Jan 24, 2009

నా జీవితంలో దేవుడు

నాకు జీవితంలో ఎప్పుడూ అహా ఇది భగవంతుని లీల అని అనిపించే అద్భుతాలు ఏమీ జరగలేదు. నేను పెద్ద పూజలు పున:స్కారాలు చేసే మనిషిని కాదు. నేను ఇప్పటికీ గుడికి వెళ్లినా నాకి ఇది కావాలి అని కోరుకోను.
మా నాన్న గారు చాలా కాలం నాస్థికుడు. ఆయన జంధ్యం కూడా వేస్కునే వారు కాదు. మా అమ్మ మాత్రం సనాతన ధర్మాలని కాపాడుకుంటూ, మడికట్టుకోవటం, పూజా పున:స్కారాలు చెయ్యటం, ప్రతీ రోజూ మహానైవేద్యాలు పెట్టటం అవీ చేస్తుండేది. తర్వాత తర్వాత నేనూ నెమ్మదిగా నమ:స్కారం పెట్టుకోవటం ప్రారంభించా. 1996 లో మా నాన్న ఆలోచనా విధానంలో కొంచెం మార్పు రావటం మొదలైంది, అదేనాలోనూ మార్పుకి శ్రీకారం చుట్టింది. 1996 లో మా నాన్న వైతీశ్వరన్ కోయిల్ కి వెళ్లొచ్చారు, ఆ గుడిని చూడాగానే మా నాన్నకి ఆయన ధృక్పదంలో అలజడి కలిగి వెంటనే జంధ్యం ధరించి స్నానం గట్రా చేసి వెళ్లి వైతీశ్వరన్ దర్శనం చేస్కున్నారు. అప్పటినుంది కొన్ని కారణాల వల్ల కొన్ని సంఘటనల వల్లా మా నాన్నకీ నాకూ అలవాటైయింది దేవుడు భక్తి. ఆయన నెమ్మదిగా షిర్డీ సాయిబాబా వైపుకి మళ్లారు. చాలా సార్లు షిర్డీ కి కూడా వెళ్లొచారు.
1999 లో మా నాన్నకి గుండె పెరిగి ఆశ్పత్రికి వెళ్లాం. డాక్టరు పరీక్షలు చేసి, మీ బంధువులందర్నీ పిల్చుకోండి అని చెప్పాడు. మా నాన్న షిర్డీ సాయి నమ్ముకున్నారు, మా అమ్మ కనపడిన దేవుళ్లకీ మొక్కుకుంది. మానాన్న క్షేమంగా తిరిగి ఇంటికి వస్తే శ్రీశైలం వస్తా అనుకున్నా. పదిరోజుల్లో మా నాన్న తేరుకుని ఇంటికి వచ్చేసారు. నేను నాన్న ఇంటికి చేరుకున్న రాత్రికి రాత్రే శ్రీశైలం వేళ్లి తలనీలాలు ఇచ్చేసి, శ్రీశైలనాధుని గర్భ గుడిలో ఆ యన పక్కనే కూర్చుని అభిషేకం చేస్కుని వచ్చా. నా మొట్టమొదటిసారి శ్రీశైల ప్రయాణం, ఆ శివలింగం పక్కనే కూర్చొని మొట్టమొదటి సారి తాకినప్పటి ఆ అనుభూతి, తృప్తి, ఆనందం, రోమాంచ మళ్లీ నాకె ఎన్ని సార్లు శ్రీశైలం వెళ్లినా కలగలా, మరెక్కడికి వెళ్లినా కలగలా.
తర్వాత్తర్వాత 2005 లో మా నాన్నగారు మమ్మల్నందర్నీ ఆశ్చర్యంగా శోకంలోకి నెట్టేసి ఆ శివంలో కలిసిపొయ్యారు.
నాకు అంతా శూన్యం అయిపోయింది. అప్పుడూ, మొట్టమొదట మానాన్నకి ఎంతో ఇష్టమైన పొందుగుల లో ఆయన అస్తికలు నిమజ్జనం చేసాం. కొందరు ప్రయాగలో చెయ్యండీ అని కొందరు కాశీలో చెయ్యండీ అని సలహాలు ఇచ్చారు. నేనాలోచించి, ప్రయాగ త్రివేణీ సంగమంలోనూ, కాసీలోనూ కలుపుతా అని బయలుదేరా. నాకు ట్రైన్లో ఒకతను పరిచయం అయ్యారు. చక్కటి భాష, స్థిరమైన దృష్టి, మాటా మాటా కలిసింది. అతనిది చీరాలే. ప్రయాగ లో ఇద్దరం కలిసే లాడ్జీ తీస్కున్నాం. అక్కడి అస్సిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్, ఆయన క్లాస్మేటే అట, ఫోన్ చేస్తే వెంటనే ఒక యస్.ఐ ని పంపించారు ఇతని దోస్తు. మమ్మల్ని త్రివేణీ సంగమం దెగ్గరకి సునాయాసంగా తీకెళ్లి అక్కడి మోసగాళ్ల చేతిలో పడకుండ అన్నీ కార్యక్రమాలు దెగ్గరఊంది చేయించి పంపించాడు ఆ పోలీసు ఆఫీసరు. వెంటనే కాశీకి వెళ్లాం ఇద్దరం. అక్కడకూడా కలిసే గది తీస్కున్నాం. అతను కార్యక్రమాలు చేకుని నిష్క్రమించారు. ఆయన అవాయా అనే కమ్మ్యూనికేషన్స్ కంపెనీకి వైస్ప్రెసిడేంటు. నేను మూడు రాత్రులు ఉందాం అని నిర్ణయించుకుని ఉండి, ఆ శంభూనాధుని దర్శనం చేస్కుని, కాసీలోని అన్నీ గుళ్లూ గోపురాలూ చూస్కొని, సంకట హనుమాన్ని కొల్చుకుని, రుదృడ్ని కూడా దర్శించుకుని బయల్దేరా. కానీ నాకు అంత తృప్తి అనిపించలా. శ్రీశైలం అంత ప్రశాంతంగా ఏదీలేదు అనిపించింది.
మా నాన్న నిష్క్రమణాశూన్యం నుండి నెమ్మదిగా నిలదొక్కుకుని, మళ్లీ నన్ను నేను జీవనశ్రవంతిలోకి తెచ్చుకుని, పొట్టచేతబట్టుకుని అమెరికాకి వచ్చి ఇక్కడ ఉద్యోగం సంపాదించి, ఇదిగో ఇలా ఉన్నా. ఈ ప్రయాణంలో మా నాన్న నావెనక ఉండి నన్ను నడిపిస్తున్నాడనే భావన. మా అమ్మ, కొడుకు వృధిలోకి రావాలీ అనే సంకల్పం. మా ఆయన జీవితపు ఉఛస్థితికి వెళ్లాలి అనే నా భార్య సంకల్పం అన్నీ మిళితమై ఉన్నాయి.
మా పాప పుట్టుక మాత్రం నాకు కొంచెం దైవలీలేనా అనిపించింది. దేనికంటే
అక్టోబరు 6 ప్రసవం కావొచ్చని డాక్టర్లు ఇచ్చిన తారీఖు. సెప్టెంబరులో మన సహ బ్లాగరు, మాష్టారు దుర్గేశ్వర గారు ఓ రోజున ఛాట్లో కలిసి, మీరు ఇరవైఒక్క రోజులు రుద్రం చెయ్యండీ మంచిదీ అని చెప్పారు. విఘ్నం కలుగకుండా చేయ్యండీ అన్నారు. మరి ఇలా అక్టోబరు 6 న డెలివరీ కదా అన్నా. అప్పటికి ఇరవైఒక్క రోజులు కావు మాష్టారూ అన్నా. పర్లేదు, ఆ సమయం వచ్చినప్పుడు నాకు చెప్పండీ మీపేరు మీద నేను చేస్తా అన్నారు ఆయన. మొదలు పెట్టాను చెయ్యటం. ఈ లోపల సెప్టెంబరు 29, శరన్నవరాత్రులు మొదలయ్యాయి. నిండు నెలలతో సాయంత్రం 6 కల్లా వంటా వార్పూ సిద్ధం చేస్కుని, ప్రసాదం తయ్యారు చేస్కొని, పిల్లాడికి స్నానం గట్రా చేయించి, వాడికి ఏదోకటి తింటానికి మూట కట్టుకుని తయ్యరుగా ఉండేది శ్రీమతి, నేను పని నుండి వచ్చి స్నానం గట్రా చేస్కుని గుడికెళ్లే వాళ్లం. నవరాత్రులు మొత్తం ప్రతీరోజూ అమ్మవారి అలంకారం, మరియూ శ్రీ లలితా సహస్రనామ పారాయణార్చన జరుగుతాయ్ అని ముందే ప్రకటించారు గుడివాళ్లు.
ప్రతీ రోజు వేళ్లాం. తను కష్టపడి కూర్చొని మొత్తం పారాయణ చేసింది, తీర్ధ ప్రసాదాలు తీస్కుని కానీ ఇంటికి చేరుకునే వాళ్లంకాదు. ప్రతీరోజు జనాలు అడిగేవారు ఇంకా కాలేదా అని. తలా ఒకలా చెప్పేవారు ఇక ఈరోజు అవుతుందిలే, 3 న అవుతుంది అని నాకనిపిస్తుంది అని ఒకావిడ అంటె, 5 న అవుతుంది అని ఇంకొకళ్లు ఇలా. మొత్తానికి, రోజుల్లెక్క ప్రకారం నా రుద్ర పారాయణ అక్టోబరు 8 కి అయిపోయింది. అలానే దేవీ నవరాత్రులు తిధుల ప్రకారంకాకుండా రోజుల ప్రకారం, సెప్టెంబరు 29 నుండి తొమ్మిదిరోజులు కలిపితే అక్టోబరు 8 కి అయిపొయ్యాయి. అక్తోబరు 8 న కూడా గుడికి వెళ్లాము. అందరూ ఆశ్చర్య పోవటం ఇంకా కాలేదా అని. మొత్తానికి అక్టోబరు తొమ్మిదిన, అంటే విజయ దశమినాడు, శ్రవణా నక్షత్రం రోజున పాప పుట్టి మమ్మల్నందర్నీ ఆనందంలో ముంచేసింది.
ఇది ఆ అమ్మవారి లీలేనా? ఏమో అలా రాసిపెట్టి ఉందేమో....
శుభం

8 comments:

  1. శ్రీశైల మల్లికార్జునుడి గురించి నా అనుభవమూ అంతే! ఆయన చెవుడేమో గానీ మల్లికార్జునుడిని తాకి మనమెవరమో చెప్పుకోవడం మర్చిపోలేని అనుభవం. అసలు ఆ మాటకొస్తే ఏ శివాలయంలోనైనా నాకు అలాగే అనిపిస్తుంది.(కోటప్ప కొండ త్రికోటేశ్వరుడిని చూసే ఉంటారుగా) నిరాడంబరుడు, ఆదిభిక్షువు,లయకారుడు కావడం వల్ల ఇలాంటి స్వఛ్చత,దైవత్వం శివుడి సన్నిధిలో ఫీల్ అవుతామేమో అనిపిస్తుంది.ఇదే ఫీలింగ్ నాకు షిరిడీ సాయి దగ్గర లభిస్తుంది.

    ReplyDelete
  2. చాలా బాగుందండి మీ ఈ టపా. ంఅనిషి జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు ఈ అంతర్మధనం రాక పోదు అత్లాంతి సమయం లొ మనిషి తనకన్న గొప్పదైన ఓ శక్తి ఉన్నదన్న సత్యాన్ని గ్రహించక మానడు. మీ కాశీ ప్రయాణం చాలా అద్భుతాలతొ కూది ఉన్నది. ఆంతా సౌకర్యం గా జరగడం వ్రథం పూర్తి అయ్యాక విజయదశమి నాదు అమ్మాయి పుట్టడం లాంటి విషయాలు అనుభవైక వేద్యం.

    జిలెబి
    http://www.varudhini.tk

    ReplyDelete
  3. మీ నాన్నగారి వృత్తాంతం చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వయసులో మారడం సాధారణంగా సాధ్యం కాదు. కానీ భగవత్ కటాక్ష వీక్షణాలకి అసాధ్యమేదీ లేదనే సత్యాన్ని ఆ వృత్తాంతం తెలియజేస్తోంది.

    ReplyDelete
  4. బహు ఆసక్తి కరం
    దేవుడూ దైవశక్తి అని ఎక్కడో వేరేగా లేదuు.మీలో సంచలనం కలిగించి ప్రేరేపిస్తున్న శక్తి అదే.
    శుభమస్తు.

    ReplyDelete
  5. ఏదయినా నమ్మకాన్ని బట్టే కదా బాచి బాబూ..

    ReplyDelete
  6. @సుజాత గారు: >>నిరాడంబరుడు, ఆదిభిక్షువు,లయకారుడు కావడం వల్ల ఇలాంటి స్వఛ్చత,దైవత్వం శివుడి సన్నిధిలో ఫీల్ అవుతామేమో అనిపిస్తుంది. అక్షరాలా నిజం.
    @వరూధిని గారు: శూన్యం నుండి అద్భుతాలా దాకా అన్నీ జీవితంలో మలుపులే, మెట్లే.
    @తాడేపల్లి గారు: ౧౯౯౬ కి మానాన్న గారి వయ్యస్సు ౫౧. మీకు గుంటూర్లో బాండు ప్రసాదుగారు తెలిసే ఉంటారు, ఆర్గానిక్ కెమిష్ట్రీ అంటే ఆయనే చెప్పాలి అని పేరు ఆయనకి. మా నాన్న ఆయన శిష్యులే. ౧౯౯౬ లో ఆయన ప్రోద్బలంతోనే వైతీశ్వరన్ కోయిల్ కి బయల్దేరింది. అస్సలు గుడి చూట్టానికో దేనికో కాదు. కేవలం "నాడీ జ్యోతీష్యం" ని శల్య పరీక్ష చెద్దాం అని.
    @కొత్తపాళీ అన్నగారు: మీరన్నది నిజం
    @దుర్గేశ్వర మాష్టారు: ధన్యవాదాలు
    @పప్పు యార్: అవును సోదరా. నమ్మకమే మనిషిని నడిపిస్తుంటుంది. ధైర్యాన్ని ఇస్తూంటుంది. రేపు మనదికాక పోతుందా అనే నమ్మకం, కిందపడినా లేవలేకపోతానా అనే నమ్మకం, సమస్యల్లోంచి భగవంతుడు బయటకెయ్యలేక పోతాడా అనే నమ్మకం. ఆప్టిమిజం. ధన్యవాదం.

    ReplyDelete
  7. మాస్టారు.
    శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు, ప్రతిఫలాపెక్ష లెకుండా దేవుని మరియు దైవశక్తి నమ్మిన వారికి మంచి జరుగుతుంది.

    ReplyDelete