Jan 31, 2011

వంద రోజుల పండగ

పది రోజుల క్రితం!
సూరిగాడి బడినుండి ఓ లెటర్. ఏట్రా అంటే, వంద గళ్ళు కొట్టిన కాయితకం పంపిస్తున్నాం. ఒకట్నుండి వంద దాకా రాయింపించండి. అయినాక ఒక్కో గళ్ళో ఒక్కో ఇత్తనం అంటించండి. బీన్స్ ఇత్తనం. ఎందుకూ అంటే మీ పిల్లోడు బడిబాటపట్టి శుక్రోరానికి వందోరోజు అవ్వుద్ది. కేన్సాస్ అని రాసున్న టీషర్ట్ వేసి పంపాల ఆరోజు. లైఫ్ సెవర్స్ పంపాల. వంద ఇత్తనాలో ఎదోకటి పంపాల. అది పంపాల ఇది పంపాల..........................
మరి లైఫ్ సేవర్స్ కొన్నా
పోయిన వారాంతంలో కూర్చుని ఒకట్నుండి వందదాకా బెరికాడు. బంక పెట్టి పచ్చిశనగపప్పు అంటించాడు. వంద యం&యం లెక్కపెట్టుకుని సంచీలో వేస్కుని పెట్టుకున్నాడు. కొట్టుకెళ్ళి కేన్సాస్ అని ఉండే లేత వంకాయ రంగు టీ-షర్ట్ కొనుక్కున్నాడు.
నిన్నటి శుక్రవారం ఇయ్యన్నీ ఏస్కెళ్ళాడు.
సాయంత్రానికి మెళ్ళో ఓ ఏదో సున్నాలు సున్నాల్లా ఉండి మధ్య మధ్యన లైఫ్ సేవర్స్ తో చేసిన ఓ దండతో ఇదిగో ఈ బా౨డ్జీతో వచ్చాడు ముఖమంతా నవ్వుతో ఎల్గిపోతూ.
ఏట్రా అంటే నేను హండ్రెడ్ డేస్ స్మార్ట్ అని చెప్పాడు.

Jan 28, 2011

నన్నుచుట్టి చీకటున్నా, నేను కాలిపోతున్నా

ఆరాధన అనే చిత్రం నుండు ఈ పాత విన్నా ఈ మధ్య. ఇంతక ముందు ఇదే చిత్రం నుండి వేరే పాటలు వినాగానీ ఈ పాటని బహుశా పట్టించుకోలేదేమో.

తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా, అల్లనా పూజకో మాల
మనసు తెర తీసిన మోమాటమేనా?
మమత కలబోసిన మాట కరువేన?


ఈ పాట చాలా బాగుంటుంది.
ఇక ఈ పాట చాలా ఖ్యాతి చెందింది -
అరె ఏమైందీ? ఒకమనసుకి రక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది
అందునుండి కొన్ని పంక్తులు -
నింగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది
నేల పొంగి నింగికేమో పూల దోసిలిచ్చింది

పూలు నేను చూడలేదు, పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళు లేవు, నింగి వైపు చూపు లేదు

కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చుశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
మది దోచావో...


నిన్న విన్న పాట, పై పాట ట్యూన్ లోనే, విషాదంతో నిండింది
ఏమౌతుందీ! తన మనసును మరచిన మనసెటు వెళ్తోందీ
ఈ పాట వింటుంటే, ఒక కవి ఇంతలా ఎలా ఊహించగలడూ అనిపించింది.

కలలన్నీ కరిగాక కనులేల అంటోంది
ఇక వెన్నల లేని పున్నమి మిగిలింది

హ్మ్!! అంతేనా
పూవులెన్నీ పూస్తూవున్నా ముల్లు నాకు దక్కింది
పూజచేయు కోరికున్నా కోవెలేమో కూలింది

ఇది మరీ దారుణమైన ఊహ. మరీ ఇంత నిరాశావాదమా?
దేవి లేని కోవెలుంది, దీపమేమో ఆరుతోంది
చమురు పోయు చేయి ఉంది, ప్రమిద దానికందకుంది
నన్నుచుట్టి చీకటున్నా, నేను కాలిపోతున్నా
వెలుగులోకి వెళుతూ వున్నా, నేను చీకటౌతున్నా


పై రెండు చరణాలు నాకు భలే నచ్చాయి
కీ।శే॥ ఆచార్య ఆత్రేయకి జైజైలు.

Jan 26, 2011

భారతదేశ మాఫియా శిక్షాస్మృతి

భారతదేశ మాఫియా వాళ్ళు వారి సొంత శిక్షాస్మృతిని రూపొందించారు, దానిపేరు భారతీయ మాఫియా శిక్షాస్మృతి. ఇందులో రకరకాల సబ్ కేటగొరీస్, డివిజన్స్, ఉన్నాయి. డీజిల్/కిరసనాయలు మాఫియా వారు వారికనుగుణంగా కొన్ని పేజీలను చెక్కుకున్నారు. ఆ పేజీల్లో, సెక్షను ౧౬౮.ఎ ప్రకారం, ఎవరైనా ఎడిషనల్ కలెక్టర్, లంచాలు తినకండా, డీజిల్/కిరసనాయలు కల్తీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తే, వారిని, అదే కిరసనాయలు పోసి తగలబెట్టటం.

యశ్వంత్ సోనావానె, ఎడిషనల్ కలెక్టర్, పట్టపగలు అందరూ చూస్తుండగా డీజిల్ మాఫియా చేత సజీవదహనం కాబడ్డాడు.
దారిన వెళ్తున్న యశ్వంత్, ఇంధనాన్ని కల్తీ చేస్తున్న కొందర్ని చూసి, ప్రశ్నించటానికి ఆగా౨డు. అదీ అతని నేరం.

కారులో మన్మాడో ఎక్కడికో వెళ్తున్నాట్ట.
రోడ్డుపక్కగా ఓ రెండు టాం౨కర్లు ఆగి ఉన్నాయట. పబ్లిగ్గా కల్తీ చేస్కుంటున్నారు సదరు యజమానులు మాఫియాగాళ్ళు. తన మొబైల్లో చిత్రించాట్ట. అదనపు బలగాలకోసం కబురుబెట్టాడట. చెట్టుకింద నిల్చున్నాడట. ఇంతలో మాఫియా వాళ్ళ పెద్దన్నా చిన్నన్నా బండిమీద వచ్చారట, యశ్వంత్ ఎక్కడా అని, చెట్టుకింద అతను నిల్చుని ఉంటాన్ని చూసి, వెళ్ళి, గాసొలిన్ పోసి నిప్పెట్టేసారట.
పోలీసులు యశ్వంత్ మొబైల్ ని తమ కంట్రోల్ లోకి తీస్కున్నారట.

యధాప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి, గోళ్ళు గిల్లుకుంటూ, ఈ సంఘటనను ఖండించారు. ఎంక్వైరీ వేస్తామని, నేరస్తులు దొరికితే (నేరం చేసినట్లుగా అనుమానిస్తున్న ఏడుగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసారు), కఠినంగా (ఏ సెక్షను అంత కఠినంగా ఉందో భారతీయా శిక్షాస్మృతి రాసినికే తెలియదు) శిక్షిస్తామని చెప్పారు.
మీడియా యధాప్రకారం ఓ రెండురోజులు రకరకాల యాంగిల్స్ చూపుతుంది.
యధాప్రకారం మళ్ళీ, అందరూ మర్చిపోతారు ఇలాంటి సంఘటనలను.
యశ్వంత్ సోనావానె కుటుంబం అలా కుమిలిపోతూ ఉంటుంది.
ప్రభుత్వం ఏదో ఒకటి ప్రకటిస్తుంది.కానీ, న్యాయం మాత్రం జరగదు.


జై హింద్

లైఫ్‌సేవర్స్

సూరిగాడి బడోళ్ళు ఏదో కాయితకం పంపించారు. ఓ జత లైఫ్‌సేవర్స్ పంపించండి, ఫన్ యాక్టివిటి సేయిప్పిస్చాం పిల్లకాయల్తో అని.
ఇంటికాణ్ణుంచి ఫోను, అయ్యా లైఫ్‌సేవర్స్ అంటే ఎందిటా అని.

తూ! ఎదవనా కొండెలు లైఫ్‌సేవర్స్ అంటే జీవితాన్ని రచ్చించేవి గాదు,
పాపిన్స్ బిళ్ళలంట బాసూ.
Lifesavers_wrapped.jpg

పనిలో పని
యావత్ హైందవ రాష్ట్రానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

Jan 25, 2011

గ్రామములలోఁ గోటలుగలవు

పల్నాటిలోని మాచెర్ల, గురిజాల, తుమృకోట, జిట్టగామాలపాడు, కారెంపూడి గ్రామములలోఁ గోటలుగలవు
- ఓ పెద్దాయన, ప్రపంచకం ఎరగనాయన ఓ బొక్కులో రాసాడు.

పాపం, ఆయనకేం తెలుసుద్ది, ఇయ్యాల్రేపు జనాలు ఏంజేస్తన్నారో, ఊహించగలగినాడా ఏందీ?

ఇప్పుడు కనీసం ఆ కోటల రాళ్ళు కూడా లేవు.

ఏవయ్యాయీ?

జనాలు మింగేసారు
ఆటితో ఇండ్లు కట్టుకున్నారు
దొంగలు దోసేసారు
ప్రభుత్వాలు మింగేసాయి
సున్నంరాయి మిల్లులు లేసాయి
కోరీలు తవ్వేసాయి
టిప్పర్లు తొక్కేసాయి
ట్రక్కులు దుమ్ములేపేసాయి

మరి ఏమి మిగిలింది?

భలేవాడివేనే?
ఏం మిగులుద్దీ?
తెల్లని బూడిద
పొద్దున పొద్దున్నే
సెట్టూ పుట్టా మీన
గొడ్డుగోదా మీన
ఇంటి కప్పు మీన
మంచంమీన
నీ దుప్పటిమీన
నీ మొకం మీన

Jan 24, 2011

ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది

నేరాలు, అసభ్య ప్రదర్శనలో రాష్ట్రానికి అగ్రస్థానం
హైదరాబాద్‌: లైంగిక వేధింపులు, అత్యాచారం లాంటి వివిధ నేరాలతోపాటు అసభ్య ప్రదర్శన వంటి కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని జాతీయ నేర నమోదు విభాగం ప్రకటించింది. చిత్రాల్లో మహిళలను అశ్లీలంగా చిత్రించటం, అసభ్యకరమైన వాల్‌పోస్టర్లు, ఇతరత్రా కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా భారతీయ శిక్షాస్మృతి కింద 66 లక్షల 75 వేల కేసులు నమోదయ్యాయని నేర నమోదు విభాగం ప్రకటించింది. ఇందులో రెండు లక్షలకు పైగా నేరాలు మహిళలకు వ్యతిరేకంగా జరగగా ఒక్క మన రాష్ట్రంలోనే 25 వేలకంటే ఎక్కువ కేసులు నమోదైనట్లు తెలిపింది. జాతీయస్థాయిలో విజయవాడ 512, విశాఖ 407, హైదరాబాద్‌ 322.4 సగటుతో 35 అత్యంత నేరమయ నగరాల జాబితాలో చేరాయి. దేశవ్యాప్తంగా నేరాల రేటు పెరుగుదలను సూచిస్తూ జాతీయ నేరనమోదు విభాగం ఈ గణాంకాలను విడుదల చేసింది.

=========================================================

ఏవిటో ఈనాడు వారి భాష. నేరాలు మహిళలకు వ్యతిరేకంగా జరిగెదేవిట్టా? నేరాలు మహిళలపై జరిగాయనొచ్చుగా. పిచ్చి భాష.
సరే, అదయ్యా సంగతి. ఈ రకంగా, అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతోంది. మన ముందరి తరాలు గర్వంగా చెప్పుకునేలా.
పదిహేనేళ్ళ క్రితం చదివిన గుర్తు. ఇండియా టుడే వారి యాభైయేళ్ళ భారతం అని ఓ స్పెషల్ రిలీజు. అందులో, అప్పటికి, కనీసం మిలియన్ కేసులు పెండింగులో ఉన్నాయనీ, వాటిని పరిషరించేందుకు కొన్ని లక్షల లాయర్లు, లక్షల జడ్జులు కావాలని. వాటిలో ఎన్ని పరిషరింపబడ్డాయో, ఎన్ని ఇంకా పెండింగులో ఉన్నాయో, తర్వాతి పదిహేనేళ్ళలో మరెన్ని కేసుల తుపానులు వచ్చాయో, ఇప్పటికీ అపరిష్క్రుతంగా ఉన్న కేసులో ఎన్నో, ఎన్నింటిలో నిజమైన న్యాయం జరుగుతుందో అసలు సదరు కేసుల కక్షిదారులు ఉన్నారో ఊడా౨రో....అనేవి ఒకవైపు, మరోవైపు, ఆంధ్రుల ఘన చరిత్ర ఇలా దినదిన ప్రవర్థమానమౌతూ, అశ్లీలతతో మహిళపై దాడులతో సూటుకేసులో శవాలతో అలా అలా పెరిగిపోతుంటే, రేపొద్దుటి తరాన్ని తలుచుకుంటేనే బాధేస్తోంది నాకు.

Jan 20, 2011

400 వ టపా

హ్మ్! బ్లాగు ప్రయాణంలో మరో మైలు రాయి. ౪౦౦వ టపా.
ఇన్ని రాయగలిగానా అనిపిస్తుంది ఒక్కోసరి. వెనక్కితిరిగి చూసుకుంటే సంతృప్తికరంగానే ఉంది నా ప్రయాణం.
యాభైయ్యో టపాకే రివ్యూ రాసేసాను., ఏంటీ యాభైకే రివ్యూఆ? అని http://ramakantharao.blogspot.com/2008/11/blog-post_07.html
అందులో
"సరే!! మంచోడివే!! నీకు నచ్చిన పోష్టు ఏది?"
"యో!! నేను తొక్కిన కోడిపియ్య కూడా కమ్మటోసన, తెల్సా. నేను రాసిన ప్రతీ అచ్చరం నాకు నచ్చిందే."

పల్లెటూరి హాస్యం రాసాను. ఎంతైనా మూలాలు అవే కదా.
అలా సాగుతూ సాగుతూ, అటు తిరిగి ఇటు తిరేప్పటికే నూరోటపాకొచ్చేసా. గసి అనే టపాతో వందకొట్టా http://ramakantharao.blogspot.com/2009/01/blog-post_19.html
"వారానికోసారి జొన్న రొట్టెలు చెసేది మా అమ్మ. వేడి వేడి జొన్న రొట్టెలు, ఉల్లిపాయకారం, వెన్న. అదీ కాంబినేషన్ అంటే. అలానే, గోంగూర పప్పు, వేడి వేడి అన్నం, వెన్న." అని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నా.
ఎన్నో ఒడుదుడుకులమధ్య,  ధైర్యంగా నిల్చుని, మరో మజిలీ చేరాను మూడొందలో టపాతో. సూరిగాడి బడిబాగోతం http://ramakantharao.blogspot.com/2009/09/200.html
"ఠావులు తెచ్చుకుని, పెద్ద సూత్తో [కొందరు టంకంతో], టయందారం పెట్టి కుట్టుకునేవాళ్ళం. భలే ఉండేయి ఆ నోటుబొక్కులు. సిరిగిపొయ్యేవి కావు. కొన్నికొన్ని సార్లు ఠావులు సింపి సగం నోటుబొక్కులు కుట్టుకునేవాళ్ళం. ఎలా, రెండుమూడు ఠావుల తీస్కుని మద్దన దారంపెట్టి సింపేసి కుట్టుకునే వాళ్ళం" అని చిన్ననాటి నోటుబొక్కులు ఎలా కుట్టుకుందీ జ్ఞప్తికి తెచ్చుకున్న.
ఇక 2010, ఎన్నో ఒడుదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, మరెన్నో సవాళ్ళు. ఒక్కోచిక్కుముడిని విప్పుతూ తోచినప్పుడల్లా బ్లాగుతూ వచ్చా. ఇదిగో నాలుగు వందలో టపాకి చేరుకున్నా.
ఏవిటేవిటో రాసాను. ఇది బ్లాగులో పెట్టాలి అనిపించినదల్లా టపాకట్టాను. ఏంటిబాబూ ఫోటో తీస్తున్నావూ దీన్నీ బ్లాగులో పెడతావా అనే స్థితికి వచ్చాను.
ఈ మధ్య కాలంలో నా బ్లాగుపై హిట్ల సంఖ్య గణణీయంగా పడిపోయింది. వ్యాఖ్యలు సరేసరి. కారణాలు అనేకం. కానీ, టపాల పరంగా, నేను చెప్పదల్చుకున్నది నిక్కచ్చిగా చెప్పాను.
ఎన్నో రాయాలని ఉంది. ఇంకా ఎన్నో చేయాలని ఉంది. సమయం కుదరటంలేదు. కానీ, చేయదల్చుకున్నది రాయదల్చుకున్నది రాసి తీరతాననే అనుకుంటున్నా

సాధారణంగా బ్లాగుల్లో ఓ ఈక్వేషన్ ఉంటుంది
దాని కథా కమామీషు -
యు రీడ్ మై బ్లాగ్
ఐ రీడ్ యువర్ బ్లాగ్
యు కామెంట్
ఐ కామెంట్
యు నో రిప్లై
ఐ నో కామెంట్
యు నో రీడ్ మైన్
ఐ నో రీడ్ యువర్స్
ఖేల్ ఖతం
దుకాణ్ బంద్

పై ఈక్వేషన్ ప్రకారం గత ఏడాదిగా నేను సరిగ్గా స్పందించలేకపొయ్యా వ్యాఖ్యలకు. కారణాలు అనేకం. జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా. దాంతో, బ్లాగుల్లో కామెంట్లు పెట్టలేక పోవటం ఒక కారణం. దీనివల్ల నా బ్లాగుని రెగ్యులర్ గా చదివేవాళ్ళని దూరం చేస్కున్నా.

ఐతే, ఏంపర్లేదు. అన్నిటికన్నా ముఖ్యం తృప్తి. నా రాతలు నాకు సంతృప్తిగా ఉన్నాయి. కొందరు అజ్ఞాతంగా చదువుతూ ఎప్పటికప్పుడు వారి విలువైన సలహలు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి, ఐ ఏపీస్

ఎందరో మితృలయ్యారు ఈ ప్రయాణంలో. కొత్తపాళీ అన్నగారు సొంత అన్నలా అనిపించారు. సుబ్రహ్మణ్య చైతన సొంత తమ్ముడైయ్యాడు. ఆర్.కె తమ్ముడైయ్యాడు. మాష్టారు దుర్గేశ్వర రావు గారు పలు సందర్భాల్లో అండగా నిల్చారు ఓ గురువులా. వారి సహాయ స్నేహ తత్పరతను ఎన్నటికీ మర్చిపోలేను. మాగంటి వంశీ, భారారె, శ్రావ్య, నేస్తం గారు, లలితమ్మ, భావన గారు, తెరెసా గారు, సుజాత గారు, సునీత గారు, తమ్ముడు హరేకృష్ణ, తృష్ణ గారు, సోదరుడు వేణు శ్రీకాంత్, ఉమా శంకర్, చైతన్య, చిలమకూరు విజయ మోహన్, మందాకిని గారు, పరిమళం గారు, రాణి గారు, మధురవాణి గారు, పప్పు యార్, దేవరపల్లి రాజేంద్రకుమార్ ఇలా అందరూ నన్ను ఎంతో ఆదరించారు. వారందరికి కృతజ్ఞతలు తెలియజేస్కుంటున్నా. భరద్వాజ్, జీడిపప్పు, కొండముది సాయి కిరణ్, శశాంక్ లాంటి మితృలు పరిచయం అవ్వటం ఓ అదృష్టంగా భావిస్తా. మరో ముఖ్యమైన వ్యక్తి - నెమలికన్ను మురళి. నా ప్రతీ టపాకి తప్పక కామెంటు రాసేవారు. ఆయనకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. మరెందరో బ్లాగు మితృలు, స్నేహితులు, హితులు, బంధువులు.
నాకు నచ్చిన బ్లాగుల్లో భాస్కర్ బ్లాగు ఒకటి అని మాగంటి వంశీ అనటం చాలా ఆనందం వేసింది.
ముఖ్యంగా కూడలి, జల్లెడ, హారం, మాలిక - వీరు కనిపించకుండా నా బ్లాగుకి ఎంతో ప్రచారం కలిపించారు. పై సంకలనుల పెద్దలందరికీ ధన్యవాదాలు.

Jan 19, 2011

మా గోడలు సాలటంల్యా

ఈ మధ్య తలా ఓ డబ్బా క్రేయాన్స్ కొని తెచ్చా. వాడికి జంబో క్రేయాన్స్, పిల్లకి ట్రైయాంగిల్ షేపువి, పట్టుకోటం సులువి అని. మురిసిపొయ్యి ఎగిరి గెంతి లాక్కుని అప్పటికప్పుడు తెల్లఠావుల లాగి బొమ్మలేయటం మొదలుపెట్టారు ఇద్దరూ. పనిలో పని క్రేయాన్స్ తోబాటు, రంగులు పులుమటానికి పుస్తకాలు కూడా తెచ్చా. వాడికి కార్స్, అనఘకి ప్రిన్సెస్. అంతా బానే ఉంది వాతావరణం ఓ గంటవరకు. అంత మౌనంగా ఉండటం తుపాను ముందు ప్రశాంతత అని అర్థం కాలా. ఉన్నట్టుండి తుపాను ఎఫ్-౫ తుపాను. ఎందిరా అంటే, అనఘ వాడి మీదపడి లాక్కుంటోంది. ఏంకావాలే అంటే పింక్ క్రేయాన్. అమ్మాయి డబ్బాలో లేదు అది. వాడి జంబో క్రేయాన్స్ డబ్బాలో ౧౬ క్రేయాన్స్ ఉంటే పిల్ల దాంట్లో కేవలం ఎంది. పింక్ లేదు. అసలే అమ్మాయికి పింక్ అంటే ప్రాణం. గింజులాట, కొట్లాట పోట్లాట. ఇలా గడుస్తుండాగా
వారి యుద్ధాల్లో పాపం క్షగాత్రులుగా మిగిలిపొయ్యాయా క్రేయాన్లు ముక్కలు ముక్కలై. కిం కర్తవ్యం అని ఆలోచించి మరోమారు ఇద్దరికీ మరో సెట్టు క్రేయానులు కొనేందుకు వెళ్ళాను వాల్మార్టుకు. ఈసారి క్రేయాన్స్ పక్కనే జంబో కలరింగ్ పేజస్ కనిపించినై. బుద్ధి గడ్దితిని, తెచ్చాను. ఇప్పుడాన్నీ డబుల్ ఢమాకాలు కదా. వాడికి కొంటే అమ్మగారికీ కొనాలి కదా. వాడికి కార్స్ కలరింగ్ పేజెస్ కొంటే, అమ్మాయికి టింకర్ బెల్ కొన్నా. వాడికి జంబో క్రేయాన్స్ డబ్బా, అమ్మాయికి ఈసారి పింక్ కలర్ ఉండేలా ఓ డబ్బా చూసి కొన్నాను. ఎవరిది వారికి అందజేసాను. షరా మామూలే, వాడిది వాడు లాక్కుని ఓ మూల సెటప్పు పెట్టుకుని కూర్చున్నాడు. వాడికి ఎదురుగా వాడికి పోటీగా అమ్మాయి కూర్చుంది. ఇక రంగులు పులమటం మొదలెట్టారు.
అందాకా బాగనే ఉన్న కథ, అంతలో ఊహించని మలుపుకి తిరిగింది. వాడేసిన కాయితం తెచ్చి చూపించాడు, బాగుందిరా అన్నా, వాళ్ళ అమ్మకి చూపించాడూ అబ్బో కేక కెవ్వు అంది, మరింకేం ఐతే, గోడకి తగిలించూ అంటాడు. అలా కాదురా అంటే వినడే. సరే అని ఒకటి అంటించాం.


మరో షీటు తీసాడు, రంగులేయటం మొదలుపెట్టాడు. అరగంట, ఇదిగో ఇదీ గోడకి పెట్టు అని తెచ్చాడు.


మా గోడలు చాలటంలేదు. మీవి ఇస్తారా?

న్యాయం ఇంకా బతికే ఉందా?

గుంతకల్లు ఎమ్మెల్యేకు జైలుశిక్ష
కర్నూలు, న్యూస్‌టుడే: పరిశ్రమలకు సంబంధించిన నిబంధనలు పాటించని అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే కె.మధుసూదన్‌, మేనేజర్‌ దేవరాజ్‌లకు మూడు నెలలు జైలుశిక్ష, జరిమాన విధిస్తూ కర్నూలు అడిషనల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ టి.హరిత సోమవారం తీర్పు చెప్పారు. శాసనసభ్యుడు మధుసూదన్‌ కర్నూలు జిల్లా కల్లూరు మండలం అశ్వత్థాపురం గ్రామ పరిధిలో రాయలసీమ గ్రీన్‌స్టెలై ఇండస్ట్రీని నడుపుతున్నారు. దీనికి మేనేజర్‌గా దేవరాజ్‌ వ్యవహరిస్తున్నారు. 2006 జులై 20న పరిశ్రమ నుంచి విషవాయువు వెలువడి రాజశేఖర్‌, రెడ్డిపోగు తిమ్మరాజు, తిమ్మప్ప అనే కార్మికులు మృతి చెందారు. ఈ మేరకు ఫ్యాక్టరీ చట్టం కింద ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి మూడు నెలలు జైలుశిక్ష విధించారు. వివిధ సెక్షన్ల కింద రూ.60 వేలు చొప్పున జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి టి.హరిత ఆదేశించారు. నిందితులు జిల్లా కోర్టుకు అప్పీలు చేసుకుంటామని పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు బెయిల్‌పై విడుదల చేసింది.

-------------------------------------
ఓ ఆడకూతురు, ఓ యం.యల్.ఏ ని బొక్కలోకి నెట్టటమా? అదీ కర్నూలో? వారెవా. ఇంకా న్యాయం బతికే ఉందన్నమాట. ఐనా పై కోర్టుకి వెళ్తున్నాడుగా, అక్కడ తేల్చి పడేస్తారు.
పేరు *గ్రీన్* ఇండస్ట్రీ. వెలువడేవి విషవాయువులు. ఇలా ఉంది మన పారిశ్రామీకరణ.
హైద్ చుట్టుపక్కల ఎన్ని ఇట్లాంటి *ఇండస్ట్రీస్* ఉన్నాయో? ఎన్ని విషవాయువుల్ని వెదజల్లుతున్నాయో?
హైద్ లో ఉండే రోజుల్లో గమనించేవాణ్ణి, టాం౨కర్లు *ఇండస్ట్రియల్ వేస్ట్* ని తీస్కెళ్తుండేవి. ఆ టాం౨కర్ల ఎనకమాల వెళ్ళే ద్విచక్రవాహన చోదకుల పరీస్థితి వర్ణనాతీతం. టాం౨కరు మూత సరిగ్గా పెట్టరు. లేక ఔట్ లెట్ లోంచి లీక్ అవుతుంటుంది. తల్చుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది.
ఏమైనా, పై తీర్పు, మెచ్చుకోతగ్గది.

మున్ముందు మన జ్యుడీషియరి సిస్టం పైలాంటి సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాలని, కనీసం విషవాయువులని గాలిలోకి రాకుండా ఉండేందుకు పై ఇండస్ట్రీ లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలనీ కోరుకుంటా.

Jan 12, 2011

ఇతిహాసము లేని జాతి ఆనంద విహీనము

ఇతిహాసము లేనిజాతి యానంద విహీనము. మనఃపూర్వకముగఁ గీర్తింపఁబడిన యోధుల సాహసకార్యములను జ్ఞాపకము చేయు కథలు వినఁగల జాతి యదృష్టవంతము. దేశముయొక్క లోపములకు వగచి క్రూరకంటకుల నిరోధించిన దేశాభిమానులను ఇతిహాసపత్రములయందు గర్వముతోఁ జూపఁగల దేశముధన్యము. కానీ మనభాగ్య మట్టిదికాదు. మనవీరులు గతించినారు. వారి కార్యములు కీర్తింపఁబడలేదు. వ్రాయఁబడలేదు అని యొక భారతీయ కృతికర్త వాసినవాక్యములు యథార్థములు. అచ్చటచ్చట మహాశూరులచరిత్రమును బాటలరూపమున పదములరూపమున నిసర్గకవులు కీర్తింయున్నారు. ఇవి కేవలము భావప్రధానములు. బొబ్బిలికథాదు లిట్టివే. ఈ కథలు చెప్పునప్పుడు నేను బాల్యమునుండియుఁ గుతూహలముతో వినుచుండెడువాఁడను. మాగ్రామములలోఁ దఱచుగా నొకతెగవారుపల్నాటివారి కథని యొక కథను జెప్పుచు భిక్షకు వచ్చుచుండెడివారు. విద్యాగంధములేని చిన్నతనమం దాకథ వినినప్పుడు దానియందలి యంశములుగాని క్రమముగాని తెలియకపోయినప్పటికిని వారు కత్తులు త్రిప్పుట గంభీరముగా గర్జిల్లుట మొదలగు నభినయములు కుతూహలాపేక్ష కలిగించినవి

- కీ।శే॥ శ్రీ అక్కిరాజు ఉమాకాంతం

Jan 11, 2011

నా ఒంటిమీది అడవి కబ్జాకి గురైంది

నా సుట్టూ ఉన్న జీవకారుణ్యం కబ్జాకి గురైంది
దాన్ని సూసి కూడా నా ఒంటికి ఏంగాలేదు
అడవులు నాసనమైతున్నా నా ఒంటికి సీమ కుట్టినట్టు కూడా లేదు
కండ్ల ముందు పులిని సంపేసి సరమం ఒలిసేసి అమ్ముకున్నోళ్ళని [హైద్ జూవలాజికల్ పార్క్ లో జరిగిన సంఘటన]
సూసీ సూడనట్టు ఒదిలెసాను
నా కండ్ల ముందు జీవకారుణ్యానికి బూజు పడితే
గమ్మున కూకున్నా
నా కండ్ల ముందు అడవితల్లిని కబ్జా సేస్తే
కిమ్మనకుండా కూకున్నా
మనది కాదులే అనుకున్నా
కముజు పిట్టల్ని కొట్టుకు తింటుంటే
నేనూ ఓ గుటకేసినా
లేళ్ళను సంపేసి సర్మ ఒలుసుకు పోతుంటే
నేనూ ఓ జానెడు కొట్టేసినా
ఆటి నోటికాడి కూడుని తుపాకీతో కాల్చేసినా
నా ఒంట్లో సీవూ నెత్తురూ లేవు
ఉన్నా అవి స్పందించవు
అసలేందుకు స్పందించాలా?

కానీ, నా ఒంటిమీదనున్న తేళ్ళు జెర్లు
సింహాలు పులులు
పిట్టలు గొఱ్లు
ఆక్రోసిస్తున్నయై
వాటి ఆవేశం పైకిపైకి పోతావుంది
నా రగతం మరుగుతా ఉంది
నా ఒంటిమీది అడవి కబ్జాకి గురైంది
ఎందుకుభై అని ఎవురన్నా అడగొచ్చు
తెలంగాణా ఇస్తనని మోసంజేస్తరా?
అందుకే...
దీనికి ఒక్కటే మార్గం నా ఒంటిని ఖతం జెయ్యాలే.జై హింద్

Jan 10, 2011

కబ్ తక్ ఛత్ పె రహోగె శంకర్, అబ్ తో నీచే ఆ మెరే భాయ్

నేనేం చూడలేదు, మేడమీద ఉన్నాను
నువ్వు అబద్ధం చెప్తున్నావు
మేడమీద ఉన్నాను
అబద్ధం చెప్తున్నావు
మేడమీద ఉన్నాను
అబద్ధం చెప్తున్నావు
మేడమీద ఉన్నాను
ఎంతసేపు మేడమీద ఉంటావు శంకర్, ఇప్పుడన్నా కిందకి దిగు, తుపాకీ పేలింది, జనాలు అటు ఇటు పరుగెత్తారు, ఇకనైన కిందకి దిగు


నాకు ఈ ప్రొమో బాగా నచ్చింది. కారణం, సాధారణ విట్నెస్, ఏమ్ చెప్పాలి ఎలా చెప్పాలీ ఎలా ఫ్రేం కాబడతాడో శంకర్ ఓ ఉదాహరణ.
పై ప్రొమొ నో వన్ కిల్డ్ జెస్సిక అనే సినిమాది.

Jan 6, 2011

బీటెక్‌ విద్యార్థినిపై బ్లేడుతో దాడి

బీటెక్‌ విద్యార్థినిపై బ్లేడుతో దాడి
రాజమండ్రి క్రైం, న్యూస్‌టుడే: బీటెక్‌ చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేసి పరారైన సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. రాజమండ్రి త్రీటౌన్‌ ఎస్సై వి.దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారు శానిటోరియంలోని భవానీపురానికి చెందిన బాధిత యువతి రాజానగరం గైట్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల నగరంలోని లలితానగర్‌లో నివసిస్తున్న అక్క ఇంటికి వచ్చి అక్కడ నుంచి రోజూ కళాశాలకు వెళ్లి వస్తోంది. మంగళవారం బస్సు ఎక్కేందుకు వెళుతున్న ఆమెను బైకుపై అపరిచిత యువకుడు మరో యువకుడితో కలిసి వెంబడించాడు. నిలువరించి మాట్లాడమని అడిగాడు. స్పందించకపోవడంతో బ్లేడుతో దాడి చేశాడు.

ఈ సంఘటన్ని నేను తీవ్రంగా ఖండిద్దామనుకున్నా. ఇది చాలా తప్పు, ఎక్సు వై జి అందామని నోటిదాకా వచ్చింది. కానీ అనలేక పొయ్యా. కారణాలు ఏవైఉండచ్చూ అని ప్రశ్నించుకున్నా.
అతి ముఖ్యమైన కారణం - మీడియా అని నాకనిపించింది. మీడియా అంటే ఓ బ్లాంకెట్ కదా. అవును. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సినీ మీడియా. ఈ మూడే కదా ముఖ్యమైన మాధ్యమాలు ఇవ్వాళ్ళ. ఎందుకలా అనిపించిందీ అంటే -
ప్రింట్ మీడియాలో కన్స్ట్రక్టివ్ వార్తలకన్నా డిస్ట్రక్టివ్ వార్తలకే పెద్ద పీట వేస్తున్నారు. వేస్తే వేసారు కానీ, సమస్య ఎక్కడంటే, నేరాలు మర్డర్లు మానభంగాలు అన్నీ పూసగుచ్చినట్లు కళ్ళకు కట్టినట్లు రాస్తున్నారు. దానివల్ల ఏమౌతుందంటే, పై సంఘటనే తీస్కుందాం. ఆ అమ్మాయి అండర్ గ్రాడ్ మొదటి ఏడాది. అంటే లేట్ టీన్స్ లో ఉంది. పిల్లాడూ బహుశా అదే బ్యాచో లేక సీనియరో అయి ఉండచ్చు, అంటే వాడూ లేట్ టీన్స్ లేక ఇరవైల్లో ఉండచ్చు. ఈ వయసుగాళ్ళకి ఇలాంటివార్తలు రుచిగా ఉంటాయి. ఆకట్టుకుంటాయి. నేరప్రవృత్తి బీజాలు పడతాయి.
ఇక ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా [The primary electronic media sources familiar to the general public are better known as video recordings, audio recordings, multimedia presentations, slide presentations, CD-ROM and online content.]- వార్తా ఛానళ్ళు ఇత్యాదివి. ఇవి పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ వారి మనీ మేకింగ్ యూనిట్స్. వీరికి కావాల్సింది టిఆర్‌పి రేటింగ్స్. దానికోసం ఎంత గడ్డైనా తింటారు, ఏవైనా చూపిస్తారు. టీన్ ఏజ్ లో ఉన్న పిల్లలకు క్రైం వాచ్ లాంటి ప్రోగ్రాములు ఆవేశాలోచనలు రేకెత్తిస్తాయి అంటంలో ఎలాంటి అతిశయోక్తీ లేదేమో.
ఇక సినీ మీడియం -
అమ్మతోడు అడ్డంగా నరుకుతా
పొడిచేస్తా
కాల్చేస్తా
ఇక్కడతో ఆగట్లా బ్లేడుతో కంఠాన్ని తెగనరకటం, కరవాలంతో తిరగటం ఇత్యాదివి ఎలాంటి తరంగాలను ఉత్పత్తి చేస్తాయో పెద్ద ఆలోచించల్సిన పనిలేదు.
ఇలాంటివి తప్పా? వాడకూడదా? డైలాగులే ఉండకూడదా?
ఇవీ ముఖ్యమైన ప్రశ్నలే. ఉండచ్చు. నాకొడకా అని కూడా వాడవచ్చు. ఎలాంటి మాటలైనా వాడవచ్చు. ఏమైనా చేయవచ్చు. ప్రేమికుడు ప్రేమికురాలు సెట్టుసాటుకెళ్ళి ముద్దు పెట్టుకోవాస్లిన పనిలేకుండా బయటనే కెమెరా ముంగటనే పెదవులని పెనవేసుకోనూ వచ్చు, ఇంకా దిగ జారిపోనూ వచ్చు
మరి సమస్య ఎక్కడా?
పై మూడింటినీ కంట్రోల్ చేసే ప్రభుత్వం దగ్గర. అసలు విలను ప్రభుత్వ విధానం.
ఎందుకటా? అంటే -
టీవీ కార్యక్రమాల్లో కంటెంట్ రేంటింగ్ అనే విధానాన్ని ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ ప్రకటించలేదు.
సినిమాలకు ఇచ్చే సర్టిఫికెట్లలో కేవలం మూడే [నాలుగు] కేటగిరీలు ఉన్నాయి. యు, యు/ఎ, ఎ.
యు = యూనివర్సల్
All ages admitted, there is nothing unsuitable for children. Films under this category should not upset children over 4. This rating is similar to the MPAA's G, the BBFC's U, and the OFLC's G ratings.

యు/ఎ = పేరెంటల్ గైడెన్స్ All ages admitted, but certain scenes may be unsuitable for children under 12. This rating is similar to the MPAA's PG-13, the BBFC's 12A, and the OFLC's PG and M ratings.

ఎ = అడల్ట్

Only adults are admitted.

Nobody younger than 18 can rent or buy an 18-rated VHS, DVD, Blu-ray Disc, UMD or game, or watch a film in the cinema with this rating. Films under this category do not have limitation on the bad language that is used. Hard drugs are generally allowed, and strong violence/sex references along with non-detailed sex activity is also allowed. This rating is similar to the MPAA's R and NC-17, the BBFC's 18, and the OFLC's MA and R ratings.


యస్ = Restricted to any special class of persons
అదే అమెరికన్ సినిమా రేటింగ్ సిస్టం చూస్తే -
G rating symbol
G- General Audiences
All ages admitted
(1968-present)

(Equivalent: Videogames: EC, Low E; Television: TV-Y, Low TV-G)

PG rating symbol
PG- Parental Guidance Suggested
Some material may not be suitable for children
(1972-present)

(Equivalent: Videogames: High E, Low E10+; Television: High TV-G, TV-PG)

PG-13 rating symbol
PG-13- Parents Strongly Cautioned
Some material may be not be appropriate for children under 13
(1984-present)

(Equivalent: Videogames: High E10+, T; Television: High TV-PG, Low TV-14)

R rating symbol
R- Restricted
Under 17 requires accompanying parent or adult guardian
(1968-present)

(Equivalent: Videogames: M; Television: High TV-14, Low TV-MA)

NC-18 rating symbol
NC-17- No One 17 and under admitted
(1990–present)

(Equivalent: Videogames: AO; Television: High TV-MA)మన సిబియఫ్‌సి వారి రేటింగులు చూసారా? Nobody younger than 18 can rent or buy an 18-rated VHS, DVD, Blu-ray Disc, UMD or game, or watch a film in the cinema with this rating.

నిజంగా చెప్పాలంటే ఎన్ని సినిమా హాళ్ళలో ఎ సర్టిఫికెట్ సినిమాకి వయసుని చూసి లోనికి పంపిస్తున్నారూ? ఇంకో ముఖ్య ప్రశ్న, ఎ సర్టిఫికెట్ సినిమాని టీవీ ఛానల్స్ లో ఎలా ప్రసారం చేస్తారూ?

ఇలా అన్నీ రకాల మాధ్యమాలు తమవంతు సహాయసహకారాలను అందిస్తుంటే, పై లాంటి సంఘటనలు జరగపోటానికి తావెక్కడా? లేని, రాని ఆలోచనలను గుప్పిస్తుంటే నేర ప్రవృత్తి పెరక్కుండా ఎలా ఉంటుందీ?

ప్రభుత్వం మేల్కోవాలి. కనీసం ఇట్లాంటి వాటిల్లోనైనా చట్టం గట్టిగా అమలుకావాలి. పోలీసు యంత్రాంగం కఠినంగా ప్రవర్తించాలి.

పైలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. పేపర్లు రాస్తూనే ఉంటాయి. నేరం చేనిన పిల్లవాడు పొద్దున్నె గడ్డితినేవాట్ట, సాయంత్రం బీరు కొట్టేవాట్ట అని పనికిరాని చెత్తని రాస్తూనే ఉంటాయి. టీవీ ఛానెళ్ళలోనూ చూపిందే చూపి చావకొడుతూనే ఉంటారు. కానీ ఒక్కరుకూడా మూలాలను గూర్చి ఆలోచించక పోవటం సోచనీయం అని నా అభిప్రాయం

ఇదే విషయంపై రెండేళ్ళ క్రితం ఓ టపా రాసాను -
http://ramakantharao.blogspot.com/2008/12/blog-post_23.html

Jan 5, 2011

ఫ్యాక్షనిజం

యాడ బుట్టిందబ్బా ఈ పదమూ? మీ ఊళ్ళోనా మా ఊళ్ళోనా
నీళ్ళ కాడనా పందెపు ఎద్దుల కాడనా
కోడి పందెము కాడనా నాటకాల కాడనా
రాజకీయ పార్టీ కాడనా మందు కొట్టు కాడనా

factionism అనే పదానికి అర్థం ఏమైఉంటుందా అని గూగులన్నని అడిగిన్యా. అన్నా అన్నా ఏందే దీని కబుఱూ అని.
విక్కీవిక్కయ్య ఎగేస్కుంటా వచ్చి ఇది సెప్పిండు

A political faction is a grouping of individuals, such as a political party, a trade union, or other group with a political purpose. A faction or political party may include fragmented sub-factions, "parties within a party," which may be referred to as power blocs, or voting blocs. The individuals within a faction are united in a common goal or set of common goals. They band together as a way of achieving these goals and advancing their agenda and position within an organization.

It is important to note that factions are not limited to political parties; they can and frequently do form within any group that has some sort of political aim or purpose.

సరే ఎట్టాగూ విక్కీవిక్కయ వచ్చినాడుకదా అని *factionism* అని దేవుళ్ళాడినా.

అన్నీ మన తెలుగు సినిమాల్లోని మాటలే అగుపించినాయి.

ఈ సోకాల్డ్ మీడియాకి పొద్దస్తమానం పరిటాల గంగుల అని ఫ్యాక్షన్ టా౨గును కలిపి రాయటమేగాని, అసలు ఎందుకు ఫ్యాక్షన్ అని రాయాలో తెలుసునా?

గబ్బునాబఱ్ఱెలు

Jan 3, 2011

తర్వాత ఎవరూ?

కొన్ని తరాలుగా కొందరిమధ్యన వైరం.
వైరం ఎలా ఐనా పుట్టుందవచ్చు. తప్పు రెండువైపులా ఉండుండవచ్చు. మొదలుపెట్టినవాడిదే తప్పు అయి ఉండవచ్చు. కాకపోయీ ఉండవచ్చు. ఎవరు మొదలెట్టినా, ఒక తరం బాంబు దాడుల్లో మసి అయ్యింది. రెండో తరం వారిలో ఆ కక్షలు చిన్నతనంలోనే మొగ్గలు తొడిగాయి. ఏర్లీ టీన్స్ లోనే ఇంట్లో ఇలాంటి సంఘటనలు జఱుగుతుంటే, కళ్ళముందే తనవాళ్ళను కక్షలు బలితీస్కుంటుంటే వెన్ను చూపనివ్వలేదు ఆ సీమ. ఆ మాటకొస్తే ఆ సీమలోనే కాదు, ఎక్కడైనా అంతేనేమో. ఏఊళ్ళోనైనా అంతేనేమో. నవ్వుతాలుకి అరేయ్ సూర్యా నాన్న నన్ను కొట్టాడ్రా అని సూరిగాడి అమ్మ అంటే, మా సూరిగాడు నన్ను కొట్టటానికి కొచ్చిన సందర్భాలు అనేకం. ఇది పిల్లల్లో కుటుంబపట్ల తల్లి తండ్రుల పట్ల ఉండే ప్రొటెక్టివ్ నేచర్‌కి కేవలం ఉదాహరణ. ఏమాత్రం ఫ్యాక్షన్ అనే మాటకి, అనే ఓ ప్రక్రియకీ కనీసం దరిదాపుల్లోలేని కుటుంబాల్లోనే ఇలా ఉంటే, చుట్టూ వేల కళ్ళలో, నిప్పులు కక్కే కళ్ళు, నిన్ను నీ కుంటుంబాన్ని మసి చేస్తాం అనే కళ్ళు, నిన్ను రక్షించుకుంటాం అనే కళ్ళూ, తర్వాత నువ్వే అనే కళ్ళ మధ్యన పెరిగే ఓ ప్రాణికి, కళ్ళముందే కుటుంబాలకు కుటుంబాలే మసి ఐపోతుంటే, నెత్తురు వేడెక్కక ఏమౌతుందీ? ఇది రెండువైపులా జరిగిందే. తప్పెవరిదీ అనేకన్నా, దీన్ని మోసేవాళ్ళ స్వార్థాన్ని చూడలేకపోతున్నాం, చూపలేకపోతున్నారు ఎవరైనా. బలైయ్యేవాళ్ళు పావులు మాత్రమే అని నా అభిప్రాయం. మరో తరం బలైయ్యింది. *తలకు తల, చావుకి చావు* అనే నెంబర్లాటా కోసమో, బావ కళ్ళలో ఆనందంకోసమో లేక కొందరు సినీ నిర్మాతల జేబులు నింపటంకోసమే, లేక రాజకీయ (వి)నాయకుల పబ్బం కోసమే.
ఫ్యాక్షన్ హత్యలకు కుటుంబ/ఊరి తగాదాలు ఒక కారణం ఐతే, రాజకీయ స్వార్థం బలమైన కారణం అని నా అభిప్రాయం. దానికి ఉదాహరణలు కోకల్లు. పరిటాల రవి తె.దె.పా ఐతే, మద్దెలచెఱువు సూరి కాంగ్రేస్ అయితీరతాడు. ఒకవేళ పరిటాల కాంగ్రేస్ అయిఉంటే, సూరి తె.దె.పా కి చెంది ఉండేవాడు.
ఒకరికి కావాల్సింది ఈక్వేషన్స్ బా౨లెన్స్(తలకి తల, ప్రాణానికి ప్రాణం) కావటం, మరొకరికి కావాల్సింది దాన్ని అడ్డంపెట్టుకుని గెలవటం.

వార్తాపత్రికలకు కొంత కాలం పండగ మళ్ళీ. తమతమ కథనాలను ప్రచురిస్తాయి. తమ బైయాస్డ్ వార్తలను వెళ్ళకక్కుతాయి. ఇదిగో ఇలా -
"అప్పట్లో 9వ తరగతి చదువుతున్న సూరి చదువు స్వస్తి చెప్పి ఫ్యాక్షన్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు."

తొమ్మిదో తరగతి చదివేవాడు ఐతే గితే ఫ్యాక్షన్/గొడవల్లోకి అడుగెడతాడు. తొమ్మిదో తరగతి చదివే కుఱ్ఱాడికి ఎంత వయసు ఉంటుంది? రాజకీయాల్లోకి అడుగు పెట్టటవేవిటీ?
అనే ఓ ప్రశ్న సదరు జర్నలిస్టుకి రాదు. రాలేదు. కారణాలు అనేకం.
పై రాతలు చదివే నాబోటిగాళ్ళకు మాత్రం ఇలా అనిపించటంలోనూ తప్పులేదు
సినిమాలు చూసీ చూసీ ఫ్యాక్షన్ కి రాజకీయాలకీ తేడా తెలియకుండా పోతోంది మన వార్తాహరులకు. కుటుంబ గొడవలు ఊరి తగాదాలు వేరే రాజకీయాలు వేరే అనే కనీస పరిజ్ఞానం లేకపోవటం సోచనీయం.


ఇహ, ఇప్పుడేవిటీ? మద్దెలచెఱువు సూరికి ఒక కొడుకు.
ఆ పిల్లాడు రేపేంచాస్తాడో చూడాలని ఉంది.
ఈ మారణ కాండలో తర్వాత ఎవరో?