నేను ఇంతకముందు చిక్కుడుకాయ కూర మీద ఓ పోష్టు రాసా. దానికీ దీనికీ ఏమాత్రం సంబంధం లేదు.
సరే ఇప్పుడు దీనిగురించి దేనికి రాయాల్సొచ్చింది? ఈ రోజు మా ఇంట్లో చికుడుకాయకూర. మొన్న దేశీ కొట్టుకి వెళ్లినప్పుడు, ఆడు కొంచెం మంచి చిక్కుళ్లు తెచ్చాడు. కూర మామూలుగా హడావిడి పడుకుంటూ, దొరికిన కొద్ది సమయంలో మా ఆవిడ పాపం చేసింది. సూరిగాడు, తినరా అంటే, తొక్కరాకూడాదు, ఇత్తురాకూడాదు ఇలా పేచీలు పెట్టాడు. తను పిల్లని నాకిచ్చి, తాను భోజనం చేసి, పిల్లని మళ్లీ తను తీస్కుంటే, నా వంతు వచ్చింది ఇక భోజనానికి. దేనికో చాలా రోజుల తర్వాత కాస్త రుచిగా తగిలింది చిక్కుడు.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే - చిక్కుడుకాయల్తో పల్లెల్లో బడుగు బతుకులు ఎంతలా ముడిపడి ఉంటాయి అని. మేము పిడుగురాళ్లలో పదమూడూ సమచ్చరాలు ఉన్నాం. మా ఇల్లు చాలా పెద్దది. పది సెంట్లలో ఉండేది. ముందు చాలా స్థలం. దాంట్లో మంచి నల్లరేగడిని ట్రాక్టర్లతో తోలించాడు మానాన్న. గన్నేరు, తినే ఉసిరి, దానిమ్మ, కొబ్బరి, చామంతి, జాజి, బూడిద గుమ్మడి, నిమ్మ, అమృతపాణి అరటి, బంతి, పొట్ల, దోండ, కాకర, బీర, బోండుమల్లి (అంటే పెద్ద మల్లెలు) లతో పాటు చిక్కుడు పాదు కూడా ఉండేది మా ఇంట్లో. ఆ నల్లరేగడి మహత్యమో మా అమ్మ చేతి మహత్యమో, చిక్కుడు గంపలు గంపలు కాసేది. అలాంటి ఇలాంటి చిక్కుడు కాదు. నల్లని ఇత్తనం. పెద్ద గోలీ అంత ఉండేది ఒక్కో ఇత్తనం, జానెడు పొడుగు ఉండేది ఆ చిక్కుడు. గంపలకేసి, పిడుగురాళ్ల కూరగాయల మార్కెట్టుకి పంపించే వాళ్లం, పిల్లి సత్యానందం అని మార్కెట్టు కాంట్రాక్టరు, ఎట్టా కాస్తాయి అమ్మగారు ఇన్నిన్ని అనేవాడు. చిక్కుడులో చాలా బలం ఉంటుంది. చిక్కుడు సీజన్లో మాకు అత్యంత ఇష్టమైన కూర అదే. రోజు మార్చి రోజు తిన్నా విసుగొచ్చేది కాదు. మేము కూరగాయలు కొనుక్కుని ఎరగం.
తర్వాత మోర్జంపాడుకి వెళ్లాల్సి వచ్చింది. పిడుగురాళ్ల కొంచెం పెద్ద టౌనైతే, మోర్జంపాడు కొంచెం పెద్ద పల్లెటూరు. అక్కడా ఇంట్లోని ఓ రెండడుగుల జాగాలో మా అమ్మ, చిక్కుడు గట్రా వేసింది. అక్కడ కూడా విరగ్గాసేది ఆ చెట్టు. అప్పటికి మా అన్నయ్య పెద్ద చదువులకి రావటం, మా నాన్న టీచరుగా పెద్ద జీతగాడు కాకపోవటంతో, మా ఇంట్లో ఎక్కువగా రెండు మూడు కూరల్తోనే వెళ్లబుచ్చేది మా అమ్మ. రోజు మార్చి రోజు చిక్కుడు. అదికూడా ఇంతలా దిట్టంగా ఉండె చిక్కుడు. నేను చిక్కుడుకాయ కూరతినే విధానం భలేగా ఉండేది. పైన తొక్కని కూరన్నంలో తినేసి ఇత్తనాలని పక్కైపెట్టి, పెరుగులో తినే వాడిని. పాపం మానాన్న తన కూరలోని ఇత్తనాలు నాకు ఇచ్చేవాడు. గడ్డపెరుగు, వేడి అన్నం, పైన చిక్కుడు ఇత్తనాలు. అంతకన్నా ఏమికావాలి ఎవ్వనికైనా?
Jan 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
భలే !! నేను కూడా అచ్చంగా ఇలానే తినే వాడ్ని చిక్కుడుకాయ కూర. ఫోటో పెట్టి ఇలా ఇబ్బంది పెడితే ఎలా సోదరా.. మా ఇండియన్ స్టోర్ వాడ్ని ఇప్పుడు అర్జంటు గా మంచి చిక్కుళ్ళు తెప్పించమని చెప్పాలి.
ReplyDeleteఅన్నట్లు అసలే సంక్రాంతి సీజన్ కదా ఇప్పుడు ఈ చిక్కుళ్ళు బాగా దొరుకుతాయి. భోగి రోజు నల్ల పెసల తో పులగం వండి, దానికి ఓ చుక్క నెయ్యి తగిలించి పచ్చిమిరగాయ్ టమాటా పచ్చడి తోనో లేదా ఈ చిక్కుడు కాయకూరతోనో తింటుంటే ఉంటదీ.. కేకో కేక...
@వేణు శ్రీకాంత్ అన్నాయ్: :):) మనమధ్య సానా కామన్ పోలికలు ఉన్నాయ్. మీ దేశీ స్టోడికి చెప్పు, తెమ్మని, లేకపోతే చెప్పు "నాకు ఇంకోపేరు ఉంది" అని. :):)
ReplyDeleteగోరు చిక్కుడుకాయ మరియు Desi టొమాటొ combination is one of the best.
ReplyDeleteఇంకా ఇలాంటి మరెన్నొ మంచి కూరలు అందించాలి.
మేము కూడా ప్రతి ఏడూ చిక్కుడు పాదు పెట్టేవాళ్లం.పాదు వున్నన్ని రోజులూ వారికి 3,4 రోజులు చిక్కుడు కాయ కూరే.నిజమే ఎన్ని సార్లు తిన్నా విసుగు వచ్చేది కాదు.అదీ కాకుండా అమ్మ వంకాయ-చిక్కుడు,గుడ్డు-చిక్కుడు,ములక్కాడ-చిక్కుడు,తమాటా-చిక్కుడు.........ఇలా వెరైటీలన్న మాట.మా దిమ్మ మీద వుండే మునగ చెట్టు కాడలు చాలా బాగుండేవి.మేము కూడా ఊర్లో కూరలు కొనుక్కుంది చాలా తక్కువ.మా ఇంట్లోనో,పక్కింట్లోనో,పక్క వీధిలోనో ఎప్పుడూ ఏవో కూరగాయలు వుంటూనే వుండేవి.ఇప్పుడే చిక్కుడు కాయ కూఅ స్టవ్ ఆఫ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చుని సౌమ్య గారికి కామెంటు పెట్టి ఇటొచ్చా.భలే వింతగా వుంది.అన్నీ కో ఇన్సిడెన్స్ అవుతున్నాయి.
ReplyDelete@మాష్టారు: అవునండి. టమాటా చిక్కుడు కొంచెం మసాలా వేసి చేస్తే చాలా బాగుంటుంది.
ReplyDelete@రాధిక గారు: మానాన్న గారు టీచరు. ఆయన శిష్యులు ఎవరో ఒకరు మునక్కాయలు తెచ్చిచ్చేవారు, ఓ కట్ట. ఎన్ని ఉంటాయి కట్టకి? ఓ యాభై. అవి అయ్యేదాకా పులుసులో, కూరలో, పప్పులో అన్నింట వేసి చెసేది మా అమ్మ. ఇక్కడకొచ్చాక, ఒక్కోసారి గోంగూర కొనుక్కుంటుంటె అనిపిస్తుంటుంది, ఛీ, గోంగూర కూడా కొనుక్కోవాల్సిన ఖర్మ వచ్చిపడిందే అని. అప్పుడప్పుడూ, ఏ బీఈడీనో చేస్కుని, హాయిగా ఏ పల్లెలోనో సింగిల్ టీచరు బడిలోనో ఉద్యోగం చేస్కుంటూంటె ఎంతబాగుండేది అని.