Showing posts with label జ్ఞాపకాల దొంతర. Show all posts
Showing posts with label జ్ఞాపకాల దొంతర. Show all posts

Apr 16, 2023

తంగిరాల వారితో అనుబంధం

గుంటూరులో మేము కీశే శ్రీ మిన్నెకంటి గురునాథ శర్మ గారి ఇంట్లో అద్దెకుండే రోజుల్లో మా ఇంటి ముందు తంగిరాల వారు ఉండేవారు. ముగ్గురు అన్నతమ్ములు, ఆస్తి పంపకాలు చేస్కున్నారు, విడిబడ్డారు. 

పెద్ద ఇంటిని మూడు ముక్కలు చేస్కోగా మా ఇంటి ముందున్న వాటా పెద్దాయనకి వచ్చింది. 

ఆ పెద్దాయనకి ముగ్గురు కొడుకులు. 

పెద్దతను హైద్ లో జాబ్ చేసేవాడు. 

రెండోతను నేను ఇంటర్ చదివే రోజుల్లో MSc Physics చేసేవాడు ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలంలో. మూడోతను వాసు. బహుశా నాకన్నా రెండో మూడో ఏళ్ళు పెద్ద అనుకుంటా. 

అప్పట్లో గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అవటం, పెద్ద హిట్ అవ్వటం, చాలామంది కుఱ్ఱకారు చిరంజీవిని కులదేవతలా పూజించటం, ఆయన డ్రస్సులు హైర్ స్టైల్ కాపీకొట్టటం..ఇలాంటివి చెప్పాల్సిన అవసరం లేదు..

వాసు కూడా ఆ తానులో ముక్కే. 

కొంచెం గడ్డం, 

పూల పూల చొక్క 

తెల్ల జీన్స్ 

పవర్ షూస్, 

కాలర్ లేపి...వాసు నా స్మృతిపథంలో అలా ఉండిపోయాడు. 

మొన్న గుంటూర్ వెళ్ళినప్పుడు ఆ సందులోకి వెళ్ళాను. 

తంగిరాల రమేష్ కుమార్ అని నేం ప్లేట్ కనిపించింది. 

తలుపు కొట్టాను. ఓ మధ్యవస్కుడు తలుపు తీసి ఏంటి అని అడిగాడు. ఇలా వాసు, వాళ్ళ అన్నయ్య బాబీ అని విచారించాను. 

వాళ్ళు హైద్ లో ఉంటూన్నారు అని చెప్పి నెంబర్ ఇచ్చాడు

తంగిరాల వారితో అనుబంధం


Oct 30, 2020

గ్రీసు/టర్కీ దేశాలల్లో భూకంపం

గ్రీసు/టర్కీ దేశాలల్లో భూకంపం


"జర్మనీలో భూకం వచ్చిందటరా. సునామి వచ్చిందట. గ్రీస్ అనే దేశంలో కూడా వచ్చిందట" అంటూ అమ్మ ఫోన్. 

సర్ది చెప్పటానికి ప్రయత్నించాను. టెన్షన్ పడకూ అని.


గ్రీస్ తో నా అనుబంధం మనసులో మెదిలంది.

2000 సంవత్సరంలో ఓ సారి గ్రీస్ వెళ్ళాను. హోలార్గోస్ అనే ఊళ్ళో బస ఇచ్చారు. నేను ఉన్న ఇంటి ఓనర్ పేరు దిమిత్రి. అతను కొంత కాలం కొత్త డిల్లీలో ఉన్నాట్ట. భారతీయులంటే అదొక అనుబంధం అని చెప్పుకొచ్చాడు.

నేను పని చెసిన ఆఫీసు కిఫిసీస్ ఎవెన్యూలో ఉండేది. బస్సులో వెళ్ళి, మైలు దూరంలో దిగి నడుచుకుంటూ వెళ్ళేవాణ్ణి.

గ్రీస్ లో కొందరు పరిచయం అవ్వటం వాళ్ళతో సాంస్కృతిక చర్చలు జరగటం - ఓ జ్ఞాపకం.


అక్కడ పరిచయం అయిన మిత్రులు ఆక్రొపొలి దగ్గర్లో ఉన్న ఒక గ్రీక్ ట్రడిషన్ల్ బుజీకి క్లబ్ కి తీసుకెళ్ళటం, క్లబ్బులో గ్రీక్ పాటలు బుజూకి సంగీతం ఆశ్వాదించటం, పాట నచ్చితే పింగాణి ప్లేట్లు నేలకేసి పగలగొట్టి ఆనందాన్ని సంతోషాన్ని వెలిబుచ్చాలనే విషయం తెలిసి తెల్లబోవటం ఓ జ్ఞాపకం.

గ్రీకులు తమ సంస్కృతిని తమ పురాణ ఐతిహాసాలని గొప్పగా చెప్పుకోవటం, కొత్తతరం పాతతరం సంస్కృతిని ఎలా మిళితం చేసుకున్నాయో చూసి ఆశ్చర్యపోవటం - జ్ఞాపకం.

గ్రీకు భాషకి, సంస్కృతానికి సంబంధాలు - మాత్రోస్/మాతా, పిత్రోస్/పితా లాంటి పదాల సారూప్యత. గ్రీకు దేవుళ్ళు/హిందూ దేవుళ్ళు ఇత్యాది అనేక సారూప్యతల గురించి చర్చలు - ఒక జ్ఞాపకం.


అనేక జ్ఞాపకాలు మదిలో మెదిలాయి.

అక్కడి జనుల క్షేమం కోరుతాను.


Oct 5, 2020

ఐక్య ఉపాధ్యాయ

 ఐక్య ఉపాధ్యాయ


యావత్ ఉపాధ్యాయులందరికీ *ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు* Oct 05/2020.

ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబరు 5 న. శ్రీ సర్వెపల్లి గారి పుట్టినరోజు. మరి అక్టోబరు 5న? ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం #ట


మా చిన్నప్పుడు, ఉపాధ్యాయ దినోత్సవానికి టిక్కెట్టు అమ్మేవారు, పావలాకి ఒకటి. ఆ వచ్చిన ఫండ్‌తో ఉపాధ్యాయులని సత్కరించటానికి ఉపయోగించేవాళ్ళు అనుకుంటా.


మా నాన్న గారు యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ టీచర్స్ ట్రేడ్ యూనియన్ లో పీకల లోతుకు కూరుకుపోయి ఉండేవారు. ఒకానొక సమయంలో గుంటూర్ నుంచి మండలికి పోటీ చేస్తున్న శ్రీ MJ మాణిక్య రావు గారిని బలపరుస్తూ క్యాంపైన్ కి కూడా తిరిగారు. ఆయన గెలిచారనుకుంటా.


గుంటూరికి మేము మారిన తర్వాత ప్రతీ రోజూ యూటీయఫ్ కార్యాలయానికి విధిగా వెళ్ళేవారు. రిటైర్ అయ్యక కుడా వెళ్ళాటం ఆగలేదు. చివరికి చనిపోయే ముందు రోజుకూడా.


అదేదో ప్రీతి. రిటైర్మెంట్ ఫండ్ నుంచి కొంత యూటీయఫ్ కి ధారాదత్తం చేశారు.


యూటీయఫ్ వారిది ఒక పత్రిక వచ్చేది. *ఐక్య ఉపాధ్యాయ* దాని పేరు. అప్పట్లో ఆ పత్రికకి సంపాదకులు శ్రీ కేశవ రెడ్డి మాష్టారు. కేశవ రెడ్డి మాష్టారు మా నాన్న గారికి చిరకాల మిత్రులు. ఆప్తులు. వారూ మా నాన్న గారు ఒకే ఊరి నుంచి, ఎదురెదురు ఇళ్ళు. మా నాన్న గారి ఫస్ట్ పోస్టింగ్ దాచేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరినప్పుడు శ్రీ కేశవరెడ్డి మాష్టారు అదే స్కూల్లో పని చేస్తుండటం కేవలం యాధృచ్చికం. కేశవరెడ్డి గారు అనేక విషయాలల్లో అనేక సందర్భలల్లో మానాన్న గారికి అండగా నిలిచారు. యూటీయఫ్/కమ్యూనిస్ట్ భావజాలానికి పడ్డ పునాదుల్లో కేశవరెడ్డి గారి ప్రభావం ఉందనక తప్పదు.


ఆరోజుల్లో ఐక్య ఉపాధ్యాయ పత్రిక శాశ్వత చందాదారుడిగా ప్రతీ నెలా ఆ పత్రికని ఆందుకోవటం, సంపాదకీయం చదవటం అనేది ఒక నెలనెలా జరిగే ఓ తంతు. ఆ మాటకొస్తే మా నాన్న ఇండియా టుడే, ఫ్రంట్‌లైన్, ఇల్లస్ట్రేటెడ్ ఇత్యాది లాంటి పత్రికలు తెప్పించి చదువుతుండేవారు. ఏ పత్రికైనా - ఆసక్తి మాత్రం ఒక్కటే.


ఒక ఉపాధ్యాయుడికి కావాల్సిన/ఉండవలసిన అత్యంత ముఖ్యమైన గుణాలులో కొన్ని - పరిశీలన/అవగాహన

ఇవి ఉపాధ్యాయుడిని ఎలివేట్ చేస్తాయి. ఇవి వ్యక్తిత్వ వికాసానికి పునాదులు అని అప్పట్లోని ఉపాధ్యాయులు చెప్పి ఆచరిస్తుండేవాళ్ళు.


ఐక్య ఉపాధ్యాయ అనే పత్రిక ముఖం పైన చివరలో ఒక బోడిగుండాయన బొమ్మ ఉండేది. ఆరోజుల్లో ఆయన ఎవరూ అనే జిజ్ఞాస ఉన్నా పెద్ద పట్టించుకోలేదు. ఈ పోస్ట్ రాస్తున్న సందర్భంలో ఆయన ఎవరూ అని వెతికితే, ఆయన పేరు చెన్నుపాటి లక్ష్మయ్య అని తెలుసుకున్నాను. 


చెన్నుపాటి లక్ష్మయ్య ఉపాధ్యాయ నేత. ఆయన తన జీవిత పర్యంతం ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడిన యోధుడు


అలాగే ఐక్య ఉపాధ్యాయ ప్రధాన సంపాదకుడు మైనేని వెంకటరత్నం. 


ఐక్య ఉపాధ్యాయ పత్రిక ఆరంభం నుండి తన మరణం వరకు ప్రధాన సంపాదకులుగా పనిచేశారు.


ఈ పోస్ట్ సందర్భంలో ఐక్య ఉపాధ్యాయ పత్రిక గురించి వెతికితే ఆన్లైన్లో దొరికింది.


జనవరి 2020 సంచిక ఓపెన్ చేశాను. *మహోన్నత వ్యక్తి మైనేని" అనే ఒక వ్యాసం. వ్యాసకర్త మా నాన్న గారికి అత్యంత ఆప్త మిత్రులు యూటీయఫ్ సీనియర్ నాయకులు శ్రీ యం.ఎ.కె దత్తు గారు.


ఉపాధ్యాయులు సంఘటితం అవ్వటం అనేక విషయాలపై పోరాటాలు చేయడం - గొప్ప విషయాలు.


ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభ్కాకాంక్షలు.



Sep 26, 2020

దొరకునా ఇటువంటి సేవా

మధ్యానం బాధ లోంచి  బయట పడటానికి ఛానెల్స్ బ్రౌజ్ చేస్తుంటే జెమినీలో శంకరాభరణం తగిలింది.

సామజ వర గమన పాట వస్తున్నది అప్పటికే! 


బహుశా నా ఒకటో లేక రెండో తరగతిలో వచ్చిందనుకుంటా శంకరాభరణం.

చూసిన ప్రతిసారీ ఓకొత్త అనుభూతి అనుభవం. 

నా దృష్టిలో గొప్పనటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారు. శంకరాభరణం నిలువెత్తు ఉదాహరణ.

నా దృష్టిలో గొప్ప నటుడు శ్రీ జొన్నలగడ్డ సోమయాజులు గారు.

నా దృష్టిలో గొప్ప నటి నిర్మలమ్మ.

నా దృష్టిలో గొప్ప నటుడు చంద్రమోహన్.

నా దృష్టిలో గొప్ప నటుడు సాక్షి రంగారావు.


సరే సినిమాలోకొస్తే సామజ వర గమన పాట, ప్రాణం వేటూరి, ఊపిరి బాలు జానకి.

ప్యూర్ వేటూరి మాయాజాలం బాలు దాన్ని తారాస్తాయికి తీసుకెళ్ళటం -



"ఆమని కోయిల

ఇలా 

నా 

జీవన వేణువులూదగ

ఆమని 

కోయిల 

ఇలా 

నా జీవన వేణువులూదగ

మధురలాలసల 

మధుపలాలనల 

మధురలాలసల 

మధుపలాలనల 

పెదవిలోని మధువులాను రసముపూని జతకు చేరగా 


వేసవి రేయిలా 

ఇలా 

నా 

ఎదలో మల్లెలు చల్లగ 


మదిని కోరికలు 

మదన గీతికలు 

మదిని కోరికలు 

మదన గీతికలు 

పరువమంత విరుల పానుపు పరచి నిన్ను పలకరించగా"


పాటని అనుభవిస్తూ పాడితే ఎలా ఉంటుందో ఈ పాట ఒక మైలురాయి.


ఇంతలో సినిమా చివరకు వచ్చేసింది.


"దొరకునా ఇటువంటి సేవ"

సన్నివేశం విశ్వనాథ్ గారు ఎలా చిత్రీకరించారు నాటకీయత  ఇవన్నీ పక్కన పెడితే!


వేటూరి ఆలోచనా తీరు, జంధ్యాల మాట, బాలసుబ్రహ్మణ్యం పాట, విశ్వనాథ్ దర్శకత్వం -


ఎన్నో ఏళ్ళ తర్వాత కచేరీకి అంగీకరించిన ఓ సంగీత శాస్త్రవేత్త.

కచేరికి వేంచేసి అతని పేరు మీద వెలసిన క్షేత్రంలోకి ఆశ్చర్యపోయి వచ్చి - 

పాశ్చాత్య సంగీతపు పెనుతుపానుకి రెపరెపలాడుతున్న సత్-సాంప్రదాయ సంగీతపు జ్యోతిని ఒక కాపుకాయటానికి తనచేతులు అడ్డుపెట్టిన దాత ఎవరో వారికి శత సహస్ర వందనాలు అర్పిస్తున్నాను. సుష్కించిపోతున్న భారతీయ సంస్కృతీసాంప్రదాయాలని పునరుద్ధరించటానికి నడుంకట్టిన ఆ మహా మనీషీకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈకళ జీవకళ, అజరామమైనది. దీనికి అంతం లేదు. నిరాదరణ పొందుతున్న ఈ కళని పోషించటానికి కోటికి ఒక్క వ్యక్తిముందుకొచ్చినా సరే - ఈ అమృతవాహిని అనంతగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి నిలువెత్తు ధనంసంపాదించినా -

దొరకునా ఇటువంటి సేవ

నీ పద రాజీవముల చేరు 

నిర్వాణ సోపాన మధిరోహణము 

సేయు త్రోవ


రాగాలనంతాలు నీ వేయి రూపాలు

భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు

రాగాలనంతాలు నీ వేయి రూపాలు

భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు


నీ పాదాలు చేరటానికి నిచ్చెన సేవ

తిమిరాలను పోకార్చు దీపాలు - 

తిమిరం - చీకటి

పోకార్చుట - 'పొకారు or పోకారు [Tel.] v. n. To be ruined, నాశమగు. పొకార్చు, పొకారుచు, పోకారుచు or పోకార్చుpokārṭsu. To kill or ruin, to render powerless, to strike with stupor, "ఉ.. కానకకన్నమాసుతుబొకారిచియిన్నియుమిధ్యచేసితే."'


జీవితాన్ని మింగేసిన చీకట్లను నాశనం చేసే దీపం సేవ.. 



బాలసుబ్రహ్మణ్యం ఈ పాటకి నిజంగా ఊపిరి!

నా కళ్ళు చెమర్చాయి.


సినిమా ఇండస్ట్రీ అంతా హీరో చుట్టూతా పరిభ్రమిస్తూ ఉంటుంది ముఖ్యంగా తెలుగులో.


రచయితకి గుర్తింపు ఉండదు.

పాటకర్త  ఎవరో తెలియదు.

వీటి ప్రస్తావన ఎక్కడా ఉండదు.

దౌర్భాగ్యం! 

పై మాటలు ఎంత లోతుగా ఉన్నాయీ. దర్శకుడి తపనని గుర్తెరిగిన రాసిన రాత - శంకరాభరణం మాట కర్త జంధ్యాల.

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మాటలు పాటలు నటన దర్శకత్వం.

Sep 16, 2020

జయ ప్రకాశ్ రెడ్డి

జయ ప్రకాశ్ రెడ్డి


మనాన్న గారు హిందూ కళాశాలలో పట్టభద్రుడైయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఒక ఏడాది చదివి మధ్యలో జై ఆంధ్రా ఉద్యమం అంటూ సమ్మెలు హర్తాళ్ళు అయ్యాక మధ్యలోనే ఆపివేసి బందరులో బిఈడి చేరినప్పుడు ఆయనకి సహాధ్యాయీ జయప్రకాశ్ రెడ్డి గారు. మా నాన్న గారికి కూడా నాటకాల పిచ్చి ఉండటం. డిగ్రీ రోజుల్లో ఒకె నాటకాన్ని అయిదు రోజులు ప్రదర్శించటం. ఆ నాటకం పేరు ఒథెల్లో అవటం. అదీ ఇంగ్లీషులో అవ్వతం. ఆయన డిగ్రీ సర్టిఫికెట్ లో "Talented Actor" అని ఉండటం - గొప్పగా చెప్పుకునే వాడు నాన్న.


జయప్రకాశ్ రెడ్డి గారు మా నాన్న గారు ఒరేయ్ ఒరేయ్ అనుకునే స్నేహితం.


ఓ రోజున నాన్న సమరసింహారెడ్డి సినిమాకి వెళ్దాం పదా అని లాక్కెళ్ళారు. బాలకృష్ణ సినిమాలు థియేటరుకి వెళ్ళి చూసినవి 4 మాత్రమే. ఏంటినాన్నా బాలయ్య సినిమకి లాక్కుపోతున్నావ్ అని ఏడుస్తూ మూలిగితే నా మిత్రుడు జయప్రకాశ్ రెడ్డి అందులో గొప్పగా నటించాడు. వాడికోసం అని చెప్పుకొచ్చాడు నాన్న.


సమరసింహారెడ్డి సినిమా చూట్టం జయప్రకాశ్ రెడ్డి గారి నటన చూసి ఆయనే నటించినంతగా పొంగిపోవటం ఇంటికొచ్చాక ఒరేయ్ అంటూ ఆయనతో మాట్లాడటం. నాన్న గొప్పగా పొంగిపోయాడు - అదిగో వాడే నా మిత్రుడు అంటూ.


టీచర్ల బృందంలో బాగా నలిగిన నాటకాలు కొన్ని. ఈ ఇద్దరు మిత్రులూ కొన్ని నాటకాల గురించి మాట్లాడుకునే వాళ్ళు. మరో మొహంజో దారో గురించి మధ్యలో వచ్చేది. జయప్రకాశ్ రెడ్డి గారి అలెక్జాండర్ గురించి మాట్లాడుకునే వారు.


జయప్రకాశ్ రెడ్డి గారు స్క్రీన్ మీద ఎంత గంభీర్యంగా ఉన్నా నిజ జీవితంలో చాలా సౌమ్యంగా మాట్లాడేవారు. ఎంతో సాఫ్ట్ గా మాట్లాడేవారు. చిన్నా పెద్ద అని లేకుండా అందరితో బహు సరళంగా మాట్లాడేవారు. మా నాన్న లాగానే.


ఆయన కాలం చేశారనే వార్త నన్ను కలచి వేసింది.


నటుడికి చావుండదు అని నా అభిప్రాయం.


Jun 16, 2020

అన్నయ్యకు అభినందనలు.


ఒకానొక రోజున 2012లో మా అమ్మకి రొమ్ము క్యాన్సర్ అనే ఓ స్థితి కలిగింది. ఆమె చాలా భయపడింది. మేము ఇక్కడ తను ఒక్కతే అక్కడ. మాకు బాగా కావాల్సిన ఓ వ్యక్తి మా అమ్మగారిని ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరకి తీసుకువెళ్ళారు. సదరు డాక్టరు ఎంతో అమర్యాదగా ప్రవర్తించాడు. నీడిల్ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ తేండి అన్నాడు. మా అమ్మ ఏదో ప్రశ్న అడగబోతే గెట్ ఔట్ అన్నట్లుగా ప్రవర్తించాడు. కసురుకున్నాడు. విసుక్కున్నాడు.
మా అమ్మ పాపం బిక్కచచ్చిపోయింది. ఇంటికొచ్చి చేలా బాధపడింది. వైద్యో నారాయణో హరిః అన్నది మన సంస్కృతి. మా మాతామహులు ఆయుర్వేద భిషక్.

నేటి డాక్టర్లు ఇలా తయ్యారయ్యారు. రోగికి మనోధైర్యం ఇవ్వాల్సిన వైద్యుడు రోగిని మానసికంగా హత్య చేస్తున్నాడని గమనించటం లేదు.
నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఇలా చెప్పుకొచ్చింది.
నా మిత్రుడికి కాల్ చేసి అతని అన్నగారితో మాట్లాడాను. ఆయన యండి రేడియాలజి చేసి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్నట్టు నాకు జ్ఞాపకం. నాకు గుర్తున్నంతవరకు గుంటూరులో పోస్టింగు. వాడికి ఫోణ్ చేసి ఇదిరా పరీస్థితి అని వివరించాను. వాడు అన్నయ్యతో మాట్లాడి ఆయన నెంబరు నాకిచ్చి మాట్లాడమన్నాడు.
ఆయన నన్ను వెంటనే రిసీవ్ చేస్కుని ఏ ఆసుపత్రీ? ఎవరా డాక్టర్ అని అడిగారు.
పలానా అని చెప్పాను.
అరేయ్ అతను నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటాని భరోసా ఇచ్చాడు.
అన్నట్టుగానే మా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడి, తన కారులో మా అమ్మని తీసుకుని సదరు డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తే అతను అప్పుడు, ఈయన మీకు ఏవైతాడూ ఇంతక ముందు చెప్పలేదే అని చేతిలో చేయివేసి లోపలకి తీసుకెళ్ళి నీడిల్ పరీక్షలు గట్రా చేసి ఏవీ లేదని మొత్తానికి నిర్ణయించి పంపించాడు ఇంటికి క్షేమంగా.

ఈరోజున అన్నయ్య HOD అవ్వటం గొప్ప విషయం.

ఈయన నన్ను సొంత తమ్ముడిలా ఆదరించాడు. ఈయనే కాదు వీళ్ళ కుటుంబం మొత్తం నన్ను కుటుంబంలోని వ్యక్తిగా చూసుకున్నారు.
అన్నయ్యకు కృతజ్ఞతాభినందనలు.