బ్లాగ్ ప్రయాణంలో ఓ మైలు రాయి. ఇదినా నూరో పోస్టు. బ్లాగు రాస్తున్నా అంటె, ఇంట్లో ఇల్లాలి సహకారమ్లేకుండ ఎలా కుదురుతుంది? కాబట్టి ముందుగా నా ఇల్లాలికి నా కృతజ్ఞతలు. సూరిగాడికి చాక్లేట్లు, పిల్లకి కొత్త డ్రస్సులు. నా బ్లాగు చదివి, వ్యాఖ్యలతో నన్ను ఉత్సాహపరుస్తున్న అందరికీ నా నమస్కారాలు.
ఈ మద్దెన మా ఆవిడ సూరిగాడికి గసి పెడుతుంటే మావాడు అదేదో పచ్చడి అని లాగిస్తున్నాడు. ముచ్చటేసింది వాడు గసి తింటుంటే.
నాకు గసి అంటే మహా ఇష్టం. మీకు తెలుసా గసి అంటే? వెన్నని కాసి నెయ్యి చేసినప్పుడు, ఆ గిన్నెలో అడుగున మిగిలేదే గసి. వెంటనే నాకు మా ఊరు, ఆ ఊరు, ఆ గేదెలు, ఆకుపచ్చని చేలు, ఆ పేడ, ఆ పాలు... .. . గుర్తుకొచ్చినై.
మేము మోర్జంపాడులో ఉండే కాలంలో, పాలు అనే పదార్ధానికి నిజమైన అర్ధం తెలిసింది నాకు. అంతరుచి, అంత చిక్కటి పాలు ఎక్కాడాజూళ్లా నేను. మా అమ్మ పాలు కాసి తోడేసి, పెరుగు వేస్కునేప్పుడు, ఆ గడ్డ పెరుగు పైన మీగడని తీసేసి దాచేది. అలా ఓ వారం మొత్తం సేకరించిన మీగడని ఓ గిన్నెలో పోసి ఇక కవ్వంతో చిలికేది. ఠాడా!! వెన్న, అంత ములాయం, మహారుచికరమైన వెన్న, ఎక్కడ దొరుకుతుంది? అలా చిలికేప్పుడు, కొంచెం పెట్టమ్మా అంటే, చూపుడువేలుతో కొంచెంతీసి, చేతిని బోర్లిస్తే మణికట్టుపై కొంత రాసేది. అలా దేనికి, అరచేతిలోనే రాయొచ్చుకదా? ఇప్పటికీ అది ప్రశ్నే నాకు. తర్వాత్తర్వత, సుమీత్ మిక్సీ వచ్చింది. దాంట్లో వెయ్యటం మొదలైంది. దేనికో సరిగ్గా వచ్చేది కాదు దాంట్లో. ఇక, పెద్ద బూష్టు సీసాలో మీగడేసి మూతపెట్టి ఊపీ ఊపీ తీసేది కొన్ని రోజులు వెన్నని. మొత్తానికి ఎప్పుడు వెన్న తీసినా, రెండుచేతులు పట్టేంత పెద్ద బంతిలా వచ్చేది వెన్న. ఇక దాన్ని కరగబెట్టి ఓ డబ్బాలో పోసాక గసి... నాకు మాడిన అన్నం చెక్కమీద గసి పూసుకుని లాగించటం అంటే మహా సరదా. వేడి వేడి అన్నంలో గసి, కొత్త పండుమిరపకాయల కారం ఏసుకుతింటే!!! వేడి వేడి అన్నంలో పండుమిరపకాయల కారం,వెన్న!!!! మా అమ్మ ఈ ఇంట్లో చేస్కున్న నెయ్యితో మైసూర్పాక్ చేసేది. ఏమి టేష్టు అది. అఫ్కోర్స్ ఒక్కోసారి మైసూర్పాక్ చెయ్యబోతే అది మైసూర్ రాక్ ఐన సందర్భాలు కూడా ఉన్నాయిఅనుకోండి.
అలానే, వారానికోసారి జొన్న రొట్టెలు చెసేది మా అమ్మ. వేడి వేడి జొన్న రొట్టెలు, ఉల్లిపాయకారం, వెన్న. అదీ కాంబినేషన్ అంటే. అలానే, గోంగూర పప్పు, వేడి వేడి అన్నం, వెన్న.
మరి వెన్న తీసాక మిగిలిన మజ్జిగతో ఏంజేస్తారు అని ఎవరైనా అడిగితే, కిస్సుక్కున నవ్వి, "మజ్జిగపులుసు" పెట్టుకుంటారు అంజెప్పాలి :)
ఇవన్నీ మన ముందరి తరాలకి లేవు. వాళ్లకి కనీసం చెప్పినా అర్ధం కావు. అమెరికాలో ఆ పాసిబిలిటీ ఉందేమో, ఓ 10ఎకరాలు కొనుక్కుని ఓ చేలో ఇల్లు కట్టేస్కోవచ్చు. నాఉద్దేశం ఆ జాగా ఇక్కడ ఉంది అని. మనకి భూమి తగ్గిపోతోంది. రియల్ భూతం అంతా మింగేస్తోంది. పల్లెల్లో పాడి తగ్గిపోతున్నదని కూడా విన్నా. ఇవ్వాళ్టి రోజున ఎద్దులు కనుమరుగౌతున్నాయి. వ్యవసాయం మొత్తం ట్రాక్టర్లతోనే జరిగిపోతోంది.
January 19th, Monday, Martin Luther King Jr. Day
Jan 19, 2009
Subscribe to:
Post Comments (Atom)
నిజమే... చక్కగా చెప్పారు. మన వాళ్ళకి లేనిది స్థలం కాదు -- మన పద్ధతుల పట్ల గౌరవమ్, కాస్త ఓపిక. మీరన్నట్లు ముందు తరాలికి ఇవేమీ ఉండవు. వందో పోస్టుకి శుభాకాంక్షలు. రాస్తూనే ఉండండి. సుఖీభవ.
ReplyDeleteమీర్రాసిన ఈ 'గసి' ని మా అమ్మమ్మ గారూర్లో గోదారి అనే వాళ్ళు ..నిజంగా భలే బావుంటుంది! అసలే అందరం బరువు పెరుగుతున్నామో అని మొత్తుకుంటుంటే మీరిలా వెన్న ముద్దలూ,వెన్న గోళీలూ, గోదార్లూ,గోరుమీటీలూ గుర్తు చెయ్యడం ఏమీ బాలేదు.
ReplyDeleteఅర్రే, తిండి గొడవలో బడి మర్చేపోయాను...శత టపా శుభాకాంక్షలు :)
ReplyDeleteమీ వందో పోస్టుకి శుభాకాంక్షలు ! వెన్నని కాసి నెయ్యి చేసినప్పుడు, ఆ గిన్నెలో అడుగున మిగిలేది మీరు గసి అంటారా? గోదారి కాదా ?
ReplyDelete@రాజు గారు: ధన్యవాదాలు
ReplyDelete@తెరెసా గారు, శ్రావ్యా - బహుశా గోదావరి జిల్లాల వాళ్లు "గోదారి" అంటారేమో!! కిట్నా జిల్లల వాళ్లు "గసి" అని అంటారు. ఏదేమైనా మహా రుచి. :):) వందోపోష్టు శుభాకాంక్షలకి ధన్యవాదాలు
మాది గోదావరి జిల్లా కాదండి :(
ReplyDelete@శ్రావ్యా:: సారీ అమ్మా!! ఏమైనా, మా పల్నాడులో గసి అంటాం ప్రిసైజ్ గా. :):)
ReplyDeleteమీ నూరు పోస్టుల పండగకి శుభాకాంక్షలు.
ReplyDeleteసూరిగాడికి చాక్లేట్లు, పిల్లకి కొత్త డ్రస్సులు- :)మిమ్ములిని వ్రాసుకోనిస్తున్నందుకా?
మీ పల్నాడులో ఏమో గాని గుంటూరు జిల్లాలో కూడా గోదారి అనే అంటారు.
ఏటండోయ్ నే లేకుండా గోదావరి జిల్లమీద చర్చ పెట్టేసేరు .వెన్న కాసినపుడు గిన్నెకి అంటుకున్నదాన్ని మే గోకిడి అంటాం .ఆటల్లో వోడిపోయినవారిని కూడా నువ్వు గోకిడి అని ఏడిపిస్తారులెండి .చిన్నప్పుడు మేం గోకిడిలో పంచదార కలిపి లాగించేవాళం .ఇప్పుడు మాడినవి తింటే కేన్సర్ అని భయపెడుతున్నరుకదా అందుకే పిల్లలకి పెట్టకుండా బయట వేస్తున్న
ReplyDeleteశ్రావ్య. తెరెసా,వరూధిని గార్లు, మీకే నా వోటు!మా వూర్లో కూడా(మాది పల్నాడంటే భాస్కర్ గారు ఒప్పుకోరుగా) గోదారి అనే అంటారు! గోదావరి జిల్లాల్లో వాడే 'గోకిడి" లేదా "గోకు"(మా అత్తారింట్లో ఇలా అంటారు) మాట వింటే డోకొస్తుంది. పోనీ గోదారి లాంటి పేరు కాకపోయినా ఇంకో పెరేదైనా పెట్టుకోవచ్చుగా, గోకేంటీ గోకూ?
ReplyDeleteమా ఊర్లో గసి అనే అంటారు.
ReplyDeleteమేమూ గోకిడి అనే అనేవాళ్లం. కరకరలాడుతూ భలే బాగుంటుంది.
ReplyDeleteశత టపాల శుభాకాంక్షలు.
తిని చాలా ఏళ్లయింది. ప్చ్
మేము "కరకం అనేవాళ్ళం దాన్ని..
ReplyDeleteబాచి బాబూ అందుకో శుభాభినందనలు. .
ముందుగా వందో టపా అచ్చొందిన సందర్భంగా అభినందనలు !!
ReplyDeleteచిన్నపుడు నాకు గసి వాసన అంటే పెద్దగా గిట్టేది కాదు... అందుకని అమ్మని నా వంతు గసి మా తమ్ముళ్ళకి పెట్టి, అంత మేరకు వెన్న ఎక్కువగా వేయమనేదాన్ని. వెన్న చిలికిన రోజు పండగే పడగ. కాస్త వెన్న కృష్ణుడికి నైవేద్యం పెట్టేది అమ్మమ్మ. ఆమె పూజ అయ్యేవరకూ ఎవరు ఉంటారో వాళ్ళకే ఆ వెన్నముద్ద సొంతం. వెన్న చిలికిన రోజు అన్నంలోకి పండుమిరపకాయల పచ్చడి లేకపోతే, పచ్చిమిరపకాయలు వాడ్చి చేసే పచ్చిమిరపకాయల కారం చేసేది నాయనమ్మ. ఇప్పుడు నేనూ చేస్తూంటాను .... మా వారికి బలే ఇష్టం... ! మరో సూపర్ కాంబినేషన్ గోంగూర పచ్చడి, వెన్న. ఇక ఎమీ లేకపోతే, ఆవకాయ, వెన్న కూడా మజా మజా గా లాగించవచ్చు. మా బుడ్డోడికి కూడా పచ్చడి + వెన్న కాంబినేషను బలే ఇష్టం.
రోజూ ఫ్రెష్ గా పితికిన గేదె పాలు మా ఇంట్లో కేవలం పెరుగు / వెన్న కోసం తెచ్చుకుంటాం. వెన్న తీసిన మజ్జిగ తో మా అమ్మగారింట్లో మెంతి మజ్జిగ / మజ్జిగపులుసు పెట్టుకుంటే, మా అత్తగారింట్లో మాత్రం ఆ మజ్జిగలో కాసిని మెంతులు, బియ్యం కలిపి (1 గ్లాసు బియ్యానికి ఒక స్పూను మెంతులు) 6, 7 గంటలు నానబెట్టి, అది రుబ్బుకుని ఒక పూట పులవనిచ్చి, ఉప్ప్తు, కాస్త వంటసోడా కలిపి, మెంతట్లు పోసుకుంటాం. ఈ అట్లు మామూలు దోసెల్లా కాక, ఊతప్పం చేసుకున్నట్లుగా, పెనం మీద నూనె వేసి, ఒక గరిటెడు కాస్త పల్చని పిండి నూనె పెనంపై పోసి, మూత పెట్టి, సన్నటి సెగపై కాలనివ్వాలి. రెండు నిముషాలాగి మూత తీసి, అట్టుని తిరగెయ్యాలి. ఈ మెంతట్లు దూదుల్లాగా మెత్తగా ఉంటాయి. ఈరోజు పొద్దున్న మా ఇంట్లో మెంతట్లే టిఫిన్....!! మీరు ఈ సారి ప్రయత్నించండి. రోజూ మామూలు టిఫిను తిని విసుగు పుడితే ఈ వెరైటీ చాలా నచ్చుతుంది.
శత టపాలు పూర్తి సం దర్భముగా అభినం దనలు.
ReplyDeleteగుంటూరు సుజాతకి, గోదావరి లలితకి యుద్ధం తప్పేటట్టులేదు.
ReplyDeleteగిన్నెని గోకి తీస్తాం కాబట్టి గోకిడి అయింది. మాడుతుందికాబట్టి మసి లేదా గసి అయింది .కాని అసలు సంబందమే లేకుండా గోదారి ఏంటండీ ఆయ్..... పైగా గోకు, డోకు, అంటూ జోకొకటా .హన్నా...... గోదారికి ఈ పదార్దానికి లింకేవిటీ అది చెప్పండి
గోకేంటి గోకూ?--- సుజాత,High five :)
ReplyDeleteమా నానమ్మదీ గోదావరి జిల్లానే.
మీ శైలి బాగుటుంది వైరైటీగా. అచిరకాలంలోనే 100 టపాలు పూర్తి చేసిన సందర్భముగా అభినందనలు.
ReplyDeleteమేము కూడా గసి అనే అంటాము.
ReplyDeleteవంద టపాల శుభాకాంక్షలు.
ఎవరక్కడ మమ్మల్ని వెటకారం చేస్తుంది.ఒక కిలో గోకిడి పంచదారలో కలిపి ఈ సుజాతగారికి,తెరెసా గారికి తినిపించమని అజ్ఞాపిస్తున్నాను.
ReplyDeleteసరిగా ఫిల్టర్ చేయని కాఫీ డికాషన్‌లో అడుగున వచ్చే పొడిని కూడా గసి అనే అంటారు - పలనాడు లోనే :-) అన్ని పదార్ధాల రెసిడ్యూలనీ గసే అనాలి కాబోలు.
ReplyDelete@భాస్కర్:
ReplyDeleteశత టపా శుభాకాంక్షలు.
@సుజాత:
బాధ పడొద్దు, మీదీ పల్నాడే .. భాస్కరొప్పుకోకపోయినా.
@సిరిసిరిమువ్వ గారు: అవునండి. ఓ రకంగా, సామాన్యంగా నేను పిల్లలు పడుకున్నాకే కూర్చుంటా.
ReplyDelete@లలిత: గోకిడి?? మొట్టమొదటిసారి వింటున్నా ఈ పదం, గోదారి కూడా.
@సుజాత గారు: ముందుగా నర్సరావుపేట పల్నాడులోదా కాదా? కాదు అనటానికి నేనెవ్వర్ని, అవును అన్టానికి నేనెవ్వర్ని. నేనెప్పుడూ విన్లా అన్నా, అంతే. మా బంధువులు పేటలో చాలామందే ఉన్నారు. మా అమ్మా వాళ్లది ఓ రకంగా పేటే. మా అమ్మమ్మా వాళ్ల ఇంట్లో కానీ మరెక్కడైనాకానీ "గసి" అనే విన్నా. ఏమో!! మా ఊళ్లో మాత్రమే అలా అంటారేమో!!
@ఒరెమునా: నాకు ఓటేసినందుకు (గసి అని) ధన్యవాదాలు
@బాబా: ధన్యవాదాలు
@పప్పు యార్: "కరకం". ఎంత విచిత్రం సోదరా, తెలుగులోనే ఎన్ని పేర్లు ఉన్నాయ్ ఒక్క పదార్ధానికి!!
@విరజాజి: మెంతి అట్లు :):) వాహ్, ఈ సారి ప్రయత్నించాలి. ధన్యవాదాలు
@లలిత గారు: గోదారి అనే పదం గోదావరికి దగ్గరగా ఉంది కదా, అందుకే గోదారికి గోదావరికీ లింకు అనుకోండి.
@శివ గారు: ధన్యవాదాలు.
@నాగ్: నీ వోటూ నాకే!! :):)
@రాధిక గారు: కిలో గోకిడీ కావాలంటే ఎంత వెన్న కరగబెట్టాలో:):)
మా మాచెర్ల లో కూడ "గసి" అనే అంటారు. లలిత గారు చెప్పిన ఉత్పత్తి అర్థాలు సమజసంగా ఉన్నాయి. "గొదారి" పదోత్పత్తి అర్థం కావటం లేదు.
ReplyDeleteగొదారి కంటే "కృష్ణ" అంటే బాగుంటుందేమో. ఎందుకంటే కృష్ణ అన్నా నలుపే, కృష్ణా నది నలుపే, మనకిష్టమైన "గసి" నలుపే" :-))
This comment has been removed by the author.
ReplyDeletegasi ane maata kottagaane undi. maadi kooda guntur.inaa memu gasi anamu. govaari ledaa kontamandi godaari antaaru. govaarilo senagapindi gaani minapa pindi gaani veyinchi neyyi panchadaara leka bellam podi kalipi kooda tintaaru
ReplyDeleteమీరు శత టపాల ఉత్సవాన్ని ద్విశత దినోత్సవంగా మార్చి బ్లాగర్లందరిని అలరించాలని మనసారా కోరుకుంటూ.....
ReplyDeletexcellent post sir...
ReplyDeleteగోదావరి లలిత గారు,
ReplyDeleteమీతో యుద్ధం ఎలా పెట్టుకోనూ, గోదారి ఆడపడుచంటే నాకు ఆడపడుచు కదా! అర్థమొగుడైపోయారు కాబట్టి వదిలేస్తున్నా!ఏదో పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి ఫాలో అయిపోడమే తప్ప గోదారి కి వ్యుత్పత్తి ఏమిటో నాకూ అర్థం కాదు. కానీ "గోకు"కంటే అందంగా ఉంది కదండీ!
జిగురు సత్యనారాయణ గారు,
మీరు చెప్పిందీ బానే ఉంది. అన్నీ నలుపే కాబట్టి కృష్ణ అంటే బాగుంటుందని.
రాధిక,
బరువు తగ్గేదెలా అని ఆలోచిస్తుంటే కిలోనా తినిపించేది, అదీ పంచదార కలిపి!
గుంటూరు లొ కూడా దానిని "గోదారి" అనెవారు. దీనికి గోదారి జిల్లాకి బహుచా సంబందం వుండి వుండదు.
ReplyDeleteఅచ్చు తప్పు. ఇలా చదవండి.
ReplyDeleteగుంటూరు లొ కూడా దానిని "గోదారి" అనెవారు. దీనికి మరియు గోదావరి జిల్లాకి బహుచా సంబందం వుండి వుండదు.
మా అమ్ముమ్మ చేసే గొదారి తింటూ జీవితాన్ని అనుభవించిన రొజులు గుర్తుకొస్తున్నాయి.
ReplyDelete@సత్యనారాయణ గారు: వీరభూమి నుండా మీరు కూడా? నా బ్లాగు చూసినందుకూ, సదివినందుకూ, కామ్మెటెట్టినందుకూ మీకు గుత్తి వంకాయ కూర మాసెర్ల స్టైల్లో. :):)
ReplyDelete@యోగానందా - లేటుగా అయినా లేటెస్టుగా కామ్మెంటేసావ్. ధన్యవాద్.
@తేజా: Thank you, welcome, enojy, x,y and z...:):)
@మాష్టారు: అవునండి, గుంటూర్లో కూడా గోదారి అంటున్నారు అంటే, ఇదేదో ఊహించని మలుపే. :):)
@కృష్ణుడు.. గారు: మిమ్మల్ని మధ్యలో ఎలా మర్చిపొయ్యానో? Thanks a lot for the wishes
ReplyDelete@అమరం: పద వెళ్దాం, సత్తెనపల్లికో లేక సిర్పరం లోనో ఓ ఐ.బి.యం పెట్టించి, యాప్పీగ గొడ్డుగోదా సూస్కంటా పనిజేస్కుందాం.
This comment has been removed by the author.
ReplyDelete@అబ్రకదబ్ర: :)
ReplyDelete@భాస్కర రామిరెడ్డి గారు: ధన్యవాదాలు
@నాబ్లాగ్: మీ కామెంటు బానే ఉంది కాని మీ బ్లాగే లేదు. రాయటం మొదెల్లట్టండి ఇక.