Apr 17, 2023

మంచి కాలేజీయేనా?

ఆంధ్రా నుంచి వచ్చిన నేను ఒక సగటు ఆంధ్రావాడిలాగనే ఉంటాగానీ ఇంకోలా ఎలా ఉంటా? పుట్టుకతో వచ్చిన, పెరగటంలో కలిగిన జ్ఞానం విజ్ఞానం పరిజ్ఞానం నాది.

సరే! విషయంలోకొస్తే, సూరిగాడు కాలేజీకి వచ్చాడు.

నమ్మలేకపోతున్నారు కదూ? నా బ్లాగులో ఎన్నో పోస్టులు పిల్లల మీద వేశాను. ముఖ్యంగా సూరిగాడి మీద. ఎందరో బ్లాగు మిత్రులు సూరిగాడికి ఫ్యాన్స్ అయ్యారు. వాడి పుట్టినరోజుకి శుభాకాంక్షలు అందించారు ప్రతీ ఏడాది, పెద్దలు అనేకులు దీవించారు.

మహాభారత్ టీవీ serial మొట్టమొదట వచ్చే మాటలు గుర్తుకొస్తున్నాయి

మై సమయ్ హూఁ మై కభీ రుక్తా నహీఁ, హమేషా ఆగె బడ్తా రహ్తా హూఁ, ఔర్ ఠీక్ ఉసీ తరాహ్  కాం హై, హమేషా బడ్థా హీ రహ్తా హై, పర్ సమయ్ కభీ కాం కేలియే నహీఁ రుక్త

కాలం నాకోసమో నీకోసమో ఆగదు...ఎప్పుడూ తన మానాన తాను ప్రవహిస్తూనే ఉంటుంది. నా బ్లాగ్ లో మొదటి పోస్ట్ వేసే నాటికి సూరిగాడు ఏడాది వయసు. ఈ రోజున 18 ఏళ్ళ వయసు.

కాలేజీకి సిద్ధం అవుతున్నాడూ అంటే ... పుత్రోత్సాహము, చెయ్యొదులన్నా, పొంగిపోనీ అన్నా...

సరే విషయంలోకొస్తే, మనోడు ఓ పెద్ద పగలనూకుతాడు భూమి మొత్తాన్ని తలకిందులుగా తిప్పే పైతాన్ కోడ్ రాసి, ఎక్జిక్యూట్ చేస్తే సిస్టంస్ అన్నీ వేడెక్కి పగిలిపోతాయి అని నేను ఏమాత్రమూ ఊహించలా.

అసలు వాడు ఏమి చదువుతున్నాడు అని కూడా నేను పెద్ద పట్టించుకోలా. బడి నుంచి ఇంటికొచ్చేవాడు, బ్యాగ్ ఇస్సిరికొట్టి baskaetball ఆడుతుండేవాడు. నేను దాన్ని ప్రోత్సహించాను. వాడి కన్నా ఏడాదో రెండేళ్ళో ముందున్నవాళ్ళు రాత్రిళ్ళు 1 దాకా హోంవర్కులు చేస్తూ హడావిడీ పడేవాళ్ళు. వీడు మాత్రం పది కల్లా దుప్పటి ముసుగులోకి జారుకునే వాడు. ఏరాబాబూ హోంవర్క్ లేదా అంటే, స్కూల్లోనే చేశా అని చెప్పేవాడు. ఆశ్చర్యం వేసేది. ఇదేంటిది, ఇలాఎలాగా? ఇల్లాక్కూడా అవ్విద్దా అని నోరెల్లబెట్టి ధనా ధనా అని మోగే బాస్కెట్ బాల్ హూప్ వైపు చూస్తూ ఉండేవాణ్ణి. వాడొచ్చి, మూసేయ్ నోట్లోకి దోమలు ఈగలూ కార్లు బస్సులూ ఎల్తన్నయ్యై అని చెప్పేవాడు వెటకారంగా.

మోడీ గారు చెప్పిన మాట, మన అందరికీ తెలిసిన మాట ఒకటి ఉంది - జో ఖేలేఁ వో ఖిలే, ఆడేవాడు వికసిస్తాడు అని. నా అభిప్రాయం - అది అక్షర సత్యం అని.

నేను వాడి చదువులో వేలు పెట్టకుండా ఉంటానికి కారణాలు అనేకం.

ఒక ముఖ్య కారణం - మీవాడు చదువులో వెనకబడి ఉన్నాడు అని బడి నుంచి నాకు నోటిఫికేషన్ రానంత వరకూ నేను వేలు పెట్టాల్సిన అవసరం లేదు అనిపించింది.

ఇంకొక విషయం - ప్రతీవాడు IIT కి వెళ్ళలేడు. వెళ్ళినా మొదటిరోజు నుంచే 20 అడుగులు దూకు కమాన్ పెర్ఫార్మ్ అనే డిమ్యాండ్ ఉంటుంది. ఎందుకు అంత ఒత్తిడి? అనిపించింది

మూడూ విషయం - సూరిగాడి మిత్రబృందంలో ఒకడి నాన్న 1960 లల్లో వచ్చి స్థిరపడ్డ సంతతి. అతను ఒకమాట చెప్పాడు. గురూ పిల్లవాడు MS చేద్దాం అనే అలోచన ఉన్నటైతే BS ఏకాలేజీలో చేసినా దాదాపు ఒక్కటే. అంతేగాక, అమెరికా సిస్టంలో, ప్రతీ వాడికి ఏదోక కాలేజీలో సీటు తప్పక రాసిపెట్టి ఉంటుంది. కొందరు Texas A&M కి వెళ్తారు, కొందరు UT Austin కి వెళ్తారు మిగతావాళ్ళు మిగతా కాలేజుల్లోకి వెళ్తారు. అంతే అన్నాడు.

ఓరిదీనెమ్మ దీనికోసం చిన్నప్పటి నుంచి ఎన్ని వెషాలు తలితండ్రులు వేస్తారూ, ఎన్ని వేషాలు పిల్లలచేత వేయిస్తారూ? హవర్స్ అని వాలెంటరీంగ్ అని మ్యూజిక్ అని స్పోర్ట్స్ అనీ సాకర్ mom సాకర్ డాడ్ .. అదీ ఇదీ ... 

ఇవన్నీ అవసరమే కాదన్ను కానీ అవసరానికి మించి యాస్పైర్ అవటం మనిషి నైజం అనిపిస్తుంటుంది..

ఏవైనా ఉరుకులు పరుగులు taekwondo లు basketball లు music లు dance లు అవి ఇవి - వీటన్నిట మధ్యలోంచి లేచి నాన్నా కాలేజీకి అప్లై చేస్కుంటున్నా, UT Arlginton UNT UT Dallas UofH Texas Tech లాంటి కాలేజీలల్లో వచ్చింది. కానీ UT Arlginton UNT Texas Tech లో నేను కోరుకున్న మేజర్లో వచ్చింది అన్నాడు.

సరేరా నాయనా, మంచి నిర్ణయం తీస్కో, ఏది బాగుంటుందో తెలుసుకో, ఇండస్ట్రీకి ఏది దగ్గరగా ఉంటుందో ఇండస్ట్రీకి ఏది సుస్పష్టంగా కనిపిస్తుందో కనుక్కుని చేరు అన్నాను.

మా ఇంటి వెనుక ఓ పెద్దాయన MIT లో PhD చేసి ఇక్కడకొచ్చి సెటిల్ అయ్యాడు పెద్ద వయసులో. మా స్కూల్ డిస్ట్రిక్టులో ఆయన అనేక స్కూల్స్ లో సబ్స్టిట్యూట్ టీచర్ గా చేస్తుంటాడు కాలక్షేపానికి. అప్పుడెప్పుడో మాటల మధ్యలో మీ వాడికి కాని అమ్మాయికి కానీ చదువు విషయంలో లెక్కలు కెమిస్ట్రీ ఫిజిక్సుల్లో ఏవైనా సహాయం కావాలంటే ఏమాత్రమూ సందేహించకుండా నా డోఋ కొట్టు, మీ పిల్లలకి ఉచితంగానే చెప్తాలే అని మాటిచ్చాడు.

సూరిగాడు ఒకటి రెండు సందర్భాలల్లో ఆయనదగ్గరకు వెళ్ళొచ్చాడు కూడా.

వీడికి పైన చెప్పిన కాలేజీలల్లో వచ్చింది అని తెలిసిన తర్వాత ఓ రోజు సాయంత్రం ఆయన వాక్ చేసుకుంటూ మా ఇంటి ముందునుంచి వెళ్తూ అగాడు హై అంటూ.

పెద్దాయనా, PhD చేసిన వ్యక్తి, MIT నుంచి వచ్చిన వ్యక్తి, పైగా సూరిగాడికి రెండు ముక్కలు ప్రపంచాగ్నికి సమిధలు ఆహుతొక్కటి ఇచ్చిన వ్యక్తి. బాగున్నారా సార్ అని పలకరించాను.

"యా యా ఏం జరుగుతోంది. మీవాడు కాలేజీలల్లో అప్లికేషన్ పడేస్తున్నాడా? అబ్బే కంగారు పడకు, ఏదోకదాంట్లో వస్తుంది అడ్మిషన్. భలే వాడివే ఊర్క టెన్షన్ పడతావెందుకూ" అన్నాడు

"అంటే ఉంటుంది కదా మాష్టారూ పిల్లాడన్నాక. అందునా చింపి చేట చేసే వాడైతే పేద్ద ఆలోచించం కానీ వాడు నాకొడుకు కదండి, అందుకే భయం" అంటూ ఒక సామాన్య తెలుగు వాడు వదిలే ఓ క్లిష్టమైన సంక్లిష్టమైన అదైన ఇదైన ప్రశ్నని వదిలాను. ఆంధ్రా నుంచి వచ్చిన నేను ఒక సగటు ఆంధ్రావాడిలాగనే ఉంటాగానీ ఇంకోలా ఎలా ఉంటా? పుట్టుకతో వచ్చిన, పెరగటంలో కలిగిన జ్ఞానం విజ్ఞానం పరిజ్ఞానం నాది.

"పై కాలేజీలల్లో ఏకాలేజీ బాగుంటుందీ, ఈ కాలేజీలు మంచివేనా" అని.

ఆయన నావైపు ఓ చూపు విసిరి చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వి అర్జునా వినూ అంటూ మొదలుపెట్టాడు

"పై కాలేజీలన్నీ మంచివే. అమెరికాలో మంచి కాలేజీ కాదు అనబడే కాలేజీనే లేదు. నీకో ముఖ్యమైన విషయం చెప్తా సావధానంగా విను, ఏకాలేజీకి వెళ్ళినా, మంచి చెడు చదివే వాడిని బట్టి. విద్యార్థిని బట్టి. కొన్ని కాలేజీలల్లో అవకాశాలు తక్కువ ఉంటాయి. కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి. తేడా అంతే. కొన్ని కాలేజీలు ఇండస్ట్రీకి దగ్గరగా ఉండి సంబంధాలు కలిగి ఉంటాయి. కొన్ని ఉండవు. ఏది ఏవైనా కష్టపడి అవకాశాలని అందిపుచ్చుకుంటూ వెళ్ళేవాడే రాణిస్తాడు." అని ముగించాడు.

నాకు కళ్ళు తెరుచుకున్నాయి.

నిజమే అనిపించింది చివరాకరికి.

మా culdesac లో సాయంత్రం అయ్యే సరికి ఓ డజను మంది పిల్లలు రెండేళ్ళ నుంచి పన్నెండేళ్ళవరకూ ఆడటానికి వస్తారు, culdesac safe కాబట్టి. పిల్లలతో పాటు ఒక కేర్ టేకర్ తండ్రో తల్లో నానమ్మో ఎవరోకరు. వాళ్ళలో ఒకతను తెల్లవాడు మనకి బాగా పరిచయం. 
"ఏంటి గురూ" అన్నాడోరోజున. 
"మామూలే" అన్నా ప్రసన్నంగా. 
"మీవాడి కాలేజీ తేలిందా" అన్నాడు కుతూహలంగా. 
పై కాలేజీ పేర్లు చెప్పి, మళ్ళీ వదిలాను - "ఇవి మంచి కాలేజీలేనా" అని.
బట్టనెత్తి అయి, అది కవర్ చేస్కోటానికి నున్నగా గీసేస్కున్న బోడిగుండు మీద ఓ సారి గీక్కుని "అంటే?" అన్నాడు. 
"అదే అదే ఈ కాలేజీలు ఎలా ఉంటాయి" అన్నాను తప్పడిగానా ఏంటి పొరపాటునా అనుకుంటూ.
"మా brother పై చెప్పిన కాలేజీలో పలానీ దాంట్లో చదివాడు, నేను పలానీ దాంట్లో చదివాను. "నీకో విషయం చెప్తా విను, కాలేజీలు అన్నీ బాగనే ఉంటాయి, విషయం అంతా విద్యార్థిలోనే ఉంటుంది అంతా." అంటూ చెప్పుకొచ్చాడు ఆయన కాలేజీలో ఎలాంటి కష్టాలు పడ్డాడో అవన్నీ...