Showing posts with label వార్తా పుత్రికలు. Show all posts
Showing posts with label వార్తా పుత్రికలు. Show all posts

Oct 13, 2020

ఎవరు చెప్పాలి ఈ ప్రజాప్రతినిధులకు?



ప్రజలతో ఎప్పుడూ మమేకమయ్యే MLA రోజా ఈరోజు 108 ఆంబ్యులెన్స్ వాహనాన్ని నడిపిందంటూ ysrcp బాకా పత్రిక ఓ వార్త రాసుకొచ్చింది.

తప్పు లేదు. ఏ గూటి చిలక ఆగూటి పలుకే పలుకు. ఏ ఇంటి పుత్రిక ఆ ఇంటి పలుకే పలుకు.

అయితే - నాకు అర్థం కానిది - ఒక MLA అయుండి, జనాలకి ఆదర్శంగా నిలవాల్సిన ఒక MLA ఆంబ్యులెన్స్ లాంటి వాహనాన్ని చోదిస్తూ - seat belt పెట్టుకోకపోవటం? సాక్షి ఆ విషయాన్ని నిలదీస్తూ రాసుంటే సాక్షి పుత్రికని పత్రికలా ఆహ్వానించేవాడిని. కానీ - సాక్షి పుత్రికలానే మిగిలిపోయిందింతవరకూ!


ఎవరు చెప్పాలి ఈ ప్రజాప్రతినిధులకు?

ఎవరు చెప్పాలి ఈ సెలబ్రిటీలకూ?


మీ ప్రాణం పోయినా పర్వాలెదు. మీ ప్రాణం మీ ఇష్టం. కానీ పక్కనోడి ప్రాణాన్ని తీసే హక్కు అధికారం మీకు లేదు.


నాయకులే సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం సిగ్గుచేటు.



 #justasking

Aug 19, 2020

Phone Tapping


ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద బురద చల్లటం బహు సాధారణం. అయితే బురద చల్లేప్పుడు తమ చేతులకీ సదరు బురద అంటుకుంటుందనీ, అది తమ మీదా పడుతుందీ అని గుర్తించకపోవటం కేవలం కళ్ళుండి గుడ్డితనం.


Phone Tapping అయ్యింది అని ఒక పార్టీ అరుపులు.


అసలు ఇక్కడ Tapping అనే పదం కరెక్టేనా?

నాకు ఒక కాల్ వచ్చినప్పుడు, ఆ కాల్లోకి చొచ్చుకొచ్చి దాన్ని మూడో చెవి వినగలదా?


ఫోన్లోకి దూరి డేటాని కొట్టేయటం అనేది - హ్యాక్ చేయటం అంటాం.

ఫోన్ సంభాషణలు పట్టటానికి చిన్నా చితకా హ్యాకర్లు చేయలెరు అని నా అభిప్రాయం.



నల్లమోతు శ్రీధర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు - 

1. కొత్త టెక్నాలజీతో (ఇజ్రాయల్ సూట్కేస్ సైజ్ ఫోన్ ట్యాపింగ్ సిస్టం) వాయీస్ ట్యాపింగ్ సాధ్యమే.

2. "ఫోన్ ట్యాప్ చేస్తే దాన్ని కనుక్కోలేరు" అని.


నాకున్న నెట్వర్కింగ్ స్కిల్ల్స్ మరియూ పరిజ్ఞానం పై స్టేట్మెంట్స్ మీద కామెట్ చేసే స్థాయిలో లేదు. కానీ, రెండో పాయింట్ - ఫోన్ ట్యాప్ చేస్తే కనుక్కో లేము అనేది wrong statement అని నా అభిప్రాయం.


ట్యాప్ చేస్తే మిమ్మల్ని కనుక్కోలేరు కాబట్టి మీ ఇష్టం అనే ఓ అలోచనకి ఊతం ఇచ్చేలా ఉంది.


ఒక ఫండమెంటల్ ప్రశ్న - ట్యాప్ చేసేంత స్థాయి చంద్రబాబుకి ఉన్నదా?


ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చెసిందనీ, ప్రైవేటు వ్యక్తులు ట్యాప్ చేస్తున్నారనీ ప్రధానమంత్రికి లేఖ వ్రాశారు చంద్రబాబు గారు.


బ్లాగులోకంలో ఎందరో టెకీలు - దీని గురించి స-వివరంగా సమాచారం ఇచ్చేవాళ్ళుంటే బాగుంటుంది.

ఈ వ్యవహారం అనేక కోణాలు

48 గంటలు ఛాలెంజ్ - బుట్టదాఖలు

రోజుకో కొత్త అరుపులు అని కొందరి భావన.


అసలు యై.యస్.ఆర్.సీ.పి న్యాయవ్యవస్థ మీది గౌరవం లేదని అస్థిత్వం లేని జనశక్తి అరుపులు


మీదగ్గర ఆధారాలుంటే ముందుకు రావాలి కదా అని అస్మదీయ వర్తా పరికల అరుపులు


మాదగ్గర ఆధారలున్నాయి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాం అని తెదేపా అరుపులు


Aug 5, 2020

ప్రతిపక్ష రావణాసురుడు

ప్రతిపక్ష రావణాసురుడు

ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి అనేది ఎక్స్పెక్టేషన్. ఎవరి ఎక్స్పెక్టేషన్ అంటే - సాధారణ పౌరుడి ఎక్స్పెక్టేషన్ అనుకుందాం. నెలబారు మనిషికి ఆమాత్రం కోరికలు ఆమాటకొస్తే హక్కులు ఉండకూడదా?

కానీ 21 శతాబ్దిలో ఏదేశంలో చూసినా ఏప్రాంతంలో చూసినా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుందాం అనే రంధిలో ఉన్న మనిషి/అతను నిర్మించిన రాజకీయ వ్యవస్థ ఎన్ని అక్రుత్యాలకు పాలుపడుతున్నాయో చూస్తే జుగుప్స కలుగుతుంది.

ప్రతిపక్షం పాలకవర్గాన్ని దించటానికి హత్యలు చేయటానికి మారణకాండ చేయటానికి నలుగుదిక్కులా ప్రజల మనోభవాల్ని రెచ్చగొట్టి ఎగదోస్తున్నాయి.

అటుజెసి ఇటుజెసి మధ్యలో జనాల ప్రాణాలే రాలిపోతున్నాయి. ప్రజలు మళ్ళీ మళ్ళీ గొర్ఱెలు కాబడుతున్నారు. రాజకీయ క్రీడలో పావులు కాబడుతున్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం కోవిడ్ సమయంలో ఎలా ప్రజల ప్రాణాలతో ఆటాడుతున్నదో ఓసారి చూద్దాం.

ఓ పెద్దాయన
67 ఏళ్ళు
పాపం ఏవో కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్
బిపీ సుగర్ లాంటివి వెంటాడాయి నేలబారు మనిషికి నేలబారు రోగాలు
ఇంతలో ఆయన భార్య గారికి కోవిడ్ వ్యాధి లక్షణాలు
ఆయన అల్లుడు ముప్పతిప్పలుపడి ఆశుపత్రిలో ఒక బెడ్ సంపాదించాడు
ఆమెకి ట్రీట్మెంట్ దొరికింది. తగ్గి ఇంటికి వచ్చింది. ఇంతలో ఆయనకి కరోనా లక్షణాలు.
మళ్ళీ అల్లుడు తీవ్రంగా శ్రమించి ఆశుపత్రిలో ఒక మంచాన్ని సాధించాడు.
మామగారు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా?
నేను వెళ్ళను అంటాడు.
ఎందుకయ్యా అంటే - ఆశుపత్రిలో భోజనం సరిగ్గా పెట్టటంలేదని పలానా ఛానల్లో చెప్పారు, పలానా పార్టీవాళ్ళు చెబుతున్నారు అంటాడు.
ఆశుపత్రికి వెళితే అటునుంచి అటే అట అంటాడు. ఎవరన్నారయ్యా అంటే ప్రతిపక్షం కోడైకూస్తున్నదిగా అంటాడు. పలానీ ఛానల్లో దీనిమీదే నిన్న చర్చ జరిగింది అంటాడు.
ఆశుపత్రిలో చికిస్త అసలు జరగంటంలేదుట అంటాడు.
తగినంత మంది డాక్టర్లు లేరు అంటాడు. వాదన.

ఈ తర్జన భర్జనలో ఆయన పోనేపోయాడు.

ప్రతిపక్షం ఆయన్ని తిరిగితేగలదా?

జనాల్లో అపోహలను నరనరాల్లోకి ఎక్కిస్తున్న ప్రతిపక్షం పోయిన ప్రాణాలను తేగలదా?

జనాలలో బతికే సైకలాజికల్ స్ట్రెంత్ ని ఇవ్వాలన్న కనీస ధర్మాన్ని పాటించని ప్రతిపక్షం ఉండి దేనికి?

ప్రభుత్వం తప్పు చేయచ్చు. దాన్ని కరెక్త్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. ఆ పాత్రని ప్రతిపక్షం పోషిస్తున్నదా?

Jun 8, 2020

ఏడాదిలో 13 లక్షల టన్నుల ఇసుక మాయం

జగ 'మేత ' గజ 'మేత ' ఏడాదిలో 13 లక్షల టన్నుల ఇసుక మాయం చేశారట. బాబు గారి ట్వీటు. మాంచి సినిమా రచయితని ట్విట్టర్ మీదకి వదిలనట్టున్నారు బాబు గారు. ప్రాసలు అనుప్రాసలు అంత్యప్రాసలు అల్లాడిస్తున్నారు ఎవరోగాని. విషయానికొస్తే - నిన్నటిదాకా ఇసుక రీచిల్లో ఇసుక లేదన్నారు. ఇప్పుడేమో తూకం పట్టి కొలిచినట్టుగా అక్షరాలా 13 లక్షలా 36 వేల 860 టన్నులా 13 గ్రాముల ఇసుక మాయం అంటున్నారు. ఏవైయుండాలి? ఇసుక తినేది కాదు. కట్టడాలకే వాడాలి. లేదా సముద్రంలోనన్నా కలపాలి. జగన్ ఇంట్లో దాచేసుకుని ఉంటాడేమో అని నా అనుమానం. ప్రతిపక్షం నేత హుందాగా వ్యవహరించాలి. ప్రపంచంలోనే సీనియర్ నేత ఇలా నీచస్థాయిలో పాలకపక్షం మీద ఇంటార్నెట్లో దాడికి దిగటం ఆయన పెద్దరికానికే వదిలేద్దాం. దీనిమీద సమగ్ర చర్చ గరుగుతుందా ట్విట్టర్లో అంటే అదీ ఉండదు. జై జై అంటూ జేకొట్టే జనాలు తప్ప

May 1, 2020

ఈనాడు పేపర్ - ఇక లైఫ్ టైం బ్యాన్


ఈనాడు చదవటం మానేశాను. అప్పుడప్పుడూ చూస్తుంటాను. కొన్ని కారణాలున్నాయి. ఒక వార్త సాక్షిలో ఎలా రాస్తాడు అదే వార్తని ఈనాడు ఎలా రాస్తాడు అని ఒక కోణం.
అనేక సందర్భాలల్లో రెండూ ఆపోజిట్ గారాస్తాయి. అంతకన్నా నేనేం ఆశించటం లేదు కూడా.
ఈనాడు తెదేపా భజన, చంద్రబాబుని నెత్తిన మొయ్యటం కూడా ఓ పెద్ద విషయం కాదు.
కానీ అప్పుడప్పుడూ శృతి మించి రాగాన పడుతుంటుంది పల్లకీ మోత.
అసహ్యం కలుగు తుంటుంది. అసహనానికి గురిచేస్తుంటుంది.

జర్నలిజం విలువలు అని దంచికొడతారు వేదికల మీద. ఇంటికెళ్ళి పల్లకీల మోత సేవ చేస్తుంటారు.

ఋషికపూర్ కాలం చేశాడు.
ఎవరెవరు సంతాపం తెలియజేశారో ఈనాడు లిస్ట్ వేశాడు
మొదట - ప్రధాని నరేంద్ర మోడి అన్నాడు.
రెండోది - తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నాడు

ఆ విండోని క్లోజ్ చేశాను.
ఈనాడుని నేను ఎందుకు చదవాలీ? జవాబు దొరకలేదు.

Apr 29, 2020

వై.యస్.ఆర్.సి.పి వల్లనే కరోనా ఉధృతం



బాబు గారు ఎప్పుడూ అంతే. నిప్పులు తొక్కుతుంటారు అదేఅదే చెరుగుతుంటారు.
కరోన తీవ్రతను ముందుగానే ఎలా గుర్తించారటా? ఎంత ముందుగా గుర్తించారటా?
నేను వై.యస్.ఆర్.సి.పి పార్టీకి చెందినవాణ్ణి కాదు. కానీ, ఎందుకో బాబు చెప్పేదాంట్లో ఏడుపు తప్ప ఏమీ ఉండదని ఎప్పుడూ అనిపిస్తుంటుంది.



దక్షిణభారతదేశంలోనే ఆంధ్రరాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందనటం బాబుకే చెల్లు. 

Apr 24, 2020

ఆర్ణబ్ గోస్వామి

భారతీయ వార్తా మాధ్యమ జగత్తులో ఓ కొత్త ఒరవడి సృష్టించింది ప్రణయ్ రాయ్. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ౧౯౮౦ చివరి దశలో వర్ల్డ్ దిస్ వీక్ అంటూ ముప్పావుగంట ప్రోగ్రామ్ ద్వారా ఆ ఒరవడికి పదును పెట్టాడు రాయ్. కొంతకాలానికి యన్.డి.టి.వి ని తెరమీదకు తెచ్చాడు. యన్.డి.టీ.వి మొట్టమొదటి *నిరంతర వార్తా స్రవంతి*. సదరు స్రవంతిలో మొట్టమొదటి/రెండో తరం వార్తాహరులు వార్తా పాఠకులలో పేరు తెచ్చుకున్నవాళ్ళలో శ్రీనివాసన్ జైన్/ బర్ఖా (క్షమించాలి) దత్/ రాజ్ దీప్ సర్దేశాయ్/ ఆర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు అనేకులు. బర్ఖా/శ్రీనివాసన్ జైన్ లాంటివాళ్ళు ఇంక అందులోనే ఉన్నారు. రాజ్ దీప్ సర్దేశాయి బయటకి వెళ్ళిపోయాడు.

ఆర్ణబ్ గోస్వామి యన్.డి.టి.వి లో ఉన్నంత కాలం ఉన్మాదాన్ని ప్రధానంగా నమ్ముకున్నాడు. అతను ఏరోజు శాంతంగా మాట్టాడిన సందర్భం నాకు కనిపించలేదు యన్.డి.టి.వి లో ఉన్నన్ని రోజులు. ప్రతీ ప్రశ్నని ఉన్మాదిలా అడిగేవాడు. ఇండియా వాంట్స్ టు నో అంటూ గొంతు చించుకునేవాడు.

మొన్నీమధ్య ఒక దృశ్యమాలిక సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టింది. ఆర్ణబ్ ఓ విమానంలో ప్రయణిస్తుండగా కునాల్ కర్మ (క్షమించాలి. ఇతనికీ ప్రవీణ్ కర్మకీ స్నేహితం ఉందా అనడిగితే కాకిరిగుమ్మ గుఱ్ఱపు బండిలో తీసుకెళ్ళి వదిలేసి రాబడును, గుఱ్ఱానికి గుగ్గుళ్ళు మీఖర్చే) అనే ఓ దౌర్భాగ్యుడు వ్యక్తిగత స్థాయికన్నా దగ్గరగా వీడియో తీయటం మొదలెట్టాడు. అతను ముఖమ్లో ముఖం పెట్టి అతన్నే వీడియో తీయటం. ఒకరకంగా ఇది వ్యక్తి స్వేచ్ఛను కాలరాయటం. మానవత్వాన్ని మర్చిపోవటం. ఇదీ వ్యక్తిగత స్థాయిలో హింస. వ్యక్తి సహనాన్ని పరీక్శించటం. సరే వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయటం. దీన్ని అద్భుతమైన కార్యంలా పొగిడిన నట్*యిజనులూ ఉన్నారు. తిట్టిన నెటిజనులూ ఉన్నారు.

ఈ మొత్తం కాండలో ఆర్ణబ్ గోస్వామి ఎంతో హుందాగా శాంతగా తన ఉన్మాద నైజాన్ని దాదాపుగా అధిగమించేసి ఒక అడుగు పైకే వేశాడు. సదరు కర్మకి అది చెంపపెట్టు.

అదే రాజ్ దీప్ సర్దేశాయ్ ఎలా పబ్లిక్ మీద ఉన్మాదాన్ని ప్రదర్శించాడో చెప్పాల్సిన పనిలేదు. ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో తిరిగింది. వేరే కథ.

కలక్రమంలో ఆర్ణబ్ రిపబ్లిక్ టివి అనే ఓ వార్తా ఛానల్లో మేనేజింగ్ డైరెక్టర్ గా వెళ్ళటం జరిగింది. ఈ మధ్య సదరు వార్తా ఛానల్ని చూట్టం జరిగింది కూడా. ఆర్ణబ్ తన స్వభావాన్ని ఏంచేతనో మెరుగుపరుచుకున్నాడాని చెప్పక తప్పదు. దురుసుతనాన్ని ఉన్మాదాన్ని వదిలేసినట్టుగా అనిపించింది.

నిన్నటి ఓ వార్త - ఆర్ణబ్ లేట్ నైట్ కొలువు ముగించుకుని భార్యతో కలిసి ఇంటికి వస్తుండగా కొందరు వారి కరోలా కారుని వెంబడించటం, దురుసుగా కారు పక్కగా వచ్చి కారుని ఆపే ప్రయత్నం చేయటం, అద్దాల్ని పగలగొట్టి గంగాజల్ పొయ్యటానికి ప్రయత్నించటం అంతలో ఆర్ణబ్ ఇంటి సెక్యూరిటి సిబ్బంది చూట్టం పరుగెత్తుకుంటూ రావటం దాడి చేస్తున్న దుండగుల్ని అడ్డుకోవటం జరిగాయి. ఆర్ణబ్ అతని భార్యతో క్షేమంగా ఇంటికి చేరుకోటం సీక్వెన్షియల్ ఈవెంట్స్ జరిగిపోయాయి.

సదరు దుండగులు యూత్ కాంగ్రేస్ అని తేలటం. ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే కాంగ్రేస్ నేతలు సెలబ్రేట్ (అల్క లాంబా) చేసుకోటం - రాజకీయ కోణాన్ని ఆవిష్కరించాయి.

ఇలాంటివి కొత్తేంకాదు భారత ఆమాటకొస్తే ప్రపంచానికి. ఎన్ని చూడలేదూ?

౨౧వ శతాబ్దంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మన రాజకీయ వ్యవస్థ ఏస్థాయికి వెళ్ళిపోయిందో అర్థం చేస్కోవచ్చు.
ఏవైనా ఈదాడిని అన్ని వర్గాలవారూ ఖండించాలి.

తప్పు ఎవరిదైనా కావచ్చు - జర్నలిస్టుల మీద దాడి చేయకూడదు.
కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

మహారాష్ట్రలో కాంగ్రేస్ కొయిలేషన్ పాలన నడుస్తున్నది. (సోనియా గాంధీ కనుసనల్లో)

రెండ్రోజుల క్రితం ముగ్గురు వ్యక్తుల్ని దారుణంగా చంపిన రక్త చరిత్ర కళ్ళ ముందే తిరుగాడుతున్నది.

రక్తం మరిగిన ఒక జర్నలిస్టుగా ఆర్ణబ్ గోస్వామి సోనియా గాంధీని సూటిగా ప్రశ్నించాడు.


"పులీస్ వాలోంనె సంతోంకో భీడ్ కో సీంపాఁ. క్యా ఉన్‌పర్ రాజనీతిక్ దబావ్ థా?"
"సంతోఁ కె శరీర్ పర్ గెరువా కపడే థే, ఇసీలియే ఉన్‌కీ హత్యా కీ గయీ?"
"ఇంసాఫ్ కె సవాల్ పర్ అపరాధియోంకా ధర్మ్ క్యోం మతారహా హై మహారాష్ట్ర సర్కార్?"
"సోనియా గంధీ సే సవాల్ పూఛ్‌నా అపరాధ్ కబ్‌సే హో గయా?"
"సోనియాగాంధీ! దో సంతోఁ కో మార్ డాలా ఆప్ కి పోలీస్ నే ఆప్‌కో యే సాంప్రదాయక్ ఘటనా క్యోం నహీ కహా థా?"
 
ఇవి తప్పు ప్రశ్నలు అని నేననుకోటంలేదు. ఆమాటకొస్తే అడిగే హక్కు ఎవరికైనా ఉంది.


చివరగా ఈ దాడి కాంగ్రేస్ ధోరణిని మళ్ళీ తెరమీదకు తెచ్చింది. గాంధీల భజన. సోనియా గాంధీ త్యాగమూర్తి అనీ, ఆమె భారత్ మాత అని ప్రొజెక్ట్ చేయటం దౌర్భాగ్యం.

Apr 21, 2020

వార్తాపుత్రికల పైత్యం



ప్రపంచం అంతా ఓవైపు గడగడ లాందుతోంది. 200 పైగా దేశాల్లో కరోన జనాలని చంపుతోంది. వణికిస్తోంది. భారతదేశంలో సమర్థవంతమైన  నాయకత్వం కరోన ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది/పడుతోంది - అంతే కట్టుదిట్టంగా అమలుచేయటానికి ప్రయత్నిస్తోంది కూడా.

బాగుంది. మోడిని మోసే పత్రికలు మోయచ్చు. మోడీని వ్యతిరేకించేవి మోడీ ఏ బ్రాండు కడ్రాయరు వేస్కున్నాట్టా ఈ నిర్ణయం తీసుకున్నప్పుడూ అని రాస్కోవచ్చు.

తప్పులేదు.

లోకల్ వార్తాపుత్రికలు తమ రంగుల్నీ వ్యక్తపరచుకోవచ్చు. జగన్ దొంగ అని లేక చంద్రబాబు కరోనాకన్నా డేంజరస్ అనీ.

తప్పులేదు.

కానీ వార్తాపుత్రికల దిక్కుమాలిన దౌర్భాగ్యానికి పరాకాష్ట -
అమెరికాలో శవాలు గుట్టలు గుట్టలుగా పోసారటా
ట్రంపుకి శవాలని ఏంచేయాలో తెలియట్లేదటా
గంటకి వందమంది పోతున్నారటా
టెక్సాసులో కూడా కరోనా వచ్చిందటా
పక్కనున్న న్యూ మెక్సికోలో కూడా కరోణా వచ్చిందటా
ట్రంపుకి వ్యాపారమే ముఖ్యంటా
జనాలు బిక్కుబిక్కుమంటున్నారటా

ఇలాంటి వార్తలు అక్కడున్న పెద్దవాళ్ళలో ఎలాంటి భయాందోళల్ని కలిగిస్తాయి గురిచేస్తాయి.

ఇవన్నీ ఒక ఎత్తైతే  మా అమ్మ పొద్దున ఇలా అడిగింది -
అమెరికాలో కుక్కలు కూడ బిక్కుబిక్కుమంటున్నాయటగా అని

రాస్కోండయ్యా! లోకేశ్ గురించో బాబు గురించో జగన్ గురించో. వడ్డించండి కరోనా వార్తల్ని ప్రాసలతోటి. ఎవడొద్దన్నాడూ?
కానీ కుక్కలు బిక్కుబిక్కు మనటం ఏంటీ? దరిద్రుల్లారా!
జర్నలిజమా మీ పైత్యమా?

సామాజిక మాధ్యమాలు/నెటిజనులు

సామాజిక మాధ్యమాలు అనేవి గొప్ప పాత్ర పోషించవచ్చు నేటి సమాజంలో. వాటి పాత్ర constructive side of the world అనేదాంట్లో ఎంత ఉందీ అనేది పక్కన పెడితే, destructive side ఎంతా అనేది ఒకసారి చూద్దాం.
అయితే ముందస్తు మీమాంశ
తప్పు తుపాకీదా? కాల్చేవాడిదా?
తప్పు Technology దా దాన్ని వాడేవాడిదా?
తప్పు కారుదా దాన్ని తోలేవాదిదా?
ఇలాంటి వాటికి సమాధానం వెతకటం కంటే బొంత ఊతకటం ఎలా అనే వీడియో చూట్టం ఉత్తమం.

ఈమధ్యకాలంలో వార్తాపుత్రికలు - వైరల్ అనే పదానికి ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నాయో మనం చూడొచ్చు.
అలాంటివాటిల్లో నన్ను తీవ్రంగా ఉద్రేకపరచినవి, నన్ను కుదిపివేసినవి, బాధపెట్టినవి, అసహనానికి గురిచేసినవి కొన్ని వీడియోలో సదరు సామాజిక మాధ్యమాలల్లో విరివిగా చక్కర్లు కొట్టాయి.

1. covid 19 policing పోలీసుల మీద జనాల దాడి.
2. shaheenbag విషయంలో జరిగిన దాడులు
3. కశ్మీర్ లో జరిగిన దాడులు
Example

ఈ వీడియోలను చూస్తే ఎంద ఘోరంగా ఉన్నాయో అనే విషయాన్ని పక్కనపెడితే - ఇవి ఎలాంటి అడుగు వేయటానికి దారిచూపుతున్నాయి అనేది ముఖ్యమైన మౌళికమైన ప్రశ్నగా నాకనిపిస్తుంది.

దేశాన్ని మతపరంగా ముక్కలు చేయటనికి ఈ విడియోలు ఎంతగా ప్రోద్బలాన్ని ఇస్తున్నాయో చెప్పాల్సిన పని లెదు.

నా దృష్టిలో అలజడులు జరిగేప్పుడు ఇంటర్నెట్ ని ఆపేయటం గొప్ప ఆలోచన. article 370 revoke సమయంలో మోడి కశ్మీరులో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయతం గొప్ప దార్శనికతకు నిదర్శనం అని నా అభిప్రాయం.

ఎందుకంటే - వదంతులు అగ్గిలాగా వ్యాపిస్తాయి. అవి నిజాలని మోయవు. వదంతులు కేవలం రెచ్చగొట్టేవే కానీ నిజాలు కావు.

ట్విట్టర్ లో టపాలు కూడా అధికశాతం - opinions మాత్రమే.
సాక్షి కానీ ఈనాడు కానీ ఆమాటకొస్తే ఏవార్తపుత్రికైన opinions ని జానాలమీద ఎందుకు రుద్దాలి?
opinions ని జనాలు ఎందుకు మోయాలి? opinion is not truth. జర్నలిజంలో ఇది నేర్పరా?

Trump లాంటి వాళ్ళు ట్విట్టర్ ని అధికార ప్రకటనల కోసం వాట్టం కేవలం దౌర్భాగ్యం.

May 31, 2019

ఆం.ప్ర ఖజానాలో కేవలం 100 కోట్లు

నిన్న ఒక వార్త చూశాం. ఆం.ప్ర ఖజానాలో కేవలం 100 కోట్లే ఉన్నాయంటూ.

ఈ పత్రిక ఎన్నికల ముందు ఏంచేసిందీ? ఎన్నికల ముందు ఈ నిజాన్ని ప్రచురించి ఉండచ్చుగా?

భలేవాడివే! ఎన్నికల ముందు 100 కోట్లకు పైగా ఉంది ఖజానా అని అనొచ్చు.

ఈ పత్రిక నిజంగా ప్రజా పక్షాన ఉంటే, వీళ్ళ జర్నలిజంలో నిజమైన విలువలే ఉంటే

ఎన్నికల ముందు ఇంత, అయ్యాక ఇంత, కొత్త ప్రభుత్వం వచ్చేనాటికి ఇంత అనే లెక్కలు ప్రచురించుంటే నా జీవితంతం వీరి పత్రికకి సబ్స్క్రైబ్ చేస్కోనుండేవాడ్ని

May 30, 2019

మీడియా కుక్క తోక

గత వారం పది రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు. ఇక జరగబోయే రాజకీయ తంతు. బాగా దగ్గరుండి ఇవాళ్టి  రాజకీయాలను గమనించాల్సిన సమయం.
ఈ గందరగోళంలో గమనించాల్సింది మీడియా పోకడని
మింగలేక కక్కలేక
జగన్ అనలేక అనకుండా ఉండలేకా
తెగ బాధపడిపోవటం.

ఒబామా మొదటిదఫా పాలన సగానపడేలోపు నేను న్యూయార్క్ నుంచి కేన్సాసుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పట్లో KMBZ అనే రేడియో వింటం జరిగింది. దాంట్లో మధ్యాహ్నం రెండు మూడు గంటలపాటు Rush Limbaugh అనేతని టక్ షో వచ్చేది. దాన్ని రిపబ్లికనులు అదొక మహత్తర కావ్యంలా ఇతిహాస పురాణాలకన్నా దేవుని వాక్యంలా చెవులు రిక్కించి మరీ వినేవారు.
ఇతను ఎంత గొప్ప వ్యక్తి అంటే బారాక్ హుస్సేన్ ఒబామా అని ఉచ్ఛరించటనికి ఇష్టపడేవాడు కాదు, ఉచ్ఛరించే పాపం చేసేవాడు కాదు. రిపబ్లికనులు ఆ పేరు వినేప్పుడు ఎంతో పాపం చేసినవారిలా ఊగిపోయేవారు. బాధపడేవారు. చర్చీలకి వెళ్ళి నాలికని నేలకేసి రాసుకునేవారు. Rush Limbaugh బారాక్ హుస్సేన్ ఒబామా అనాల్సి వచ్చినప్పుడు బారాక్ ఆఆఆ  ఒబామా అనేవాడు.

ఒక వ్యక్తిని వ్యతిరేకించవచ్చు
ఒక వ్యక్తిని ద్వేషించవచ్చు
కానీ ఈస్థాయికి ద్వేషించటం వాళ్ళ విచక్షణకి తార్కాణం
మానసిక స్థితికి నిలువెత్తు అద్దం

అదేస్థాయికి ఇవ్వాళ్ళ మీడియా దిగజారింది. నిన్నటిదాకా విషప్రచారం చేసింది. A1 అంటూ జైలు పక్షి అంటూ ఎన్ని విధాలుగా దిగజారాలో అన్ని విధాలుగా పాకుడు మెట్ల మీదనే నిల్చుంది.

చివరికి తాము ఎవ్వరి గెలుపుకోసం పాటుపడుతున్నాము అని భ్రమించాయో, ఆ సంకల్పాన్నే పాకుడురాళ్ళ మీద నిలబెట్టి అధోపాతాళానికి నెట్టి తామూ అధోపాతాళానికి జారిపోయాయి.


ఇవ్వాళ్ళ కొదరు పచ్చలయ్యలు "వార్తా సమీక్ష" లకు జగన్ పార్టీ నుంచి ఎవ్వరూ రాకుండానే చర్చిస్తున్నారు.
ప్రజలచేత ప్రజలకొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటు అయే సందర్భంలో, 50% మెజారిటీ సాధించుకున్న పార్టీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేకుండా గెలుపోటముల చర్చలు *తల లేని మొండెం*లా అనిపిస్తున్నాయి.

ఇక భజన పత్రికలు తమ భక్తిని ఇలా చాటుకున్నాయి -
ఎవరన్నా ఫలితాలు రాసేప్పుడు క్రొనొలోజికల్ ఆర్డర్లో రాస్తారు. ఎక్కువ సీట్ల నుంచి తక్కువ సీట్లు వచ్చిన ఆర్డరులో లేక ఆల్ఫాబెటికల్ ఆర్డరులో.
కానీ రామోజీ తాత
TDP           23
YSCRCP 151
JSP              1

అంటూ లిస్టింగ్ ఇచ్చాడు.

మీడియా కుక్క తోక వంకర అని నిరూపించాడు

May 25, 2019

లంకా దినకర్

ఈనాడు పత్రికని వార్తల్నీ బ్యాన్ చేసి చాలా కాలం అయ్యింది. ఆంధ్రజ్యోతి చూసే అలవాటు ఎప్పుడూ లేదు. ఆర్కె తో ముఖాముఖీ లాంటివి అసలు పడవు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక అలవాట్లు ఉన్ననాకు వార్తల్ల్ని వండి వార్చే పుత్రికలు రెండే మిగిలాయి. ఒకటి టీవి 5 రెండు సాక్షి.
టీవి 5 లో పొద్దున్నే వార్తల సమీక్షని చూట్టం అవసరం అయ్యింది. ఒక కారణం రావిపాటి విజయ్.
ఇతను కొంత పరిణితితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాడాని నా అభిప్రాయం. కానీ ఇతనికీ పచ్చ కామెర్ల వ్యాధి ఉందని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. జగన్ పార్టీని హేళాన చేస్తూ మాట్టాడటం భాజపాని చులకన చేస్తూ మాట్టాడటం గమనించినా అంతగా నేను పట్టించుకోలేదు. ఓరోజు పచ్చకామెర్లు ముదరటం - జగన్ పార్టీ టీవి5 ని వెలివేయటం జరగనే జరిగింది.
ఇక టీవి5 ని తగ్గించేశను. వార్తావిశ్లేషణ సాక్షీలో చూట్టానికి అలవాటు పడ్డాను.
మధ్యలో ఓ రోజు టీవి5 పెట్టాను. లంకా దినకర్ అనే అతివ్యాధిగ్రస్తుడు ఆరోజు వార్తా విశ్లేషణకి వచ్చాడు. విశ్లేషణో లేక ఏడుపో లేక ఆర్తనాదమో మొదలైంది. లంకా దినకర్ గారి వితండవాదం జోరుగా కొనసాగుతున్నది. అంశం - ఈవీయం ట్యాంపరింగ్.

లంకా దినకర్ గారి ఉధృత ప్రవాహం కొనసాగింపులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది గురించి ఒక వింత స్టేట్మెంట్ పలికాడు.

గోపాలకృష్ణ ద్వివేది ఆర్.యస్.యస్ భావజాలం కల వ్యక్తి అని. అదేదో దేశ ద్రోహం అయినట్టు.

ఇది ఎంత వరకూ సమజంసం


లంకా దినకర్ గారు గ్రామసింహంవలే ఎలా వాక్ప్రవాహాన్ని స్రవింపచేస్తారో. అనేక ఉదాహరణలు. ఒక చిన్న ఉదాహరణ ఈ వీడియో


Oct 28, 2018

నిందితుడి జేబులో తొమ్మిది పేజీల ఉత్తరం

నిందితుడి జేబులో తొమ్మిది పేజీల ఉత్తరం పెట్టుకుని తిరుగుతున్నాడు. పైజేబులోనా కింద జేబులోనా? కట్రాయరులోనా? ఎవడికీ తెలియదు.
పోలీసు రాజులు దాన్ని వార్తల్లో చూపించారు వార్తా పుత్రికలకు
బాగుంది
ఉత్తరం ఎక్కడా మడిచినట్టుగానీ చుట్టినట్టుగానీ లేదు
అప్పుడే నోటుబుక్కులోంచి చింపినట్టు థళథళ లాడుతూ మిలమిల లాడుతూ ఉందా ఉత్తరం లెటర్

Jun 18, 2018

ఈనాడు అమెరికా వీసా యూనివర్సిటి


ఈనాడులో ఓ ప్రధాన వార్త -
గ్రీన్‌ కార్డు కోసం ఈబీ-2 కేటగిరి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అమెరికా నిబంధనల ప్రకారం వీరికి గ్రీన్‌ కార్డ్‌ రావడానికి కనీసం 150 సంవత్సరాలు పట్టే అవకాశముంది. అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ అర్హతతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటం కూడా దీనికి ఒక కారణం. యూఎస్‌సీఐఎస్‌ గణన ప్రకారం ఈ కేటగిరి కింద గ్రీన్‌ కార్డ్‌ పొందాలనుకునే వాళ్ల సంఖ్య 2,16,681. వారి భార్యపిల్లలతో కలిపి 4.33,368 మంది గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఏమిరాస్తున్నారా నాయనా? ఎందుకిలాంటి పిచ్చిరాతలూ?
గ్రీంకార్డ్ ప్రాసెసింగ్ అనేది రాజకీయాలకు లోబడి నడుస్తుంది.
ప్రస్తుతానికి ప్రోసెసింగ్ సెంటర్లలో పనివేసే జనాభాని తగ్గించారు. అందువల్ల నింపాదిగా నడుస్తున్నది.
ఎప్పటికీ ఇదే తరహా ఉండదు.
రేపొద్దున్న వీసా నెంబర్లను నాలాలోకి విడిచిపెట్టరు. వాటిని వాడుకుని తీరాలి.
ఎన్నో సాంకేతిక విషయాలు ఇందులో ముడిపడి ఉన్నాయి.
ఊరకే జనాకర్షణ వార్తలు రాకయకండి.

Jun 17, 2018

ఈనాడు ప్రభు భక్తి

ఈనాడు ప్రభు భక్తి

*ముగిసిన నీతిఆయోగ్‌ భేటీ: ఏమేం చర్చించారంటే..?* అంటూ ఓ పేజీడు వార్త రాసుకొచ్చాడు రామోజీ తాత. అందులో *
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న చంద్రబాబు* అని ఒక ఉప శీర్షిక. తన గోడు వెళబోశుకున్నాడు బాబు. తప్పులేదు. చెప్పి మాట్టాడాల్సిన విషయాలు అతని పర్స్పెక్టివ్ నుంచి.

తర్వాతి ఉపశీర్షిక
*జాతీయ అంశాలపైనా చంద్రబాబు సూచనలు

ప్రత్యేక హోదా తాము కొత్తగా అడుగుతున్నది కాదని, విభజన చట్టంలో పేర్కొన్నదేనన్నారు. పోలవరం నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందన్నారు. 2019 లోపు పూర్తి చేయాలంటే కేంద్రం నిధులు ఇవ్వాలన్నారు. కడపలో ఏర్పాటు చేస్తామన్న ఉక్కు కర్మాగారం, విశాఖలో రైల్వేజోన్‌ అంశాలను కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చి వాటిని వెనక్కి తీసుకోవడాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించినట్టు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యమిస్తూనే.. జాతీయ స్థాయి ప్రాధాన్యతాంశాలైన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం, ఆరోగ్యానికి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన మిషన్‌ ఇంద్రధనస్సు పథకాన్ని ఎలా సమర్థంగా అమలుచేయాలనే దానిపైనా పలు సూచనలు చేశారు. స్వాతంత్య్రపోరాటానికి సంబంధించిన విషయాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై సూచనలు చేశారు. మహాత్మాగాంధీ ఆశయాలను, ఆయన స్వచ్ఛభారత్‌ కలను సాకారం చేసేందుకు దేశంలో అందరికన్నా ముందుభాగాన ఏపీ ఉంటుందని స్పష్టంచేశారు. స్వచ్ఛభారత్‌ కలను సాకారం చేయడం ద్వారా గాంధీజీకి ఘన నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌లతో పాటు పలువురు సీఎంలు చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఆయన చేసిన సూచనల్ని సమర్ధించారు.*

దీంట్లో తాత హైలైట్ ఏంటయ్యా అంటే బాబు దేశస్థాయి నాయకుడు, ఆయన కేంద్రప్రభుత్వానికే సూచనలు ఇచ్చాడు అని. తర్వాతి ఉపశీర్షికల్లో బాబు సూచనలని మోదీ అనుసరిస్తున్నట్టుగా రాసుకొచ్చాడు.

చివర్లో కెసీఆర్ కూడా మాట్టాడినట్టు రాసిన తాత, మరి కేసీఆర్ ఏవీ సూచనలు ఇచ్చినట్టుగానీ వాటిని ప్రధాని విన్నట్టుగానీ విని ఆచరించినట్టుగానీ ఎక్కడా రాయలేదు మరి.

Jun 6, 2018

రాజకీయ బురద

అమెరికా లాంటి దేశాల్లో రాజకీయ (వి)నాయకుల చేతిలో అత్యంత ప్రధానమైన పెంపుడు జంతువు *మీడియా*. వీళ్ళు ఆడే పావుల ఆటలో ప్రధానమైన ఎత్తుగడ - ఏంచేసైనా పేపర్లో పెద్దక్షరాలతో మొదటిపేజీలో పడాలి.

అదే సమీకరణాన్ని అనుకరిస్తున్నాడు బాబు.
జనాలు మర్చిపోకూడదని రోజుకోసారి "భా.జ.పా నమ్మక ద్రోహం" అంటాడు. దాన్ని బాజాభజంత్రీల మీడియా పెద్దక్షరాలతో ప్రచురిస్తుంది.

మొన్న జరిగిన ఒక వార్తావి-శ్లే-షణలో తెదేపా నాయకుడు శ్రీ లంక దివాకర్ పాపం ఆవేశ-పడి ఆయాస-పడి విలవిల్లాడితే, సదరు కార్యక్రమం నడిపిన వ్యక్తి విజయ్ అతన్నికి సీరియస్గా చెప్పేడు. మీరు విషయం మాట్టాడండి అని. ఆసందర్భంలో ఓ ప్రశ్న పడింది. మీడియాగానీ మిగతా పక్షాలుగానీ దాన్ని పట్టించుకోకుండా వదిలేశాయి.

భారతదేశలోనే ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అత్యంత సీనియర్, నటుడు కాదు కాదు క్షమించాలి, రాజకీయ నాయకుడు చంద్రబాబు అని గుండెలు చరుచుకుని చెప్పుకుంటారే, అట్లాంటిది, ఆయనకి ఒక పార్టీ టోకరావేసిందని తెలియటానికి 4 ఏళ్ళు పట్టిందా?

మోసం దగా కుట్రా బాబుని ఎదగనీయకుండా ప్లాను అదీ ఇదీ అంటూ యాగీ చేసేబదులు - #పిల్ వేయొచ్చుగా సుప్రీం కోర్టులో
ఇదీ చట్టం, ఇలా చేశారు చట్టం, ఇంత రావాలి, రాలేదు. ఇంత ఇవ్వాలి, ఇవ్వలేదు. మరి ఆడబ్బు ఏవనట్టూ? విభజన చట్టం ప్రకారం ఇవి రాలేదు అని కోర్టునాశ్రయించొచ్చుగా?

రాజకీయాలంటే ట్రంపులాగా పొద్దస్తమానం ఒబామా ఓబామా అనటం లేకపోతే పొద్దున్నే మూడుకి లేచి పలానోడు అబ్బో మంచోడనటం రాత్తిరికి అతన్ని తిట్టటం కాదు.
భాజపా మీద తెదేపా, తెదేపా మీద జగన్ పార్టీ, జగన్ మాట లేకుండా ఏవీ మాట్టాడకుండా తెదేపా - చూట్టానికి వినటానికి కంపరంగా అసహ్యంగా ఉంది.

అయ్యా రాజకీయ రాక్షసుల్లరా - రాష్ట్రానికి ఏంకావాలో అది చేయండి. గుంటూరులో కలిసి కాట్ల కుస్తీ పోటీ పెట్టుకోండి. దిల్లీలో కలిసి పోరాడండి.

May 19, 2018

ఇది ప్రజాస్వామ్య విజయం ఎలా అవుతుంది?

ఇది ప్రజాస్వామ్య విజయం ఎలా అవుతుంది?
యం.యల్.యే లను అక్కడే ఉంచి, *నిర్బంధించకుండా* వదిలేసి, ఎంత ప్రలోభాలు పెట్టినా *మా పార్టిని మేము వీడము* అని చెప్పగలిగిన నాడు - అది ప్రజాస్వామ్య విజయం.
హోటళ్ళలో క్యాండిడేట్లను దాపెట్టే ప్రతోడు ప్రజస్వామ్య విజయం అనేవాడే

I see loopholes in law.

Jul 22, 2011

అది హత్యా ఆత్మహత్యా ??

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన యాదిరెడ్డి తెలంగాణ కోరుతూ ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తెరాస నేతలు ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌, కాంగ్రెస్‌ ఎంపీలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్‌, కేకే, వీహెచ్‌, బలరాంనాయక్‌, వివేక్‌, రాజయ్య, మధుయాష్కీ, రాష్ట్రమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, జానారెడ్డి, సారయ్య, జూపల్లి, తెదేపా ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, భాజపా నేతలు నిర్మలా సీతారామన్‌, లక్ష్మణ్‌ తదితరులు గురువారం మార్చురీలో ఉన్న అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.


ఇదేందిదీ? ఏపి భవన్లోకి అనుమతించలేదు. అప్పుడు మార్చురిలో పెట్టారు. అదేదో ముందే చేయొచ్చుగా? అసలు శవాన్ని మార్చురీలో ఉంచాలా ఏపిభవన్లో ఉంచాలా అనేది పోలీసులు పోస్టుమార్టం చేసినాక కదా?

ఎపి భవన్లో ఉంచితే మర్యాద ఇచ్చినట్టు అని ఓ పెద్ద మనిషి అంటా ఉన్నాడు. అంటే మార్చురిలో పెట్టే శావాలన్నిటికీ అవమానం చేసినట్టా?



అయ్యా! నాదొక ఫండమెంటల్ ప్రశ్న
సదరు యాదిరెడ్డి గారు ఆర్మహత్య చేస్కున్నాడని వార్తాపుత్రికలు రాసుకొస్తున్నాయి. అది ఎవరు ధృవీకరించారు?
అది హత్యా ఆత్మహత్యా అని ఎవరు పరిశోధన జరిపారు? రిపోర్టెక్కడా? ఎపి భవన్లో ఉన్న వ్యక్తి చెట్టుకి ఉరేస్కున్నాడంటే ఎలా వేస్కోగలిగాడు? తాడుని ఎలా తీస్కెళ్ళ గలిగాడు. కొమ్మకి ఎలా కట్టగలిగాడూ? చెట్టుపైకి ఎక్కి తాడు కట్టుకున్నాడా? లేక బెంచి వేస్కుని తాడు కట్టాడా? బెంచి వేస్కుని ఎక్కితే అక్కడ బెంచి దొరికిందా?

చెట్టు కొమ్మకి తాడు కట్టిన వ్యక్తి ఉరిని మెడకు ఎలా ధరించగలడూ? ఎలా ఉరిపోస్కోగలడూ? తాడు మెడకేస్కుని కిందకి దూకాడా? అలా దూకితే చెట్టు కదల్లేదు, ఎవరూ చూళ్ళేదా?

తెలంగాణ రావాల్సిందే!! దానికి ఇవి కాదు మార్గాలు.
అమాయకుల ప్రాణాలను హరించి, శవాలపై తెలంగాణ పోరాట ఏనుగలును నడిపించి ఇదే పోరాటం అంటానికి తె పోరాట కర్తలు ఛెంగీజ్ ఖాన్లు బాబరు అక్బర్లు కారు. ఇది వెయ్యేళ్ళక్రితం సమాజం కాదు. ఇకనైనా ప్రాణాలతో చెలగటాలను ఆపి, సక్రమమైన మార్గంలో పోరాటం చేస్కోండి. విలువైన ప్రాణాలను కాపాడండి. సామాన్యుల ఆస్థులను కాపాడండి. ప్రభుత్వ ఆస్థులను కాపాడండి.

జై హింద్
జై జన్మభూమి

[గమనిక - పిచ్చి పిచ్చి అసందర్భ కమెంట్లు ప్రచురింపబడవు]

Jun 10, 2011

రాందేవ్‌ ఆస్తి ఎంతా?

రాందేవ్‌ ఆస్తి రూ.1100 కోట్లు
వెల్లడించిన బాబా సహాయకుడు
క్షీణిస్తున్న యోగాగురువు ఆరోగ్యం
హరిద్వార్‌: బాబా రాందేవ్‌ నెలకొల్పిన నాలుగు ట్రస్టుల విలువ రూ.1100 కోట్లపైనే ఉంది. వీటిలో దివ్యయోగ మందిర్‌ ట్రస్టు రూ.249.63 కోట్లు, పతంజలి యోగపీఠ్‌ ట్రస్టు రూ.164.80 కోట్లు, భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు రూ.9.97 కోట్లు, ఆచార్యకుల్‌శిక్ష సంస్థాన్‌ రూ.1.79 కోట్ల మూలధనాన్ని కలిగి ఉన్నాయి. ఈ సంస్థలు ఏర్పాటైనప్పటి నుంచి అయిన వ్యయం రూ.751.02 కోట్లు. మొత్తమ్మీద ఈ నాలుగు ట్రస్టుల విలువ రూ.1100 కోట్ల పైనే. బాబా సహాయకుడు బాలకృష్ణ గురువారం ఈ వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 'మేము పనిలోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ పారదర్శకతను పాటిస్తాం. ఆదాయం ఎంత? ఖర్చు ఎంత అయింది? ఎలా అయింది? వంటి వివరాలన్నీ కచ్చితంగా నమోదు చేస్తాం' అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము పన్ను కడతామని, తమ అనుబంధ సంస్థల వివరాలను కంపెనీల రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి తీసుకోవచ్చన్నారు. పన్ను వివరాలు, ట్రస్టుల బ్యాలెన్స్‌ షీట్లను తమ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేశామన్నారు. బాబారాందేవ్‌ ఆస్తులపై దర్యాప్తు జరిపించాలంటూ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడించారు.

నాదొక ప్రశ్న -
ఈ వార్తాశీర్షిక *రాందేవ్ ఆస్తి* అని వ్రాసారు. వార్తలోకి వెళ్తే, ఆయన ట్రస్టుల ఆస్తులు అంటున్నారు. ఏవిటీ ఇదీ? ఆయన ఆస్తి వేరే ఆయన ట్రస్టు ఆస్తి వేరే కాదా?

May 4, 2011

ఏవిటో ఈ వార్తలు, వార్తాపత్రికలు

నిన్న ఈనాడులో ఈవార్త నన్నాశ్చర్యపరిచింది. లాడేన్ని మట్టుబెట్టారన్న వార్తాపరంపరలో, అమెరికాలోని అందరూ పాకిస్థాన్నీ, పాకిస్థాన్లో లాడెన్ దొరకటాన్నీ ప్రశ్నిస్తుంటే, అలానే ఫరీద్ జకారియాని కూడా డిస్కషన్ లోకి లాగి ప్రశ్నిస్తుంటే ఈనాడు వాడేవిట్రా ఇలా రాసాడు అనుకున్నాను.

ఇక ఈరోజు వార్త
అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్‌లాడెన్‌ పాకిస్థాన్‌ గడ్డపై హతమవడంతో ఇప్పుడు అందరి చూపులూ ఆ దేశంపైకే మరలాయి. అమెరికా సైతం అనుమానంగానే చూస్తోంది


ఏవిటీ ఈ వార్తాశ్రవంతులు? ఏవిటీ వీరి లక్ష్యాలు?
మొన్నటికి మొన్న ఇలా వేసాడు
అక్బరుద్దీన్‌ దాడిని ఖండించిన చంద్రబాబు
కడప: ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న అక్బరుద్దీన్‌పై దుండగులు దాడి జరపడం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఒవైసీపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

రెండు విభిన్న అర్థాలు ఒకే వార్తలో
From May 1, 2011