Jan 12, 2011

ఇతిహాసము లేని జాతి ఆనంద విహీనము

ఇతిహాసము లేనిజాతి యానంద విహీనము. మనఃపూర్వకముగఁ గీర్తింపఁబడిన యోధుల సాహసకార్యములను జ్ఞాపకము చేయు కథలు వినఁగల జాతి యదృష్టవంతము. దేశముయొక్క లోపములకు వగచి క్రూరకంటకుల నిరోధించిన దేశాభిమానులను ఇతిహాసపత్రములయందు గర్వముతోఁ జూపఁగల దేశముధన్యము. కానీ మనభాగ్య మట్టిదికాదు. మనవీరులు గతించినారు. వారి కార్యములు కీర్తింపఁబడలేదు. వ్రాయఁబడలేదు అని యొక భారతీయ కృతికర్త వాసినవాక్యములు యథార్థములు. అచ్చటచ్చట మహాశూరులచరిత్రమును బాటలరూపమున పదములరూపమున నిసర్గకవులు కీర్తింయున్నారు. ఇవి కేవలము భావప్రధానములు. బొబ్బిలికథాదు లిట్టివే. ఈ కథలు చెప్పునప్పుడు నేను బాల్యమునుండియుఁ గుతూహలముతో వినుచుండెడువాఁడను. మాగ్రామములలోఁ దఱచుగా నొకతెగవారుపల్నాటివారి కథని యొక కథను జెప్పుచు భిక్షకు వచ్చుచుండెడివారు. విద్యాగంధములేని చిన్నతనమం దాకథ వినినప్పుడు దానియందలి యంశములుగాని క్రమముగాని తెలియకపోయినప్పటికిని వారు కత్తులు త్రిప్పుట గంభీరముగా గర్జిల్లుట మొదలగు నభినయములు కుతూహలాపేక్ష కలిగించినవి

- కీ।శే॥ శ్రీ అక్కిరాజు ఉమాకాంతం

1 comment:

  1. యథార్థమండి. మనకొక ఇతిహాసమే లేదనే విధంగా ఉన్నాయి పాఠ్యపుస్తకాలు.
    ఆఁ...ఏముందీ, రాజ్యకాంక్షతో ఒకరిపై ఒకరు దండెత్తటమే కదా మన చరిత్ర.. అని తీసి పారేస్తారు చాలామంది.

    ReplyDelete