Apr 11, 2010

గడ్డకట్టుకున్న గాయాలు

దిబ్బలుదిబ్బలుగా పడిన మంచంతా
ఉన్నట్టుండి కరిగిపోయింది
నిన్నటిదాకా సచ్చినట్టు పడున్న పచ్చిక
పచ్చదనం నింపుకుని
తలారబోసుకున్న కన్నెపిల్లలా కళకళ్ళాడుతూ
ఆకాశంవైపు చూసి వీచే గాలికి తుళ్ళిపడుతుంటే
మనసులో నిన్నటి మంచుతో పూడుకుపోయిన
కాలం చేసిన గాయాలు
ఒక్కొటిగా బయటపడుతూ
మళ్ళీ పచ్చిగా అవుతుంటే
వేడితనం పుట్టించిన జీవంలోంచి వచ్చిన ఈగలు
గాయాల సలుపుని పెంచుతున్నాయ్
కష్టంగా ఉన్నా
*గడ్డకట్టుకునే* ఆ మగతే బగున్నట్టుంది
మనసు గాయాలకి

3 comments: