Mar 6, 2009

దూడజచ్చింది

ముంగటి మాట. గొడ్డు గోదా ఉన్న ఇంటో కష్టాలు కన్నీళ్లు ఉండవంటారు. ఎందుకయ్యా అంటే అట్టాంటియన్నీ ఆ మూగ గొడ్డుకి సెప్పుకుని కూసింత ఊరట పడతారు. అదో దైర్నం.
ఏఏటికాయేడు మాఇంట గొడ్డు గోదా పెరగతనే ఉండాయి. పోయినేడాది రెండుగేదెలు, ఓ పెయ్య, ఓ పడ్డ ఉంటే, ఈ ఏడాది రెండుగేదెలూ సూలుకొచ్చినయ్యి. నూకల సివరావయ్య దున్నపోతుసేత దాటిపిచ్చినం. రెండుమానికల నూకలు ఎత్తకపోయిండు దున్నపోతుకని. దసరా మర్నాడు, ఓ గేదె ఈనింది.
మా ఇండ్లల్ల దూడిబుట్టినా పిల్లలు పుట్టినంత సంబరంగుండిద్ది. అయి, అటు ఇటూ దూకుతుంటయా పిల్లకాయలమాదిరి, సూట్టాకి సమ్మంగుడిద్ది. పిల్లకాయలమాదిరిగనే దొరికింది నోటికాడబెట్టుకుంటయి. మనెమ్మటాబడతయి, కాళ్లకడ్డంబడతయి, గారాలు బోతయి, ఒక్కోపలి జొన్న సొప్పకాడికిబొయ్యి కొరుకుతయి. ఆ సొప్ప అంగిట్లో గుచ్చకపోయిద్ది. కుడితిలో మూతులుబెడతయి. అందుకే ఆటికి సిక్కం గడతం. మా ఇంటికాడి పిల్లలు ఆటితో పొద్దస్తమానం ఆడతనే ఉంటరు. పిల్లోళ్లకి అదో ఆట, సంబరం.
పొద్దున, సోయంకాలఁవ్ దూడని పాలకి వదుల్తం. అది కడుపునిండా పాలు కుడుసుకున్నాక, మా ఆడోల్లు పాలుపిత్తుక్కుంటరు. ఒక్కోపాలి అరగంటో ఆలసం అయితే బర్రె సేపుకొచ్చి పాలుకారిపోతయ్యి. పాలు కేంద్రానికి పోస్తం. ఏదో సలికాలానికి ఎండ్లకాలం, ఏడినీళ్లకి సన్నీళ్లు, ఓ నాలుగు రాళ్లు ఎనక్కేస్కోఅచ్చని ఆశ. మడిసి ఆశాజీవి. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా, గొడ్డుగోదా ఉంటే ఓ దైర్నం, అయ్యి, తరగని ఆస్థులు. అయ్యి అట్టా పెరుగుతనే ఉండాల. వచ్చేఏటికి ఆరుగావాల.
ఈపాలి, దీపాలపండక్కి ఓ రెండోరాలా ముందు, సిన్న దూడకి నోటెమ్మట నురగపడింది. పశువులాస్పత్రికి ఎత్తుకెళ్లినా. కాంపాండరు గోపయ్య, సూసిండు. ఓ నాలుగు గొట్టాలిచ్చిండు. ఇంటికెత్తుకొచ్చిన దూడని. నల్లని దూడ. తెల్ల కాళ్లు. మహా ఉషారైన దూడా. మట్టితిన్నపావులా నేలకోరగిలబడి కూసున్నది. కళ్లూదోమాదిరిగైఉండయ్యి.
మర్రోజు పొద్దునికి దూడపోనేపోయ్యింది. దూడజచ్చింది. ఓ అయిపు గేదె అరుపులు, రంకెలు బెడుతుండింది. సేపుకొచ్చిందాయా, ఇంకో అయిపు, కన్న పేగు సూస్కోవాలిగా, దోడని నాక్కోవాలిగా, తల్లిపానం. ఇంటికాడి ఆడోళ్లందరూ, జేజమ్మ, నా యమ్మ, నా పెండ్లాం ఓ చోటజేరి కళ్లల్ల నీళ్లు గుక్కుకుంటూండిరి. పిల్లకాయలు దూడజుట్టూ జేరి ఓ మాదిరిగా సూస్తుండిరి.
ఇంతలా నేబొయ్యి మా ఊరి ఎట్టోడికి జెప్పొచ్చినా. ఆడు బండిగట్టుకొచ్చి, దూడని దీసకపోయ్యిండు. లోన బొమికలు అన్నీ తీసిపక్కన్నూకి, దాన్ల గడ్డిపెట్టి కుట్టి ఇంటికాడ నూకిండు. వానికో మానిక వడ్లుబోసి దూడని అట్టా పెట్టినం గుమ్మంకాడ.
సోయంకాలఁవ్ పాలపితికే ముంగట, ఈ దూడబొమ్మ చేత పాలు తాగిపించినట్టుగా జేస్తేనే ఆ గేదె పాలిచ్చేది, లేకుంటే తన్నుద్ది.
వచ్చేఏటికి ఇంకో రెండు గొడ్లు పెరుగుతై అనుకుంటే బగమంతుడు ఇట్టాజేసిండు.

18 comments:

  1. నిజమా, అలా stuffed దూడని ఎన్నాళ్ళు వాడుతారు?!!

    ReplyDelete
  2. చేటపెయ్యను చూసి దూడ అనుకుని పాలిచ్చే గేదెను చూస్తే గుండు చెరువైపోతుంది.

    ReplyDelete
  3. మిత్రమా,
    చిన్నప్పటి బాధాకరమైన జ్ఞాపకాలు గుర్తు చేసారు. నా ఊహ తెలిసినప్పటినుంచి నా ఇంటర్ వరకూ మా ఇంట్లో కనీసం మూడు గేదెలుండేవి. దూడ చనిపోయిన ప్రతిసారీ, ఆ విషయం తెలీక బిడ్డ కోసం ఆ మూగజీవి పడే బాధ వర్ణనాతీతం..

    ReplyDelete
  4. pallevaasana marachipoledu meeru dhanyaavaadamulu maapalletoori janam tarapuna

    ReplyDelete
  5. Beautiful.
    But your should pay attention to the యాస.
    ఓపాలి, నూకడం .. ఇత్యాది విశాఖవేపు వాడుకలు. బహుశా నూటయనభై ఒకటోసారి ఆరుసారా కథలు చదువుతున్న ప్రభావం కావచ్చు.
    నూకిండు అని ఎక్కడా అనరు.
    మనకి బాగా పరిచయమైన మాండలికంలో రాస్తే మంచిది.

    ReplyDelete
  6. కామెంటు జేసిన అందరికీ ధన్యవాదాలు.
    నూకడం అనే అతి సాధారణ పదం మావైపు. అన్నగారు మీకెందుకలా అనిపించింది ఆ పదం ఉత్తరపు వైపుదని? నూకటం అనేది అతి సాధారణంగా వాడతాంమేము. మా మాడలికం - మాది గుంటూరు జిల్లా, కృష్ణాజిల్లా, నల్లగొండజిల్లాలకి సరిహద్దుల్లో ఉంటుంది. పొందుగుల దాటితే నల్లగొండ. ఇటువైపు గోవిందపురం దాటితే చింతిరాల కృష్ణాజిల్లా. కొన్ని మాటలు కలసిపొయ్యి ఉండవచ్చు లేక, అస్సలు మిగతావాళ్లు విననని మాటలు ఉండిఉండవచ్చు కూడా.

    ReplyDelete
  7. నిజమా? ఐతే మీమాండలికం నాకు పరిచయం లేకపోవడం కారణం :)

    ReplyDelete
  8. భాస్కర్ గారు, నేనూ అదే ఆలోచిస్తున్నాను, పలనాడులో ఈ మాట చాలా చోట్ల , ఆ మాటకొస్తే రోజూ వింటూ ఉండేదాన్ని అని! "ఓ పాలి" మాత్రం కొత్తగానే ఉంది.

    ReplyDelete
  9. బాల్యం లోకి తీసుకెళ్ళారు..

    ReplyDelete
  10. నూకడం, ఓపాలి లాంటి పదాలు మా వైపు కూడా ప్రతిరోజూ వినిపించే అతి సాధారణ పదాలే. :)

    ReplyDelete
  11. నూకడం ante enti cheppi punyam kattukondi please !

    ReplyDelete
  12. నూకటం అంటే విసరికొట్టడం,నెట్టుట,తోయుట

    ReplyDelete
  13. రెండోదఫా, కామెంటుజేసిన అందరికీ ధన్యవాదాలు.
    @శ్రీ గారు: అజిత్ కుమార్ సమాధానమే నాదికూడా. నూకటం అనేది సందర్భాన్ని బట్టి వాడుకోఅచ్చు.

    ReplyDelete
  14. నూకడం, "దొంగతనం" అనే అర్ధం లో కూడా వస్తుంది..రాబరీ కాదు గాని చిల్లర దొంగతనాలన్నమట.
    "నా పెన్సిల్ నూకాడు", "నా పెన్ను నూకాడు" అంటూ స్కూల్లో చిన్నప్పుడు తిట్టుకొనేవాళ్ళం..

    ReplyDelete
  15. కొన్ని ఏరియాల్లో నూకడం అంటే నాలుగు పీకడం. (అంటే కొట్టడం అన్నమాట). మరి కొన్ని చోట్ల అదొక బూతు పదం.

    ReplyDelete
  16. @ఉమా శంకర్ - ఔను...నిజమే
    @కృష్ణారావ్ గారు - మనవైపు బూతులా కూడా వాడతాం...:):) అందుకే సందర్భాన్నిబట్టి...అలా అలా మార్చేసుకోడమే.

    ReplyDelete