Dec 11, 2008

ఓ తోటమాలి కధ - బాగ్బాన్

పోయిన ఆదివారం రాత్రి టీవీ ఏసియా లో బాగ్బాన్ అనే సినిమా వేసాడు. నేను ఈ సినిమా మొట్టమొదటినుండీ చూడలేకపోయినా సగం నుండి చూడటానికి వీలైయ్యింది.
ముందుగా బాగ్బాన్ అంటే అర్ధం ఏమైఉంటుందీ అనుకుని, గూగుల్లో గెలికా, వెంటనే "తోటమాలి" అని వచ్చింది. ఆ పేరు ఈ సినిమా కధకి వందశాతం సరిగ్గా సరిపోయింది. తండ్రి అనే తోటమాలి సంసారం అనే తోటని, పిల్లలు అనే మొక్కల్ని, ఎంత అపురూపంగా పాదులు తీసి, నీళ్లు పోసి, పురుగుపుట్రా నుండి కాపాడుతూ, రెక్కలు ముక్కలు చేసుకుని కాయకష్టం చేసుకుంటు, చిగుళ్లేస్తే ఆనందపడుతూ, పూలుపూస్తే కేరింతలుకొడుతూ అహర్నిశలూ తపిస్తాడు. ఈ సినిమా అలాంటి ఓ తోటమాలి కధ.

అడ్డాలనాటి పిల్లలే కాని గడ్డాలనాటి పిల్లలు కాదు ఓ సామెత. ఒక తండ్రి కొడుక్కి మొట్టమొదటి అడుగు వెయ్యటానికి అండగా నిలిస్తే, ఆ కొడుకు ఆ తండ్రికి చివరి అడుగు వెయ్యటంలో అండగా ఎందుకు నిలవలేకపోతున్నాడు?. ఈ సినిమా కధ అదే. ఎన్నో తెలుగు సినిమాలు ఇలాంటివి ఉన్నాయ్, కాని, అమితాభ్ మళ్లీ ఈ సినిమాలో, "అమితాభ్ ఒక్కడే" అనిపించుకున్నాడు. నాకు ఆ పాత్రలో ఆయన మా నాన్నలానే అనిపించాడు, మీకూ మీనాన్నలానే అనిపిస్తాడు. అంత సహజంగా జీవించాడు, ఎందుకంటే అతనూ ఓ తండ్రేగా.

సరే, ఈ సినిమాలో పాత్రలు పాత్రధారులు
అమితాభ్, హేమామాలిని, శరత్ సక్సేనా, పరేశ్ రావల్, మరియూ బృందం
విడుదల - అక్టోబర్ 2003
దర్శకత్వం - రవి ఛోప్ర
కధ - బి ఆర్ ఛోప్ర
ఈ కధని బి.ఆర్. ఛోప్రా ఎప్పుడో రాసిపెట్టుకున్నారుట. ఆయన దిలీప్ కుమార్ మరియూ రాఖీ లనిపెట్టి తీద్దాం అనుకున్నారుట.
కధలోకొస్తే :-
రాజ్ మల్హోత్ర (అమితాభ్), పూజ (హేమామాలిని) దంపతులకు నలుగురు పిల్లలు. రాజ్ ICICI బ్యాంక్లో పనిచేస్తూ సంతుష్టంగా బతికేస్తూ ఓరోజున పదవీ విరమణ చేసి, పెళ్లాం పిల్లతో గడపొచ్చు అని ఆశిస్తాడు. రాజ్ పూజాల వైవాహిక బంధం 40 ఏళ్లైనా వాళ్ల ప్రేమ ఇంకా వికసిస్తూనే ఉంటుంది. ఐతే, మరి పదవీ విరమణ అయ్యాక, పెద్దరికం వల్లా, ఇక పిల్లలదెగ్గరకి చేరుకుందాం సహారాకోసం అనుకుంటారు రాజ్ మరియూ పూజ. కానీ వీళ్ల బాధ్యతల్ని తాము తీస్కోటానికి ఆ పిల్లలు పెద్దగా ఇష్టపడరు, దానికో ప్రత్యేక కారణం రాజ్ దెగ్గర ఆస్తులు కూడా లేకపోవటం. మొత్తానికి ఆ నలుగురు పిల్లలు ఒక పరిష్కారం కనిపెడతారు. అది, రాజ్ పెద్ద కొడుకు దగ్గర, పూజ రెండో కొడుకు దగ్గర ఉండాలి అని. ఆరూనెలల తర్వాత, రాజ్ మూడోవాడి దగ్గర, పూజ నాలుగోవాడి దగ్గరకీ మారాలి అని. రాజ్ కి ఈ ఆలోచన నచ్చదు, పూజ ని తనని అలా విడదీయ్యటం అతనికి మింగుడుపడదు. కాని తప్పని పరీస్తితుల్లో రాజ్ మరియూ పూజ విడిపోయి పిల్లలదగ్గరకి చేరుకుంటారు. ఇక వాళ్ల కష్టాలు మొదలౌతాయి. ఇక్కడ కష్టాలకన్నా అభిమానాలు హర్ట్ అవుతుంటాయి. ఇటు తండ్రికి రావాల్సిన గౌరవం అటు తల్లికి ఇవ్వ్లాల్సిన గౌరవం ఉండదు. పిల్లల మాటలు చాలా కటువుగా, వీళ్లు తమ కొడుకులపై పెట్టుకున్న నమ్మకాల్ని చీల్చి చెండాడుతూ ఉంటాయి. ఉదాహరణాకి, రాజ్ పొద్దున్నే బ్రేక్ఫాష్ట్ చెయ్యటనికి భోజనబల్ల దెగ్గరకి వస్తాడు, ఓ కుర్చీలో కూర్చుంటాడు, వెంటనే కోడలు, మామయ్య, అది మీకొడుకు కూర్చునే కుర్చి, మీరు అటు కూర్చోండి అని చెప్తాడు. ఈ లోపల రాజ్ కి అదే అపార్ట్మెంటుల్లో ఉంటున్న పరేశ్ రావల్ పరిచయం అవుతాడు. ఇతనికి ఓ కాఫీషాప్ ఉంటుంది. పరేశ్ రావల్, రాజ్ తో మీ కధని కాయితానికెక్కించండి అని ప్రోత్సహిస్తే, రాజ్, అది రాస్తుంటాడు, ఒక చిన్న టైప్ రైటర్ సహాయంతో. ఓరోజు నిద్ర పట్టక టైప్చేస్తూ ఉంటాడూ టిక్కు టిక్కు అని. ఆ శబ్దానికి కోడలుగారికి నిద్ర పట్టక మొగుడ్నిలేపి పంపిస్తుంది ఆపమని చెప్పు మీ నాన్నకి అని. వాడు వచ్చి, ఏంటి ఈ గోలా అంటాడు. నిద్ర పట్టడమ్లేదు అందుకని అంటే ఈ వయ్యసులో నిద్ర పట్టదు, అది మామూలే, ఐతే, మేముకూడా నిద్రపోకూడదా అంటాడు. ఓరోజు అర్ధరాత్రి కొడుకు పనిచేస్కుంటుంటే రాజ్ అడుగుతాడు, ఏంజేస్తున్నావ్ అని, ప్రెజెంటేషన్ తయ్యారు చేస్తున్నా అంటాడు కొడుకు. నేను సహాయం చేయనా అంటే కొడుకు తండ్రిని ఎగతాళిగా మాట్లాడుతూ, మేము మీలా కాదు, మా ఆలోచనల్తో యింతవాళ్లమయ్యాం, మీ వయ్యస్సొచ్చినా ఇబ్బందిలేకుండా, మీలా ఇంకొకళ్ల దెగ్గర దేబిరించకుండా కూడబెట్టుకుంటున్నాం అంటాడు. ఇలాంటివి పూజ కి కూడ జరుగుతూ ఉంటయి. ఇలా ఆరునెలలు గడచిపోతాయి. మరి బాధ్యతలు షిఫ్ట్ అయ్యే రోజు వస్తుంది. కింది కొడుకులు ఇద్దరూ అస్సలు సుముఖంగా ఉండరు వీళ్ల బాధ్యతల్ని తీస్కోటానికి. ఇంతలో రాజ్ తన కధని, పేరు బాగ్బన్, పూర్తి చేసి, పరేష్ రావల్ కి ఇచ్చేసి వెళ్లి పోతాడు. పూజ కి ఫోన్ చేసి నువ్వు వచ్చే రైలు, నేనొచ్చే రైలు కలిసే చోట మనం ఒకచోట కలుద్దాం అంటాడు. తను సరే అని ఆ స్టేషన్లో దిగుతుంది. రాజ్ పూజ కలుస్తారు. ఆ వూరు వాళ్లు వాళ్ల జీవితాన్ని మొదలుపెట్టిన ఊరే. మొత్తానికి అక్కడ రాజ్ యొక్క పెంపుడుకొడుకు, సల్మాన్ కలుస్తాడు. సల్మాన్ ఇంటికి వీళ్లు వెల్తే అక్కడ భగవంతుడితో పాతు వీళ్లని కూడా పెట్టి పూజిస్తున్నట్టు తెల్సుకుంటారు రాజ్ మరియూ పూజ.
ఇంతలో పరేష్ రావల్ మరియూ అతని భార్య ఈ కధని చూసి చెలించిపొయి, ఇతన్ని కలుద్దాం, అనుకునేలోపు, కొంతమంది సలహామేరకు బాగ్బన్ అనే కధని అచ్చువేస్తారు, ఆ కధకి ఉత్తమ కధ అవార్డ్ వస్తుంది. ఆ కధ పబ్లిషర్ టోకెన్ అడ్వాన్స్ కింద ఒక 10 లక్షల చెక్కు ఇస్తే, దాన్ని రాజ్ కి అందిద్దాం అని పరేష్ రావల్ రాజ్ దెగ్గరకి వెల్తాడు.
ఆ పుబ్లిషర్ రాజ్ కి సన్మానం ఏర్పాటు చేస్తాడు. దీని సంగతి తెల్సుకుని రాజ్ కొడుకులు "రాజ్ దెగ్గర డబ్బు మళ్లీ వచ్చింది" కాబట్టి, వెళ్లి కాళ్ల మీద పడి క్షమించేయమని అడుగుదాం, తల్లితండ్రులు క్షమిచి తీరుతారు అని ఆ సన్మాన కార్యక్రమానికి వెళ్తారు.

ఇక ఈ సినిమాకి హైలైట్ మొదలు - అది - ఆ వేదికనుద్దేశించి రాజ్ ఇచ్చిన ప్రసంగం.


ప్రసంగం అయ్యాక, రాజ్ పూజ ని తీస్కుని వెళ్లిపోతుంటె, కొడుకులు క్షమించమని అడుగుతారు, నేను క్షమించను అనేసి ముందుకి వెళ్లగానే, వాళ్లు తల్లిని వేడుకుంటారు. ఆ తల్లి, "ఒక తల్లిగా మిమ్మల్ని క్షమించినా, ఒక భార్యగా నేను క్షమించలేను" అంటుంది.

ఈ కధ మనలో చాలా మందికి దెగ్గరగా ఉంటుంది. కావాలని తల్లితండ్రుల్ని మనం విసిగించక పోయినా, కొన్ని కొన్ని సార్లు మనం వాళ్లకి ఇవ్వాల్సిన విలువని ఇవ్వము. అది క్షమించ రాని నేరం. కాబట్టి మనల్ని కని పెంచి, విద్యా బుధుల్ని నేర్పి, విజ్ఞానాన్ని ఇచ్చి, మనం ఈ రోజున ఇలా నిలబడేలా కష్టపడిన మన తోటమాలుల్ని మనం మన పూల పరిమళాలతో, కమ్మని ప్రేమా వాత్స్ల్యపు వాసనల్తో వాళ్లుపడిన కష్టాలనుండి సేదదీరుద్దాం.

ఓ చిన్న విన్నపం: పై అమితాభ్ ప్రసంగాన్ని ఎవ్వరైనా తెలుగులోకి అనువదించగలరా?
నోట్: ఈ అమితాభ్ ప్రసంగాన్ని రాసింది జావేద్ అక్తర్. అక్తర్ ఈ సినిమాకి రచయిత కాదు, కానీ కేవలం ఈ ప్రసంగం రాసిచ్చారాయన.
దీంట్లో నాకు నచ్చిన పాట : నేను ఇక్కడ నువ్వు అక్కడ జీవితం ఎక్కడ - main yahan tu wahan jindaji hai kahaan:
పాదింది : అమితాభ్ మరియూ అల్కా యాగ్నిక్
సంగీతం : ఆదేష్ శ్రీవాత్సవ్
రచన : షహీద్ ఫియాజ్


Read somwhere that: "The movie is a remake of 2 different movies - the Marathi movie 'Tu Thitha Me', meaning Where You Are There I Am, and a National award winning Kannada movie 'Post Master'."

8 comments:

  1. నేను అనువదించగలను కానీ ఇప్పుడు కాదు. వీకెండ్
    అమితాబ్ కేక!

    ReplyDelete
  2. ఈ సినిమా నేను చూసినప్పుడల్లా రెండు తెలుగు సినిమాలు గుర్తుకు వస్తాయి.

    1.బడిపంతులు -NTR,అంజలి.
    2.మహారాజు - శోభనబాబు ,(?? మణిరత్నం భార్య)

    ReplyDelete
  3. సుహాసిని
    మహారాజు -- నాకు బాగా నచ్చిన సినిమా. Story సూపరు.

    ReplyDelete
  4. నాకైతే ఈ సినిమా చాలా నచ్చింది. భావం పరంగా.. అలాగే నన్ను నేను భవిష్యత్తులో ఊహించుకున్నాను. ఈ సినిమా ప్రతి తల్లితండ్రులకు హెచ్చరికలాంటిది.. ఎన్నిసార్లు టివిలో వచ్చినా అలా చూస్తుండిపోతాను.మావాడు నన్ను చూసి , మమ్మీ, నేను అలా చేయనులే. అంటాడు..

    ReplyDelete
  5. @యోగి- Thanks Brother
    @Dileep.M - బడిపంతులు నేనూ చూసా. ఈ కధ కూడా అదే ఎరా కి చెందిందే. సరే మరికొన్ని వివరాలు ఇస్తా దీనిమీద.
    Thanks for your comments
    @జ్యోతి గారు: నాకు అమితాభ్ ప్రసంగం కళ్లలో నీళ్లని తెప్పించింది. ఈ కధ నిజానికి చాలా దగ్గరగా ఉంది.
    Thanks

    ReplyDelete
  6. ఈ సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా భాస్కర్ గారు. అందరూ రుబ్బేసిన కధ తీసుకుని ట్రీట్మెంట్ తో అమితాబ్ నటనతో మనల్ని కట్టిపడేస్తాడు. ఇదే కోవలో "ఓ తండ్రి తీర్పు" అని మురళీమోహన్ గారి సినిమా ఉంది జయభేరి వాళ్ళదే అనుకుంటా అది కూడా చాలా బాగుంటుంది. దాన్లో కూడా తండ్రి పుస్తకం ఏదో రాస్తాడనుకుంటా...

    ReplyDelete
  7. I know its a very old post. Happened to come across today. Felt like doing it. I used Google Indic transliteration. Really impressed with it. Feel free to improvise the translation if needed - Krishna.

    చూడండి..నేను రచయిత ని కాదు...రచయితలయితే ఆలోచనలనా సముద్రాలలో మునిగి ఎన్నో మంచి ముత్యాలు వెలికి తీస్తారు. నేనేదో జీవితం నాకు చూపించినవే కథ గా రాశాను. 'బాఘ్బన్' (తోట మాలి) నా కథో ఇంకెవరి కథో కాదు. ఈ కథ గడనిచిపోయిననిన్నటికి రాబోయే రేపటికి మధ్య నున్న నిశ్శబ్దాన్నిగురించి రాశినది. ఇది ఒక తరానికి మరొక తరానికి మధ్య కూలిపోయిన ఎన్నో వారధుల కథ. తమపై కూర్చున్న పిల్లలకి జీవితం అనే వేడుక ని చూపించి ఇప్పుడు అలసిపోయి కుంగిపోయిన భుజాల కథ ఇది. తమ పిల్లలకి తప్పటడుగులు వేయడం నేర్పించి..ఇప్పుడు ఊతం లేక వణుకుతున్న చేతుల కథ....ఒకప్పుడు జోల పాటలు పాడి..ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మాట లు లేక అదురుతున్న పెదవుల కథ కూడా. కాలం మారిపోయింది..జీవితం మారిపోయింది..మా వయసు వాళ్ళకి గుర్తే ఉంటుంది..బంధాలు అనుబంధాలు అంటూ ఎలా వెంపర్లాడేవాల్లమో....తండ్రి ముఖం లో పరమ శివుడ్ని చూసేవాళ్ళం..తల్లి పాదాల వద్ద స్వర్గం కనిపించేది...కాని ఇపుడు జనాలు ఇంగితం కల వాళ్ళు. ఈ తరం తెలివి, లోక జ్ఞానం కలిగినది. వీళ్ళకి ప్రతి బంధము పైకి వెళ్ళడానికి ఒక మెట్టు లాంటిదే. ఆ మెట్టు అవసరం లేదు అనిపించినపుడు ..ఇంట్లో విరిగిపోయిన కుర్చీ లా, అరిగిపోయిన గిన్నె లా, చినిగిన పాత బట్టల లా నిన్నటి వార్తా పత్రిక లా ఎ మూలనో పారవేస్తారు. కాని జీవితం మెట్ల లా పైకి వెళ్ళాడు..జీవితం చెట్టు లా పెరుగుతుంది. తల్లిదండ్రులు పైకి వెళ్ళే నిచ్చెన లో మొదటి మెట్టు కాదు. తల్లిదండ్రులు, జీవితం అనే చెట్టు కి తల్లి వేరు లాంటి వాళ్ళు. చెట్టు ఎంత పెద్దదైన ఎంత పచ్చగా పుష్పించినా..తల్లి వేరు కొట్టేస్తే అది పచ్చ గా మనలేదు. అందుకే ఈ రోజు నేను సాదరం గా సవినయం గా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏ పిల్లల సంతోషం కోసం ఒక తండ్రి తను కష్ట పడి సంపాదించిన ప్రతి పైసా నవ్వుతూ ఖర్చు చేస్తాడో..ఆ పిల్లలు ఆ తండ్రి కళ్ళు మసక బారినప్పుడు ఆ కళ్ళకి కాస్త వెలుగు నివ్వడానికి ఆలోచిస్తారెందుకు? తన జీవితం లో మొదటి అడుగు వేయడం నేర్పిన తండ్రి జీవితం చివరి దశలో ఆ కొడుకు ఆసరా గా నిలబడలేదేన్డుకని? జీవితం అంతా తమ సంతోషాలను పిల్లలకోసం త్యాగం చేసే తల్లిదండ్రులకి ఏ నేరం చేసారని కన్నీళ్ళు ఒంటరితనం శిక్ష గా విధిస్తున్నారు? మాకు ప్రేమ ని పంచలేని వాళ్ళు మా ప్రేమను తీసుకునే అధికారం ఎవరిచ్చారు? ఈ పిల్లలు ఎం అనుకుంటున్నారు? ప్రేమ అనే బంధం తో భగవంతుడు కలిపిన తల్లిదండ్రులను రెండు భాగాలు గా విడదీసి ఎవరికీ వారుగా బాధ పడేలా చేస్తారా? ఈ రోజు కోసమే నా ఒక మనిషి పిల్లలను పెంచేది? పిల్లలు మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. ఈ రోజు మాకు జరిగింది రేపు వాళ్ళకి జరగవచ్చు. ఈ రోజు మేము ముసలి వాళ్ళం ఐతే వాళ్ళు ఒక రోజు ముసలి వాళ్ళు అవుతారు. ఈ రోజు మేం అడిగే ప్రశ్నలు రేపు వాళ్ళు అడుగుతారు. ఇక మా గురించి మీరు ఆలోచించకండి. ఎందుకంటే ఎం మాట్లాడలేని, నడవలేని అర్థం చేసుకోలేని పిల్లలను పెంచి పెద్ద చేసినవాళ్ళం..మమ్మల్ని మేము పోషించుకోలేమా? మాకు ఎవరి అండ అవసరం లేదు. నేను అదృష్టవంతుడిని. ఎందుకంటే జీవితం నాకొక అద్భుతమైన తోడూ నిచ్చింది. తనతో నడుస్తూ ఉంటె దారి తేలిగ్గా అనిపించేది. తనతో నడుస్తూ ఉంటె జీవితం లో ఎంత చిక్కు సమస్య అయినా ఇట్టే విడి పోయేది. ఆ తొడు..నా భార్య. అందరు ప్రేమిస్తారు. కాని ఈ విషయం చెప్పవలసినాన్ని సార్లు చెప్పారు. ఆ తప్పు నేను చేయదలచుకోలేదు. "పూజా, నువ్వంటే నాకు అంతు లేని ప్రేమ..అంతు లేని ప్రేమ..thank you for being there". "నీవు ఉంటే మనం ఉంటాం. మనం ఉంటే అన్ని ఉంటాయి..లేకపోతె ఏది ఉండదు....ఏది ఉండదు.."..నేను చెప్పవలసినది ఇంతే.

    ReplyDelete
  8. హ్మ్మ్.. అతి గా పిల్లల జీవితాలలోకి దూసుకుని వెళ్ళి వాళ్ళను ఇక్కట్ల పాలు చేసే తల్లి తండ్రులు, ఇలా అవమాన నిరాదరణలకు గురి ఐ కృంగి పోయే వాళ్ళు రెండూ రకాలు రెండు ఎక్స్ట్రీంస్ కదా..

    ReplyDelete