Oct 24, 2008

ఇంట్లో చిరుతిండ్లు అ.క.అ. snack @ home

సీజనల్: ఉడకబెట్టిన కందికాయలు, పుల్లశనగ గుగ్గిళ్ళు, కంది గుగ్గిళ్ళు, ఉడకబెట్టిన వేరుశనగలు/వేరుశనక్కాయలు,వేపిన వేరిశనక్కాయలు, అలచంద గుగ్గిళ్ళు, తాటిముంజలు, రేక్కాయలు, పుల్లరేక్కాయలు, ఈత కాయలు, నేరేడు కాయలు, తేగలు, తాటి బూరెలు, తాటి కుడుములు, తంపటేసిన వేరుశనక్కాయలు, శనక్కాయలు, చెరుగ్గడలు, పెసర కాయలు, మొక్కజొన్న కండెలు.

నిలవ ఉండేవి : కారప్పుస, చెక్రాలు, కజ్జికాయలు, చెక్కలు(తెల్ల నువ్వులేసినవి, సగ్గుబియ్యంవి), కొబ్బరిలౌజు, బెల్లప్పుస, వేయించిన అటుకులు, మైసూర్పాక్, బూంది, బూంది లడ్డు, తొక్కుడు లడ్డు, రవ్వ లడ్డు, గోధుమ పిండితో చేసేవి కొన్ని - గవ్వలు, అరటికాయలు గట్ర. ఎప్పుడో ఒకటి రెండు సార్లు కట్టెలపొయ్యిమీద చేసిన కారప్పూస తిన్న జ్ఞాపకం. అదుర్స్.

పండగలకి పబ్బాలకి చేసేవి: సజ్జ బూరెలు. అరిశెలు, గారెలు

అప్పటికప్పుడు తినేవి: వడలు, పకోడి, తప్పాల చెక్కలు, "పుట్నాలపప్పు/వేయించినశనగపప్పు ఉల్లిపాయలు కారం ఉప్పు నెయ్యి".
మరపురాని సీతాకాలం లేక వానాకాల వంటలు - అలా బయట చిత్తడి చిత్తడిగా ఉంటే పొట్టలో గురుగురు అని ఎవో పేగులకేకలు వింపడుతుంటే -డబ్బాలోంచి సగ్గుబియ్యం వడియాలు తీసి ఫటాఫట్ వేయించేది మా అమ్మ..వహ్.
కుంపట్లో మా అమ్మ పప్పు వండాక, దాంట్లో చిక్కుడుకాయలు కాల్చుకు తినేవాళ్లం. అలానే, నిప్పుల్లో ఉల్లిపాయలు కాల్చి తింటుంటే..అప్పుడప్పుడూ పిత్తులు గట్రా రావట్లేదనుకోండి - బెష్ట్ మార్గం - గెణుసుగడ్డలు. కుంపట్లో గెణుసుగడ్డలు కాల్సుకుతింటే మర్నాడు క్లాసులో ఎవ్వడూ ఉండకూడదు.. ఎండాకాలం శెలవుల్లో గెణుసుగడ్డల్ని ఉడకబెట్టేది మా అమ్మ. కింద పెద్ద గిన్నె, నిండా నీళ్లు, పైన ఇంకో చిన్న గిన్నెలో రెండో నాలుగో గెణుసుగడ్డలు వేసి మూతపెట్టేస్తే అవి ఉడికేవి. భలేవుండేవి.

కొనుక్కుని ఇంట్లో తినేవి: అప్పట్లో స్వీట్లు ఒక అద్దాల బండిలో పెట్టి అమ్మేవాళ్ళు. ఎక్కువగా కొన్నుకునేవి - పూసమిఠాయి, బాదుషా, జాంగ్రీ, పేడా, బర్ఫి మరియూ చేగోడీలు. నాకు మహా ఇష్టం చేగోడీలు. కాని కొనుక్కుని తినేది చాలా తక్కువ. ఎప్పుడో, సంవత్సరానికోసారి. అంతే. చిప్సు అంటే ఏంటో తెలియదు. చిప్సు తింటారని పెద్దయ్యాక తెల్సింది.అప్పుడప్పుడూ కొన్ని కొత్తవి తెలుస్తుండేది. వేయించిన బియ్యం. దోసకాయ ఒరుగులు - దోసకాయ విత్తనాలు నోట్టోవేస్కుని పైపొట్టు చాలా నేర్పుతో చెయ్యి పెట్టకుండా తేసేసి తినెయ్యటం. మంచి గుమ్మడికాయ విత్తనాలు.

5 comments:

  1. భలే నోరూరిస్తున్నారే!
    సీజన్లో ఇంకొన్ని: రేక్కాయలు, పుల్లరేక్కాయలు, ఈత కాయలు, నేరేడు కాయలు, తేగలు, తాటి బూరెలు, తాటి కుడుములు, తంపటేసిన వేరుశనక్కాయలు, శనక్కాయలు, చెరుగ్గడలు, పెసర కాయలు, మొక్కజొన్న కండెలు.
    ఇక all time favorites: బఠాణీలు, ఉప్పు శనగలు.
    "కట్టెలపొయ్యిమీద చేసిన కారప్పూస"--కట్టెల పొయ్యి మీద ఏం చేసినా అదుర్స్,అంతే. మా ఇంటి దగ్గర ఇప్పటికీ పిండి వంటలు కట్టెల పొయ్యి మీదే చేస్తారు.

    ReplyDelete
  2. ఇందులో కొన్నింటి పేర్లు తెలియవు.

    ReplyDelete
  3. ??గెణుసుగెడ్డ్లలు??

    ReplyDelete
  4. @teresa: గెణుసుగడ్డలు = Sweet potatos

    ReplyDelete