Oct 17, 2008

తినుబండారాలు a.k.a snacks

నిన్న మా బుడ్డోడికేవో బిస్కెట్లు కొన్నాం.పెప్పరిడ్జ్ ఫార్మ్ వాళ్లవి ఛెస్మెన్ కుక్కీస్.


నేనూ ఓటి నోట్టోవేస్కున్నా. అమెరికాకొచ్చాక, కాస్త రుచి తగిలిన బిస్కెట్లు ఇవే. మావోడికి మరి అవి ఎలా కొనాలనిపించిందో తెలుసా? ఆటిమీద గుఱ్ఱం బొమ్మ ఉంటంవల్ల. సరే అట్టా తినుకుంటా వారెమ్మెటి కార్ని తోల్కుంట ఎల్తుంటే చిన్నపటి బిస్కెట్లు, చాక్లెట్లు, తినుబండారాలు గుర్తొచ్చినై.

చిన్నప్పటి ఆల్టైం హిట్ బిస్కెట్లు - బ్రిటానియా. అవి ఇప్పటి 5 రూపాయల్ బిళ్ళంత ఉండేవి. మా బుడ్డోడు తింటున్నాడు చూడండి ఇక్కడ, అవే.నోట్టోఏస్కుని అట్టే నాలికతో పైనోటికేసి నొక్కిపెట్టి, కొంచెంసేపు నానినాక నాలికతో నొక్కితే సుర్రున కరిగిపోయేవి. అలా నాలికమీదపెట్టి పైనోటికేసి నొక్కి నొక్కి కాయలు కాసేవి.
తర్వాత బాగా ఇష్టంగా తిన్నవి చందమామ బిస్కెట్లు. ఉఫ్ఫ్.. వీటిరుచే వేరు. మళయాళం వాళ్లు ఎక్కడికెళ్లినా టీ కొట్టు పెట్టినట్టే బేకరీలుకూడా పెడతారు. అలాంటి బేకరీలో చేసేవే ఈ చందమామ బిస్కెట్లు. నోట్టోవేస్కుంటే కరిగిపోతాయ్. అలాంటివే కొబ్బరి బిస్కెట్లు, జీడిపప్పువి మొవి.
ఇంక, అత్యంత ఇష్టమైన చాక్లేట్లు - parrys. చాలా తక్కువ ఖరీదు. బ్రంహాండమైన రుచి. ఎప్పుడో ఓసారి eklairs తినేవాళ్లం. అవి కొంచెం ఖరీదు, ఒక్కోటి అర్ధ రూపాయ్.
నాటు నాటుగా తినేవి, తెగ ఎగబడి తినేవి "కొబ్బరి బిళ్లలు". మా బడి గేటు దగ్గర ఒక బూబమ్మ కిందపెట్టుకు కూర్చుని కొబ్బరి బిళ్లలు, గొట్టాలు, రేగి అప్పచ్చులు, నూగుజీడీలు, పుల్లశనగ గుగ్గిళ్ళు అవి ఇవి అమ్ముతుండేది. 5 పైసల్కి ఒక బిళ్ల. తెగతినే వాళ్లం. అలానే గొట్టాలు. 5 పైసలకి 5. ఒక్కోవేలుకి ఒక్కోటి పెట్టుకుతినేవాళ్లం. అప్పుడప్పుడూ గుంటపునుగులు వెల్లుల్లి కారప్పొడి.
ఇంక నూగుజీడీలు: పెద్దవి చిన్నవి. పెద్దది ఐతే నోట్టో పట్టేది కాదు చీకి చీకి..చిన్నవి ఆ బుగ్గలో ఓటి ఈబుగ్గలో ఓటి పెట్టుకుని చీకేటప్పుడు ఒకసౌండు, ఇషక్ ఇషక్ అని..
ఇంక, పప్పుండలు... మా ఇంటో ఒక కుటుంబం అద్దెకుండేవాళ్లు. వాళ్లది పప్పుండల వ్యాపారం. వేడి వేడి పప్పుండలు, ఆ బెల్లప్పాకం వాసన, యాలుకల వాసన...నాయనా!! పార్ధాయ ప్రతిబోధి చెట్టూ, రిక్షా పై విమానయాత్రా...

తర్వాత్తర్వాత మిరపకాయ బజ్జీలు, పునుగులు. వహ్.. పల్నాళ్లో పుట్టినందుకు, గుంటూరు జిల్లావాణ్ణైనందుకూ నాకు చాలా గర్వంగా ఉంది.

ఇంతకముందు గుంటూర్లో బోంబే టీష్టాల్ అని లక్ష్మీ పురమ్లో ఉండేది. అక్కడ ఉల్లి మిర్చి బజ్జి. అంటే, వేడి వేడి మిరపకాయ బజ్జిని నిలువునా కోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసిం, కారం ఉప్పులో నిమ్మకాయ పిండి దాన్ని ఆ ఉల్లిపాయలమీద జల్లి ఇస్తాడు...జీవితం ఎటుపోతుందో..నాలిక అలా కిందపడి కొట్టుకుండేది ఆ రుచికి. అలా తిన్నాక, అసలే వేడి వాతావరణం, ఆపైన, మిర్చి బజ్జి, ఆపైన కారం ఇన్ నిమ్మ రసం, చెమట కక్కి దెబ్బకి చొక్కా తడిసాక, వేడి వేడి చాయ్ కొడితే...గణేస్ నిమర్జనమ్లో తీన్మార్ కి డాన్సేసినట్టు అహా షేకు షేకు అవుతుండేది మనసు.అట్టానే, బ్రాడిపేట 2/1లో ఒక బజ్జి బండి. వానిదెగ్గర పునుగులు. వేడి వేడి పునుగులు, వాయి తీయ్యంగనే ఖతం. వానిష్. ముందుగానే బుక్ చేస్కోవాలి ఆర్డరు. అలా వేడి వేడివి, కారప్పొడితో తిని వగర్స్తూ ఓ షోడా తాగితే...అహా జజ్జినక జజ్జినక..
మొదట్లో బ్రాడీపేట 4/7 లో రెడ్డి మసాలా, జిలేబి ఉండేది. తర్వాత్తర్వాత 4/14లో పెట్టాడు రెడ్డి. ఒక సాదా మసాల - మరమరాలు, వేయించిన వేరుశనగ ఇత్తనాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగిన మిర్చి, కొన్ని అలచందలు ఉదకబెట్టినవి ఒక కొబ్బరి ముంతలో వేసి బాగా కలిపి, ధనియాపొడి, ఉప్పు వేసి, నిమ్మకాయ పిండి మళ్లీ గిలక్కొట్టి ఒక ఆకులో వేసి, తాటాకుని ఒక ని స్పూన్లా వేసి ఇస్తాడు. జజ్జనకా, అహా జజ్జనక...ఇది అయ్యాక, బఠాణి మసాలా - బఠాణీలు టమాటాలు, కారెట్టు, అలా ఉడుకుతూ ఉంటాయ్..దాన్లోంచి ఒక పెద్ద స్పూన్ తీసి, ఉల్లి, కొత్తిమీర పుదినా వేసి నిమ్మకాయ పిండి ఇస్తే...జజ్జనకా అహా జజ్జనకా...అలా పొట్టపగలా తిన్నాక, రెడ్డి బండికి ఎదురుగానె జిలేబి బండి..వేడి వేడి జిలేబి. 100గ్రాములు ఒక్కరూపాయే..
పట్టాభిపురం గుడిదెగ్గర,బాషా మసాలా అని ఒక బండి ఉండేది. అహా ఏమి రుచి...అనరా మైమరచి...

తర్వాత్తర్వాత గప్చుప్లు. ఇవి వచ్చిన కొత్తల్లో ఒకటి రెండు బళ్లు మాత్రమే ఉండేవి. వాడిదెగ్గర, ముందుగా ఒక మసాలా కట్లెట్ - అంటే ఉడకబెట్టిన బంగాళాదుంప, ఎదో మసాల, దాన్ని పెద్ద పెనం మీదపెట్టి మాష్ చేసి, పాని పోసి కొన్ని బఠాణి వేసి మెత్తగా నూరి ఒకటిరెండు పూరీలు నలిపేసి ఇస్తాడు. బానే ఉండేది. అది అయ్యాక ఒక పాతికో ముప్పైయ్యో పానీపూరీలు తినే వాళ్లం.
ఇప్పట్లో, మనకి పొరుగింటిపిల్ల కూర సారి పుల్లకూర రుచి. మనవి మర్చిపోవటం అంటే మనకి మహా సరదా. ఎక్కడ చూసినా బేకరీలు పిజ్జాలు బర్గర్లు గోల.

ఇక..చివరాకరికి ఇక్కడ...అమెరికన్ వడలు..ఒక్కటికూడా తినలేము. బేగల్, పొటాటో విడ్జెట్స్ తినలేము, ఫ్రెంచ్ ఫ్రైస్ తినలేము. ఏందయ్యా అంటే అలా ఆప్-పిళ్ (యాపిల్), పీచ్, గట్రా పళ్లు తింటమే.. ఒకప్పటిరుచిని తల్చుకుంటూ....

23 comments:

 1. naa nOru oorinchEsaaru...naaku maa hyderabad gurtukochindi....avi "potato edges" maastaaru...

  ReplyDelete
 2. మీభోజనప్రియత్వం ముచ్చటగా ఉంది- ఎంత బాగా గుర్తున్నాయో!! :)

  ReplyDelete
 3. @నరహరి గారు: పొటాటొ ఎడ్జెస్సో విడ్జెట్సో...సోది గోల.....బాగోవు!!
  @తెరిసా గారు: :):) థాంక్సు

  ReplyDelete
 4. Baava bhale raasavv...nuvvu cheppina vaatillo ee week lo mem u thalchukkunavi 2 items ...okati eclairs chocalates..ninne na wife ahde mee chelli vatinin gurthu chesindhi....malli mana bombay tea stall lo ullipaya bajji..weekend lo santha nunchi podugu mirchi techhi ullipayi masal abjji thinnam.....ahha masthu ruchi leee

  ReplyDelete
 5. కేక మాష్టారు, ఒక రేంజ్ లో వ్రాసారు గా చిరు తిళ్ళ గురించి.

  ReplyDelete
 6. మొత్తానికి మర్చిపోయిన చిరుతిండ్లన్ని గుర్తుచేసారండి.మీ బుడ్డోడి ఫోటో బాగుంది.

  ReplyDelete
 7. చంపేసారు పొండి!

  గుంటూర్లో బ్రాడీపేటని బాగనే ఏలినట్టున్నారుగా! మీరు చెప్పిన బండో కాదో కానీ బ్రాడీపేట్ 4/14 లో ఉండే ఒక బండి దగ్గ్ర మీరు చెప్పిన ముంత కింద పప్పు(ఇదే దాని పేరు మా వూర్లో) బలే ఉంటుంది. అక్క వాళ్ళింటికి వెళ్ళినపుడు భోజనం సైజులో కొట్టేసేవాళ్లం!

  4/18లో కూడా ఒక కోమట్ల ఫామిలీ ఇంట్లోనే బజ్జీలువ్ ఏసే వాళ్ళు. అవి కూడ సూపరు. సెలవులకెళితే పట్టాభిపురం అంతా సర్వ నాశనమై పోవాలి. స్వామి థియేటర్ దగ్గర, గుజ్జన గుళ్ల రోడ్లో, ఇంకా కంకర గుంట గేటు, జూట్ మిల్లు, TJPS కాలేజీ..ఎక్కడ ఏ చిరుతిళ్ళున్నా వాడికి బోలెడు బిజినెస్స్ ఇచ్చేసేవాళ్లం!

  ఇక స్కూలు బయట తిన్న(మీరు చెప్పిన అన్నీ) తిళ్ళు, గుర్తొస్తే ఇవాల్టి పొటాటో వెడ్జెస్ థూ స్నిపిస్తాయి.

  చిన్న నాటి స్మృతులని తేనెతుట్టె మీద రాయేసినట్టు లేపడం మీకొక్కరికే సాధ్యం అనిపిస్తుంది!

  ReplyDelete
 8. విజయవాళ్ళో సీతారాంపురం కనకదుర్గ టాకీస్ ఎదురుగా ఒక కోమట్ల మిరపకాయబజ్జీల కొట్టుండేది. సాయంత్రం నాలుగు నించీ ఎనిమిది మధ్య విపరీతమైన రద్దీ. వాళ్ళు కేవలం మిరపకాయ బజ్జీ, పునుగులు .. ఈ రెండే అమ్మేవాళ్ళు. అతను పునుగులు రెండు వాయలు వేస్తున్న సమయంలో (ఆ రోజుల్లో) బజ్జీలకోసం రెండొందల రూపాయల పైన బుకింగులైపోయేవి. థియేటరు కొచ్చిన జనాలు, టిక్కెట్లు దొరికాయండీ, బజ్జీలు దొరుకుతాయో లేదో గేరంటీ లేదనేవాళ్ళు.
  ఆర్యీసీ రోజుల్లో చిరుతిళ్ళ గురించి అంతగా గుర్తు లేదు. సీజనల్ గా మొక్కజొన్న కండెలు తినేవాళ్ళం. విజయవాడ వైపు కండెలు కాల్చి సాదాగా అమ్మేవాళ్ళు. వరంగల్లో దానిమీద ఉప్పూకారం అద్దిన నిమ్మ బద్ద రుద్ది అమ్మడం నాకు విచిత్రంగా ఉండేది.
  ఆ తరవాత మళ్ళీ చిరుతిళ్ళు బాగా ఎంజా చేసింది బాపట్లలో. అప్పుడు ఐదు థియెటర్లు ఉండేవి. ఒక్కో థియెటర్లోనూ ఒక్కో చిరుతిండి స్పెషలు. మిర్చి బజ్జీ, సమోసా, తంపటేసిన చెనక్కాయలు గుర్తున్నాయి. మిగతా రెండూ ఏంటో గుర్తు లేవు. ఇది కాక ప్రతి రోజూ ఏజీకాలేజి లేడీస్ హాస్టలు గేటు దగ్గర బండి నించి ఉల్లిపాయేసిన మిర్చి బజ్జీ. ఆ రోజుల్లో అవి పదిపైసల కొకటి అనుకుంటా. ఒక్కొక్క బజ్జీ బొటనవేలంతే ఉండేది. ఒక్క గుటకలో ఫట్.
  BTW .. ఇంతా చేసి ఆ తినుబండారం పేరు పొటేటో వెడ్జెస్. మిర్చి బజ్జీల్లాగే వీటిని కూడా ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. నాలుగు చోట్లా శాంపుల్ చేసుకుని, బాగా నచ్చిన చోట డిసైడైపోవాలి. కొన్ని పలహార శాలల్లో మాంఛి బీర్ బేటర్లో తడిపి వేయించి, పైన కేజన్ మసాలా అద్ది సర్వ్ చేస్తారు. వేసవి సాయంత్రం చల్లటి మెక్సికన్ బీర్తో అహు రంజుగా ఉంటాయి.

  ReplyDelete
 9. ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి..

  ఇప్పటి పిల్లకాయలకు చిరుతిళ్లు ఎక్కువగా లేవు. అన్నీ ప్యాకెట్లే గతి.

  ReplyDelete
 10. @శ్రీకాంత్: బావ.. ఇక్కడకి రారా...మజా చేస్కుందాం :):)
  @వేణుశ్రీకాంత్: :) పిడుగురాళ్ళ గుర్తొచ్చిందా? శ్రీనివాసా స్టూడియో పక్కన, మళాయాళం టీకొట్టు, దాంట్లో అరటికాయ సైజు మిర్చి బజ్జి:):)
  @క్రాంతి: మీ పేరు నాకు బాగా ఇష్టం. నాకు బాగా దెగ్గరైన మా బావ కొడుకు పేరు. thanks for your comment.
  @సుజాత గారు: మీరు అన్న 4/14లో బండి నేను చెప్పిన బండి ఒక్కటే. :):)
  @కొత్త పాళీ గారు: మధుర సృతులు. అన్నట్టు మా అన్న కూడా REC Warangal లో చదివాడు. 1987-1991 Computer Sciences. Anyway, Thanks for your the comment.
  @జ్యోతి గారు: నిజం. అన్ని ప్యాకెట్లే.

  ReplyDelete
 11. ఇదిగో రామరాజు,ఏందీ రాతలు,అసలేందీ అంట,ఎయ్యి గుర్తొస్తే అయ్యి రాసిపారెయ్యటమేనా అని?బలేవోడివి లాగున్నావే?ఇప్పుడా ఎనకాల యేడేడ ఏం తిన్నామో గుర్తుకుతెచ్చుకోని,ఒకేపు నోట్లో నీళ్ళూరతంటే,ఇంకో యేపు ఇయ్యన్నీ గుర్తుచేసినందుకు బూతులు తిడతానే ఉన్నా,ఇది చదివిన కాడ్నుంచి...
  నీకేం,అమెరికాలో యిమానమెక్కి బుయ్యన ఏ హైద్రాబాద్లో నో దిగి,ఏ పల్నాడో ఎక్కి గబాల్మని మీఊరుబోతావ్,మరి మేము వయిజాగు నుంచి పోవాల,నడుములు పడిపోతాయ్,

  ReplyDelete
 12. వేడి వేడి పకోడీ గురించి మీరు రాయలేదా? నాకు కనపడలెదా?
  క్రికెట్టు మ్యాచ్ చూస్తూ మా కంపనీ చిప్స్ తినండి ఓ బహుళజాతి సంస్థ ప్రచారం చేస్తుంది గాని, కారప్పూస, చెక్కలముందు ఈ చిప్స్ ఏ పాటి?
  సహోద్యోగులు ఎవరైన పిజ్జా తెప్పించుకొని తింటు, ఓ ముక్క తిందువురా అంటే, బజ్జీలుంటేబిలువు, పిజ్జాలకు పిలవక్కర్లేదు అని చెబుతూ ఉంటను.

  ReplyDelete
 13. ఇటుకల్లే పోతా ఉంటే మిరపకాయ బజ్జీల వాసన తగిలింది. వచ్చి చూద్దునుగదా.. ఇక్కడ పెద్ద దుకాణమే తెరిచారు. నాకంటే ముందు పన్నెండు మంది లైన్లో ఉన్నారప్పుడే! ఎంతసేపు చూడాలో బజ్జీల కోసం!!

  ReplyDelete
 14. @భాస్కర్ .. అంటే మీ అన్న మేం పండి రాలిపోయినాక పొడమిన మొగ్గన్న మాట :)

  ReplyDelete
 15. @ఊకదంపుడు గారు: ఇవి బైట తినేవి మాత్రమే..
  @చదువరి గారు: కనీసం బజ్జీల వాసనకైనా మా వైపు వచ్చారు. థాంక్సులు...
  @కొత్త పాళి అన్నగారు: మావాడు షికాగోలో స్థిరపడ్డాడు..

  ReplyDelete
 16. అబ్బా !!! గుర్తు చేసారండి ఆ పునుగులు తినే మధుర రొజులున్ని... మైసూర్ బొండాలు తినే అందమైన జ్ఞపకాల తేనెతుట్టను...ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అవి...I am presently in US :(

  ReplyDelete
 17. వాహ్...బిస్కట్ల దగ్గరనుండి బజ్జీల దాకా ఏం చెప్పారండి. నా ఆల్ టైం ఫావరేట్ మిరపకాయ బజ్జీలు. గుంటూరోళ్ళకి బజ్జీలకి విడదీయరాని బంధం ఉందిలేండి...

  ఇక బడి గేటు ముందు తిన్నవాటిల్లో కమ్మరకడ్డీలు కూడా చేర్చండి...

  @కొత్తపాళీ గారు, బాపట్ల బజ్జీలు గుర్తొచ్చినప్పుడన్నా మీరు రాయాల్సిన మన బాపట్ల గుర్తు రాలేదా??..నేను మర్చిపోలే, అప్పుడప్పుడు ఇలా గుర్తు చేస్తుంటా:)

  ReplyDelete
 18. @మున్నీ గారు: :( అందుకేగా ఈరాతలు.. అమెరికాలో ఉన్నాం కాబట్టే ఇలా రికాల్ చేస్కుని తృప్తిపట్టమే..
  @సిరిసిరిమువ్వ గారు:కమ్మరకడ్డీలు అంటే? అన్నట్టు మా పాప ఫోటోపెట్టా చూసారా?

  ReplyDelete
 19. కొత్తపాళీ అన్నగారు: కరెక్టు చేస్కున్నా. పొటాటో వెడ్జెస్...నాట్ విడ్జెట్స్..

  ReplyDelete
 20. @మున్నీ .. అందుకే వంటా నేర్చుకోండి, లేదా వంటొచ్చిన అబ్బాయిని పెళ్ళి చేసుకోండి (సరైన భోజనం దొరకట్లేదంటున్నారు కాబట్టి మీకింకా పెళ్ళి కాలేదని ఊహిస్తున్నా!)
  @సిసిము .. ఆ మాట మీరంటారా లేదా అని చూస్తూ ఉన్నా :) నిజమే! బాపట్ల కబుర్లు ఇంకా రాయాలండీ. ఉన్నది 8 నెల్లే ఐనా, జరిగి 20 ఏళ్ళు ఐనా స్పష్టంగా గుతుండిపోయినై కొన్ని.

  ReplyDelete
 21. @భాస్కర్ రామరాజు గారు: రికాల్ చేసుకోవడం బాగుందండి... కాని తీరే దారి మాత్రం కనబదుట లేదు... వా...వా... :(

  @కొత్తపాళి గారు: నాకు పెళ్ళి అయ్యిందండి...మా వారు వంట కూడా చేస్తారు..నిజం చెప్పాలంటే నాకన్న బాగా... కాని బండి పైన దొరికే వాటి రుచి ఇంట్లో రావటం లేదు సార్..

  ReplyDelete
 22. బండివాడు చెమటనికూడా వేస్తాడు. అందుకే అంతరుచి. :):):) పిల్లాట (just kidding)

  ReplyDelete