Jun 10, 2020

శివానంద లహరి

శివానంద లహరి

శివానంద లహరి అంటే శివానంద మహా ప్రవాహం అని.

తన్మయత్వంలో మునిగితేలిన ఆయన అంశ ఆయనతో రమిస్తూ స్రవించిన మహాప్రవాహం శివానంద లహరి. ఆ అంశ శ్రీ ఆదిశంకరాచార్య.

కలాభ్యాం చూడాలంకృత-శశి కలాభ్యాం నిజ తపః-
ఫలాభ్యాం భక్తేశు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే |
శివాభ్యాం-అస్తోక-త్రిభువన శివాభ్యాం హృది పునర్-
భవాభ్యాం ఆనంద స్ఫుర-దనుభవాభ్యాం నతిరియమ్


కలాభ్యాం = (సకల) కళలయొక్క స్వరూపము తామే అయిన వారు (అగు పార్వతీ పరమేశ్వరులు ఇరువురికీ)
చూడాలంకృత శశికలాభ్యాం = శిరస్సుపై చంద్రరేఖను అలంకరించుకున్నవారు
నిజతపః ఫలాభ్యాం = పరస్పరము ఒకరి తపస్సునకు మరియొకరు ఫలముగా లభించినవారు
భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం = భక్తులకు విశేషముగా వరములను ప్రసాదించువారు
శివాభ్యాం = పరమ మంగళ స్వరూపులు
అస్తోక త్రిభువన శివాభ్యాం = మూడు భువనములకును విశేషముగా శుభములను కలుగజేయువారు
హృది పునర్భవాభ్యాం = (నా) హృదయమునందు మరలా మరలా దర్శనమిచ్చువారు
ఆనన్ద స్ఫురదనుభవాభ్యాం = ఉప్పొంగుతున్న ఆనంద స్థితిని అనుభవించువారు (అయిన పార్వతీపరమేశ్వరులకు)
మే నతిరియమ్ = ఇవియే నా నమస్కారములు
భవతు = అగుగాక

సకల కళలయొక్క స్వరూపము తామే అయినవారు, శిరస్సున చంద్రరేఖను ధరించినవారు, పరస్పరము ఒకరి తపస్సునకు మరియొకరు ఫలముగా లభించినవారు, భక్తులకు విశేషముగా వరములను ప్రసాదించువారు, పరమ మంగళ స్వరూపులు, త్రిభువనములకును విశేషముగా శుభములను కలుగజేయువారు, నా హృదయమునందు మరలా మరలా దర్శనమిచ్చువారు, నిరంతరమూ ఉప్పొంగుతున్న ఆనంద స్థితిని అనుభవించువారు అయిన పార్వతీ పరమేశ్వరులకు ఇవియే నా నమస్కారములగుగాక.



సినిమా ప్రపంచంలోకి వస్తే -
అతనొక *జగదేకవీరుడు*. అతనికి సవాళ్ళంటే మహా ప్రీతి. అతని జీవిత ప్రవాహంలో ఓ మలుపులో ఒక సవాల్ - 
మహావీరా - అల్లదిగో కనిపించే ఆ జంత్రములను ఏకకాలమున మేళవించి నీ గానామృతముతో ఈ శిలని కరిగించు, నాకు ముక్తిని ప్రసాదించు


సవాల్ స్వీకరిస్తాడు మహావీరుడు. 
  

 -
శివశంకరీ
శివానందలహరి శివశంకరీ
చంద్రకళాధరి ఈశ్వరీ...
కరుణామృతమును కురియుజేయుమా
మనసు కరుగదా మహిమ జూపవా
దీనపాలనము చేయవే
శివశంకరీ

శ్రీ పింగళి నాగేంద్రరావు గారి మహాద్భుత రచన
ఈ రచనకు గాత్రాన్ని ఇచ్చి ప్రాణం పోసింది మాత్రం శ్రీ ఘంటసాల.

ఈ పాటని చూసే జనాలు చూస్తారు, NTR ని జగదేక వీరునిగా ఊహించుకుంటారు. ఆయనకి ఓటేస్తారు గెలిపిస్తారు, ముఖ్యంత్రిగా చేస్తారు. ఆయన కొడుకుని నెత్తిన పెట్టుకుంటారు. ఆ కొడుకు కొడుకుని పెట్టుకుంటారు. రాబోయే తరాల్లో ఆ కొడుకుల కొడుకుల్నీ పెట్టుకుంటారు.

కానీ ఎందరు పింగళిని గుర్తుతెచ్చుకుంటారూ? ఎందరు పాటగాడిని స్మరిస్తారూ?

అది పక్కన పెడితే తెలుగు సినీ సాహిత్యంలో సాంప్రదాయ సంగీత వాసనలతో వచ్చిన పాటలు తక్కువ. అందులో ఎన్నతగ్గ పాట ఇది.

ఇలాంటి పాటని శ్రీ బాలయ్య బాబు గారు ఖూనీ చేయకుండా ఉండాల్సిందని నా అభిప్రాయం.

వాళ్ళ నాయనగారూ స్క్రీన్ మీద అభినయించారేగానీ గాత్రదానం చేయలేదు. అలాంటప్పుడు ఈయన ఈపాటని ఆయనగారి పుట్టినరోజు కానుక అని పాడటం ఏంటో అర్థంకాదు.

ఏ దానవీరసూర కర్ణలోని డైలాగుల్నో బహుమతిగా ఇచ్చుంటే ఇంతగా బాధపడాల్సిన పని లేదు.

పాటని చూస్తే ఒక్క గమకం లేదు. గొంతులో మృదుత్వంలేదు. పాటతో రాళ్ళని కరిగించాలనే ఆర్తి లేదు.



శంకరాభరణం శంకరశాస్త్రి గారి అద్భుతమైన మాటలు ఒక్కసారి స్మరిస్తూ -
"ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు
ఎదురుదెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరోలా అంటాడు
నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా అని మరొకవిధంగా అంటాడు. 
ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతి వుంది, స్వరం ఉంది.
ఆ కీర్తనలోని ప్రతీ అక్షరం వెనక ఆర్ద్రత నిండి ఉంది దాసూ. 
తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి తనకు తానే గంగాజలంలా పెల్లుబికిన గీతమది. రాగమది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగాల పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యా. మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమమైన సంగీతాన్ని అపభ్రంశం చెయ్యకు"

No comments:

Post a Comment