నరకం ఎలా ఉంటుంది?
చీకటి చీకటిగా.....
రావుగారి తలంతా వర్షాకాలంలో కటిక చీకట్లో చిట్టడవిలా ఉంది.
పైన భగ్గున మండే సూర్యుడు.
బైట ఫెళ్ళున కాసే ఎండ.
ఎండ ఎలా వుంది?
పులికోరలా, పాము పడగలా.
నరకం ఎలా ఉంటుంది?
పులితో పాముతో చీకటిగా.....
కచేరిలో అంతా చీకటిగా ఉంది. ఎదురుగా బల్లమీద నల్లని చీకటి గుడ్డ, సిరాపడితే విషంలో విషమ్లా కలిసిపోతుంది. ప్లీడర్ల నల్లకోట్ల నిండా వికృతంగా క్రూరంగా చీకటి. పోలీసువారి ఎర్రటోపీలనిండా చారలు చారలుగా చీకటి. చుట్టూ పడున్న ఖాళీసారా కుండలనిండా చల్లారిన చీకటి. ముద్దాయీల కళ్ళనిండా దీనంగా అజ్ఞానపు చీకటి.
బంట్రోతు వెళ్ళి పదకొందు గంటలూ కొట్టగానే రావుగారు కచేరిలో 'బెంచి' మీద కూర్చున్నారు.
ఇరవైయ్యేళ్ళయి ఇలా కచేరిలో అడుగుపెట్టడం, ఠంగున పదకొందు మోగడం.
ఎన్నాళ్ళకో మోక్షం?
ఈ వూరొచ్చి ఇలా గంటలు వింటూ అప్పుడే ఏడాదయింది.
నిన్న లెక్కలుకూడి రిపోర్టు పంపిన ప్రకారం ఈ యేడాదిలోనూ ఆరువేల సారా కేసులు!
సారా కేసులు! ఆరు వేలు!
మూడు వేలమంది జరిమానాలు కట్టుకుంటున్నారు. దాదాపు మూడువేల మంది జైలుకి పోయారు. యాభైమంది కాబోలు యిళ్ళకి శుభంగా పోగలిగారు.
ఒక్క ఏడాడిలో తన చేతిమీదుగా యింతమంది?
మొత్తం ఇరవైయేళ్ళలోనూ ఈ విధంగా ఎంతమంది?
లెక్కకట్టలేక, ఊహించుకోలేక. అంతుదొరక్క రాత్రంతా నిద్రపట్టలేదు.
తలనొప్పిగా ఉంది.
జ్వరం తగిలిందా?
అలానే వుంది. వళ్ళంతా మండుతోంది.
బైట ఎండలా పాముపగలా.
రాత్రల్లా దయ్యాల ముఖాలే కనిపించాయి.
వాళ్ళంతా అన్ని వేలమందీ ఇప్పుడెక్కడ చెప్మా? ఎక్కడ?
కటకటాల వెనక కుళ్ళి కుళ్ళుంటారు. అక్కడే అందులోనే చచ్చుంటారు.
బైటికొస్తే -
పగబట్టి వుంటారు.
నామీద కొన్నివేల పగలు. లోకంలో కోటాను కోట్ల పగలు.
పాముల్లా వాటి పడగల్లా 'ఏమిటి?!! ఏమిటివి?!!'
"కొత్త కేసుల్లో సారాట్యూబులు సార్" అన్నాడు బెంచి గుమాస్తా
"అంతేనా?"
రోజూ ఇలాగే పాముల్లా సారా ట్యూబులు.
మోటార్లవి, సైకిళ్ళవి, ఎర్రవి, నల్లవి.
అన్నిట్లోను సారా! కోర్టుకొస్తే సారా, కోర్టులో వున్నంత సేపూ సారా. రోజూ దాదాపు ప్రతి కేసు సారా.
కూలీలు జెయిలుకి, కుష్టురోగులు జైయిలుకి, అమాయకులు జైలుకి, దరిద్రులు జైలుకి, ఆడవాళ్ళు, అనాధలు అంతా జైయిలుకి-
మరెక్కడికి? అంతా జైయిలుకే.
రావుగారి మెదళ్ళో చలి.
కీకారణ్యంలో చీకటి చినుకుల్లో అల్లుకొన్నట్టుగా మెదళ్ళో చలి అల్లుకొంటోంది.
"ఎవరది?"
"ఏమిటి సార్??" అని అడిగేడు బెంచి గుమాస్తా.
ఓహో కోర్టు కదూ!
మర్చేపోయాను.
ఎదురుగా మిల్చున్న ఆడమనిషి 'ముద్దాయీవేనా?'
"అవును బాబూ!"
బెంచి గుమాస్తా కాయితం కట్టొకటి చేతికందించాడు.
ఎదర న్లిచున్న ముద్దాయీ ముప్పైయేళ్ళది. చింపిరిజుట్టుది. పాలిపోయిన ఎర్రనిది. ఆమె కాళ్ళనిండా బురద బురద, వంటినండా బుగ్గి బుగ్గి, కోకనిండా డాగులుడాగులు, తలనిండా పేలు పేలు, కళ్ళనిండా జడుపు జడుపు, గుండెల్లో భయం భయం, చేసిన నేరం సారా సారా....
"ఏం అమ్మా! నీ దగ్గర సారా పట్టుకున్నరా?
మామూలుగానే మాట్లాడుతున్నాను, మరేం భయంలేదు; రాత్రల్లా పిచ్చెక్కినట్టుగా ఉంది. మరేం భయంలేదు.
"మాట్లాడవేం; సారా పట్టుకున్నరా?"
ఆడదాన్ని, సరిగా, రోజులాగే కరిరాను. మరేం ఫరవాలేదు.
"పట్టుకున్నారా??"
"పట్టుకున్నారు బాబూ."
"నేరం చేశావా?"
"నేరం చేశావా అంటే ఏటిసెప్పేది బాబూ! అర్ధరూపాయి కూల్డబ్బులిచ్చి మొయ్యమన్నారు బాబూ!"
"అదే నేరం చేశావా?"
"ఏ టెరగనట్టు సావుకారుబాబూ ఒల్లకున్నాడు, బాబూ."
"షావుకారు సంగతి కాదు; నువ్వు నేరం చేశావా? లేదా?"
"సేసాను బాబూ,"
"డబ్బు కట్టుకోగలవా?"
"ఎంత బాబూ?"
"వంద."
"వొందే రూపాయలేవుంటే, అర్దరూపాయి కూల్డబ్బులకి అమ్ముడు పోతానా బాబూ?"
"అయితే ఆరు వారాలు."
జెయిలు జెయిలు!!
మామూలు ధోరణిలో పడుతున్నాను. మరేం భయంలేదు. కొంచెం తలనొప్పిగా ఉంది...రాత్రల్లా దయ్యాలు...
ఎవరో కెవ్వున...
ఏమిటది?
ఏడుపా? ఎవరిది?
"నా కొడుకు బాబూ!.... ఒల్లకోరా నాయనా."
ముద్దాయి వెనకనుంచి ఆమెకాళ్ళు పట్టుకొని మూడేళ్ళపిల్లడు భావిపౌరుడు, భగవంతుడెలా పుట్టించాడో అలా ఉన్నాడు. భయంతో ఏడుస్తున్నాడు.
"ఎందు కేడుస్తున్నాడు?"
"నిన్న ఇయాల్టేళకి తిన్నకూడు! మరేడడా బాబూ?"
ఆకలి.....ఏడుస్తున్నాడు!
"పిల్లడి కెవరూ లేరా?"
తండ్రి? తోబుట్టువులు? తాతలు? తండ్రి తోబుట్టువులు? నీ వాళ్ళు? చుట్టాలు, నేస్తాలు? ఎవరూ? ఎవరూ లేరా? ఇంత ఊరుంది. ఇంత దేశం ఉంది. ఇంత జనాభా వుంది! ఇంత మందిలో ఎవరూ లేరా!!
"అడవిలో ఉన్నట్టున్నాం బాబూ!"
అడవిలో అతి చీకటి!
అక్కడ పులులూ, పాములూ!
అక్కడ సూదుల్లా చీకటి చినుకులు.
"మరైతే పిల్లణ్నేం చెయ్యడం! ఓయ్, ఎవరక్కడ! మీ స్టేషన్ కేసేనా! జెయిలు వారంటు రాయించినప్పుడు 'పిల్లడితో తల్లి' అని గుమస్తా చేత రాయించు. మర్చిపోకు; రాయకపోతే జెయిల్లో తీసుకోరు, బైటుంటే కుర్రాడు చస్తాడు"
"చిత్తం"
ఏడుపు దూరమయింది.
బైటుంటే చస్తారు. జైల్లోనే బతకాలి.
- మోక్షం; ఆరు సారా కథలు; కీ.శే శ్రీ రావిశాస్త్రి
విశాలాంధ్ర దినపత్రిక ౧౪-౫-౧౯౬౧
కళ్ళముందు కోర్టు నేపథ్యం కదిలనట్టు, అజ్ఞానులు అనాధలు అమాయకలు జైలుకి వెళ్తున్నట్టు, భావిపౌరులు ప్రశ్నిస్తున్నట్టు అనిపించలేదూ?
పంతొందొందల అరవైఒకటిలో రాసిన ఈ కథ, నేటి కథకు ఏ మాత్రమూ తేడా లేదు. అవే కోర్టులు, అవే బల్లలు, అవే గోడలు, అవే నల్లకోట్లు, అవే కళ్ళద్దాలు, అవే నేరాలు కాదు కాదు మరింక ఎక్కువ నేరాలు, అపరిష్కృతంగా పెరిగిపోతున్న ఫైళ్ళు, ఊపిరాడని న్యాయమూర్తులు, నేటి ముద్దాయిలు. ఏ మార్పూ లేనివి అనేకం. భయంకరమైన మార్పులు చెందింది మాత్రం సమాజం. నేరాలు చేసే తరీకా మారింది. పద్ధతి మారింది. షావుకార్ల తెలివి పుచ్చిపోయింది. అమాయకులు మాత్రం వెళ్తూనే ఉన్నారు, జెయిళ్ళకి.
న్యాయవ్యవస్థకి పట్టిన బూజూ అలానే వేళ్ళాడుతోంది. బహుశా పాత బూజి కిందకి పడిపోయి కొత్త బూజు పట్టుండవచ్చు.
అప్పటి నుండి ఇప్పటివరకూ
"నేరం చేసావా" అనే దగ్గరే ఆదిపోయింది మన (అ)న్యాయవ్యవస్థ. ఎందుకు చేస్తున్నారో ఇన్ని నేరాలు అనే కోణాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు లేవు. ఉండవు. ఉండబోవు. ఎందుకంటే, ఆ ఒక్క కోణం రావణ కాష్టపు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. తట్టుకోలేదు న్యాయవ్యవస్థ. వేళ్ళు నల్లకోట్లను ప్రశ్నిస్తాయి ఆ దిశగా వెళ్తే. వేళ్ళు న్యాయాధికారులవైపు తిరుగుతాయి. వేళ్ళు న్యాయవ్యవస్థ మొత్తాన్ని ఎత్తిచూపుతాయి. ప్రబుత్వాన్ని తప్పుపడతాయి. అరాచకం జరుగుతుంది. కత్తులు బయల్పడతాయి. షావుకార్లు రగిలిపోతారు. దేశాన్ని కూల్చేస్తారు.
అంతకన్నా, అమాయకులను జెయిల్లో పెట్టటమే ఉత్తమం. బలైపొయ్యేది అమాయకులేగా? పోనీయండి.
ఎందరు రావిశాస్త్రులు వచ్చి వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపినా, ఏమాత్రమూ మార్పురాని సమాజంలో ఉంటున్నాం. అదే పదివేలు మనకు. రావిశాస్త్రులు వస్తుంటారు, రాస్తుంటారు, కాల గర్భంలో కలుస్తుంటారు...............................................మనకేంటి!!
Subscribe to:
Post Comments (Atom)
ఈ పోస్ట్ నచ్చింది.
ReplyDeleteకానీ సమస్య గురించి మాట్లాడే అర్హత నాకు లేదు :(
నేరం చేసేవాడికి శిక్ష వేసి సమాజంలో నేరాన్ని రూపుమాపొచ్చనే ఆలోచనే తప్ప నేరం తాలుకా మూలాలు కనుక్కుని దానిని పెకిలించే వ్యవస్థలేదు మనకి. ఇదేంటంటే అంత ఐడియలిస్టిక్ వ్యవస్థ ఎక్కడా లేదనే నాయకులే అందరూ.
ReplyDeleteఇదే పధ్ధతిన విశ్వనాధ సత్యనారాయణ గారు ఒక కథ వ్రాశారు. ఆ కథ పేరు ఉరి. ఆ కథను వారబ్బాయి పావని శాస్త్రి గారు చదివి వినిపించారు. నా బ్లాగులో కొంత కాలం క్రితం వేశాను. చూసి వినండి.
ReplyDeletehttp://saahitya-abhimaani.blogspot.com/2010/10/blog-post_1718.html
హ్మ్ ! భాస్కర్ గారు !
ReplyDelete