Oct 20, 2010

గొడుగు

నాన్నా ఆపిల్లాడు చూడు చక్కగా గొడుగేస్కొచ్చాడు. నాకూ అలాంటిది కావాల్నాన్నా అన్నాడు సూర్య నాతో. వద్దురా నాన్నా కంట్లో గుచ్చుకోవచ్చు లేక పొడుచుకోవచ్చు. వద్దమ్మా. ఇదే బాగుంది అని వాడేస్కున్న పాంచోని పొగిడాను. అబ్బా కాదునాన్నా. గొడుగైతే ముడుచుకోవచ్చు, బ్యాగ్గులో పెట్టుకోవచ్చు, అవసరం వచ్చినప్పుడు తీయవచ్చు అంటూ గొడుగు గొప్పతనాలను ఏకరువు పెట్టటం మొదలెట్టాడు. ఇంతలో బస్సు వచ్చింది. నాన్నా గొడుగు సాయంత్రం వచ్చేప్పుడు తీస్కురా అంటూ బస్సెక్కాడు.
ఆవేళ సాయంత్రం మా కార్యాలయం వద్దనున్న వాల్గ్రీన్స్‌కి వెళ్ళా పిల్లల గొడుగులేమన్నా ఉన్నాయా అని. లేవండీ అన్నాడు కొట్టువాడు. సరేనని ఇంటికి ఫోనుకొట్టి గొడుగులు దొరకలేదని చెప్పి కారు తీసి రొడ్డెక్కాను. ఇంటిదాకా వెళ్ళంగనే టర్గెట్‌లో ఓసారి చూద్దాం అనిపించింది. కారుని అటుతిప్పాను. సన్నగా తుప్పర పడుతోంది. టార్గెట్‌కి వెళ్ళాను. లోపలి ఓ సహాయక యువతిని అడిగేను పిల్లకాల గొడుగు కావాలి అని. పిల్లల డిపార్ట్మెంట్ వైపుకి వెళ్ళి చూస్కోండి అంది ఆ వైపుకి చుపుతూ. అక్కడకెళ్ళి చూస్తే ఒకేఒక రకం పిల్లల గొడుగు ఉంది. దానిపై ఏదో చిన్న డిజైను. పిల్లల గొడుగు డిజన్ పిల్లలకు ఏమాత్రం హాని కలిగించకుండా, పిల్లలు ఈజీగా తెరిచి ముడిచేలా ఉంటాయిని ఆ గొడుగు చూసాక అర్థం అయ్యింది. సరేనని అది తీస్కుని, మరి పిల్లాడికి ఏమన్నా కొంటే చంటిదానికి కొనకుండా ఎలా బుంగమూతి పెట్టుకోదూ అని బెత్తెడుజుట్టికి అరడజను సైడుపిన్నులు కొనుక్కెళ్ళా.
సన్నటి తుప్పర ఇంకా పడుతూనే ఉంది. ఇంటికెళ్ళగానే ఏంటీ ఇంత ఆలశ్యం అన్నాడు పిల్లాడు. ఏ లే లా లీ అంది అమ్మాయి. వానగా ఉందిగా అని సైలెంటుగా లోపలికెళ్ళాను. ఆపీస్ సంచి కిందపెట్టి బూట్లిప్పి, చీకట్లో తలుపు దగ్గరే దాచిపెట్తిన గొడుగు నెమ్మదిగా కాలివెనకుపెట్టుకుని వెళ్ళాను హాల్లోకి. ఠకా మని తీసి సూర్యా ఇదిగోరా అని ఇచ్చాను. మరి నాకో అని చూసిన పిల్లకి పిలక బ్యాండ్లు ఇచ్చాను.
పిల్ల అపురూపంగా చూస్కుంది. ప్యాకెట్టు ఊడదీసి బెత్తెడు జుట్టుకు నాలుగు రబ్బరు బ్యాండ్లి పెట్టుకోటానికి వాళ్ళమ్మదగ్గరకి పరుగెత్తింది.
పిల్లాడు గొడుగు చేతుల్లోకి గర్వంగా తీస్కున్నాడు. నాకళ్ళలోకి చూసాడు. నాకేనా ఇదీ అన్నట్టుగా అనిపించాయా కళ్ళు. నీకే అన్నట్టు నేనూ చూసాను. అమ్మా అమ్మా నాన్న గొడూగు తెచ్చాడని వాళ్ళమ్మకి చూపించాడు. చెల్లెమ్మా గొడుగు అని చుపించాడు. నాన్నా బాగుంది అని నాదగ్గరకొచ్చి గొడుగు టెక్నికాలిటీస్ గురించి కొంచెం ప్రోబ్ చేసాడు. ఇక దాన్ని తెరిచి మూసి తెరిచి మూసి అడుతున్నాడు.
పిల్లకి రబ్బరు బ్యాండ్లు బోరుకుట్టాయి ఈ మధ్యలో. అన్న సంబరం పిల్లకి ఎట్రాక్టివ్‌గా అనిపించింది. లాక్కోటానికి పరుగెత్తింది. షరమాములే ఇద్దరూ లాక్కుని పీక్కుని గోలగోల చెసారు. నే మధ్యలో కల్పించుకుని గొడుగుని ముడిచేసి పైన పెట్టాను.
మఱ్ఱోజు పొద్దున్నే గొడుగేస్కుని వెళ్తాం అనుకున్నాడు పిల్లాడు.
తెల్లవారింది.
వానవెరిసింది.
ఎండగా ఉంది.
గొడుగు తీస్కెళ్ళనా సాయంత్రం వానపడొచ్చేమో అన్నాడు. వద్దులేరా అన్నాము.
సాయంత్రం అయ్యింది. వానలేదు.
మఱ్ఱోజు పొద్దున్నే గొడుగేస్కెళ్ళనా అన్నాడు. వానలేదుగా అని చెప్పాం.
అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. పొద్దున్నే వాన పట్టంలేదు. వాడికేమో వానలో గొడుగేస్కుని వెళ్ళాలని కోరిక. మొన్నీమధ్య పొద్దున్నే పొగమంచుగా ఉంటె ఐతే గొడుగేసుకుని వెళ్ళొచ్చా అన్నాడు ఆత్రంగా.
అలా అటక మీదనే ఉంది గొడుగు వాడికేసి చూస్తూ!

14 comments:

 1. బాగుంది, ఏదో చిన్న పిల్లల ఆర్ట్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది సోదరా :)

  ReplyDelete
 2. చాలా బావుంది మీ కథనం.
  Wish I could say the compliment better :)

  ReplyDelete
 3. చాలా బావుంది ..

  త్వరలో వర్షం పడాలనీ, మీ అబ్బాయి ముచ్చట తీరాలనీ కొరుకుంటున్నా..

  ReplyDelete
 4. :)
  విశాల్ భరద్వాజ్ 'బ్లూ అంబ్రెల్లా' సినిమా గుర్తొచ్చింది, ఇది చదవగానే.

  ReplyDelete
 5. మరీ పెద్ద వాన కాకుండా , సన్నని చిరు జల్లులు పడాలని, అప్పుడు సూర్య గొడుగు వేసుకొని వస్తూంటే తన కళ్ళలో ఆనందం చూడాలని ఉంది

  ReplyDelete
 6. సన్నని చిరు జల్లేవిటోయ్ పేప్ర్ కాయిత్కం లాగా?

  ReplyDelete
 7. నాదీ వేణూశ్రీకాంత్ మాటే...
  Nice narration :)

  ReplyDelete
 8. బావుంది, సూర్య కోరిక త్వరలో తారుతుందని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 9. వానల్లు రావాలి వానదేవుడా
  నాగొడుగు తడవాలి వానదేవుడ
  అని పాడుకోమనుసూరిగాణ్ణి

  ReplyDelete
 10. నన్ను రమ్మంటారేటి? ఈ మద్దెక్కడికెళ్ళినా వాన్లూ పదతన్నయి :)

  కళ్ళ ముందు సూరి కనిపించేశాడు మీ కథనానికి

  ReplyDelete
 11. >>>మొన్నీమధ్య పొద్దున్నే పొగమంచుగా ఉంటె ఐతే గొడుగేసుకుని వెళ్ళొచ్చా అన్నాడు ఆత్రంగా.

  హ్హహ్హహ్హ..!! భలె ఉందండీ గొడుగు కథ. మీ అబ్బయికి గొడుగు ముచ్చట తీరాలని కోరుకుంటున్నా!! ఇంకొద్దిరొజులు ఆగితే మంచు పడుతుందిగా..అప్పుడు వేసుకెళ్ళమనండీ పోనీ!!

  ReplyDelete
 12. Good reading this story. I think You have re-lived your childhood..

  ReplyDelete