ఓ డొక్కు సైకిలు. ఎనక ఓ బుట్ట. సైకిలుకిటుపక్కన వైరుతో అల్లిన ఇనప ఫ్రేము బుట్ట. మెలేసిన మీసాలు. సన్నని రివటలాంటి శరీరం. నరాలు కనిపించే జీవంలేని కండలపైకి మూడిచిన చొక్కా. ఓ పక్క కారాకిళ్ళీ తో ఉబ్బిన బుగ్గ, ఇంకోపక్క చప్పిడైపోయిన బుగ్గ, పోలీసు కట్టింగు - వెరసి సత్తార్. సత్తార్ నడిపే క్యంటీన్ పేరు "సత్తార్ క్యాంటీన్". తార్నాక కాణ్ణుంచి, ఇటు అడిక్మట్, శంకర్ మట్, అటు శివం, అంబర్ పేట్ వరకూ, నల్లకుంట, ఎక్కడైనా, రాత్రి రెండుకి చాయ్ కావాల్నంటే ఏకైక దిక్కు - సత్తార్ క్యాంటిన్.
సత్తార్ క్యాంటీన్ ఉస్మానియా యూనివర్సిటి క్యాంపస్ లో హాస్టల్ గంగ మరియూ హాస్టల్ స్వర్ణముఖి ల మధ్యలో ఉంటుంది. సాయంత్రం ఎనిమిదికి తెరుస్తాడు సత్తార్. సత్తార్ కి హెల్ప్ చెయ్యటానికి ఓ చిన్న పోరడు. ఈ చిన్న పోరడు రెండు హాస్టళ్ళ డిమ్యాండ్స్ ని అటెండ్ జేస్తడు. అంటె, స్వర్ణముఖి,రూం నెంబర్ 38 నుండి ఒకడు, ఛోటే చార్ చాయ్ లా అని జెప్తడు. ఇంతలో రూం నెం 67 లోంచి ఇంకొకతను, అబే దోబడా చార్ సమోసా అంజెప్తడు. ఇలా. ఆ రెండు హాస్టల్ల మొత్తానికీ గీ పోరడే. లేటైతే ఏంరా, ఏం లేట్జేస్తవ్ సాలే అని తిట్లు, పైకి తిట్టినా, తమ్మీ నువ్వూ ఈ సమోసా తిను, లేకుంటె తమ్మీ చాయితాగినావురా? అని అడిగే వాళ్ళు. ఏంరా పైసల్ ఏమన్న గావాల్ల్నా అని అడిగేటోళ్ళు ఇంకొందరు.
ఇక దుకాణం తెరిచినంక, ఒక్కోడు నెమ్మదిగా జేరుకుంటడాడికి. పక్కనే ఓ చిన్న క్రీక్ పోతుండ్లే, దానికి గట్లు కట్టిన్రు. నెమ్మదిగా దాని మీంకి జేరుకుంటరు పోరగాళ్ళు. ఇక, చాయి మీన చాయ్, దమ్ముమీన దమ్ము. ముంగట ఒక్కడే ఒస్తడు, ఇంక ఆని స్నేహితులు జేర్కుంటరు ఒక్కోడొక్కోడు. పదకొండింటికి పుల్లుగా కితకిత లాడుతుంటరు జనం.
ఒక రౌండు సమోసలు అయిపోనంక, ఇంకో తట్ట తెప్పిస్తడు సత్తార్. తినోటోళ్ళు తినుడు. ఇక అక్కడ్కి చేరినోళ్ళు గుండుసూది కాడ్నుంచి ఇమానాలదాంక, లేటెస్టు పాలిటిక్స్ మీన, అబ్బో మహా రంజుగా ఉంటై అక్కడి రచ్చబండ చర్చలు. ఇంక స్వర్ణముఖి యం.టెక్ హాస్టల్ కావటంతో అక్కడి చాలామంది, సివిల్స్ ప్రిపేర్ అవ్వటానికొస్తరు. ఇక వాళ్ళు జనరల్ నాలడ్జి మీద, యాంత్రొపాలజీ మీద ఇలా అబ్బో, పెద్ద పెద్ద డిస్కషన్స్ నడుస్తుంటై.
ఇక సత్తార్ భాయ్ క్యాంటీన్ లో యస్.పి ఏంది? అని ఎవుడైనా అడగొచ్చు. యా, సెప్తా తమ్మీ -
బ్రెడ్ ఆంలెట్.
ఫ్రెంచ్ టోస్టు.
బ్రెడ్ ఆంలెట్ ఆర్డర్ జేస్తే ఓ అరగంట పడ్తది. దేనికివయ్యా అంటే, అంత క్యూ.
ఇక ఫ్రెంచ్ తోస్ట్. మాంచి ట్యాప్ నీళ్ళలో పాలు పోశ్తడా, భలే చిక్కంగుంటై ఆ పాలు. అందల బ్రేడ్డుని తడిపి, ప్యాన్ మీన ఫ్రై చేసి ఇస్తడు. వేడివేడి ఫ్రై, ఆకలిమీద, రాత్రి పదకుండింటికో పన్నెండింటికో తింటుంటే...ఆహా వోహో.
హైద్ అనంగనే మనిషి స్పురణకి వచ్చేది - కేఫ్లు, చాయ్, బిర్యాని, సమోస.
ఇక శంకర్ మట్ రోడ్లో రైల్వేలైన్ దాటంగనే ఓ కేఫ్. రాంనగర్ గుండు ఈ కేఫ్ ఎనకనే. ఇక్కడా బాగనే ఉండేది చాయ్.
నాకు బాగా నచ్చిన సమోస - ఆల్ఫా, మరియూ, అమృతా క్యాజిల్ కి దగ్గర్లో ఒక కేఫ్. గుర్తుకి రావట్లా. అబ్బో ఆ రుచే వేరు.
బిర్యానీ గురించి ఓ పోస్టేస్కుందాం తర్వాత.
అలానే మెస్సుల గురించీ ఇంకో పోస్టు.
Jun 10, 2009
Subscribe to:
Post Comments (Atom)
"మాంచి ట్యాప్ నీళ్ళలో పాలు పోశ్తడా, భలే చిక్కంగుంటై ఆ పాలు. అందల బ్రేడ్డుని తడిపి, ప్యాన్ మీన ఫ్రై చేసి ఇస్తడు. వేడివేడి ఫ్రై, ఆకలిమీద, రాత్రి పదకుండింటికో పన్నెండింటికో తింటుంటే...ఆహా వోహో." :-) :-)
ReplyDeleteఓసారి సత్తార్ క్యాంటీన్ రేకులూ అవీ గాలికో మరో ఉత్పాతానికో రేగిపోతే, విద్యార్థులంతా కలిసి మర్నాడుదయానికే వాటిని సరిగ్గా చేసి మళ్లీ క్యాంటీన్ నిలబెట్టారట. దానికి చలించిపోయిన సత్తార్ కళ్లనీళ్లతో ఎప్పటికీ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడని ఉస్మానియా విద్యార్థి ఎవరో తన అనుభవం ఎప్పుడో నాలుగేళ్ల క్రితం చెప్పారు. ‘ఈనాడు’లో క్యాంపస్ కహానీ అని దాన్ని ప్రచురించినప్పుడు మంచి స్పందన వచ్చింది కూడా. మీకు తెలుసా ఆ సంఘటన గురించిన వివరాలు?
ReplyDeleteమురళి భాయ్ - :):)
ReplyDeleteఅరుణ గారూ - అవునా? నేను 1994-1995 సంవత్సరాల్లో కొన్ని నెలలు ఉన్నా అక్కడ. తర్వాత నాకు తెలియదు. అయిఉండవచ్చు.