May 7, 2009

తుంటరి సూరీడు

ఓ రోజు మధ్యాహ్నం
సమయం - మూడు గంటలు.
స్థలం - లేతం, న్యూయార్క్

హరి పిల్లని నిద్రబుచ్చుతోంది. నేను ఆఫీసులో ఒక కంటితో కూడలిలోకి తొంగిచూస్తున్నా. మరి రెండో కన్నో, అదేమరి, రెండోకన్ను నిద్రపోతోంది.
ఇంతలో, ఒక అకారం, పిల్లిలా కదులుతోంది. అది, నెమ్మదిగా డైపర్ల డబ్బాలోంచి, డైపర్లన్నిటిని కిందపడేసి, ఆ డబ్బాని ఈడ్చుకుంటూ టిప్టో చేస్కుంటు, అడుగులో అడుగేస్కుంటూ మెయిన్ డోర్ వైపు వెళ్ళింది. ఆ ఆకారం ఆ డబ్బా ఎక్కి, డోర్ కి వేసి ఉన్న చైన్ లాక్ ని నెమ్మదిగా తీసేసింది. ఒక రకమైన నవ్వు వినిపించింది వెంటనే. వెంటనే డైపర్ల డబ్బాని యధాస్థానంలో పెట్టి, టక్ మనే శబ్దంతో తలుపు తెరిచి బయటకి వెళ్ళిందా ఆకారం.
పడక గదిలో పిల్లని నిద్రబుచ్చుతున్న హరికి ఆ శబ్దం వినిపించింది. వెనువెంటనే పిల్లని కిందపెట్టి బయటకి వచ్చి చూస్తే ఆ ఆకారం పక్క ఇంటి తలుపుకొడుతోంది.
"ఒరేయ్ సూర్యా, అక్కడేంచేస్తున్నావ్, ఇట్రా నిన్నస్సలూ, ఉండు మీ నాన్నకి ఫోన్ చేస్తా"
ట్రింగ్ ట్రింగ్
"ఏంటమ్మాయ్!! ఏంటి సంగతి?"
ఇంతలో పిల్ల లేచి ఏడుపు లంకించుకుంది.
"బాబూ మీవాడితో నావల్లకాదు"
"ఏమి"
"వాడికి తలుపు తీస్కోడం వచ్చింది. ఆ చైన్ లాక్ తీసి పక్కింటికెళ్ళిపొయ్యాడు"
"వాట్$#$‌ఊ%&*&‌* ఎలా?"
"ఇలా"
"గాడ్!! వస్తున్నా"
ఇంటికి వెళ్ళి "ఏరా" అని నిలదీస్తే
"అవును నాన్నా, టెన్షన్ పడకూ (ఈ మధ్య నేను, హరి అనే ప్రతీ మాటని వాడు నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఠకా మని పట్టేస్తున్నాడూ కొన్ని కొన్ని మాటలు. అలాంటి వాటిల్లో ఇదొకటి. అలానే, అబ్బ అబ్బ అబ్బ ఏం డ్యాన్సు తాటతీసాడు, కొంపలేమి మునగవ్, ఓరినీ ఎన్కమ్మా లాంటివి కొన్ని) నువ్వు లేవు. అమ్మ బేబీని పడుకోబెడ్తోందా. అందుకే, బయటకి వెళ్ళా"
"తప్పునాన్నా అలా వెళ్ళకూడదు"
"కాదునాన్నా. నువ్వు ఎక్కడ ఉన్నావో అని చూస్తున్నా అంతే"
"ఒరేయ్!! బయట బూచోళ్ళుంటారు నాన్నా..వెళ్ళకమ్మా"
"సరే"
.. అపార్ట్మెంట్ ల్యాండ్లార్డ్ తో చెప్పి చైన్ అందకుండ పైకి పెట్టించా.

ఈలోపు - పాటియో డోర్ ఓపెన్ చేస్కుని వెనక్కి వెళ్ళటం మొదలైంది.
దాన్ని, ఎలా ముయ్యాలో అర్ధంకాక, ఒక చెక్కముక్కని డోర్ కి అడ్డం పెట్టి, కాలితో గట్టిగా నొక్కా రాకుండా వాడికి. ఇంకో రోజు మళ్ళీ ప్రయత్నం చేసాడు పాటియో డోర్ తీద్దాం అని. రాలేదు. వాడికి అర్ధం అయ్యింది కర్ర అడ్డం ఉందని.
అంత కష్టపడి నేను కాలితో నిక్కిమరీ చెక్కముక్క పెడితే మొన్న, తను పిల్లని బెడ్రూంలోకి తీస్కెళ్ళంగనే పాటియో డోర్ దగ్గరకొచ్చి, ఆ చెక్కని ఒంటి చేత్తో ఇలా అనేసి, తీసేసి పక్కన పడేసి, తుర్రున బయటకి వెళ్ళి పక్కనోళ్ళింటికెళ్ళి, హాయ్ చెప్పి, నేను వావ్ వావ్ వబ్జీ చూడాలి అని చెప్పి మళ్ళీ వెనక్కొచ్చి, పాటియో తలుపేసేసి, చెక్క ముక్క గట్టిగా నొక్కి మరీ పెట్టి ఏమీ ఎరగనట్టు సోఫాలో కూర్చుని వబ్జీ చూస్తున్నాడు. ఈ శబ్దాలకి వాళ్ళమ్మ వచ్చి అడిగితే అవును వెళ్ళొచ్చా అంటాడు. ఇలా కాదని, సోఫా అడ్డం పెట్టాం. వాడూతక్కువోడా, సోఫా ఎక్కి, సోఫాకి, పాటియో డోర్ కి మధ్యనున్న సందులోంచి నెమ్మదిగా జారి ఆ కర్ర ని తీసేసి తుర్రుమన్నాడు.

నిన్న మధ్యాహ్నం
సమయం మూడున్నర
హరి పిల్లని పడుకోబెట్టటానికి బెడ్రూంలో ఉంది. వాడిలో వాడె మాట్లాడుకుంటూ ప్రయత్నాలు మొదలుబెట్టాడు. హరికి అనుమానం వచ్చి బెడ్రూం డోర్ మొత్తం తియ్యకుండా ఓరగా తీసి చూస్తోంది ఏంచేస్తాడా వీడు అని -
కుర్చి లాక్కొచ్చి పైకి జరిపిన చైన్ తీయడనికి ఇలా ప్రయత్నిస్తున్నాడు. అందటంలేదు. ఫ్లాష్, నాలుగు దిండ్లు తెచ్చాడు, కుర్చీ సీటుపై పెట్టాడు. అందలేదు. డైపర్ల డబ్బా తెద్దామని చూసాడు. కుదరలేదు. కుర్చీ ఎక్కి, దానిపైనుండి డోర్ పక్కనే ఉన్న డ్రాయర్ పైకి ఎక్కుదామని ప్రయత్నిస్తుంటే, హరి వారించింది, నాయన పడితే తలకి బొక్క పడుతుంది అని.

ఇదీ కధ ..
ఇలా జరుగుతోంది.

11 comments:

  1. భాస్కర్ గారూ,

    ఎంత అద్రుష్టం.క్రిష్ణ లీలలు ప్రత్యక్షం గా ఆనందిస్తున్నారు.

    ReplyDelete
  2. బాగుంది బాగుంది :)

    ReplyDelete
  3. అచ్చం అయ్యపోలిక, బుద్ధులు ఎక్కడికి పోతాయి :)

    ReplyDelete
  4. :) రామిరెడ్డి గారు చెప్పినట్టేనా ???

    ReplyDelete
  5. భాస్కర రామి రెడ్డి గారు చెప్పింది నిజమేనాండీ ? :) :)

    ReplyDelete
  6. అయితే మీ ఇంట్లో ఒక బుడుగు ఉన్నాడన్న మాట!

    ReplyDelete
  7. యధా పితః తథా పుత్రః

    ReplyDelete
  8. నాన్నా బాచి బాబూ...సిరి అబ్బకపోయినా జీడి అబ్బుతుందని ఊరికే అన్నారా..అనుభవించు తప్పదుమరి,మీ నాయన ఎంత ఇబ్బంది పడ్డారో కదా నీతో...ఇదీ అంతే తప్పదు మరి...

    ReplyDelete
  9. ఆ వయసులో మీ లీలలన్నీ కూడా రాయాలని 'సూరిబాబు అభిమాన సంఘం' తరపున డిమాండ్ చేస్తున్నా..

    ReplyDelete
  10. మా అనుభవాలని మీ రాతల్లో చూసుకుని బాధ/భయపడుతున్నాం.
    http://www.safeandsecurebaby.com/images/T/t_16395.jpg
    గత నాలుగు నెలలుగా ఆ లాక్ వాడి సుఖపడుతున్నాం.

    ReplyDelete
  11. కామెంటు పెట్టిన అందరికీ ధన్యవాదాలు.
    రాధిక గారు - మీరు సూచించిన లింకు చాలా ఉపయోగకరంగా ఉంది. ధన్యవాదాలు

    ReplyDelete