May 1, 2009

జ్ఞాపకాల దొంతర

ఆరోజుల్లో మేము పిడుగురాళ్లలో ఉండేవాళ్లం.
మా ఇల్లు, మేము కట్టుకున్నప్పుడు, ఊరి చివర. మా ఇంటికన్నా ఇంకా కిందకి ఎల్తే దచ్చినాదోళ్ల బజారు. దచ్చినాదోళ్లు అంటే ఎవురోకాదు, ఆళ్లు గిద్దలూరు అటుకాడ్నించి ఇక్కడకొచ్చి స్తిరపడినోళ్లన్న మాట. ఈళ్లు ఇసుక తోలటం, బండ్లు కట్టటం, ఇటుకలు తోలటం ఇట్టాంటి పన్లు సేస్తుండేఓళ్లు.
మా ఇంటికి ముంగట అంబంమ్మగారి ఇల్లు. మా అమ్మకన్నా పెద్దామే ఆమె. ఓ చాలా పెద్ద సంతానం వాళ్లది. వాళ్లబ్బాయి పెసాదు నా సహవాసగాడే. విచిత్రంగా వాళ్ళింట్లో ఇద్దరు ప్రసాదులు. అంబంమ్మగారి పెద్దకొడుకూ ప్రసాదే, మూడూవాడూ ప్రసాదే. మా ఇంటికి ఇటైపు బి.జి.కే మాష్టారు గారి ఇల్లు. అటువైపు ఓ వీధి. ఆనుకుని ఎవురిదో ఇల్లు. తెల్సినోల్లే. గుర్తుకురావట్ల. వాళ్ల ఇంటి ముందు పాలుపోసే గంగమ్మ ఇల్లు. వాళ్లింటికి అటైపు మేస్త్రి కోటేశ్వర్రావ్ ఇల్లు. మా ఇల్లు కట్టింది కోటేశ్వర్రావే.
బి.జి.కె మాష్టారు గారి పెద్దపిల్లోడు, నేను, పెసాదు, మా అన్న, అందరం కల్సి బడికెళ్ళేవాళ్లం. అర పర్లాంగు మా బడి మాఇంటికాడ్నుండి. మా ఇంటికాడ్నుండి లంబాడోళ్ల బజారు ఎనకమాలగా ఎల్తే పల్నాటి రోడ్డు దాటితే మా బడే. మా బడిని తండా బడి అనేవోళ్లం. ఎందుకంటే ఆ బళ్ళో లంబాడోళ్ళు ఎక్కువ సదివేవోళ్లు. ఆ బడికి స్థలం ఇచ్చిందిగూడా లంబాడోళ్లే. అది ఆం.ప్ర. ప్రాధమికోన్నత పాఠశాల మరియూ సాఘీక సంక్షేమ హాస్టలు. అన్నీ ఒకే కాంపౌండులో ఉండేవి.
ఒకానొక కాలంలో అది ఓ స్మశానం అని అనుకుండేఓళ్లు. రాత్రిళ్లు బావి గిలకలు గిర్రున ఆటంతటవే తిరుగుతుంటాయ్ అనిచెప్పుకునేఓళ్లు. నేనెప్పుడూ చూళ్ళా.
బడి ఎనకమాలె రైలుకట్ట. అప్పుడప్పుడు ఎళ్ళే వాళ్ళం. రాయిపూజ సేస్కుని వచ్చేవాళ్ళం. ఇప్పటికీ పిడుగురాళ్ళొచ్చిందని ఎమ్మటే జెప్పొచ్చు రైలు బండ్లో ఎళతా. అంత కంపు మరి.
అప్పుడప్పుడు సచ్చి రెండుముక్కలై తెగిపడిన శవాలు కనిపించేయి, కుక్కలు పాపం దెగ్గరికెళ్దమా వొద్దా అని సూత్తాకూసుండేయి. రాబందులు వచ్చి, ఎవుడోకడు కొంచెం బొక్క పెట్టకపోతడా తినక పోతమా అని ఆసగా సూత్తా ఉండేయి. పట్టలకటైపు లంబాడోళ్లే ఉండేఓళ్లు.
మా బడికి ముంగట పిడుగురాళ్ల మొత్తానికి ఒకేఒక పెట్రోలు పంపు. దాని పక్కనే పుడ్డుకార్పోరేసనోల్ల గిడ్డంగి. మాకు మద్దానం భోజన పతకం కింద, పొద్దున టిపినీ కింద కావాల్సిన గోధుమలు, బియ్యం, పాలపిండి ఆడినుండె తెచ్చేవోళ్లు.
నేను ఒకటో తరగతి, మా అన్నయ్య నాలుగు. నేబొయ్యి అన్న పక్కన కూర్చుండేవోణ్ని. ఒకటి తరగతి కాడ్నుండి నాలుగు దాకా ఓ పెద్ద పాక. రాంసోవిగారని ఓ మాష్టారు ఉండేవాళ్లు. ఆయన హిందీ మాష్టారు. ఆయన బెత్తంతో తిరుగుతా ఉండేవోళ్లు ఎప్పుడు. ఛటక్ మని ఒక్కటేసేవోళ్లు. నా కాడకొచ్చి నాలుగేసి మళ్లీ ఒకటో కల్లాసులో కూర్చోబెట్టేవోళ్ళు.
మాకు అప్పట్లో బడికి ఓ పలక, బలపం, ఓ బొక్కు. అంతే. ఓ గుడ్డ సంచిలో ఏస్కుని సంచి నెత్తికిబెట్టుకుని ఎళ్ళేవాళ్ళం.
నాకు గుర్తున్నంతకాలం దాసినేని ఆంజనేయులు మాష్టారు హెడ్మాష్టారుగా చేసేవోళ్ళు. ఆయన కొడుకు, ఆయన అన్న కొడుకులూ అందరూ మా బడే.
బడి అవ్వంగనే ఇంటికొచ్చి, బయటనుంచి బడిసంచీని ఇంటోకి ఇస్సిరినూకి పరుగో పరుగు ఆటలకి. మోకాళ్ల పైనదాకా మట్టికొట్టుకుపొయ్యిందాకా ఆ ఉప్పుదువ్వలోపడి ఏందో ఆటలు, దొంగా పోలీసు, ఉడుం, అదీ ఇదీ, కుందుళ్లు, వంగుళ్ళూ దూకుళ్ళు ఎన్ని ఆటలు ఇంకా బెచ్చలు, ఓకులు, ఆడీ ఆడీ మా నాయన ఇంటికికొచ్చేదాకా ఆడుడె. మా నాయన సైకిలుమీన వచ్చినాక అప్పుడు ఓ నాలుగు బక్కెట్లు నీళ్లుపోస్కుని, పొట్టనిండా తిని పడుకుంటే, కళ్లు మూసి తెర్సే సరికి తెల్లారిపొయ్యిఉండేది.
దచ్చనాదోళ్ల బజారు దాటితే పొలాలే. బడిలేనప్పుడు బైలుకి అటుబొయ్యే వాళ్ళం. నాలుగు సేలు దాటితే బుగ్గోగు. ఆడకి పొయ్యి కార్యలు కరామత్తులు కానిచ్చి బుగ్గగులో కడుక్కొని, కొంచెంసేపు ఈత కొట్టి, అక్కడ పెద్ద పెద్ద కప్పలు కనబడితే ఆటిని పట్టి, బురదపావులు కనపడితే రాళ్ళేసికొట్టి అట్టా ఓ గంట అట్టా అట్టా ఆడినాక ఇంటికొచ్చేతలికి మా నాయన నాలుగు ఉతుకులు ఉతికుతుండేవోడు.
ఓ రాజు పాలుపోసే గంగమ్మ వాళ్ళ పంది పక్కనున్న బావిలో పడింది. ఆ బాయికి సుట్టూతా గట్టు ఉండేది కాదు. మొత్తానికి కష్టపడి తీసిన్రు. ఓరోజున ఎద్దు పడింది ఆ బావిలో. గోల గోల. పెద్ద ఎద్దు. పెద్ద బండిలాగేది. సానా పెద్దది. ఓ మూడు నాలుగొందల కిలోల బరువు ఉండిద్దా? మొత్తానికి ఓ పదిమంది మోకులు గట్రా తెచ్చిన్రు. పెద్ద బాయి అది. దిగుడు బాయి కాదుగానీ, అడుగు లోతుకి ఒక సప్టా బండా ఉండింది దిగటానికి. బావిలోనికి దిగటానికిబోతే పొడిసిద్దిగా మరి. అందుకని, దానికి అందనంతకాదికి దిగి, అటొకళ్ళు, ఇటొకళ్ళు, ముల్లుగర్రలు పైనించి లోనకిస్రినూకితే ఆ దిగినోళ్ళు ఆటినిపట్టి, ఆటికి ఎనకమాల సన్నతాడుకట్టి ఇటునుండటుకేసి మొత్తానికి సన్నతాళ్ళ సివర్లు మోకులకి కట్టి ఎట్టానో మొంగటి కాళ్ళకి ఎనకమాల కాళ్లకి కట్టి ఎట్టనో బయటికీడ్చిన్రు. బయటపడంగనే కుమ్మటానికి కురికింది. తప్పించుకున్నరు జనాలు మొత్తానికి. అప్పుడు అనుకుంటుండే ఇన్నా బాయి బలిగోరిందీ అని.
ఓ రోజున గంగమ్మ వాళ్ళకి చెందినోళ్ళు ఎవరో పొయిన్రు. అప్పుడు నా జీవితంలో మొట్టమొసటిసారి ఒక వాయిద్యం చూసా. అదే మొదటిసారి, చివరి సారి కూడా. ఓ నలుగురైదుగురు వచ్చిన్రు తప్పెట ఇంకేవో వాయిద్యాలతో, ఒకాయన మాత్రం ఒక విచిత్రమైన వాయిద్యంతో వచ్చాడు. ఇప్పుడు గుర్తుతెచ్చుకుంటే అది సరిగ్గా బ్యాగ్పైపర్ లా ఉండిందది.
అంబంమ్మ గారి ఇంటికి ఎనకమాల కూసింత అటుగా ఓ పెద్ద డాబా ఇల్లు. సానా పెద్దది. ఐతే ఆఇంట్ల ఎవుళ్ళూ ఉండేవోళ్ళు కాదు. దానికి దయ్యాల కొంప అనేవోళ్ళు ఎందుకో.
మా బడికాడానుండి ఇంకా పైకిపోతే రైల్వే గేటు. గేటూ పక్కనే ఓ గేటుమడిసి గది. ఏందేందో ఉండేయి ఆ గదిలో దానికి ఎనకమాల ఇంకొంచెం అటుగా ఎల్తే ముగ్గుమిల్లు.
అప్పుడప్పుడు ముగ్గుమిల్లుకు రాయెత్తకొచ్చే కోరీలకాడికి పొయ్యేవాళ్ళం. లోనికి దిగటానికి దారిలా ఉండేది ఒక్కో కోరీ. తవ్వుకుంటాపోతారా, ఆ తొవ్విన గోడలెమ్మటి సూస్కుంటా ఎల్తే మెత్తని రాయి దొరికేది. దాన్నే బలపం అంనేవోళ్ళం. అట్టాంటివి తెచ్చి, ఓ అరగదీసి సేతిలో పట్టేలా జేస్కుని బొక్కుల సంచీలో ఏస్కునేఓళ్ళం. అస్సలు రరాయిలేకుండా ఉండే బలపాన్ని తేనెబలపం అనేఓళ్ళం. తేనెలా రాసుద్ది ఆ బలపం. పలకలు ఆయాల్టిరోజున మట్టి పలకలు. నీళ్ళుపెట్టి కడిగితే పలక సల్లగా ఉండేది.
పట్టాలెమ్మటి ముందుకిబోతే ఎర్రోగు (ఎర్రవాగు) బ్రిడ్జీ వొచ్చేది. జారిపడకుండా సిన్నగా దిగి, ఎర్రోగులో ఆడేవోళ్ళం. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి జేరేఓళ్ళం. ఎందుకంటే ఆ బ్రిడ్జి ఎమ్మటి ఉండే తాడిసెట్లమీన కొరివిదయ్యాలు ఉండేవని ఒకళ్ళ ఎమ్మటబడినై అని చెప్పుకునేఓళ్ళు. రాత్రిళ్ళు పట్టాలు పైకి లేస్తై అని సెప్పుకునేఓళ్ళు.
(......మిగతాది తర్వాత)

9 comments:

 1. గుడ్. బాగున్నాయండి మీ ఙ్నాపకాలు. ఇన్నాళ్ళూమీ బ్లాగులో ఉన్న "రాంసోమి" అంటే అర్ధం తెలియలా. ఏదో రోజు మిమ్మల్నే అడుగుదామనుకున్నా.

  ReplyDelete
 2. వర్ణన ఆర్టు సినిమాలో ప్రధాన కథకి తెరతీయబోయేముందు చూపించే ఉపోద్ఘాతంలా ఉంది. బావుంది. కానివ్వండి. :)

  ReplyDelete
 3. మీ చిన్ననాటి పిడుగురాళ్ల చూపించారు !

  ReplyDelete
 4. మీరుపోయి మీ అన్న పక్క నాలుగులో కూర్చోడం ...నాలుగు తగిలించుకుని వెనక్కు వెళ్ళడం ...పడి పడినవ్వాను .....అస్సలు మూడ్ బాలేదు ....మీ జ్ఞాపకాలూ ఉల్లాసపరిచాయ్......తలపులు నా భాల్యం లోకి తొంగి చూసాయి ....అన్నట్లు మీ పిడుగురాళ్ళ లోని సుగాలీలు నా కొలీగ్స్ వున్నారందోయ్ :)

  ReplyDelete
 5. చాలా బాగా వ్రాశారు.
  ముఖ్యంగా మీరు మీ యాసలో వ్రాయటం నచ్చింది.
  అందులో ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది.
  వి.ఎస్.నాయ్పాల్ "మిగ్వెల్ స్ట్రీట్" చదివినప్పుడు అందులో అతుకుల ఇంగ్లీషు ఎంత నచ్చిందో చెప్పలేను. నాకు మా శ్రీకాకుళం యాస ఇంత బాగా రాదు. వస్తేనా...అన్ని టపాలూ అందులోనే వ్రాసేదాన్ని. ప్చ్...ఏం చేస్తాం!

  ReplyDelete
 6. It was nice writing in your accent.I didn't understand the meaning of " nookatam ". tOyaTam anaa ?

  Btw, apart from boring and routine love stories, Surya, s/o Krishnan is a very nice movie. It's only for people who dont need mass entertainment kinda movies, and people who like a bit of serious movies which are close to real life !

  I'm sure you'll love that movie.watch it here : http://video.google.com/googleplayer.swf?docid=2730069929955483788&hl=en&fs=true

  ReplyDelete
 7. సిరిపురం హైస్కూలు, చింతలతొపులో బడెగ్గొట్టి మేము ఆడిన ఆటలు, పెద్దకాలవలొ ఈత ఒక్కసారిగా గుర్తొచ్చాయ్.

  ఆ రోజుల్ని ఒక్క సారిగా గుర్తుకుతెచ్చింది మీ టపా.

  ReplyDelete
 8. సునీత గారూ - రాంసోవికి మా రామస్వామి మాష్టారు గారికీ ఏ మాత్రం సంబంధంలేదు. రంసోవి అనేది ఒకానొక జాతి వాళ్ళ ఊతపదం. వాళ్ళు ఏందిరా, నువ్వేమైనా రుస్తుం రాంసోవి అనుకుంటున్నవా? అనే వాళ్ళు. అలా వచ్చి అతుక్కుంది ఆ పదం నాకు.
  ఉమాశంకర్ - :)
  శ్రావ్యా - :):)
  భవాని గారూ - యాస, మాడలీకం అనేది ఓ పెద్ద ఇదేం కాదు. మీరూ ఆలోచించి చూడండి...రాయగలరు
  @శ్రీ గారు - నూకు - అనగా ఓ చాలా అర్ధాలు ఉన్నాయ్ ఆపదానికి, సందర్భాన్ని పట్టి వాడచ్చు. నూకు అనగా కొట్టు - జెల్లకాయ కొట్టు అనుకోవచ్చు, నూకటం కొట్టెయ్యడం అనగా దొంగతనం అనుకోవచ్చు, విసరికొట్టడం,నెట్టుట,తోయుట అనికూడా అనుకోవచ్చు.
  @అమర్ - :):) సిర్పారం..

  ReplyDelete
 9. hai chinnappati piduguralla gnaapakaalu guthu chesaaru bagundi, thank you

  anjalipriya

  ReplyDelete