Sep 29, 2010

మరో నాలుగొందల ఎకరాలు మింగొద్దు. మా బతుకులు కొట్టద్దు.



సాగర్‌ వద్ద భారీ ఉద్యానం
వచ్చే ఏడాది 'విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌'!
రూ.1500 కోట్ల పెట్టుబడులకు ఆహ్వానం: సీఎం రోశయ్య
నేడు కొత్త పర్యాటక విధానం ప్రకటన
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
ర్యాటక రంగంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.1500 కోట్ల పెట్టుబడులు ఆహ్వానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచనున్నట్లు పేర్కొన్నారు. కొత్త పర్యాటక తుది విధానానికి ఆదివారం ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. దీనిని సోమవారం అధికారికంగా విడుదల చేయనున్నారు. పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీప్రసాద్‌, పర్యాటక కార్యదర్శి జయేష్‌ రంజన్‌లతో సీఎం సమీక్ష నిర్వహించారు. పర్యాటక ప్రోత్సాహం, భారీగా ఉపాధి అవకాశాలతో కూడిన ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. సాహస, తీర్థయాత్ర, సముద్ర తీర పర్యాటక ప్రోత్సాహంతోపాటు, జాతీయ, అంతర్జాతీయ యాత్రికులను ఆకర్షించేందుకు వచ్చే ఏడాదిని 'విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌'గా సంవత్సరంగా జరుపుకోవాలని చెప్పారు.

మైసూరులోని 'బృందావన్‌ గార్డెన్స్‌', బెంగళూరులోని 'లాల్‌బాగ్‌' తరహాలో నాగార్జునసాగర్‌ వద్ద అతిపెద్ద ఆధునిక ఉద్యానాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికోసం అందరికీ అందుబాటులో, రవాణా సౌకర్యాలకు వీలుగా గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగులవరం గ్రామంలో 400 ఎకరాల భూమిని గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పర్యాటక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. 2009-10 ఏడాదిలో యాత్రికుల సంఖ్య విషయంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక అభివృద్ధి కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.6.5 కోట్లు పెంచామని, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.25 కోట్లు నిధులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు. జలయజ్ఞం ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా తొలి విడత కింద 13 ప్రాంతాలను ఎంపిక చేశామని తెలిపారు. వీటిలో ఎనిమిది ప్రాంతాల్లో పడవ విహారం సౌకర్యం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కడెం, కండలేరు, సోమశిల, సింగూరు, భావనాసి ప్రాజెక్టుల వద్ద ఈ ఏర్పాట్లు పూర్తయ్యాయనీ, గుండ్లకమ్మ, బ్రహ్మసాగర్‌, జమ్ములమ్మ చెరువు వద్ద పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కొత్త విధానం అమల్లోకి వచ్చేలోగా.. గత విధానం కింద అపరిష్కృతంగా ఉన్న ప్రాజెక్టులను పరిష్కరిస్తామని వివరించారు. పుట్టపర్తి, నాగార్జున సాగర్‌ వద్ద హెలిప్యాడ్‌, హెలీ టూరిజం అభివృద్ధి చేయనున్నట్లు గీతారెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్‌ వద్ద హెలీపోర్టు ఏర్పాటుకు ఇప్పటికే ఫ్త్లెటెక్‌ ఏవియేషన్‌ ఆసక్తి చూపుతోందని, పుట్టపర్తి వద్ద లేపాక్షి ఫౌండేషన్‌ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వివరించారు. సదరన్‌ స్ల్పెండర్‌ పర్యాటక రైలు ప్రాజెక్టు సమస్యలపై కేంద్రంతో చర్చించనున్నట్లు తెలిపారు. సమీక్ష సమావేశం వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.


ముఖ్యమంత్రి మరియూ బృందం గార్లూ

మా మానాన మమ్ము బతుకనివ్వండి. మాకే ఉద్యానాలు వద్దూ, పర్యాటకాలు క్రిమికీటకాలూ వద్దు. సత్తెనపల్లి నుండి మాసెర్ల వరకూ ఒక్కటంటే ఒక్కటి ట్రౌమా సెంటర్, ప్రత్యేక మెడిసిన్ విభాగం, అత్యంత అవసరమైన మెడీకేర్ విభాగం, గుండెకి సంబంధించిన మెడీకేర్ విభాగం, కేన్సర్ లాంటి మహమ్మారులకు ట్రీట్మెంట్ ఇచ్చే విభాగం గల ఆశుపత్రులు ఒక్కటంటే ఒక్కటి లేదు. మోర్జంపాళ్ళో గుండె నొప్పి వస్తే బస్సులో ఏస్కుని గుంటూరు కొత్తపేటకి తెచ్చెలోపు రోగి కన్నుమూసి మరోజన్మ ఎత్తే అవకాశాలు మెండుగా పుష్కలంగా ఉన్నాయని ప్రత్యేకంగా సెప్పాల్సిన పనిల్యా. మా అద్దురుష్టమో దురద్దుష్టమో సమచ్చరం సమచ్చరం కొన్ని వేల టీయంసీల నీళ్ళు కిట్టమ్మ మోస్కెళ్ళి సమద్రంల కలిపేస్తంటే, వరదముంపుకు గురుతున్న మా ఊళ్ళకు శాశ్వత పరీష్కారం సూప్పెట్టండి సాలు. పలునాడులో జనాల ముక్యమైన పని పంటలు సేలు. మాకో వ్యవసాయ కళాశాలనివ్వండి. మా పంటనేలల్లో ఎఱువుల ఉపయోగం తక్కువసేస్కునేందుకు సేంద్రీయ ఎఱువల కర్మాగారాలను ప్రోత్సహించండి. స్తానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రోత్సాహాలు ప్రకటించండి.

మా జీవితాలు మార్చండి. మాకెందుకయ్యా ఉద్యానాలు ఉద్యానవనాలు, ఆ పేరు సెప్పి రియల్ ఎస్టేటు ధరలు పెంచటానికా? పొలాలు అమ్మించటానికా? పండే భూమిని తగ్గించటానికా? బువ్వకి పనికిరాని ఉద్యానం మాకెందుకయ్యా. పొట్ట నిండినప్పుడు మేమే ఏర్పటు సేస్కుంటాం ఇంటికో ఉద్యానం. మరో నాలుగొందల ఎకరాలు మింగొద్దు. మా బతుకులు కొట్టద్దు.

ఇందులో కొత్త ఉద్యోగావకాశాల మాటా ఎలా ఉన్యా, సెట్లు పుట్టలెమ్మట తిరిగే ప్రేవజంటలకు సువర్ణావకాశం కలిగించినట్టౌద్ది. అవసరమా? సెట్టు పుట్టలసాటున సాగించే కార్యక్రమాలకి ఇంత తగలెట్టటం అవసరమా అద్దెచ్చా?

7 comments:

  1. తెలంగాణా వాళ్లను దోచి, తన సీమాంధ్ర మొగుడు గారుకు వత్తాసుగా గీతా రెడ్డి, గుంటూరు జిల్లా వాడినని చెప్పుకొని తిరిగే కాశయ్య కుట్రల ఫలితంగా, 400 ఎకరాల సుందర ఉద్యానవనాన్ని ఆంధ్రప్రాంతానికి తరలిస్తుంటే మీరేమిటి ఇలా అంటారూ?

    ఇదో పాయింటు గా , రెపో ఎల్లుండో దొర& కంపెనీ ఓ రాస్తోరోక్కో కూడా ఇప్పటికే ప్లాన్ చేస్తూ ఉంటే, మీరు వాళ్లకు పాయంటు ఇవ్వకూడదన్న కుట్రే నాకు ఈ టపాలో కనిపిస్తుంది :))

    ReplyDelete
  2. "పలునాడులో జనాల ముక్యమైన పని పంటలు సేలు. మాకో వ్యవసాయ కళాశాలనివ్వండి. మా పంటనేలల్లో ఎఱువుల ఉపయోగం తక్కువసేస్కునేందుకు సేంద్రీయ ఎఱువల కర్మాగారాలను ప్రోత్సహించండి. స్తానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రోత్సాహాలు ప్రకటించండి."
    నువ్వేంది సోదరా! ఇట్లా అంటావు ఇప్పటికే రైతులకు ఎన్నో పెద్ద పీటలేసిండ్లా,కూకోండి దాండ్లలో.

    ReplyDelete
  3. పలనాడులో వగసాయం గూడా చేస్తారా, నేనింకా తెలంగాణాని దోచుకోటానికి కొత్త ప్రణాళికలు రచించటంలో ప్రజలంతా మూకుమ్మడిగా బిజీగా ఉంటారే అనుకున్నానే. :-)

    Anyhow, first see where are those 400 acrs, are they presently under private ownership? or public ownership?

    ReplyDelete
  4. కృష్ణ :):) ఔనౌను...రాస్తారోకో సెయ్యాల్సింది.
    బిజయ్ అన్నా - రైతులకు ఎన్నో పెద్ద పీటలేసిండ్లా,కూకోండి దాండ్లలో. నిజవే..కూకుంటే సీలలు గుచ్చుకున్టళ్ళా....
    కిరణ్ గారూ -
    >>పలనాడులో వగసాయం గూడా చేస్తారా
    మీరు పలునాడు యాడుందనుకుంటన్నారు, బెజవాళ్ళోనో ఈస్టు వెస్టుల్లో అనుకుంటన్నారా? పలనాడు నల్లగొండ గుంటూరు మద్దిన ఉందండీ..బిక్కు బిక్కు మనుకున్టా. యగసాయవే సేసేది. బాంబులు సేయటంగూడకా వచ్చుద్ది. అది ఏరే ఇషయం..

    ReplyDelete
  5. Thats a good proposal.
    Let new(future) world class capital for Andhraseema be built there with wide roads and good city plan, leaving old cities Tirupati/ Kurnool/ Vizag/ Vijayawada /Rajamundry.

    ReplyDelete
  6. valid point..ఒక్కటంటే ఒక్కటి ట్రౌమా సెంటర్, ప్రత్యేక మెడిసిన్ విభాగం, అత్యంత అవసరమైన మెడీకేర్ విభాగం, గుండెకి సంబంధించిన మెడీకేర్ విభాగం, కేన్సర్ లాంటి మహమ్మారులకు ట్రీట్మెంట్ ఇచ్చే విభాగం గల ఆశుపత్రులు ఒక్కటంటే ఒక్కటి must be need .

    ReplyDelete