May 24, 2010

తెర వెనుక కథలు కొన్ని

నేనీ ఊరు వచ్చిన కొత్తల్లో, వచ్చిన మరుసటివారాంతానికి గుడికెళ్ళా. వారాంతంకావటంతో మధ్యాహ్నం కాస్త రద్దీ తక్కువగా ఉంటం వల్ల, శ్రీ శ్రీనివాసాచార్యులవారితో సంభాషించా. మనకి, ఎవరైన పొరపాటున చేయెత్తితే చాలు కదా, మట్టాటమే. మాటలమధ్యలో అబ్బాయి ఇలా సుదర్శన యజ్ఞం చేయనున్నాం. నువ్వూ పాల్గొను అన్నారు. దాందేముందీ అన్నాను. అలాక్కాదు అబ్బాయీ, నువ్వూ ఓ ఋత్విక్కులా పాల్గొనాలీ అన్నారు. సరే అన్నాను.
ఈ క్రతువుకి సరిగ్గా నెలముందర నుండి మెయిల్స్ రావటం మొదలైంది. శుక్రవారం సాయంత్రం గుళ్ళో పలానా పాఠం ఉంది తప్పక రావలెను అని. మనం వెళ్ళాలేకపొయ్యాం. అలా జరిగాక, చివరి వారం మాత్రం వెళ్ళా. పంచ సూక్తాలు నేర్పించారు అప్పటికే. శాంతిమంత్రాలు అయ్యాయి. ఉపనిషత్తులు అయ్యాయి. మనం చివరి వరుసలోజేరి మొత్తానికి కొన్ని కొన్ని పట్టగలిగాం. మరే, పల్నాడుకదా మరి.
ఇక ఫ్లిప్ సైడ్ అనగా నాణేనికి రెండోవైపు. కొందరు ఆడవాళ్ళు, గుడిమొత్తం ముగ్గులు పెట్టారు. చక్కగా రంగులతో ఆ రంగవల్లుల్ని అలంకరించారు.
చివరిరోజు మినహాయించి, మిగిలిన తొమ్మిదిరోజులూ, ఋత్విక్కులకే కాకుండా, ప్రేక్షకవీక్షకులందరికీ ఉచితంగా భోజనప్రసాదాదులు అందించారు. సామాన్యమా? రోజుకి కనీసం ముఫైమంది ఋత్విక్కులుంటే, చూడవిచ్చేచిన వారు కనీసం వందమంది. హీనపక్షం రోజుకి రెండువందల మందికి ఉచితంగా అన్నపానీయాలు. ఆదివారం వేంచేసిన జనప్రభంజనం రెండువేలపైమాటే. అంతమందికి భోజనం అందించటం ఒక ఎత్తు. ఆకార్యక్రమాన్ని మేనేజ్ చేయటం ఒక ఎత్తు.

మొట్టమొదటి రోజున విపరీతమైన గాలి. ఎలారా బాబూ అనుకున్నామా. మొత్తానికి పట్టలు పట్టుకుని నిల్చుని కానిచ్చామా. రెండోరోజుకల్లా ఓ మినీ డేరా వేయించారు.
హోమం ఆసాంతం దానిపై ఓకన్ను వేసి ఉంచాలా?
ఇక, ఇవి చూడండి
మొన్నటిపోస్టులో చెప్పినట్టు 100అడుగులు x 100 అడుగులు డేరా వేయటం అంటే మాటలా? అమెరికాలో అంత పెద్ద డేరాలు లేవు. రెంటిని కలిపి వేయించారు. దానికి ఒకతను లీడ్ తీస్కుని, నాలుగు చోట్ల తిరిగి మాంచి కోట్ తెచ్చి, ఓకే చేసి వేయించటం సామాన్యమా?
సరే డేరా వేసినా. రెంటిని కలపటంవల్ల, మధ్యలో జాయింటువద్ద నీరు లోనికి కారుతుందా? అందుకని అక్కడ, ఓ జాయింటు వేయించి, దానికి నీళ్ళు వెళ్ళే ఓ పైపు కట్టించి, ఎంతపెద్ద వాన్న పడ్డా ఆ ఔట్లెట్ ద్వారా నీళ్ళు చుక్క కిందపడకుండా పైపు మార్గం ద్వారా వెళ్ళే ఏర్పాటు చేసారు.
ఇక, పార్కింగ్ - మొత్తం మీద రెండువేల పైచిలుకు జనాలు వచ్చారు. ఎక్కడ పెట్టాలి కార్లు? ఎక్కడో ఓ బళ్ళోనో పార్కులోనో పార్కింగు ఏర్పాటు చేసి బస్సు షెటిల్ పెట్టించారు.
తర్వాత - ఒకతను, దేశం నుండి మల్లెపూలు పంపించాడు. నమ్మగలరా? నీట్ గా ప్యాక్ చేసి పాడు కాకుండా, మల్లెలు పంపించాడు.

మరి ౧౦౮ మంది ఋత్విక్కులండీ. అందరికీ పసుపు పంచెలు పసుపు ఉత్తరీయాలు. వాటిని ఒకతను స్పాన్సర్ చేసాడు.
౧౦౮ ఋత్విక్కులకి నూతన యజ్ఞోపవీతాలు. ఒకతను తెప్పించాడు.

స్రుక్కులు స్రువాలు - ఒక్కో ఋత్విక్కుకు రెండు కావాల్సొస్తాయి. స్రుక్కులు స్రువాల షేపు శాస్త్రోక్తంగా ఐతే ఒకటి గుండ్రంగా చిప్పగంటెలాగా ఉంటే ఇంకోటి నక్షత్రాకారంలో ఉండాలి. అవి ౨౧౬ చేయించాలంటే? వెళ్ళి హోం డిపో లోనో అడిగితే వాడు ఆస్థులు అమ్ముకురండీ అన్నాట్ట. మరెలా? వాల్మార్ట్లో చెక్క చెంచాలు చూసారట. శ్రీ శ్రీనివాసాచార్యులవారు అవి పనికిరావు కానీ ప్రత్యామ్న్యాయం లేదు కాబట్టి తప్పదు అని ఒప్పేస్కున్నారట. సరే, అంతవరకూ బానే ఉంది. మరి 216 కావాలా? వాల్మార్ట్ వాడు, సాధారణంగా మేము నెలకి ఓ పది అమ్ముతామేమో. మీకు ఇన్ని ఎందుకూ అని అడిగాట్ట. మొత్తానికి ఒక వాల్మార్టులో ఊడ్చారు. పది దొరికాయి. చుట్టుపక్కల వాల్మార్టుల్లో ఊడ్చారు ఇంకో ఇరవై దొరికాయి. అదేపనిగా వందమైళ్ళ రేడియస్సులో సాధ్యమైనన్ని వాల్మార్టులను జల్లెడపట్టి తెస్తే కొందరు అర్కానస్ దాకా వెళ్ళి మొత్తానికి సాధించుకొచ్చారట.
యజ్ఞకుండం - దెంతోచేసారూ? అల్యూమినియం ట్రేలో ఇసుకబోసి, నాలుగు ఇటుకరాళ్ళి పెట్టారు. అరె, ఏముందీ అనుకుంటున్నారా? ప్రతీ ఇటుకకూ పసుపు పూసారు. ఏముందీ అంటారా? ప్రతీ ఇటుకపై ముగ్గు వేసారండీ. ప్రతీ యజ్ఞకుండమ్లో సూర్యుని ప్రతిమనుంచారు. దానిపై కూడా ముగ్గు వేసారు. 108 కుండాలు. 4 ఇటుకలు ఒక్కో కుండానికి. 432 ఇటుకలకు పసుపు పూసి ముగ్గులేసి!!! ఒక్కో ట్రేని మూడు ఇటుకలపై పెట్టాం. 108 స్థానాల్లో మూడు మూడు ఇటుకలు అమర్చటం.
ఇక యజ్ఞకుండం ట్రేపై, నాలుగు మూలలా నాలుగు కొబ్బరి చిప్పలు. కుండంలో ఓ కొబ్బరి చిప్ప, అందులో కర్పూరం బిళ్ళ. మిగతా నాలుగింటిలో ఒకదాన్లో ఓ నాంణెం, ఇంకోదాంట్లో ఖర్జూరం, ఇంకోదాంట్లో వక్కలు. ఇంకోదాంట్లో మరింకేదో. మొత్తానికి ఐదు చిప్పలు * ౧౦౮ 540 చిప్పలు. ఏంచెసారో తెలుసా. ఒకతను అక్కడ ఇక్కడా వెతికి ఆర్డర్ ఇచ్చాట్ట. ఒకతను దేశీ కొట్లు తిరిగి పట్టుకొచ్చాట్ట.
ఇక ౧౦౮ కుండాలలో అగ్నికార్యం చెయ్యాలంటే, ఎన్ని సమిధలు కావాలి, అదీ రెండున్నర గంటల కార్యక్రమం. పొగ రాకుండా మళ్ళీ రా చేయకుండా, అలా అగ్ని నిలవాలంటే ఎంత ఎండువై ఉండాలి? అంత చిన్న అగ్నికుడంలో పట్టాలంటే ఎంతచిన్న చిన్న సమిధలై ఉండాలి? ముఖ్యంగా ఎన్ని డబ్బాల నెయ్యి కావాలంటారూ? అదీ దేశవాళీ శుద్ధ ఆర్ఘ్యం. స్థానిక కాస్ట్కో వాడివద్ద మన శుద్ధ నెయ్యి దొరుకుతుందట. వెళ్ళారు, అయ్యా ఓ నాలుగు డబ్బాలు. ఇంతనెయ్యి మీకెందుకూ అన్నాట్ట. మాకు నలభై డబ్బాలు కావాలంటే గుచ్చి గుచ్చి అడిగాట్ట. మొత్తానికి వాడికి అర్ధమైయ్యెలా చెప్పేసరికి పిలకలో ప్రాణం గోచీలోకొచ్చిందట.
మరి యజమానులకి ఒక కలశం, ఋత్విక్కుకో కలసం. ౨౧౬. వాటిల్లో ఋత్విక్కులకిచ్చేవి ఓ పళ్ళెంపై పెట్టి దారంతో చుట్టి ఇవ్వాలి. ౧౦౮ చెంబులకు దారం ఎవరు చుట్టారూ? పళ్ళెంపై పెట్టి నూలు చుట్టటం. యజమానులకి కొత్త కలశం. ౧౦౮ కొత్త రాగి చెంబులు.
ఇక అలంకరణ, గుళ్ళోకి వచ్చే దారిలో ఒకతను ప్లై ఉడ్ ని నెమళ్ళ ఆకారంలో కట్ చేస్తే, ఇంకొకరు చక్కగా నెమళ్ళు వేసి రంగులద్దారు.
లోపల గుడిలో ఎంత అలంకరణ. ప్రధాన మంటపం వద్ద, వేంకటేశ్వరస్వామి ఆకారం కట్ చేస్తే, చేతులు తిరిగిన ఆర్టిస్టు పైంటువేసి, రంగులద్ది నిలబెట్టారు.
ఇంతకీ ఆవేళ జరిగిన సమావేసం ఏంటంటే, ఇలా కష్టపడిన అందరినీ పేరుపేరునా ప్రశంసించటం. పేరుపేరునా వారు చేసిన సేవలకు వారిని అభినందించడం. ఈలాంటి క్రతువులు, అదీ గుళ్ళో చేసేప్పుడు, ఓ సమూహం పడే శ్రమ, వారి వెనుక నిల్చునే వ్యక్తులు, వారిని ప్రభావితం చేసే వ్యక్తులు, వారికి ఉత్సాహం కలిగించే శక్తులు ఇత్యాది వాటిని గుర్తించి ప్రశంసించటం సామాన్యం కాదు.
నాకు అత్యంత అత్భుతం అనిపించిన ఓ మాట -
భర్తలు రోజూ ఈ పనుల్లో పడి ఏ రెండింటికో మూడింటికో ఇంటికొస్తుంటే, భార్యలు సహకరించడం ఒక ఎత్తు. వాళ్ళూ ప్రతీ పనిలో ప్రతీ బాటలో తమవంతు సహాయాన్ని అందించటం ఒక ఎత్తు. అందరూ నిల్చుని మరీ భార్యామతల్లులకు జేజెలు పలకటం నాకు బగా నచ్చింది.
అలాగే పిల్లలు కూడా వారి మానాన వాడు ఆడుకుంటూ ఎక్కడా సహనానికి పరీక్షపెట్టలేదు. అదీ చెప్పికు తీరాల్సిన విషయమే.
అలానే ఇంత పెద్ద పదిరోజుల కార్యక్రమాన్ని ఒక్కచేత్తో అనుసంధానం చేసిన పూజారయ్యగారు కూడా గ్రేట్. వారికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం అందరం.
సేవకుల్లా నిలిచిన చిన్న పెద్దా పిల్ల పుడకా అందరినీ అభినందించాం.
అతి పిన్న సేవకుడు, పిల్లాడికి పన్నెండేళ్ళుంటాయేమో. బురదలో పడి, వానని లెక్క చేయకుండా, ఎంతలా పని చేసాడంటే అసమాన్యమైన సేవ చేసాడు. ఆ పిల్లాణ్ణి పిలిచిమరీ మెచ్చుకోలు అందజేసి నాలుగు వీరతాళ్ళు వేసాం అందరి హర్షాతిరేకాల మధ్యన.
అలా ఈ క్రతువుని విజయవంతం చేసిన ప్రతీ ప్రాణినీ మెచ్చుకున్నాం.
చివరగా, ప్రతీరోజూ కొలువుకెళ్తూ, సాయంత్రమవ్వగానే గుడికెళ్ళొ ఏదోక పనిని శిరస్సుపైకెత్తుకుని, విజయవంతంగా పూర్తిచేసి, ఎప్పుడూ కంప్యూటర్ పరిభాషనే జీవిన విధానంలా మరల్చుకుని తిరిగే జీవితంలో పంచసూక్తాలు రుద్రం మూల మంత్రాలు ఉపనిషత్తులు ఇత్యాది నేర్చుకునేందుకు ఉత్సుకత చూపి, పట్టుదలగా నేర్చుకుని, కనీసం పుస్తకం చూసైనా తప్పుల్లేకుండా చదవగలిగే స్థాయికి చేరుకుని, ఈ పదిరోజుల కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా విజయవంతం చెసిన నూటాఎనమండుగ్గురు ఋత్విక్కులు - హేట్సాఫ్.
వారికి ఇలా చేయగలిగేందుకు ఓర్పుతో నేర్పరితనంతో బాధ్యతగా తగు శిక్షణ ఇచ్చిన గురువర్యులు శ్రీ శ్రీనివాసాచార్యులు గారికీ హేట్సాఫ్.
నిస్వార్ధంగా చేసిన ఈ పనికి అందరకీ ఒక్కో సుదర్శన చక్రం వేసిన రాగి రక్షారేకుని ఇచ్చారు.
స్వంత డబ్బా కొంత మరి ఉండొద్దా -
నేను ఈ పదిరోజుల క్రతువుకి దాదాపు ప్రతీరోజూ వెళ్ళా. ఒక రోజు తుపాను హెచ్చరిక వల్ల వెళ్ళలెక పొయ్య. ఇంకోరోజు తీవ్రమైన తలనొప్పి వల్ల వెళ్ళలేక పొయ్యా.
పనికి వెళ్తూ, ఐదుకల్లా ఇంటికి వచ్చి, ఆరుకి మొదలయ్యే కార్యక్రమానికి అరవైమైళ్ళ దూరం ప్రయాణించి అందుకోవటం, కార్యక్రమం మొత్తం అయ్యాక ప్రసాదాలందుకుని, భుజించి, ఏ తొమ్మిదిన్నరకో పదికో తిరిగి రోడ్డున పడితే ఏ పదకుండింటికో ఇంటికిజేరి, ఆ రోజున తీసిన ఛాయాచిత్రాలతో ఓ టపా రాసి, భార్యాబిడ్లకు కాల్ చేసి కన్న తల్లిని ఓ మారు పలకరించి మంచంఎక్కేప్పటికి ఏపదకుండుంన్నరో.
ఐతే, ఏరోజూ నేను అలసిపొయ్యాను అనే భావం రాలేదు నాకు. అది కేవలం ఆ దేవుడి దయే అని నా అభిప్రాయం.

ఇది తప్పకుండా చెప్పాల్సిన మాటలు -
౧. నాలుగోరోజు, సోమవారం - ఆవేళ మహా మృత్యంజయ హోమం. వాన. హోమం మొదలు పెట్టాం వాన పెరిగింది. అందరం భక్తి శ్రద్ధలతో ఎంతో డెడికేషన్తో మృత్యంజయ మంత్రం, రుద్రం పఠిస్తుంటే వాన ఎక్కువైంది. పూర్ణాహుతి అయ్యింది, వాన మాయం.
౨. శనివారం అర్ధరాత్రి వరకూ కుఱిసిన వాన, ఆదివారం పొద్దునకల్లా మటుమాయం.

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ।
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ [శుక్లయజుర్వేదం]

శన్నో మిత్ర(శ్) శం వరుణః । శన్నో భవత్-వర్యమా । శన్న ఇంద్రో బృహస్పతిః ।
శన్నో విష్ణురు-రుక్రమః । నమో బ్రహ్మణే । నమస్తే వాయో । త్వమేవ(ప్)
ప్రత్యక్షం బ్రహ్మాసి । త్వమేవ(ప్) ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి । ఋతం
వదిష్యామి । సత్యం వదిష్యామి । తన్మా-మవతు । తద్-వక్తార-మవతు । అవతు మాం
। అవతు వక్తారం ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

సహనా వవతు । సహనౌ భునక్తు । సహ వీర్యఙ్ కరవా-వహై । తేజస్వి-నావ-ధీత-మస్తు-
మావిద్-విషావహై ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ [కృష్ణ యజుర్వేదం]

ఓం ఆప్యాయన్తు మమాఙ్గాని వాక్ప్రాణశ్చక్షుః
శ్రోత్రమథో బలమిన్ద్రియాణి చ సర్వాణి।
సర్వం బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ।
నిరాకరోదనికారణమస్త్వనికారణం మేऽస్తు।
తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తే
మయి సన్తు తే మయి సన్తు॥

ఓం శాంతిః శాంతిః శాంతిః॥ [సామవేదం]

ఓం వాజ్ మే మనసి ప్రతిష్టితా।
మనోమే వాచి ప్రతిష్ఠితా ఆవిరావీర్మ ఏధి ।
వేదస్య మ ఆణీస్థః శ్రుతం మే మా ప్రహాసీః ।
అనేనా ధీతేనా హొరత్రాస్సందథామి । అమృతం వదిష్యామి సత్యం వదిష్యామి ।
తన్మామవతు । తద్వక్తార మవతు అవతుమామ్ అవతు వక్తారమ్ ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః॥ [ఋగ్వేదం]

ఓం భద్రం కర్ణేభిః శ్రుణు యామదేవాః భద్రం పశ్వేమక్షభిర్యజత్రాః।
స్టిరై రంగై స్తుష్టువాగ్\ం సస్తమాభిః వ్యశేమ దేవహితం యదాయః ॥
స్వస్తి న ఇంద్రో వృద్ద శ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః।
స్వస్తి నస్తా న క్ష్యో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్ దధాతు ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః॥ [అధర్వణ వేదం]

5 comments:

  1. ధర్మో రక్షిత రక్షిత:!

    ReplyDelete
  2. very happy to read about this collective effort...ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తీ అదృష్టవంతుడేనండి.

    ReplyDelete
  3. వివరాలు తెలుసుకోవడం ఆనందంగా ఉంది సోదరా... పాల్గొన్న ప్రతి ఒక్కరిని తప్పకుండా అభినందించాలి. ప్రతి ఒక్కరి శ్రమని గుర్తించడం కూడా అభినందనీయం.

    ReplyDelete
  4. ఆఫీసు యజ్ఞం అందరూ చేసేదే. మానవాళి మంగళం కోసం యజ్ఞం చేసి మీరంతా ధన్యులయ్యారు. అభినందన లందుకోండి.

    ReplyDelete
  5. కార్యక్రమాన్ని అందరూ చక్కగా,సమన్వయంతో నిర్విఘ్నంగా నిర్వహించినందుకు అందరికీ వీరత్రాళ్ళు.

    ReplyDelete