May 30, 2009

ఓ వర్గం గోడు

"అన్నయ్యా!!"
"తమ్ముడూ!!"
"అన్నయ్యా! బజార్లో మనం ఇద్దరం పక్కపక్కనే ఉన్నామా, మళ్ళీ ఇక్కడ కలుసుకున్నందుకు చాలా హ్యాప్పీగా ఉంది"
"ఔను తమ్ముడూ!! నాక్కూడా. మరి రెడీయా పనికి"
"నేన్రెడీ అన్నయ్యా"
"బండబరువులు మొయ్యాలిగా. చొక్కాలు, ప్యాంటులు, డాయర్లు, బియ్యం కందిపప్పు, చెత్త చెదారం"
"ఔను అన్నయ్యా!! అంతే కాదు, మోస్తున్నప్పుడు ఇసిరిసిరి కొడ్తారా, మనం అంటే గౌరవమే ఉండదా, మళ్ళీ చలని లేదు, మంచని లేదు, వేడని లేదు ఎండని లేదు, జాలే లేదు మనమీన."
"అంతేకాదు తమ్మీ!! ప్రపంచం మొత్తం తిరుగుతామా, ఎక్కడకిపోయినా ఓ మూల ఇస్సిర్నూకుతారా. మనకంటూ మిగిలే జ్ఞాపకాలు, మొహానికి కట్టిన తెల్ల కాయితకాలు, అక్కడక్కడా సెర్మం సినిగిన బొక్కలు"
"ఓను అన్నయ్యా!! అంతేనా, ఓ ఇంటోళ్ళైనాక, యాడ్నో ఓ అటకమీనబడేస్తారా, దుమ్ము, ధూళి, మట్టి, బూజు పేరుకుపోయినా కనీసం ఒక్కసారి ఓదార్చరు, మళ్ళీ అవసరం వచ్చేదాక"
"తమ్మీ!! ఏమనిచెప్పను, మొట్టమొదట కేవలం మనతో మొదలెడతారా జీవితాన్ని. అటకెక్కించినాక ఆ అటకమీన నుండి చూత్తాఉంటే, సెత్త సెదారాలు కొంటారా, అన్నీ సామాన్లు పేరుకుపోతా ఉంటాయా, ఓరినాయనో ఈళ్ళు ఇల్లు మారితే ఇన్ని మోయాలా అని గుండెలు బదబద లాడతంటయి."
"ఏంచేస్తాం అన్నయ్యా!! మనబతుకు ఇంతే"
......
ఈ ఇద్దరు అన్నా తమ్ములు - పెద్ద వి.ఐ.పి సూట్కేసులు.
మా మిత్రుడు, ఇల్లుమారుతున్నాం, చెత్త చెదారాలు అనవసరమైన సామాన్లు ఎక్కువైనై, ఈడకి వచ్చేప్పుడు రెండు సూట్కేస్ లతో వొస్తాం, ఇంతింతై వటుడింతైలా సామాను పెరిగిపోతుంది అని మాట్లాడుకున్న సందర్భంలోంచి పుట్టిన పోస్టు ఇది.

May 29, 2009

నగదుబదిలి..

బాబు మహానాడులో మళ్ళీ "నగదు బదిలి" పధకం ఆ విధంగ ముందుకి తీస్కెళ్ళాలి అని తెలియజేస్కున్నాడు.

మొన్న వోట్ల కౌంటింగ్ జరుగుతున్నప్పుడు, టివీ9లో జరిగిన డిస్కషన్స్లో పాల్గున్న ఒకడు ఇలా ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు పక్కనున్న తెదెపా ప్రతినిధిని -
నగదు బదిలి ఎలా సాధ్యం, 20000 కోట్లు కనీసం కావాలి ఆ పధకానికి అని.
ఒక్కసారి చూద్దాం. మన రాష్ట్ర జనాభా ఈ రోజున పది కోట్లు.
నాయుడు గారి ప్రకారం,
ప్రతీ నిరుపేద బడుగు కుటుంబానికి నెలకి పదిహేను వందలు.
ప్రతీ మధ్యతరగతి కుటుంబానికి వెయ్యి నెలకి.
సగటున, మన జనాభాలో పదిశాతం మంది అట్టడుగు నిరుపేదలు ఉన్నారు అనుకుందాం. అనగా, కోటి మంది. అనగా
10000000 * 1500 = 1500 కోట్లు, నెలకి. అనగా, సంవత్సరానికి, 18000 కోట్లు.
మిగిలిన తొమ్మిది కోట్లల్లో ఐదు శాతం మధ్యతరగతి కుటుంబాలు అనుకుందాం.
అనగా 45 లక్షల మంది. అనగా 4500000 * 1000 = 450 కోట్లు. అనగా సంవత్సరానికి 5400 కోట్లు.
మొత్తానికి 23400 కోట్లు కావాల్సొస్తుంది కేవలం నగదు బదిలీకి, సంవత్సరానికి. ఇంత కేటాయించాలంటే వార్షిక బడ్జెట్ ఎలా ఉండాలో?
ఇప్పటికే, గత నాలుగు బడ్జెట్లని తీస్కుంటె దాదాపు ప్రతీ ఏడాది లక్ష కోట్లు దాదాపు (ప్లాన్డ్ మరియూ నాన్ ప్లాన్డ్ కలిపి). మరి పైన 23400 కోట్లు దేంట్లోంచి కోస్తారు, ఎక్కడ సర్దుతారు? ఎలా సర్దుతారు?
నా ప్రశ్న బాబుని ఉద్దేశించి కాదు. నా ప్రశ్న బాబు కింద ఉన్న ఎం.ఎల్.యే లకి, ఆయన వెనకున్న బిజినెస్ వర్గానికి, ఆ ఎం.ఎల్.యే లని నమ్ముకుని ఎంతోకంత ఎనకేద్దాం అనుకునే జాతికి.
కారణం -
ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నా కళ్ళ ముందు జరిగిన కధ ఇది.
ఒకానొక సంవత్సరం, తుపాను వచ్చింది. కొన్ని గుడిసెలు కూలినై. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గుడిసెలు నీళ్ళల్లో మునిగినై. వెంటనే ప్రభుత్వం సహాయ ప్యాకేజీ ప్రకటించింది. గోడకూలితే ఇంత, ఇల్లే కూలితే ఇంత, నీళ్ళు మోకాళ్ళలోతు వస్తే ఇంత యాట యాట యాట.
ఒకడు ఒక నోటుబుక్కు తీస్కుని వచ్చాడు, ఓ కుర్చీ ఏస్కుని ఓ ఇంటో కూర్చున్నాడు. రూలింగ్ పార్టీ కార్యకర్తలు వచ్చారు. ఆళ్ళకి తెల్సినోళ్ళ పేర్లు చెప్పుకున్నారు. ఏ కేటగిరీకి ఎక్కువ మొత్తం వస్తుందో దాంట్లో వాళ్ళోళ్ళ పేర్లు రాయించుకున్నారు. బయట నిజంగా ఆస్తి నష్టం ఐనోళ్ళకి ఎంగిలి చెయ్యిని విదిల్చారు. కొందరు నిజంగా ఆస్తినష్టపోయినోళ్ళకి ఇలా ప్యాకేజీ ఇస్తున్నారు అని తెలియనుకూడా తెలియదు.
ఐతే, ఈ తంతు కొత్తేమీ కాదు, ఓ పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు ఈ వ్యవహారంలో. ఏ పార్టీ రూలింగులో ఉన్నా ఈ తంతు జరిగేదే. ఇప్పుడు ఈ నగదు బదిలీ పధకం గురించి దేనికయ్యా అంటే ఇది డైరెక్ట్ క్యాష్ ఫ్లో. అభ్యర్దిల్ని ఎవరు ఎంపిక చేస్తారూ? వాళ్ళ ఆదాయాన్ని ఎవరు కొలుస్తారూ? ఏ ప్రాతిపదికన? ఒక సర్టిఫికేట్ పెడితే సరిపోతుందా, అయ్యా నా ఆదాయం నెలకి ఇంత, కావున నేను పేద బడుగుని అని. ఆ సర్టిఫికేట్ సంపాదించటం ఎంతసేపు?
మనకి కావాల్సింది పేదోడికి నెలకి పదిహేనువందలు సంపాదించుకునే ఉద్యోగం చూపించగల ప్రభుత్వం, నాయకత్వం, దార్శనీకత. అంతే కానీ వందకే నెలకి సరిపడా సరుకులు, కిలో బియ్యం రెండు రూపాయలకే, ప్రతీ పేదోడికి టీవీ, ప్రతీ మధ్యతరగతి మహిళకు నెలకి వెయ్య కాదు.

ముగింపు -
రాబోయే తరాల్లో అయినా, రాజకీయనాయకులు, అధినాయకులు, కారకులు, నిర్మాతలు - ఎవ్వరైనా -
కిలో రెండుకే ఇస్తాం కాకుండా - మన ఆర్ధిక వనరుల్ని నియంత్రించుకుంటూ, రెండురూపాయల యొక్క విలువని అంత ఎత్తుకి తీస్కెళ్ళగలిగే విప్లవాత్మక నిర్ణయాలు తీస్కోవాలని కోరుకుంటా.
వందరూపాయలకే సరుకులొచ్చే విధంగా మన ఆర్ధిక వ్యవస్థ రూపొందించాలని కోరుకుంటా.

May 28, 2009

అప్పుడప్పుడు ఇలాంటివి...

తెల్సుకుంటుండాలి..అప్పుడే మజా.
నిన్నటి నా పోస్టులో సెన్తాళుం పూవిల్ గురించి రాసా. ఆ సిరీస్ లో నా ఎలుకకి ఈ లింకు తగిలి బోర్లా పడింది.
ఇళయనిల పొళీగిరధె ఇధయం వరై ననైగిరధె
ఉలా పొగుం మేగం కణా కాణుమె విళా కాణుమె వాళమే

నా ప్లేలిస్టులో ఇదీ ఉంది. దాంట్లో ఓ పెద్ద గొప్పేముంది!! తమిళపాటలు కూడా వింటావా? ఏం పనీ పాట లేదా? అనుకోవచ్చు. సంగీతానికీ, దట్ టూ ఇళయరాజా సంగీతం వింటానికి, భాషతో పనిలేదు.
సరే ఈపాట గురించి చాలా ఇంటరెస్టింగ్ విషయాలు -
ఈ పాట వింటె టక్కున గుర్తుకొచ్చే, ఛాఛా మర్చిపోతే కదా గుర్తుకొచ్చేది, స్లీప్ మోడ్ లోంచి బయటకొచ్చే పాట
నీలె నీలె అంబర్ పర్.
ముందుగా ఇళయనిల -
చిత్రం - పయనంగళ్ ముదివతిలై
పాడినవారు - బాలసుబ్రహ్మణ్యం
సంగీతం - ఇళయరాజా
సంవత్సరం - 1982
నీలె నీలె అంబర్ పర్ -
చిత్రం - కళాకార్
సంగీతం - కళ్యాణ్ జి ఆనంది జి
పాడినవారు - కీ।శే॥ కిషోర్ కుమార్
సంవత్సరం - 1983

ఈ రెండు పాటలు ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా ఉన్నాయ్ కదా, ఎవరు ఎవరికి కాపీ అని పెద్ద పెద్ద పోట్లాటలు, వాక్యుద్ధాలు, కత్తి పోరాటాలు క్రూసేడులు జరిగైనై.

ఐతే కొందరు ఇలా తేల్చారు -
ఈ పాటకి మాత్రుక తమిళం. కల్యాణ్ జి/ ఆనంద్ జి ఈ పాటని ఇష్టపడి హిందీలోకి తీస్కుని, ప్రతిఫలంగా కస్ మే వాదే ప్యార్ వఫా సబ్ (చిత్రం - ఉపకార్) అనే పాటని ఆయనకి బహుమతిగా ఇచ్చారట. ఆపాట తమిళంలో కణవు కాణుం వళ్కై ఆగుం ( చిత్రం - నీన్గల్ కేట్టవై). మన శంకరాభరణం సోమయాజి కీ।శే॥ జె.వి సోమయాజులు ఈ పాట పాడతారు తెరపై. హిందీలో ప్రాణ్.
ఇళయనిల -

నీలె నీలె అంబర్ పర్

కణవు కాణం

కస్/మే వాదే ప్యార్ వఫా సబ్

May 27, 2009

ట్రెండ్ మార్చిన సూరిగాడు

ఈ మధ్య, కార్లో మోగే పాత యం.పి.మూడు సీడీలని మార్చా. కొత్తగా దహేలి ఆరు, రాక్ ఆన్, సిన్గ్ ఈజ్ కిన్గ్, లాంటివి మోగిస్తున్నా పిల్లల్తో బయటకెళ్ళేప్పుడు. ఇంతకముందు సూరిగాడు జల్సా పాటల్ని, షారుక్ పాట "గుంషుదా" పాటని ఎక్కువగా ఇష్టపడేవాడు. జల్సా పాటని ఇలా నెత్తిమీదరాయి పెట్టి కొట్టినట్టుందే అని హం కూడ చేసేవాడు.
ఇప్పుడు పాటలు మార్చంగనే వాడు ఇట్టే పట్టేసిన పాట "సిన్ద్బాద్ ది సైలఱ్" "సోచాహై సోచానహి తో సోచో అభి" "రాక్ ఆన్ జిందగి మిలెగి న దొబర"
సోచాహై, ఖిడికి ఖోలే జోషీలే లాంటి కొన్ని కీ మాటల్ని పట్టేసాడుకూడా!!!
బోనస్ షాక్ - నన్నా, నాకు ఎలక్ట్రిక్ గిటార్ కొనిపెట్టు. సరెలేరా అంటే నీకొస్తుందా ఎలక్ట్రిక్ గిటార్ వాయించడం? రాదమ్మ అంటే, నాకొచ్చుగా అని, నేను రాక్ స్టార్ అంటాడు. అదీ కధ.
ఏమాటకామాట - రాక్ ఆన్ పాటలు అత్భుతంగా ఉన్నాయ్. సింద్బాద్ ది సైలర్ అనే పాట అనుకుంటా ప్రపంచ టాప్ 10 లోకి వెళ్ళింది అని విన్నట్టు గుర్తు.
రాక్ ఆన్ సినిమాకి సంగీతం శంకర్ ఎహ్షాన్ లాయ్. రియల్ రాక్ సంగీతం. మనవైన ఈ పాటల్ని వినేప్పుడు నా వాల్యూంని పెంచుతా. తెల్ల నాయాళ్ళారా, మాకూ ఉన్నాయ్ రాక్ పాటలు అని.


ఈ పాటలన్నీ దాదాపు ఫరాన్ అక్తరే పాడాడు. బాగనే పాడాడు.
ఇక్కడ వినండి రాక్ ఆన్ పాటల్ని.



ఇక మా పిల్లకి ఇళయరాజా పాటలు వినకపోతే నిద్ర పట్టదు. ఇన్స్ట్రుమెంటల్ సంగీతం. అవి పెడితేనే పడుకుండేది.
వాటిల్లో నాకు ఈ పాట బాగా నచ్చింది. పాట - సెన్తాళం పూవిల్ వన్తాడుం. చిత్రం ముల్లుం మలరుం. పాడినవారు శ్రీ ఏసుదాస్.
సెంతాళం పూవిల్ వంతాడుం తెండ్రల్
ఎన్ మీదు మేడుదమ్మ
పూవాసం మేడై పోదుదమ్మ
పెణ్ణ్ పోల జాదై కాత్తుదమ్మ
అమ్మమ్మా ఆనందం
ఇక్కడ వినండి ఈ పాట బీట్ ని.

దానికోసం యూగొట్టం లో వెతికితే ఈ లంకె దొరికింది.

ఈ పాటకి ఎవ్వరికైనా అర్ధం తెలిస్తే పంచుకోండేం!!!

May 22, 2009

అలారం - వేకప్ కాల్

రుద్ర కి ఇప్పుడు ముప్పైనాలుగేళ్ళు. అతను ఎక్కడో ఒక పల్లెలో పుట్టాడు. పుట్టినప్పటినుండి చాలా ఉత్సాహంగా ఉండెవాడు. మహా హుషారుగా ఉండేవాడు. బాయిలోంచి నీళ్ళు తోట్టం, పనులు చెయ్యటం, కంపకొట్టడం. బళ్ళో చెట్లు నాటటం, ఆటికి నీళ్ళు పొయ్యటం, గంపలు గంపలు మట్టి మొయ్యటం ఇలా. కుఱ్ఱోడు మహా గట్టోడుకూడ.
తర్వాత్తర్వాత పై చదువులకి పట్నం ఎళ్ళటం. అక్కడా సైకిలు తొక్కుకుంటు కాలేజీకి ఎళ్ళటం ఇలా బాగనే ఉండేవాడు. రోజుకి తిన్నదాంట్లో బాగనే ఖర్చుపెట్టుకునేవాడు శక్తిని. ఐతే, వయసు ప్రభావం వల్ల, స్నేహాలవల్ల దమ్ముకొట్టడం మొదలెట్టాడు. అప్పుడప్పుడూ దొంగతనంగా మందుకొట్టడం మొదలెట్టాడు. అలాఅలా, వ్యాయామం నెమ్మదిగా అటకెక్కింది. చదువు అయ్యాక, ఉద్యోగప్రయత్నాలు, ఉద్యోగం తొందరగా దొరక్కపోవటం, ఇంటికి దూరంగా ఎక్కడో హైద్ లోనో బెంగలూరులోనో ఉండటం వల్ల, దమ్ముకొట్టుట, మందుతాగుట ఎక్కువయ్యాయ్. అయినా, అతను, అతనిమీద నమ్మకాన్ని కోల్పోలేదు. తను చలా గట్టి, తనకేమీ కాదూ అనుకునేవాడు. ఇక ఉద్యోగం దొరికినాక, అతన అలవాట్లు చాలా మారిపొయ్యాయ్. అంతక ముందుదాకా వారాంతానికో లేక ఎప్పుడన్నా మందుకొట్టేవాడు ఇప్పుడు దాదాపు వారానికి రెండుమూడు సార్లు కొట్టటం మొదలుపెట్టాడు. కార్యాలయంలో పని తీవ్రత, పని వొత్తిడిల వల్ల, పీర్ ప్రెస్సర్స్ వల్లా తీవ్ర అందోళనలకి, తీవ్ర వొత్తిడులకీ గురవ్వటం, ఒక పద్ధతి పాడూ లేని భోజనం, ఎప్పుడు ఎక్కడ ఏది తింటున్నాడో గమనించే స్థాయిలో లేకపోవటం, పార్టీలు, మందు, దమ్ముకొట్టుట ఇలాంటివి విపరీతంగా పెరిగిపోయింది.
ఇంతక ముందు కనీస వ్యాయామం అన్నా ఉండేది. ఇప్పుడు అస్సలులేక, కిందపొట్ట పెరగనారంభించింది. కొంచెందూరం వెళ్ళటానికి క్కూడా హా బొంగులే ఎవడు నడుస్తాడూ అని బండేస్కెళ్ళటం, ఇలాంటి వాటితో కండరాలన్నీ సుఖానికి అలవాటయ్యాయి. ఇంతలో స్పాజ్మాటిక్ పైన్స్ అవీ ఇవీ ఆన్ అండ్ ఆఫ్ గా రావడం మొదలైంది. డాక్టర్ దగ్గరకి వెళ్తే ఆటలు ఆడు అని చెప్పాడు. ఐతే ఇతను నిర్లక్ష్యం చేసాడు. ఇంతలో పెళ్ళి అయ్యింది కుఱ్ఱాడికి.
ఒకానొక రోజున దేనికో డాక్టర్ వద్దకు వెళ్తే, రక్త పరీక్ష చేయించమని చెప్తాడు డాక్టర్. రక్త పరీక్ష ఫలితాలు - రుద్రకి ప్రి-డయబెటీస్ అని తేలింది.
తను ఎంతో గట్టి, తనకేమీ కాదూ అని గట్టిగా నమ్మిన రుద్ర ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తల గిఱ్ఱున తిరిగింది. అప్పుడు, జీవితంలో తొలిసారిగా రుద్ర, తనని తాను ఒక్కసారి ప్రశ్నించుకుని, ఒక్కసారి వెనక్కితిరిగి తను అప్పటిదాకా నడచిన బాటని చూస్కున్నాడు. అతను చేసిన తప్పులు అతనికి తెల్సినై.
అప్పటికీ మించిపోయింది లేదు అని అతని అంతరాత్మ, అతని జీవిత భాగస్వామీ మోటీవేట్ చెయ్యనారంభించారు.
డాక్టర్ సూచన - పొట్ట తగ్గించుకో, లెకపోతే నువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తుడివి అవ్వటానికి ఎంతో సమయమ్ పట్టదూ అతని కళ్ళముందు కలాడనారంభించింది. కళ్ళు తెరిచినా మూసినా ఆ సూచనే స్పురిస్తోంది అతనికి.

రుద్ర తన ప్రధమ కర్తవ్యాన్ని గుర్తించాడు. మూడు నెలలో కనీసం బఱువు తగ్గాలని గట్టినిర్ణయం తీస్కున్నాడు. తన ఆహారపు అలవాట్లన్ని కూలంకుషంగా పరిశీలించి విప్లవాత్మకంగా తన తిండిని మార్చుకునేందుకు ప్రణాలికని నిర్మించుకున్నాడు.

ఇప్పుడతనికి ఒక్కటే లక్ష్యం - ఆరోగ్యాన్ని కాపాడుకోవటం - సరైన తూకంతో భోజనం, సరైన వ్యాయామాలతో.


-----------
ఎక్కడో చదివినట్టు, లేక రుద్ర లాంటోడిని చూసినట్టు ఉందా?
రుద్ర లో నన్ను నేను చూస్కున్నాను. నేనూ వ్యాయామం మొదలుపెట్టాను. దమ్ము కొట్టూట మానేసాను. మందు మానేసాను. మరి మీరు?

ఓ సాఫ్ట్వేర్ మిత్రమా!! రుద్ర జీవితం నీ జీవితానికి అతి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోందా? నీకూ పొత్తికడుపు ముందుకు వస్తోందా? కొంతదూరం నడిస్తే ఆయాసం వస్తోందా? నిద్రపట్టకపోవటం లాంటి పరీస్థితులు ఉన్నాయా, వ్యాయామం అంటే ఏంటి అని అడుగుతున్నావా? పొద్దున్నే ఆరింటికి లేచి కొన్ని యుగాలైందా? ప్రతీ చిన్న దూరానికి బండి వాడుతున్నావా?
ఒక్కసారి డాక్టర్ వద్దకు వెళ్ళు. రక్త పరీక్ష చేయించుకో. మధుమేహ వ్యాధి ఉందేమో తేల్చుకో.
వ్యాయామం వైపుకి మొదటి అడుగు వెయ్యి.

May 19, 2009

జన్జీర్ - ప్రకాష్ మెహ్ర

జన్జీర్ అనే అత్భుతమైన చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించిన ప్రకాష్ మెహ్ర మే 17 న మరణించారు.

ఈ సినిమాతో ఆయన అమితాభ్ బచ్చన్ లోంచి ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ని వెలికితీసారు. ప్రాణ్ ఈ చిత్రంలో స్నేహం కోసం ప్రాణాలిచ్చే పాత్రలో అత్భుతంగా జీవించారు.

షరాబ్, నమక్ హలాల్, లావారిస్, ముకద్దర్ కా సికన్దర్ లాంటి చాలా సినిమాలను ఆయన నిర్మించి దర్శకత్వం వహించారు. వీటిల్లో పాటలు చాలా జనరంజకంగా ఉండి ప్రజాదరణ పొందాయి.

తెలుగులో "స్నేహమేరా జీవితం స్నేహమేరా శాస్వతం" అనే పాట హిందీ జన్జీర్ కి రిమేక్ సినిమా, నిప్పులాంటి మనిషి, నుండే.
ఈ పాట ఇప్పటికీ ఫేమస్సే -

పాడింది మన్నాడే
రాసినవారు గుల్షన్ బావ్రా (ఈ పాటకి ఇతనికి ఆ సంవత్సరం బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ కూడా వచ్చింది)
సంగీతం కల్యాణ్ జీ, ఆనంద్ జీ
अगर ख़ुदा मुझसे कहे
अगर ख़ुदा मुझसे कहे कुछ माँग ऐ बंदे मेरे
मैं ये माँगूँ
मैं ये माँगूँ महफ़िलों के दौर यूँ चलते रहें
हमप्याला हो, हमनवाला हो, हमसफ़र हमराज़ हों
ता-क़यामत ...
ता-क़यामत जो चिराग़ों की तरह जलते रहें

यारी है ईमान मेरा यार मेरी ज़िंदगी
अरे! यारी है ईमान मेरा यार मेरी ज़िंदगी
प्यार हो बंदों से ये, ओ ओ
प्यार हो बंदों से ये सब से बड़ी है बंदगी
यारी है! यारी है ईमान मेरा यार मेरी ज़िंदगी

साज़-ए-दिल छेड़ो जहाँ में, ए ए ए
साज़-ए-दिल छेड़ो जहाँ में प्यार की गूँजे सदा
एइ, साज़-ए-दिल छेड़ो जहाँ में प्यार की गूँजे सदा
जिन दिलों में प्यार है उनपे बहारें हों फ़िदा
प्यार लेके नूर आया ...
प्यार लेके नूर आया प्यार लेके सादगी
यारी है! यारी है ईमान मेरा यार मेरी ज़िंदगी

अरे! जान भी जाए अगर
जान भी जाए अगर यारी में यारों ग़म नहीं -२
अपने होते यार हो ग़मगीन मतलब हम नहीं
हम जहाँ हैं उस जगह ...
हम जहाँ हैं उस जगह झूमेगी नाचेगी ख़ुशी
यारी है! यारी है ईमान मेरा यार मेरी ज़िंदगी

गुल-ए-गुलज़ार क्यों बेज़ार नज़र आता है -२
चश्म-ए-बद का शिकार यार नज़र आता है
छुपा न हमसे, ज़रा हाल-ए-दिल सुना दे तू
तेरी हँसी की क़ीमत क्या है, ये बता दे तू -२

कहे तो आसमाँ से चाँद-तारे ले आऊँ
हसीं जवान और दिलकश नज़ारे ले आऊँ
ओए! ओए! क़ुर्बान
तेरा ममनून हूँ तूने निभाया याराना
तेरी हँसी है आज सबसे बड़ा नज़राना -२
यार के हँअस्ते ही ...
यार के हँसते ही महफ़िल में जवानी आ गई, आ गई
यारी है ईमान मेरा ... -३

लो शेर! क़ुर्बान! क़ुर्बान!

అలానే ఈ పాట ఎలా మర్చిపోతారు -
ముకద్దర్ కా సికన్దర్ నుండి
పాడినవారు - కిషోర్ దా
సంగీతం - కల్యాణ్ జీ, ఆనంద్ జీ
రాసినవారు -అన్జాన్

रोते हुए आते हैं सब, हंसता हुआ जो जाएगा
वो मुक़द्दर का सिकन्दर जानेमन कहलाएगा

वो सिकन्दर क्या था ज़िसने ज़ुल्म से जीता ज़हां
प्यार से जीते दिलों को वो झुका दे आसमां
जो सितारों पर कहानी प्यार की लिख जाएगा
वो मुक़द्दर का सिकन्दर...

ज़िन्दगी तो बेवफ़ा है एक दिन ठुकराएगी
मौत महबूबा है अपने साथ लेकर जाएगी
मर के जीने की अदा जो दुनिया को सिखलाएगा
वो मुक़द्दर का सिकन्दर...

हमने माना ये ज़माना दर्द की जागीर है
हर कदम पे आँसुओं की इक नई ज़ंजीर है
आए दिन पर जो खुशी के गीत गाता जाएगा
वो मुक़द्दर का सिकन्दर...

रोते हुए आते हैं सब, हंसता हुआ जो जाएगा
वो मुक़द्दर का सिकन्दर जानेमन कहलाएगा

May 18, 2009

చిరంజీవి!! కిం కర్తవ్యం?

నా దృష్టిలో -
పిఆర్పి ఓటమి చిరంజీవి ఓటమి కాదు. పీఆర్పి ఓటమికి ముఖ్యకారణలు - వలసవాదులు. తెదెపా నుండి, కాంగ్రెస్ నుండి పిఆర్పి లోకి దూకిన వాళ్ళపై జనాలు "క్రెడిబిలిటి" ముద్రవేసి ఇంటికి పంపారు. తర్వాత, ఏ పార్టీకైనా ముఖ్యం, ఆ పార్టీ పిరమిడ్ లో కనీసం ఒక వరస పటిష్టత. చిరంజీవి, తన క్రింది వరసల్లో ఏదో ఒక వరసని గట్టి చేస్కోవాల్సింది. పరకాల లాంటి వాళ్ళు ఓటి చేసిపొయ్యారు ఆ పార్టీ ముఖ్య శ్రేణుల్ని. పార్టీకోసం అన్నింటినీ త్యాగంచేసే శ్రేణిని నిర్మించుకోలేక పోవటం చిరంజీవి అనుభవ రాహిత్యం.
ఇక ఇప్పుడు చిరంజీవి పీకల్దాకా మునిగి ఉన్నాడు రాజకీయ సముద్రంలో, వెనక్కివెళ్ళే సమస్య ఉండకూదదు. ఈదటమే. ఈదాలంటె అంత సుళువు కాదు. అతనికి ఇప్పుడు కిం కర్తవ్యం? ఏమి చెయ్యాలి?
నా ఉద్దేశంలో - టిఆర్యస్ మరియూ లెఫ్ట్ ల ఘోరపరాజయాల్ని అతను, సమర్ధవంతంగా తనవైపుకి తిప్పుకోవటం అతనికి ఉత్తమం. అదును దొరికినప్పుడు నెమ్మదిగా తెదెపాని అణగదొక్కగలిగితే కాంగ్రేస్ కి ప్రధానమైన ప్రతిపక్షంగా అవతరించవచ్చు. అలానే తెదెపా ఓటమి ఆ పార్టీని కొంత ఒడుదుడుకులకు దారితీయవచ్చు. ఆ అవకాశాన్నికూడా చిరంజీవి సద్వినియోగం చేస్కోగలగాలి. అలానే, అదృష్టమో ఏమో, ఏమైనా ఓ ఐదు సంవత్సరాల సమయం అతనికి లభించింది. ఇప్పుడు నెమ్మదిగా, బలంగా కోటని నిర్మించుకుంటే ఈ సారి విజయం అతనిదే కావచ్చు. ఐతే ఇది అంత వీజీ వ్యవహరం కాదు అని అతనికి ఈ పాటికే అర్ధం అయి ఉండలి.

కొందరు అంటారు - ఓయబ్బా తొంభై శాతం సీట్లు కొట్టేస్తాం అని చెప్పుకున్నాడు అని. నాకైతే చిరు పార్టీకి పద్దెనిమిది సీట్లు రావటం ఒక పెద్ద మైల్ స్టోన్ అనిపిస్తుంది. కాంగ్రేస్ వ్యతిరేక వోట్ ని చిరు చేజిక్కించుకోగలిగాడు. అది అతని విజయమే. కానీ తెదెపా వోటుని అంతగా చీల్చలేక పొయ్యాడు. అది అతని బ్యాడ్లక్.

ఏమైనా - చిరంజీవి - సాగిపో ముందుకి...

May 17, 2009

కెవ్వు కేక టివీ తొమ్మిది

కోల్కత్త నైట్ రైడర్స్ కి, ఇంకో టీం (ఛార్జర్స్) కి మధ్యన జరిగిన మ్యాచ్. ఎవడో ఆ చెప్పేవాడు, ఇలా చెపుతున్నాడు! గంగూలీ బ్యాటింగ్ అదరగొట్టాడు. స్కోర్ బోర్డ్ని పరిగెత్తించాడు. అప్పటిదాకా బాగనే ఉంది. ఇంతలో ఈ మాట నా చెవిలో పడి నా చెవులకి పట్టిన తుప్పుని వదిలించింది.
బౌలర్ వేసిన బంతి గంగూలీ బంతుల్ని చిత్తుచేసినంత పనైయ్యింది.
ఇలా ఉంది మన టీవీ, మీడియా.

ఇది ఇంకా కేక. http://www.eenadu.net/story.asp?qry1=2&reccount=40
వార్తా పత్రిక - ఈనాడు
సీర్షిక - మన లోక్ సభ సభులు వీరే.
ఆదిలాబాద్
విజేత కాంగ్రేస్ అభ్యర్ధి - రమేష్ రాథోడ్
ప్రత్యర్ధి - కాంగ్రేస్ అభ్యర్ధి. వావ్. పేరు కొట్నాక రమేష్

పెద్దపల్లి
విజేత - వివేక్ - కాంగ్రేస్
ప్రత్యర్ధి - తెరాస - డి.శ్రీనివాస్

May 16, 2009

INC 65 TDP 60 TRS 10 PRP 10

leads - INC 65 TDP 60 TRS 10 PRP 10 @ 11:20 pm EST
INC 90 TDP 83 TRS 10 PRP 15 @ 11:35 pm EST
తిరుపతి పాలకొల్లు రెంటిల్లో చిరు ఆధిక్యం
INC TDP TRS PRP
100 92 10 15 @ 11:38 pm EST
120 105 10 20 @ 11:42 pm EST

జయప్రకాష్ నారాయణ ఆధిక్యం

May 13, 2009

మంటలు -

నిన్న మా అమ్మ మాటల మధ్యలో రేట్లు మండుతున్నాయిరా అంది. ఏమ్మా అన్నా. లెక్కచెప్పుకొచ్చింది.
కందిపప్పు కిలో - 67/-
మినప్పప్పు కిలో - 60/-
పెసరపప్పు కిలో -60/-
పెసలు కిలో - 60/-
బియ్యం కిలో - 34/- బాపట్ల మసూరి, ఒంటిపట్టు
ఇదయం నువ్వుల నూనె కిలో - 185/-
పచ్చడి మావిడికాయ ఒకటికి - 12/-
బంగినపల్లి మావిడి పండ్లు ఒకడజను - 250/-

పైనుండి సూరీడు మంటాడిస్తుంటే, కింద జనాలు పై రేట్లకి గగ్గోలు పెడుతుంటే ఏ ప్రభువులు జనాలని ఆదుకోగలరూ? ఏ ప్రభుత్వాలు ఈ మంటల నుండి రక్షించగలరూ?

అంతా విష్ణుమాయ.

పనిలో పని, మాటాలో మాట, నేను ఓ కొత్త బ్లాగు పెట్టా. దానిపేరు పల్నాటి వీరులు http://palnativeerulu.blogspot.com/
పల్నాటి చరిత్ర, పల్నాడు గురించి, జనాల సరళి గురించి ఇలాంటివన్నీ పెడదాం అని నా ఆలోచన.

May 12, 2009

చిలిపి ఆలోచన

ఇది మా మితృడు పంపిన మెయిల్.
సరదాగా అనిపించి ఇక్కడ పెడుతున్నా.

May 11, 2009

సూరీడు - మాతృదినోత్సవం - ఓ కార్డ్

మావాడికి ఈ రోజు మాతృదినోత్సవం అని తెల్సిపోయింది. ఎలా అంటే టీవీలో ఎక్కడ చూసినా అదే హేలకదా. అవిచూడంగనే వీడూ, ఓహ్ నువ్వూ మదర్ వే కదా ఉండూ కార్డ్ ఇస్తా అని, వెంటనే ఓ కార్డ్ బెరికి ఇచ్చాడు వాళ్ళ అమ్మకి.
ఓ కాయితకం ముక్క మీద బెరికాడు. దాన్ని స్కాన్ తీద్దాం అని స్కానర్లో పెట్టా కాయితకాన్ని. ఇలా వచ్చింది.
From mothers_day

డాకటేరు మర్సిపోయిన కత్తులు ఎక్స్-రే లో బయటపడ్డట్టు, వాళ్ళ అమ్మ సైడుపక్క పిన్నులు స్కానర్ లోంచి బయటపడ్డై ( వాడుదాచిపెట్టినవే).
ఇక వాడి కార్డ్ -
From mothers_day

ఏ రన్ త్రు :
HAPPY అని రాయంగనే పురుగుకుట్టింది. పక్కనబెట్టాడు మిగతాది. HAPPY పక్కనే ఉన్నది వాడే. వాడికి రెండు లేజర్ బీమ్స్ వచ్చాయ్. దేనికో అర్ధం కాలా. HAPPY కింద వాడి చెల్లాయ్. HAPPY చివర్న ఓ చెట్టుకూడా ఉందండోయ్.

ఇది కేక -
From mothers_day

ఏ రన్ త్రు -
వాళ్లమ్మ. వాళ్ళమ్మ బొట్టు - వాడు దానికిచ్చిన పేరు - ముక్కు బొట్టు.
కింద నేను. నా కళ్ళాజోడు వెయ్యటామికి ప్లేస్ లేదు అని ఎక్కడో ఎడం పక్కన వేసాడు.
ఓ పువ్వు కూడా ఇచ్చాడు మా ఇద్దరికి.
వాళ్ళ అమ్మకి పొద్దున్నే వచ్చి చెవిలో చెప్పాట్టా మాతృదినోత్సవం అని.

May 8, 2009

తుంటరి సూరీడు - ఇంకొంత..

మనోడి దగ్గర్ కొన్ని చిన్న చిన్న పురుగులు, కొన్ని పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయ్. అదేంది పురుగులు అనుకుంటున్నారా?
చెప్తా.
మీలో ఎంతమందికి గుర్తు ఇదీ?
నా చిన్నప్పుడు, అదేదో పురుగు పట్టి, అగ్గిపెట్టెలో పెట్టి దానికి మేత వేసేవాళ్ళం. మేత, అనగా ఆకులు, ఏమి ఆకులు? అంటే!!! పెద్ద తుమ్మ చెట్టు. పెద్ద పెద్ద ముళ్ళుంటాయ్ ఆ చెట్టుకి. మేకలు ఆకుల్ని మహా ఇష్టంగా తింటాయ్. ఏదో పిచ్చి అది. అలా ఆకులు పెడితే ఆ పురుక్కి గుడ్లు పెడుతుంది అనీ. అవి సీతాకోకచిలుకలు అవుతాయ్ అని.

సరే వీడి పురుగులు ఏంటంటే.
ఒక్కో రోజు పొద్దున్నే కుడుతుంది చిన్నపురుగు. అంతే కొంచెం పిచ్చి ఎక్కుతుంది. బ్రష్ చేస్కోను అంటాడు. టిఇ వద్దూ, మిక్కిమౌస్ వద్దు, ఓసో వద్దు అని అలిగి మంచం ఎక్కుతాడు.
ఒక్కో రోజు పెద్ద పుర్గు కుడుతుంది, పొద్దున్నే, మహా పిచ్చి ఎక్కుతుంది. అలాంటప్పుడు, అరుపులు కేకలు, డోర్ ధడా మని వెయ్యటాలు ఇలా.
సాయంత్రాలు కూడా ఇలా పురుగులు కుడుతుంటాయ్ అప్పుడాప్పుడు.
ఒక్కో రోజు మంచిపురుగులు కుడాతాయ్. అప్పుడు ఇలా బెరుకుతుంటాడు.
వాడి ఉద్దేశంలో ఇది గుఱ్ఱం.
From fun

మరి ఐదు కాళ్ళు ఉన్నాయ్ ఏంటీ అని అడక్కు.

ఇది యాలిగేటర్
From fun


ఇది డిస్నీ కార్. దీనిపేరు లైటెనింగ్ మెక్ క్వీన్. దీని నంబర్ 95, కార్ బొమ్మపైన ఉన్నది లైటెనింగ్ అన్నమాట. మెరుపు. దాంట్లో 95 వేసాడు. ఆ పైన కార్స్ సినిమా లోగో. ఆ వి ఆకారంలో మధ్యలో ఉర్దూలా అనిపించేది, వాడి దృష్టిలో "Disney cars" అని.
From fun


ఇదొక అత్భుత కళాఖండం:
From fun

పై బొమ్మ గురించి మీ మట్టి బుఱ్ఱకి అర్ధం కాలేదు కదా. హి హి హి, ఎక్స్పెక్ట్ చేసా (రాజేంద్రప్రసాద్ స్టైల్లో)
చెట్టూ, దాని కింద పులి, పైన సూర్యుడు, బ్లూ వి మబ్బులు.
సరే ఈ కిందదేంటో చెప్పగలరా...
From fun

సరే, అంత దృశ్యం లేదులే, నేనే చెప్తా. కిందవి రెండు పూలు అది మా పిల్లకూడా చెప్తుంది. పైది, పూల్ టేబుల్, పక్కన కఱ్ఱ, ఆ మధ్యలో పిచ్చిగీతలు బాల్స్.
బుఱ్ఱ గిఱ్ఱున తిరిగిందా...
ఇంకొన్నితర్వాత...

May 7, 2009

తుంటరి సూరీడు

ఓ రోజు మధ్యాహ్నం
సమయం - మూడు గంటలు.
స్థలం - లేతం, న్యూయార్క్

హరి పిల్లని నిద్రబుచ్చుతోంది. నేను ఆఫీసులో ఒక కంటితో కూడలిలోకి తొంగిచూస్తున్నా. మరి రెండో కన్నో, అదేమరి, రెండోకన్ను నిద్రపోతోంది.
ఇంతలో, ఒక అకారం, పిల్లిలా కదులుతోంది. అది, నెమ్మదిగా డైపర్ల డబ్బాలోంచి, డైపర్లన్నిటిని కిందపడేసి, ఆ డబ్బాని ఈడ్చుకుంటూ టిప్టో చేస్కుంటు, అడుగులో అడుగేస్కుంటూ మెయిన్ డోర్ వైపు వెళ్ళింది. ఆ ఆకారం ఆ డబ్బా ఎక్కి, డోర్ కి వేసి ఉన్న చైన్ లాక్ ని నెమ్మదిగా తీసేసింది. ఒక రకమైన నవ్వు వినిపించింది వెంటనే. వెంటనే డైపర్ల డబ్బాని యధాస్థానంలో పెట్టి, టక్ మనే శబ్దంతో తలుపు తెరిచి బయటకి వెళ్ళిందా ఆకారం.
పడక గదిలో పిల్లని నిద్రబుచ్చుతున్న హరికి ఆ శబ్దం వినిపించింది. వెనువెంటనే పిల్లని కిందపెట్టి బయటకి వచ్చి చూస్తే ఆ ఆకారం పక్క ఇంటి తలుపుకొడుతోంది.
"ఒరేయ్ సూర్యా, అక్కడేంచేస్తున్నావ్, ఇట్రా నిన్నస్సలూ, ఉండు మీ నాన్నకి ఫోన్ చేస్తా"
ట్రింగ్ ట్రింగ్
"ఏంటమ్మాయ్!! ఏంటి సంగతి?"
ఇంతలో పిల్ల లేచి ఏడుపు లంకించుకుంది.
"బాబూ మీవాడితో నావల్లకాదు"
"ఏమి"
"వాడికి తలుపు తీస్కోడం వచ్చింది. ఆ చైన్ లాక్ తీసి పక్కింటికెళ్ళిపొయ్యాడు"
"వాట్$#$‌ఊ%&*&‌* ఎలా?"
"ఇలా"
"గాడ్!! వస్తున్నా"
ఇంటికి వెళ్ళి "ఏరా" అని నిలదీస్తే
"అవును నాన్నా, టెన్షన్ పడకూ (ఈ మధ్య నేను, హరి అనే ప్రతీ మాటని వాడు నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఠకా మని పట్టేస్తున్నాడూ కొన్ని కొన్ని మాటలు. అలాంటి వాటిల్లో ఇదొకటి. అలానే, అబ్బ అబ్బ అబ్బ ఏం డ్యాన్సు తాటతీసాడు, కొంపలేమి మునగవ్, ఓరినీ ఎన్కమ్మా లాంటివి కొన్ని) నువ్వు లేవు. అమ్మ బేబీని పడుకోబెడ్తోందా. అందుకే, బయటకి వెళ్ళా"
"తప్పునాన్నా అలా వెళ్ళకూడదు"
"కాదునాన్నా. నువ్వు ఎక్కడ ఉన్నావో అని చూస్తున్నా అంతే"
"ఒరేయ్!! బయట బూచోళ్ళుంటారు నాన్నా..వెళ్ళకమ్మా"
"సరే"
.. అపార్ట్మెంట్ ల్యాండ్లార్డ్ తో చెప్పి చైన్ అందకుండ పైకి పెట్టించా.

ఈలోపు - పాటియో డోర్ ఓపెన్ చేస్కుని వెనక్కి వెళ్ళటం మొదలైంది.
దాన్ని, ఎలా ముయ్యాలో అర్ధంకాక, ఒక చెక్కముక్కని డోర్ కి అడ్డం పెట్టి, కాలితో గట్టిగా నొక్కా రాకుండా వాడికి. ఇంకో రోజు మళ్ళీ ప్రయత్నం చేసాడు పాటియో డోర్ తీద్దాం అని. రాలేదు. వాడికి అర్ధం అయ్యింది కర్ర అడ్డం ఉందని.
అంత కష్టపడి నేను కాలితో నిక్కిమరీ చెక్కముక్క పెడితే మొన్న, తను పిల్లని బెడ్రూంలోకి తీస్కెళ్ళంగనే పాటియో డోర్ దగ్గరకొచ్చి, ఆ చెక్కని ఒంటి చేత్తో ఇలా అనేసి, తీసేసి పక్కన పడేసి, తుర్రున బయటకి వెళ్ళి పక్కనోళ్ళింటికెళ్ళి, హాయ్ చెప్పి, నేను వావ్ వావ్ వబ్జీ చూడాలి అని చెప్పి మళ్ళీ వెనక్కొచ్చి, పాటియో తలుపేసేసి, చెక్క ముక్క గట్టిగా నొక్కి మరీ పెట్టి ఏమీ ఎరగనట్టు సోఫాలో కూర్చుని వబ్జీ చూస్తున్నాడు. ఈ శబ్దాలకి వాళ్ళమ్మ వచ్చి అడిగితే అవును వెళ్ళొచ్చా అంటాడు. ఇలా కాదని, సోఫా అడ్డం పెట్టాం. వాడూతక్కువోడా, సోఫా ఎక్కి, సోఫాకి, పాటియో డోర్ కి మధ్యనున్న సందులోంచి నెమ్మదిగా జారి ఆ కర్ర ని తీసేసి తుర్రుమన్నాడు.

నిన్న మధ్యాహ్నం
సమయం మూడున్నర
హరి పిల్లని పడుకోబెట్టటానికి బెడ్రూంలో ఉంది. వాడిలో వాడె మాట్లాడుకుంటూ ప్రయత్నాలు మొదలుబెట్టాడు. హరికి అనుమానం వచ్చి బెడ్రూం డోర్ మొత్తం తియ్యకుండా ఓరగా తీసి చూస్తోంది ఏంచేస్తాడా వీడు అని -
కుర్చి లాక్కొచ్చి పైకి జరిపిన చైన్ తీయడనికి ఇలా ప్రయత్నిస్తున్నాడు. అందటంలేదు. ఫ్లాష్, నాలుగు దిండ్లు తెచ్చాడు, కుర్చీ సీటుపై పెట్టాడు. అందలేదు. డైపర్ల డబ్బా తెద్దామని చూసాడు. కుదరలేదు. కుర్చీ ఎక్కి, దానిపైనుండి డోర్ పక్కనే ఉన్న డ్రాయర్ పైకి ఎక్కుదామని ప్రయత్నిస్తుంటే, హరి వారించింది, నాయన పడితే తలకి బొక్క పడుతుంది అని.

ఇదీ కధ ..
ఇలా జరుగుతోంది.

May 5, 2009

సినిమా స్క్రిప్ట్స్

మనలో చాలా మందికి సినిమా అనేది ఒక ప్యాషన్. అబ్బా ఈ సినిమా ఎలా తీసారు, ఎలా రాయగలరూ ఇలాంటి స్క్రీన్ ప్లే, ఇలాంటి కధని రాయటం ఎంత కష్టం, ఎంత భావుకత ఉండాలి ఇలాంటి కధని రాయటానికీ తెరకెక్కించటానికీ ఇలాంటి ప్రశ్నలు సర్వసాధారణంగా మనలో రేగే ప్రశ్నలే ఒక మంచి సినిమా చూసినప్పుడు.
ఈ మధ్య ఎ.యం.సి అనే ఛానెల్లో ట్రాయ్ అనే ఒక ఎపిక్ వేసాడు. అత్భుతంగా ఉందా సినిమా. అలానే మాటోనీ గాడు మాటలమధ్యలో 300 http://en.wikipedia.org/wiki/300_(2007_film) అనే సినిమా చూసావా అని అడిగాడు, దాని గురించి తెల్సుకుంటే చాలా ఇంటరెస్టింగా అనిపించింది.
అసలు వర్మ కి గాడ్ఫాదర్ ఎలా అతని చాలా సినిమాలకు ప్రేరణని కలిగించింది?
ఇలాంటివి తెలియాలంటే ఆ సినిమాలను చూడాలి లేక ఆ సినిమా స్క్రిప్ట్ ని చదవాలి.
నేను గూగుల్లో గెలుకుతుంటే, ఈ లింకు తగిలింది.
http://www.imsdb.com.
http://www.imdb.com సినిమాల డేటాబేస్ ఐతే, imsdb స్క్రిప్ట్ డేటాబేస్.
ఇదిగో అందులోంచి ఒక ఉదాహరణ స్క్రిప్ట్ - షాషాంక్ రిడెంప్షన్ http://en.wikipedia.org/wiki/Shawshank_Redemption అనే సినిమా స్క్రిప్ట్ -
THE SHAWSHANK REDEMPTION

by

Frank Darabont


Based upon the story
Rita Hayworth and Shawshank Redemption
by Stephen King



1 INT -- CABIN -- NIGHT (1946)

A dark, empty room.

The door bursts open. A MAN and WOMAN enter, drunk and
giggling, horny as hell. No sooner is the door shut than
they're all over each other, ripping at clothes, pawing at
flesh, mouths locked together.

He gropes for a lamp, tries to turn it on, knocks it over
instead. Hell with it. He's got more urgent things to do, like
getting her blouse open and his hands on her breasts. She
arches, moaning, fumbling with his fly. He slams her against
the wall, ripping her skirt. We hear fabric tear.

He enters her right then and there, roughly, up against the
wall. She cries out, hitting her head against the wall but not
caring, grinding against him, clawing his back, shivering with
the sensations running through her. He carries her across the
room with her legs wrapped around him. They fall onto the bed.

CAMERA PULLS BACK, exiting through the window, traveling
smoothly outside...

2 EXT -- CABIN -- NIGHT (1946) 2

...to reveal the bungalow, remote in a wooded area, the
lovers' cries spilling into the night...

...and we drift down a wooded path, the sounds of rutting
passion growing fainter, mingling now with the night sounds of
crickets and hoot owls...

...and we begin to hear FAINT MUSIC in the woods, tinny and
incongruous, and still we keep PULLING BACK until...

...a car is revealed. A 1946 Plymouth. Parked in a clearing.

మిగతా స్క్రిప్ట్ ఇక్కడ చదవండి http://www.imsdb.com/scripts/Shawshank-Redemption,-The.html

May 1, 2009

జ్ఞాపకాల దొంతర

ఆరోజుల్లో మేము పిడుగురాళ్లలో ఉండేవాళ్లం.
మా ఇల్లు, మేము కట్టుకున్నప్పుడు, ఊరి చివర. మా ఇంటికన్నా ఇంకా కిందకి ఎల్తే దచ్చినాదోళ్ల బజారు. దచ్చినాదోళ్లు అంటే ఎవురోకాదు, ఆళ్లు గిద్దలూరు అటుకాడ్నించి ఇక్కడకొచ్చి స్తిరపడినోళ్లన్న మాట. ఈళ్లు ఇసుక తోలటం, బండ్లు కట్టటం, ఇటుకలు తోలటం ఇట్టాంటి పన్లు సేస్తుండేఓళ్లు.
మా ఇంటికి ముంగట అంబంమ్మగారి ఇల్లు. మా అమ్మకన్నా పెద్దామే ఆమె. ఓ చాలా పెద్ద సంతానం వాళ్లది. వాళ్లబ్బాయి పెసాదు నా సహవాసగాడే. విచిత్రంగా వాళ్ళింట్లో ఇద్దరు ప్రసాదులు. అంబంమ్మగారి పెద్దకొడుకూ ప్రసాదే, మూడూవాడూ ప్రసాదే. మా ఇంటికి ఇటైపు బి.జి.కే మాష్టారు గారి ఇల్లు. అటువైపు ఓ వీధి. ఆనుకుని ఎవురిదో ఇల్లు. తెల్సినోల్లే. గుర్తుకురావట్ల. వాళ్ల ఇంటి ముందు పాలుపోసే గంగమ్మ ఇల్లు. వాళ్లింటికి అటైపు మేస్త్రి కోటేశ్వర్రావ్ ఇల్లు. మా ఇల్లు కట్టింది కోటేశ్వర్రావే.
బి.జి.కె మాష్టారు గారి పెద్దపిల్లోడు, నేను, పెసాదు, మా అన్న, అందరం కల్సి బడికెళ్ళేవాళ్లం. అర పర్లాంగు మా బడి మాఇంటికాడ్నుండి. మా ఇంటికాడ్నుండి లంబాడోళ్ల బజారు ఎనకమాలగా ఎల్తే పల్నాటి రోడ్డు దాటితే మా బడే. మా బడిని తండా బడి అనేవోళ్లం. ఎందుకంటే ఆ బళ్ళో లంబాడోళ్ళు ఎక్కువ సదివేవోళ్లు. ఆ బడికి స్థలం ఇచ్చిందిగూడా లంబాడోళ్లే. అది ఆం.ప్ర. ప్రాధమికోన్నత పాఠశాల మరియూ సాఘీక సంక్షేమ హాస్టలు. అన్నీ ఒకే కాంపౌండులో ఉండేవి.
ఒకానొక కాలంలో అది ఓ స్మశానం అని అనుకుండేఓళ్లు. రాత్రిళ్లు బావి గిలకలు గిర్రున ఆటంతటవే తిరుగుతుంటాయ్ అనిచెప్పుకునేఓళ్లు. నేనెప్పుడూ చూళ్ళా.
బడి ఎనకమాలె రైలుకట్ట. అప్పుడప్పుడు ఎళ్ళే వాళ్ళం. రాయిపూజ సేస్కుని వచ్చేవాళ్ళం. ఇప్పటికీ పిడుగురాళ్ళొచ్చిందని ఎమ్మటే జెప్పొచ్చు రైలు బండ్లో ఎళతా. అంత కంపు మరి.
అప్పుడప్పుడు సచ్చి రెండుముక్కలై తెగిపడిన శవాలు కనిపించేయి, కుక్కలు పాపం దెగ్గరికెళ్దమా వొద్దా అని సూత్తాకూసుండేయి. రాబందులు వచ్చి, ఎవుడోకడు కొంచెం బొక్క పెట్టకపోతడా తినక పోతమా అని ఆసగా సూత్తా ఉండేయి. పట్టలకటైపు లంబాడోళ్లే ఉండేఓళ్లు.
మా బడికి ముంగట పిడుగురాళ్ల మొత్తానికి ఒకేఒక పెట్రోలు పంపు. దాని పక్కనే పుడ్డుకార్పోరేసనోల్ల గిడ్డంగి. మాకు మద్దానం భోజన పతకం కింద, పొద్దున టిపినీ కింద కావాల్సిన గోధుమలు, బియ్యం, పాలపిండి ఆడినుండె తెచ్చేవోళ్లు.
నేను ఒకటో తరగతి, మా అన్నయ్య నాలుగు. నేబొయ్యి అన్న పక్కన కూర్చుండేవోణ్ని. ఒకటి తరగతి కాడ్నుండి నాలుగు దాకా ఓ పెద్ద పాక. రాంసోవిగారని ఓ మాష్టారు ఉండేవాళ్లు. ఆయన హిందీ మాష్టారు. ఆయన బెత్తంతో తిరుగుతా ఉండేవోళ్లు ఎప్పుడు. ఛటక్ మని ఒక్కటేసేవోళ్లు. నా కాడకొచ్చి నాలుగేసి మళ్లీ ఒకటో కల్లాసులో కూర్చోబెట్టేవోళ్ళు.
మాకు అప్పట్లో బడికి ఓ పలక, బలపం, ఓ బొక్కు. అంతే. ఓ గుడ్డ సంచిలో ఏస్కుని సంచి నెత్తికిబెట్టుకుని ఎళ్ళేవాళ్ళం.
నాకు గుర్తున్నంతకాలం దాసినేని ఆంజనేయులు మాష్టారు హెడ్మాష్టారుగా చేసేవోళ్ళు. ఆయన కొడుకు, ఆయన అన్న కొడుకులూ అందరూ మా బడే.
బడి అవ్వంగనే ఇంటికొచ్చి, బయటనుంచి బడిసంచీని ఇంటోకి ఇస్సిరినూకి పరుగో పరుగు ఆటలకి. మోకాళ్ల పైనదాకా మట్టికొట్టుకుపొయ్యిందాకా ఆ ఉప్పుదువ్వలోపడి ఏందో ఆటలు, దొంగా పోలీసు, ఉడుం, అదీ ఇదీ, కుందుళ్లు, వంగుళ్ళూ దూకుళ్ళు ఎన్ని ఆటలు ఇంకా బెచ్చలు, ఓకులు, ఆడీ ఆడీ మా నాయన ఇంటికికొచ్చేదాకా ఆడుడె. మా నాయన సైకిలుమీన వచ్చినాక అప్పుడు ఓ నాలుగు బక్కెట్లు నీళ్లుపోస్కుని, పొట్టనిండా తిని పడుకుంటే, కళ్లు మూసి తెర్సే సరికి తెల్లారిపొయ్యిఉండేది.
దచ్చనాదోళ్ల బజారు దాటితే పొలాలే. బడిలేనప్పుడు బైలుకి అటుబొయ్యే వాళ్ళం. నాలుగు సేలు దాటితే బుగ్గోగు. ఆడకి పొయ్యి కార్యలు కరామత్తులు కానిచ్చి బుగ్గగులో కడుక్కొని, కొంచెంసేపు ఈత కొట్టి, అక్కడ పెద్ద పెద్ద కప్పలు కనబడితే ఆటిని పట్టి, బురదపావులు కనపడితే రాళ్ళేసికొట్టి అట్టా ఓ గంట అట్టా అట్టా ఆడినాక ఇంటికొచ్చేతలికి మా నాయన నాలుగు ఉతుకులు ఉతికుతుండేవోడు.
ఓ రాజు పాలుపోసే గంగమ్మ వాళ్ళ పంది పక్కనున్న బావిలో పడింది. ఆ బాయికి సుట్టూతా గట్టు ఉండేది కాదు. మొత్తానికి కష్టపడి తీసిన్రు. ఓరోజున ఎద్దు పడింది ఆ బావిలో. గోల గోల. పెద్ద ఎద్దు. పెద్ద బండిలాగేది. సానా పెద్దది. ఓ మూడు నాలుగొందల కిలోల బరువు ఉండిద్దా? మొత్తానికి ఓ పదిమంది మోకులు గట్రా తెచ్చిన్రు. పెద్ద బాయి అది. దిగుడు బాయి కాదుగానీ, అడుగు లోతుకి ఒక సప్టా బండా ఉండింది దిగటానికి. బావిలోనికి దిగటానికిబోతే పొడిసిద్దిగా మరి. అందుకని, దానికి అందనంతకాదికి దిగి, అటొకళ్ళు, ఇటొకళ్ళు, ముల్లుగర్రలు పైనించి లోనకిస్రినూకితే ఆ దిగినోళ్ళు ఆటినిపట్టి, ఆటికి ఎనకమాల సన్నతాడుకట్టి ఇటునుండటుకేసి మొత్తానికి సన్నతాళ్ళ సివర్లు మోకులకి కట్టి ఎట్టానో మొంగటి కాళ్ళకి ఎనకమాల కాళ్లకి కట్టి ఎట్టనో బయటికీడ్చిన్రు. బయటపడంగనే కుమ్మటానికి కురికింది. తప్పించుకున్నరు జనాలు మొత్తానికి. అప్పుడు అనుకుంటుండే ఇన్నా బాయి బలిగోరిందీ అని.
ఓ రోజున గంగమ్మ వాళ్ళకి చెందినోళ్ళు ఎవరో పొయిన్రు. అప్పుడు నా జీవితంలో మొట్టమొసటిసారి ఒక వాయిద్యం చూసా. అదే మొదటిసారి, చివరి సారి కూడా. ఓ నలుగురైదుగురు వచ్చిన్రు తప్పెట ఇంకేవో వాయిద్యాలతో, ఒకాయన మాత్రం ఒక విచిత్రమైన వాయిద్యంతో వచ్చాడు. ఇప్పుడు గుర్తుతెచ్చుకుంటే అది సరిగ్గా బ్యాగ్పైపర్ లా ఉండిందది.
అంబంమ్మ గారి ఇంటికి ఎనకమాల కూసింత అటుగా ఓ పెద్ద డాబా ఇల్లు. సానా పెద్దది. ఐతే ఆఇంట్ల ఎవుళ్ళూ ఉండేవోళ్ళు కాదు. దానికి దయ్యాల కొంప అనేవోళ్ళు ఎందుకో.
మా బడికాడానుండి ఇంకా పైకిపోతే రైల్వే గేటు. గేటూ పక్కనే ఓ గేటుమడిసి గది. ఏందేందో ఉండేయి ఆ గదిలో దానికి ఎనకమాల ఇంకొంచెం అటుగా ఎల్తే ముగ్గుమిల్లు.
అప్పుడప్పుడు ముగ్గుమిల్లుకు రాయెత్తకొచ్చే కోరీలకాడికి పొయ్యేవాళ్ళం. లోనికి దిగటానికి దారిలా ఉండేది ఒక్కో కోరీ. తవ్వుకుంటాపోతారా, ఆ తొవ్విన గోడలెమ్మటి సూస్కుంటా ఎల్తే మెత్తని రాయి దొరికేది. దాన్నే బలపం అంనేవోళ్ళం. అట్టాంటివి తెచ్చి, ఓ అరగదీసి సేతిలో పట్టేలా జేస్కుని బొక్కుల సంచీలో ఏస్కునేఓళ్ళం. అస్సలు రరాయిలేకుండా ఉండే బలపాన్ని తేనెబలపం అనేఓళ్ళం. తేనెలా రాసుద్ది ఆ బలపం. పలకలు ఆయాల్టిరోజున మట్టి పలకలు. నీళ్ళుపెట్టి కడిగితే పలక సల్లగా ఉండేది.
పట్టాలెమ్మటి ముందుకిబోతే ఎర్రోగు (ఎర్రవాగు) బ్రిడ్జీ వొచ్చేది. జారిపడకుండా సిన్నగా దిగి, ఎర్రోగులో ఆడేవోళ్ళం. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి జేరేఓళ్ళం. ఎందుకంటే ఆ బ్రిడ్జి ఎమ్మటి ఉండే తాడిసెట్లమీన కొరివిదయ్యాలు ఉండేవని ఒకళ్ళ ఎమ్మటబడినై అని చెప్పుకునేఓళ్ళు. రాత్రిళ్ళు పట్టాలు పైకి లేస్తై అని సెప్పుకునేఓళ్ళు.
(......మిగతాది తర్వాత)