Sep 22, 2008

నా ఆవేదన, ఆందోళన, రోదన, మౌనం.....

నేనీరోజు దేనికోసమో గూగుల్లో వెతుకుతుంటే ఈ బ్లాగు http://teluguplaty.blogspot.com/2007/11/blog-post.html, http://www.venuvedam.com/ కనపడింది. నా కళ్ళు చెపర్చాయి.

మనిషి పుట్టుకేంటో, పోవటమేంటో. అస్సలు ఎందుకుపుడతామో?
చావంటే నాకు భయం లేదు. మా నాన్న నా చేతుల్లోనే పొయ్యాడు. మా తాతయ్య నా కళ్ళా ముందే పొయ్యాడు. ఇక్కడ నా రోదన ఏంటంటే:
మనం ఐటీ రంగం అది ఇది, అభివృద్ధి, 2020, చదువు సట్టిబండలు, అమెరికా, జపాను, జెర్మనీ అని రొమ్ములు ఇరగదీసి బాదుకుంటాం. ఐతే, గుంటూరులో, బ్రాడీపేటలో మానాన్నకి గుండె నొప్పి ఎక్కువైతే, ఇంట్లోచి కిందకెళ్ళి ఆటో ని పిల్చుకొచ్చి ఆశుపత్రికి తీస్కెళ్ళేలోపు ఆయన ప్రాణం పోయింది. ఇన్ని ఉండి, ఇంత జ్ఞానం ఉండి, విజ్ఞానం ఉండి మనం మన కనీస అవసరాల్ని దేనికి పట్టించుకోము అని?
మన డైయాగ్నైజు ఇలా ఉంది: మా నాన్నకి 1999 లో గుండే పెరిగింది. ఆ సమయంలో అది గుండె పెరగటం అని మేము కనిపెట్టలేక పొయ్యాం. ముందు జ్వరం వచ్చేది. ఒక పెద్దాయన దెగ్గరకి వెళ్ళాం. ఆయన ముందు మలేరియా అని క్వినైన్ ఇచ్చాడు. 10 రొజుల తర్వాత ఇంకా తగ్గక పోతే మళ్ళి వెళ్ళాం. ఈసారి యంటై బాక్టోరియల్ ఇచ్చాడు. ఇంకో 10 రోజులు గడిచినై. ఈలోపల మా నాన్న 10 కిలోలు బరువు తగ్గిపోయాడు, పేల్ గా అయిపోయాడు.
అప్పూడు నా సొంత తెలివితేటల్తో, నా డాక్టరు స్నేహితులతో చర్చించి, కంప్లీటు చెకప్పు చేయిద్దాం అని నిర్ణయించి అరుండేల్ పేటలో అమరావతి డైయాగ్నోస్టిక్స్ కి వెళ్ళాం.
Dr. Srinivasa Reddy MD అక్కడ ఇన్-ఛార్జ్. వెళ్ళాం, ఎక్స్-రే అవి ఇవి అయ్యాయి. స్కాన్ తీయించుకోటానికి రమ్మన్నారు, వెళ్ళాం. వాడు, ఆ స్కాన్ తీసేవాడు, ఒక కంప్యూటరు స్క్రీను మీద చూస్తున్నాడు, దాంట్లోనే ఇంకో విండో, దాంట్లో సిటికేబుల్లో సినిమాజూస్తున్నాడు. అలా మల్టై ప్రొసెస్సింగు జేస్తూ గుండే దెగ్గర స్కాన్ తీస్తూ, పేషంటుతో అంటాడూ "మీ గుండె పెరిగింది!! చాలా సీరియస్గ ఉంది" అని. వెంటానే వాడి రెక్క పట్టుకులాక్కొచ్చా బైటికి "ఎవుడ్రా నువ్వు, రోగికి చెప్తార్రా, పక్కన్నేనున్నది దేనికి" అని కొట్టినంత పనిజేస్తే అప్పుడొక "సారీ"ని నామొహాన కొట్టి రిపోర్ట్స్ చేతిలోపెట్టాడు. తర్వాత మొత్తనికి పోరాడి కొంతకాలం బతికించుకున్నాం మా నాన్నని అది వేరే సంగథి.
బ్రాడీపేటలో ఉన్న ఒక రోగి, ఎక్కడో కొత్త పేటకి ఆటోలో వెళ్ళాటానికి కనీసం 30 నిముషాలు పడుతుంది, ఆయువుంటే బతుకు, లేకపోతే? అసలు అన్నీ ఆస్పత్రులూ ఒకేచోట దేనికి? ఇదేమైయినా కూరగాయల మార్కెట్టా? బ్రాడీపేట కాడ్నించి కొత్తపేట కాడికిబోటానికి ౩౦ ని పడితే, మోర్జంపాళ్ళో గుండెనొప్పొచ్చినోడిని గుంటూరు ఎత్తుకెళ్ళాలంటే? రేగులగడ్డ కాడ్నించో? ౨౦ లక్షల కోట్లు అప్పుజేసాం ఇప్పటిదాకా. ఆడబ్బుని ఏంజేసాం? మన్లో కొంతమంది ఎదవలు అప్పుజేస్తే తప్పేంటి అన్నారు, కొంతమంది కాంగ్రేస్ అప్పుజేయకూడన్నారు. కొందరు టీడీపీ మాత్రమే అప్పుజేయ్యాలన్నారు. ఒకడు ప్రపంచ ఎకనమిక్ ఫోరం కెళ్ళొస్తడు. ౫౦ మంది ఎంపిలు అమెరికాకెళ్ళొస్తరు. అది చూసాం, ఇది చూసాం. ఎక్కడ వాటి ఫలాలు?
మనకి బతుకు విలువ ఎప్పటికి తెలుస్తుంది? చిన్న పిల్లలు ఇలా అర్ధం కాని ట్యూమర్లతో పోతుంటే? ఏంటో నాకు ఆవేశం తో పాటు ఆవేదన, ఆందోళన కల్గుతోంది.
ఒక ఎమర్జన్సి మెడికల్ సిస్టం ఎందుకని మనం పెట్టుకోలేకపోతున్నాం? మండలానికి ఒక ఎమర్జెన్సీ, ట్రౌమా కేంద్రం ఏర్పాటుచెయ్యటానికి ఆటంకాలేంటో?
పైన పేర్కొన్న బ్లాగులో ఆ తల్లితండ్రులు ఎంత హృదయవిదారకంగ కుమిలిపోయి(పోతూ) ఉంటారో?
ఇశాన్ తండ్రి ఇలా రాసాడు "వాడు మాకు చాలా జీవిత సత్యాలు నేర్పాడు. మరణం అనేది కేవలం ఒక మార్పు మాత్రమే అని చెప్పాడు. ఇక ముందు మాకు ఎటువంటి కష్టాలైనా చిన్నవిగానే కనిపించేటట్లు చేశాడు. డబ్బు ఎందుకు పనికిరాదు అని విడమార్చి బోధించాడు. (అమెరికా లో చికిత్స చేయించగల స్థోమత ఉండి కూడా అందుకు వ్యవధి లేని పరిస్థితి)."
అంత చిన్న పిల్లోడి ఆర్గాన్స్ డొనేట్ చేసారంటే వాళ్ళకి నేను శిరస్సు వంచి పాదాభివందనం జేస్తున్న. ఇలా అర్ధాంతరంగా మనల్నందర్ని వదిలేసి నిజంలో ఐక్యం ఐన వాళ్ళందరికోసం రెండునిమిషాలు మౌనం పాఠిస్తున్న.

ఇందాకనే నా మితృడొకడు మొహం ఏళ్ళాడేస్కుని నా డెస్కు దెగ్గరకొచ్చాడు. ఏందిరా అన్నా, మనసేం బావోలేదు. ఏం? మా స్నేహితుడి కొడుకు రెండున్నరేళ్ళు, పోయాడూ!! ఎలా? ఎక్కడా? ముంబయ్ లో ట్యూమర్. నాకు కళ్ళలో నీళ్ళుతిరిగినై. మనసంతా వికలమైంది. నాచిట్టికన్నల్లారా!! పుట్టిపుట్టంగనే ఇలా ఎళ్ళిపోతే ఎలా???? అందరూ ముందుకి రండి. మనకోసం, మన ఊరుకోసం ఎదోకటిజేద్దాం...దయచేసి.

5 comments:

  1. అయ్యో ! ఎంత బాగా రాశారండీ.. ? ఎంత ఆవేదన ! ప్రజారోగ్యం ఇప్పుడు నెమ్మదిగా వ్యాపార రూపం సంతరించుకుంటూంది. ఈ వ్యాపారం క్లిక్ అయితే, పల్లెల్లోనూ మంచి సౌకర్యాల గురించి మనం కలలు కనొచ్చు. నా సొంత తమ్ముడు, కూడా, పట్నం లోనే, కేవలం డాక్టరు సమయానికి దొరకక, హాస్పిటల్ లో వెయిట్ చేస్తూ, వైద్యం అందక చనిపోయాడు. గుండెల్లో పచ్చిగా నిలిచి పోయిన గాయం అది. మీరు మీ నాన్న గారి విషయం లో చెప్పినట్టే, నాకూ జరిగింది. విపరీతమైన నడుము నొప్పితో రెండేళ్ళు బాధ పడి, స్పాండిలైటిస్ అనీ, బరువు తగ్గితే నొప్పి తగ్గుతుందనీ, జనరల్ వైద్యం చేస్తూ నా ప్రాణాల మీదికి కాక పోయినా, జీవితాంతం నడుము కిది భాగం లో పారా ప్లీజియా కి గురవ్వ బొయ్యే వరకూ తెచ్చారు. అయితే, దేవుడి సహాయంతో ఒక మంచి ఆపద్బాంధవుడిలాంటి డాక్టర్ గారు మమ్మల్ని తొందర పెట్టి, ఆపరేషన్ చేసారు. ఈ డాక్టర్ అతి గా చెప్తున్నారేమో అని మాకు డౌట్ వచ్చింది కూడా. కానీ ఆపరేషన్ జరిగాక, ఇంకో డాక్టర్, మా ఫిసియో థెరాపిస్ట్, నా ఎం.ఆర్.ఐ.స్కాన్ చూసి, నివ్వెర పోయారు. కాళ్ళ లో చలనం పోయి, రెండు నెల ల తరవాత నడవటం, మెట్లెక్కడం నేర్చుకున్నాను. ఇలాంటి వ్యాధి ఇంకెవరికయినా బీద వారికో, చిన్న పల్లె లేదా పట్నం లో ఉన్న వారికో వస్తే, వారు జీవితాంతం మంచానికే అంకితం అయిపోయే వారు.

    మీ ఆవేదన నాకు చాలా బాగా అర్ధం అయింది. మీ నాన్న గారి విషయం లో ఇ ఆం వెరీ సోరీ.

    ReplyDelete
  2. సుజాత గారు,
    నిజమా ఇదంతా? ఎంత మానసిక వ్యధ అనుభవించి ఉంటారో కదా! తిరిగి కోలుకుని మా అందరికీ దగ్గరయ్యారు. అంతే చాలు!

    భాస్కర్ గారు,
    మీ టపా చాలా ఆవేదనా భరితంగా ఉంది. సరైన డయాగ్నసిస్ లేకపోవడం అనేది ఈ రోజుల్లో కూడా జరుగుతుందంటే డాక్టర్ల దగ్గరికెళ్ళాలంటే భయమేస్తుంది. మా అమ్మ గారికి కూడా అంతే జరిగింది. ఆమెకు గుండెలో నొప్పి వస్తుంటే అది 'గ్యాస్ ' నొప్పని ఏ డాక్టరూ సరిగ్గా పట్టించుకోక, యాంటాసిడ్స్ ఇచ్చారు.(గుంటూర్లోనే) చివరకు ఆమెకు గుండె పెరిగిందని తెలుసుకునే సరికి, ఆమెకు తట్టుకునే శక్తి పోయి, సుగర్ ఉండటం వల్ల ఆపరేషన్ చేయలేక, మందులతో గాజు బొమ్మలా మిగిలింది. ఆరుగురు పిల్లలని అబ్బరంగా పెంచిన అమ్మ గుప్పెడు మెతుకులు తినలేకపోతుంటే,చూడటం ఎంత నరకంగా ఉంటుందో!

    ReplyDelete
  3. @భాస్కర్ రామరాజు గారు, నేను కూడా అనుభవించినదాన్ని కాబట్టి మీ ఆవేదన అర్థం చేసుకోగలను.

    విద్య వైద్య రెండూ వ్యాపారం అయిపోయాయి ఈ రోజులలో. అంతా మాకే తెలుసు అనుకునే డాక్టర్లు (అందరూ కాదు), వ్యాపార ధోరణి తప్పితే మానవతా ధోరణి కనిపించని ఆసుపత్రులు, కూరగాయల బేరం అయిపోయిన వైద్య పరీక్షలు, చికిత్సలు---వీటన్నిటిని మనం మార్చగలమా?
    కాస్తో కూస్తో తెలిసిన మనకే ఇలాంటి అనుభవాలయితే ఏమీ తెలియని అమాయకుల పరిస్థితి ఏమిటి? నన్ను ప్రతి రోజు పీడించే ప్రశ్న ఇది.

    కదిలిస్తే ఇలాంటి వ్యధలు ఎన్నో!

    @sujata, మీ లాంటి అనుభవమే నాది కూడా. తప్పుడు బయాప్సీ రిపోర్టుతో తప్పుదోవపట్టిన డాక్టర్సు, మరలా తిమ్ముర్లు, నెప్పి వస్తుంది అని ఆపరేషను చేసిన డాక్టరు దగ్గరికి వెళితే మీదంతా సైకలాజికల్ ఫీలింగు మీకేమి లేదు అని నాలుగు నెలలు తిప్పించుకున్నాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు హైదరాబాదులో చాలా పెద్ద అనుకునే డాక్టర్లు కూడా అదే మాట--చివరికి పరిస్థితి ఎలా తయారయిందంటే నా మీద మావారికే కాదు నాకూ అనుమానం వచ్చింది నాకేమి లేకుండానే ఉందని ఫీల్ అవుతున్నానా అని. వాళ్ళ మాట పట్టించుకోకుండా నేను ముందే మేలుకున్నాను కాబట్టి సరిపోయింది.

    @సుజాత గారు, సరైన డయాగ్నసిస్ లేకపోవడం అనేది వైజ్ఞానికంగా చాలా ముందడుగు వేసాము అనుకునే ఈ రోజుల్లోనే ఎక్కువ జరుగుతుంది, దానికి ముఖ్య కారణం అలసత్వం.

    ReplyDelete
  4. @sujata గారు:
    అదేదో హిందీలో అన్నట్టు " లడయీ లడ్నా హై నహి హైతో మర్నా హై", మీ సమస్య పై మీరు పోరాడి గెల్చారు, ఈరోజున ఇలా నిలబడ్డారు. Great.
    @సుజాత గారు:
    నా బాధల్లా, మనకి కనీస విషయ పరీజ్ఞానం కూడ లేదే అని. గుండే పెరిగితే ఇవీ సింటంసు. లేక Single Sided Dumbness అంటే ఇది. Stroke అంటే ఇది.ప్రధమ చికిత్స ఇది అని మనకెక్కడా లేదు. ఇన్ని సినిమా హాళ్ళు ఉన్నై. టీవీ ఉంది. సోది నాటకాలు సొల్లు ప్రోగ్రాములేసేకన్నా, ఒక్క ప్రకటన, జనాలకోసం, గుండే జబ్బుకి ప్రధమ చికిత్స ఇది అని ఒక చిన్న యాడ్ ఫిల్మ్ వేయొచ్చుగా. చూద్దాం మున్ముందు మన సోకాల్డ్ యూత్ గొఱ్ఱెలు ఎలా ఆలోచిస్తాయో.

    @సిరిసిరిమువ్వ గారు:
    అవును.

    అన్నీ వ్యాపారాత్మకత ని సంతరించుకున్నై. విలువలు, బంధుత్వాలు, సర్వీసులు కూడా. ఐతే, ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయ్యండి, ఐతే "ఈ బస్సు చేయి ఎత్తినచోట ఆపబడును" లా "మా సర్వీసు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పొందవచ్చును, ఇదీ దాని ఖరీదు" అంటె సరిపోతుంది కదా. మన పరీస్థితి ఏంటంటే, అన్నా డబ్బుబెడతా, మోర్జంపాడ్లో ఉన్న ఈ హృద్యోగిని జిజిహెచ్ (గుంటూరు జెనరల్ హాస్పిటల్) కి తరలించండి అంటే, తరలించే మాధ్యమం ఏది?

    ReplyDelete
  5. Rural healthcare needs a complete revamp. Heart Disease is the #1 killer in the world, ahead of Cancer and HIV. It's time the authorities woke up and ram some awareness campaign among the people.

    ReplyDelete