Mar 10, 2012

రాట్నంవడికేటి సేతుల్ల టీవీ రిమోట్లొచ్చె

మితృడు లక్ష్మీ నరేష్ ఇట్టా ఓ టపా ఏసినాడు
మీలో ఎంత మందికి వ్యవసాయం చెయ్యాలని ఉంది....ఈ జీవితానికి దూరం గా, పచ్చని పొలాల మద్య సేద తీరుతు, అలిసిపోఏంత పని చేసి చద్దన్నం ఆవురావురు మంటూ తిని...మద్యాన్నం కాగానే మర్రి చెట్టు కింద ఓ కునుకు తీసి పొద్దు వాలేప్పుడు ..బారులు తీరిన పక్షులతో పాటు మనము ఇంటికి చేరి, వేడి వేడి అన్నం లో రోట్లో తొక్కినా పచ్చడి, నెయ్యి పప్పు ...గడ్డ పెరుగుతో ముగించి...ఆరు బయట మంచం వేసుకొని ఎద్దుల కట్టిన మువ్వల సవ్వడి వింటూ...పుచ్చ పువ్వుల విరిసిన వెన్నల్లో లేదా చుక్కలు నిండిన ఆకాశాన్ని చూస్తూ రేపటి కోసం ఆలోచిస్తూ నిదురలోకి జారుకుంటే...ఉదయాన్నే తొలి కోడి మీకు మేలు కొలుపు పాడి మిమ్మల్ని నిద్ర లేపి సూరిడోచ్చే వేళకి బద్ధకం ఆమడ దూరం పారిపోయి...ఇది మనకి దేవుడిచ్చింది...మరి మనం దేనికోసం వెతుకుతున్నాం....ఉన్నారా మీరంతా, మీ EMI అన్ని తీర్చేయండి, మనలా మన పిల్లల్ని మండల ప్రాధమిక పాఠశాలా లో చేర్పించండి.....అందరం కల్సి ఎడ్లు కట్టి , పొద్దునే పొలం పోదాం...ప్రతి వారం టౌన్ కెళ్ళి రెండో ఆట చూద్దాం...ప్రతి ఏడు జరిగే తిరునాళ్ళ కెళ్దాం...మన ఊర్లో ఆటలా పోటీలు పెడదాం...మళ్ళి పల్లెల్ని బ్రతికిద్దాం..మనం బ్రతుకుదాం....ఏముంది ఈ జీవితం...ప్రకృతి ఇచ్చిన చల్ల గాలిని AC తో నింపాం,కలుషితం చేసాం ...పారే ఏటిని కలుషితం చేసాం....భూ జలాలు లేకుండా తూట్లు పొడిచాం..ఎం చేస్తే మనకి శాంతి ...మీలోకి ఓ సరి తొంగి చూడండి...మీరు ఎక్కడో ఓ మూలాన బిక్కు బిక్కు మంటూ కూర్చుని ఉంటారు...ఓ సారి నోరు తెరిచే అవకాశం ఇస్తే ఇదే చెప్తారు....మరి మీరేమంటారు....నాకు సమాధానం కావాలి...చేయలేమా అలా...

నా సమాధానం

గిప్పుడా మఱ్ఱిచెట్లూపాయే
గాలీ పాయే
మువ్వలూపాయే
పట్టెడగంటలూ పాయే
యాడ్జూసినా కలుస్జితం
నీళ్ళులేవు
సెట్లు లేవు
అన్నీ కొట్టేసిన్రు తుక్కునాకొడుకులు
కరెంటుగావాల పెద్దానికి
డీజిలుగావాల దున్ననీకి
ఎడ్లు ఎవునింట ఉన్యాయీ? సీపెట్టూ?
పొలాలగొట్టిన యూరియా దెబ్బకి నీళ్ళంతా ఎరువుకంపే కొడతాఉన్యాది
సెట్టు పుట్ట ఇల్లూ వాకిలి ఎరువుకంపు
పెతోడు ఎరువుకంపు
పాడి పాడెక్కనే ఎక్కినాది
సిక్కంకట్టిన దూడలు కలల్లోనే మిగిలె
రాట్నంవడికేటి సేతుల్ల టీవీ రిమోట్లొచ్చె
రోట్లో పోటేసే సేతులు ఊరక కూసోబట్టినై
తిరగలి సిరామిక్ టైల్స్ కిందకిబాయె
బావుల గిలకలు తుప్పుబట్టిపాయె
సేంతాళ్ళు ఎవునికి తెలుసూ
ఎద్దులకు గట్టే ముక్కుతాళ్ళను నేసిన చేతులు ట్రాక్టరు స్టీరింగు తిప్పుతన్నయి
యాభై బుంగలు నీళ్ళు తోడి కాగులు మోసిన గూడలు మోటరు స్పిచ్చులు ఏస్చన్నయి
బగమంతుడా, ఏంసిచ్చరా నాయనా
పొట్టసేతపట్టుకుని పట్నాలకు అంపించినావు మమ్ముల్ని
థూ!! ఎదవబతుకైపోయనే!! దేవుడా

2 comments:

  1. ప్రపంచం మొత్తం మారిపోలేదేమోనండీ... నిజంగా అందరూ మారిపోయుంటే ఈ రోజు ధాన్యంగింజలు ఇలా మన నోటికందవుగా.

    ఈ రోజుల్లో కూడా...
    రూపాయికి కొదవలేకపోయినా ఇంట్లో టివి వాడని వారున్నారు,
    ఇప్పటికీ ఇంకా "బుడ్డి"ల్తో నీళ్ళు తెచ్చి మొక్కల్ని తడుపుతున్నారు,
    కోట్లు సంపాదించినా పొలాన్ని దగ్గరుండి చూసుకునేవారున్నారు,
    "కారెం"తో నీళ్ళు తోడి పంటలు పండిస్తున్నారు,
    పాడిమీదే ఆధారపడి ఇంటింటికీ పాలమ్ముకుంటూ రూపాయిరూపాయి కూడబెట్టుకునేవారున్నారు,
    తిరగలిని మాత్రమే వాడేవారున్నారు. (అంతెందుకు... ఇప్పటికీ పొడులకీ, పచ్చళ్ళకీ, సున్నుకీ... రోలు, తిరగళ్ళనే వాడతారు మా అత్తయ్య)

    మీకో విషయం తెలుసా... ఉదయం పది గంటలనుంచి సాయంత్రం అయిదు గంటలవరకూ మూడువందల రూపాయల కూలి ఇస్తామన్నా వ్యవసాయపనులకు కావల్సినంతమంది పనివాళ్ళు దొరకడం లేదు. అంటే మారుతోంది మనమో, మన మనస్తత్వాలో కాదండీ... మన చదువులు. అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అయితే తిండిగింజలు పండించేదెవరు...?

    అందరూ సిటీబాట పడుతుంటే... వ్యవసాయం చేసేవారు తగ్గిపోయి, దిగుబడి పెరగడం కోసం కొత్తకొత్త మందుల్ని కనుక్కొంటూ, ఒకే మొక్క రెండు దిగుబడులిచ్చేలా ప్రయోగశాలల్లో సంకరాలు చేస్తూ, అలా చేసే చదువుల్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. మన పిల్లలకి అవే చదువులు నేర్పుతున్నాం. ఇదో సైకిల్..

    మనలో ఒకరం మారితే ఆ మార్పు మరికొంతమందిని మార్చుతుంది.

    అవకాశం లేనప్పుడు, సిటీల్లో స్థిరపడిపోయినప్పుడంటారా.. అప్పుడు ఎలాగూ తప్పదు, కానీ మారే పరిస్థితులు అందుబాటులో ఉన్నప్పుడు మారడం అనివార్యం.

    ఇప్పటి జీవన విధానం గురించి ఇది నా అభిప్రాయం మాత్రమే... మీరు ఏకీభవించాల్సిన అవసరం లేదు.

    ReplyDelete