Aug 18, 2010

సొతంత్ర దినోత్సవమ్

అబ్బా!! ఈ న్యూయార్క్ న్యూజెర్సి ఏరియా వాళ్ళు హెంత అదృష్టవంతులు. వాళ్ళని జూస్తే నా కళ్స్ మంట్స్. ఇక్కడి సొతంత్రతా దినోత్సవ సంరభ సందర్భంగా జెండా వందనానికి సొతంత్ర సమర యోధురాలు కుమారి। మల్లికా శరావత్ వేంచేసారు. ఎంతటి భాగ్యం! ఆలెక్కన ఇక్కడి సొతంత్రతా దినోత్సవాలకు ప్రతీఏడాది ఇలానే సమరయోధురాళ్ళు వచ్చి మన దేశ ఔన్నత్యాన్ని విశదపరచి ప్రవాస భారతీయ యువ కుసుమాలకు జ్ఞానబోధని, వారు దేశంకోసం పడ్డ కష్టాలను త్యాగాలనూ ఏకరువు
పెడుతుంటారు. ఎంత అదృష్టం ఆ సమూహానిదీ? వే వెళ్ళలేక పోయినందుకు కడు చింతిస్తున్నా. ఐనా నేనిప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్ళా కదా. ఇక ఇక్కడ మా దురదృష్టం, ఇలాంటి వేడుకలు చేయలేకపోవటం, చేసే యోచన లేకపోవటం, ఒకవేళ
ఉన్నా, మల్లికా శరావత్ లాంటి యోధురాళ్ళు ఆల్రెడీ బుక్కైపోయి ఉంటరు కదా.

వీళ్ళలాంటి దేశ భక్తులు చాలా అవసరం. నిద్రాణంగా మరియూ అంతరించిపోయే ప్రమాదంలో పడనున్న మన సంస్కృతి సాంపదాయలను తిరిగి ఆవిష్కరించే దిశగా వీరిలాంటివారు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు.

నా జ్ఞాపకాల దొంతరలో ఓ చిన్న కదలిక. అప్పట్లో, మా ఊళ్ళవైపు నాటకాలు వేసేవారు. సాంఘీక నాటకాలు. దీనిపై ఓ టపా కూడా కట్టాను ఇంతక ముందు. ఆ నాటకాల్లో హీరోయిన్లుగా వేసేందుకు గుంటూరు నుండి ఓ హీరోయిన్ను బృందం
వచ్చేది. వాళ్ళు చాలా ఫేమస్ నాయికలు. వీళ్ళు నాటకనికి ఒప్పుకుంటే మూణాల్రోజుల ముందే వాలతారు రిహార్సిల్స్ కోసమని. మధ్యాహ్నమంతా రిహార్సిల్స్. మరి డ్యాన్సులు కట్టాలి ఆడాలి కదా. రాత్రిళ్ళు బయట పెద్ద క్యూ. కాస్తడబ్బున్న పోరంబోకులందరూ ఆ క్యూలో కనిపిస్తారు. సంఘసేవ. ఆళ్ళకి మల్లికా శరావత్‌కి పెద్ద తేడా ఏముంది?

ఇక, టీవీ చానెల్స్ తమ దేశభక్తి చాలా అత్భుతంగా చాటుకునే ఉంటాయని నేను ఊహించగలను. దేశభక్తి సినిమాలు ప్రసారం చేసి, మరియూ మధ్యమధ్యన మల్లికా శరావత్ మొమైత్ఖాన్ లేక ఇలియానా లాంటివారిచే "హ్యాప్పీ ఇండిపెన్డెన్స్ డే"
అని చెప్పించి ఉంటారు. టీ.ఆర్.పి రేటింగ్స్ ఎంత పెరిగితే అంత దేశభక్తి ఉన్నట్టు వారికి.

స్టార్ టివీ వారి ఒక కార్యక్రమం, *ఆజాదీ లైవ్* దానిపేరు. ఆ టీవీ సీరియళ్ళలో పనిచేసే హీరో హీరోయిన్ విలన్ యాట యాట యాట అందరూ వచ్చారు. ఒక్కోకరు ఒక్కో థీంత్‌తో ఆడి అలరించాం అనుకున్నారు. ఒక్కోక్కరు తమతమ అభిప్రాయాలను తెలియజేసారు. ఈనాటి పరీస్థితులపై తమ తమ గొంతులను వినిపించారు. చాలా మంది హింస వద్దు, మిలిటెంట్లు సాధించేదేమీ లేదు, అందరికీ బతికే హక్కుంది అని ముక్తకంఠంతో చెప్పారు. కొందరు ఆడవాళ్ళు కొన్ని కదిలించే మాటలు చెప్పారు. మనకి స్వాతంత్రం వచ్చి అరవై ఏళ్ళు దాటినా, ఆడదానిపై అత్యాచారాలు ఏమాత్రం తగ్గకపోగా పెరుగుతున్నాయనేది పచ్చి నిజం అని, అవి అమాయక ఆడపిల్లపైనే కాక విదేశీ వనితలను కూడా బలితీస్కుంటున్నాయని, ఇవి చాలా స్పూర్దిదాయకంగానే కాక ఆలోచింపతగ్గ మాటలే కదా.

ఇక మధ్యమధ్యలో రోడ్డున పోయే వారిని ఆపి స్వతంత్రతా దివశ్ అంటే మీకేంటీ? మీ దృష్టిలో ఏంటీ లాంటివి కొన్ని చూపించారు.

ఒకతన్ని జై జవాన్ జై కిసాన్ అని ఎవరన్నార్రా నాన్నా అంటే దిలీప్ కుమార్ అని సెలవిచ్చాడు గుట్కా నములుతూ. జాతీయ గీతం ఏంట్రా అంటే ఊంచీ హై బిల్డింగ్ లిఫ్ట్ తేరీ బంద్ హై అన్నాడు. పాపం. వాడికి తెలియదులా ఉంది మనకి స్వతంత్రం వచ్చిందని. ఆ *నేలబారు* [గొల్లపూడివారి కాపీరైటు మాట] జీవితాలకి అర్ధం కాకపోయి ఉండొచ్చు స్వాతంత్రం అంటే ఎంటో. తప్పేమీ లేదు. ఆలెక్కకొస్తే ఈడ్చి తంతే ఎందరు సోకాల్డ్ చదువు కొంటున్న యువతకి స్వతంత్ర పోరాటం గురించి తెలుసూ?

నాకేం అనిపిస్తుందంటే - స్వతంత్రపోరాటం లేక యోధులు లేక గీతాలు తెలియకపోవటం ఓ పెద్ద నేరం కాదూ అని. దేశభక్తి అనేది కేవలం ఓ అందమైన మాటే అని. దేశభక్తి కన్నా ముందు, కుటుంబం, సమాజం, తర్వాత జిల్లా రాష్ట్రం అటుపై దేశం..ఈ వరసలో ముందు కుటుంబం ఎడల భక్తి, బాధ్యత కలగలని నా ఉద్దేశం. ఆ తర్వాత తనుండే సమాజం. ఇవి లేని వాడికి *నే దేశభక్తిపరుణ్ణి* అని ఓ బోర్డ్ తగిలించుకుని తిరిగినంత మాత్రాన ఓపెద్ద ఒరిగేదేమీ లేదు. కావాల్సింది సామాజిక బాధ్యత.

స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకు తీరాలి. ఎందుకంటే ఎవడో వచ్చి మనల్ని చేతిలో పెట్టుకుని మన సంపదనంతా దోచేసి మనల్ని కట్టుకునేందుకు కేవలం ఓ బెత్తడు గుడ్డతో మిగిల్చేస్తుంటే, పోరాడి ఎదురించి సాధించాం స్వాతంత్రాన్ని. ఆవేళ స్వాతంత్రం రాకుండా ఉండిఉంటె ఇప్పటికి ఏమీ మిగిలి ఉండేది కాదు. అందుకొరకు, స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకు తీరాలి. ఆరోజున
తమతమ ప్రాణాలని పోరాటం కోసం త్యాగం చేసిన త్యాగ మూర్తులను కనీసం ఏడాదికొక్క మారు స్మరించాలి. ఐతే, అక్కడితో ఐపోతుందా తతంగం, మర్రోజు నుంచీ తిన్నామా లేచామా తొంగున్నమా తెల్లారిందా.

ఇక నిన్న మన గురూగారు స్వాతంత్రతా దినోత్సవ శుభాకాంక్షలు పంపించారు అందర్కీ, నేనూ ఆ లిస్టులో ఉన్నా. ఆ మెయిల్ కి ఇంకో పెద్దాయన ఎదో రిప్లై కొట్టారు. దానికి ఒక మేతావి వెంటనే ఎవరి ఎద్దు పెంట ఇదీ, మీకసలు స్వాతంత్ర పోరాటం అంటే ఏంటో తెలుసా? మీకసలు పార్టీషన్ అంటే ఏంటో తెలుసా అని దద్దించారు, గాండ్రించారు. మాకెలా తెలుస్తుంది? నిశానీగాళ్ళం మరియూ స్వతంత్ర పోరాటంలో పాలు పెరుగు పంచుకోని వాళ్ళం. చదువు కొన్న వాళ్ళం. అసలు పార్టీషన్ అంటే ఏంటో వారిలాంటి మేతావులు చెప్తే నా లాంటి ఛాందసులు విని తరించాలి. లేక ఏ రంగనాయకమ్మ [పాపము సమించుగాక, రంగనాయకమ్మ గారూ
అనాలి] విరచితమైన గ్రంధమో లేక అరుంధతీ రాయో రప్పో లేక రోమిల్లా థప్పర్ చేతినుండి జాలువారిన *నిజమైన చారిత్రాత్మక ఉత్గ్రంధ*మో ఉటంకిస్తే నాబోటి భావవైశాల్యంలేని కుంచితపాదులు తెలుసుకుని, తరించి పాకిస్థానీయులనూ లేక పార్టీషన్కు కారణభూతులైన సత్‌జనులను పేరుపేరునా పూజిస్తారు.

3 comments:

 1. >>పార్టీషన్ అంటే ఏంటో వారిలాంటి

  అందుకే IBM లాప్‌టాపులో, డెస్క్‌టాపులో వాడకూడదు.
  http://support.microsoft.com/kb/309000

  అది చదివి తెలుసుకోండి..

  >>ఆళ్ళకి మల్లికా శరావత్‌కి పెద్ద తేడా ఏముంది?

  ఆళ్ళు ఎప్పుడూ సంఘ సేవ చెయ్యరు, చెరావత్, ఎప్పుడూ ఒళ్ళు ఆరేసుకోని చేస్తూనే వుంటడి, 24x7 అన్న మాట..

  ఝెండా వందనానికి వెళ్ళి అంతసేపూ ఎండలో ఏడ నిలబడతామబ్బా అని దుప్పటి కప్పుకొని తొంగున్నా, తరువాత తెల్సినాది, గట్లా చెస్తే దేశభక్తి తెల్వదు/ అదే అదే లేదని అందరికీ తెల్సిపోతాది అట..

  ReplyDelete
 2. chaala bhaga chepparu.manaku teliyanappudu evaro okaru cheppedi vinaali kadaa?andaru andariki nachharu,antamaatrana vaallanu avamaaninchinatlu raayadamu manchidikaademo aalochinchandi

  ReplyDelete
 3. >>జెండా వందనానికి సొతంత్ర సమర యోధురాలు కుమారి। మల్లికా శరావత్ వేంచేసారు.
  హ్హ..హ్హ..హ్హ
  నాకు బాగా గుర్తు. టి.వి9 మొదలయిన తరువాత వచ్చిన మొదటి జనవరి 26కి ఒక రిపోర్టర్ మైకిచ్చుకు బయల్దేరి ఒక పబ్ నుంచి బయటకు వచ్చి కార్ లాక్ తీసుకుంటున్న అమ్మాయిని జనవరి 26 ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడు. ఆ యువతి తీవ్రంగా ఆలోచించి చించి "ఈజ్ ఎనీవన్స్ బర్డే? ఐ డిడెంట్ రిమెంబర్" అంది

  ReplyDelete