Jul 30, 2009

అంత అభిమానం ఎలా?

నెమలికన్ను మురళి రేడియో కధానిక చదువుతుంటే మధ్యలో ఈ క్రింది వాక్యాలు నన్ను ఆకర్షించాయి.
డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. ఇతర క్వాలిఫికేషన్లు బాగున్నాయి. ప్రయత్న లోపం లేకపోయినా ఉద్యోగం దొరకలేదు. సున్నితమైన మనస్తత్వం. తండ్రి మాటలు భరించలేక పోయాడు.
మనోళ్ళు నిజంగనే అభిమానవంతులు. ఆ అభిమానానికి హద్దు ఉండదు. ఓ మాట అంటే అంతే.
1981, April 24, స్థలం దాచేపల్లి - దాదాపు మధ్యాహ్న సమయం. మా బాబాయి టైప్ హైయ్యర్ తప్పాడు అనే వార్త తెలుసుకుని మా తాతయ్య, చెడామడ తిట్టాడు. బాబాయి అప్పటికి డిగ్రీ పూర్తి చెసాడు. టైపు నేర్చుకుంటే మంచిదన్నట్టు బహుసా నేర్చుకుని ఉంటాడు. సాధారణంగా మా ఊళ్ళవైపు మాటపట్టం అంటే మహాకష్టం. తొందరగా మాటపడం. కన్న తండ్రి అరిస్తే, ఆవయసులో ఉన్న కుఱ్ఱాడు పుసుక్కున మందు తాగేస్తారు. ఇంతమందినిజూసా. మా ఇంటి దగ్గర్లోనే క్రాంతికుమార్ గారి ఆశుపత్రి. ఎన్నో కేసులు ఇలాంటివి. పురుగు మందులు ఎండోసఫాన్, నువాక్రాన్, ఎండ్రిన్ లాంటివి తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేయటం. ఐతే, బాబాయి ఏంచేసాడో తెల్సా?
ఇంట్లోంచి పారిపొయ్యాడు. ఔను, ఇంట్లోంచి ఎవ్వరికీ చెప్పకుండా పారిపొయ్యాడూ ఆరోజే. మేము పిడుగురాళ్ళలో ఉండేవాళ్ళం ఆరోజుల్లో. మానాన్నకి కబురొచ్చింది. అయ్యా మీ తమ్ముడు పారిపొయ్యాడు మీనాన్నగారు కూలబడ్డారు అని. వెంటనే వెళ్ళాం దాచేపల్లికి. తాతయ్య పాపం అవాక్కయ్యాడు. అదిరిపొయ్యాడు. ఇటు బాబాయి చిన్నవాడె, ఎలా ఎటువెళ్ళాడో ఎంటో అనే ఆందోళన. జనాలు వెతకటం ప్రారంభించారు. అక్కడ ఇక్కడ నడికుడి స్టేషన్ మాచర్లలో తెల్సిన వాళ్ళకి చెప్పారు, గురజాలలో తెల్సినవాళ్ళకి వెప్పారు. గుంటూరులో తెలిసిన వాళ్ళకీ చెప్పం. దొరకలేదు. జాడలేదు.
1982 గడిచిపోయింది
1983 గడిచిపోయింది.
తాతయ్యకి ఎటాక్ వచ్చింది. పక్షవాతం. లేవలేని స్థితికి వచ్చాడు.
1984 గడిచిపోయింది. వెతికే జనాలు వెతుకుతూనే ఉన్నారు
1985 లో తాతయ్య దిగులుతో వెళ్ళిపొయ్యాడు. పేపర్లో ప్రకటన ఇచ్చాం. బాబూ ఇకనైనా రారా నాన్నా అని. జాడలేదు.
1995 ఐపోయింది.
2005 మానాన్న పొయ్యారు. పేపర్లో ప్రకటన ఇచ్చాం.

మా బాబాయు జాడ ఇంతవరకూ లేదు.
నిజం.
ఇప్పటికి దాదాపు ముఫై ఏళ్ళు కావస్తుందా? ఇంతవరకూ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు.

13 comments:

  1. చాలా బాధాకరం భాస్కర్ గారు, చదువుతుంటూనే చాలా చాలా బాధగా అనిపించింది..

    ReplyDelete
  2. అయ్యో !చాలా బాధాకరం భాస్కర్ గారు, చదువుతుంటూనే చాలా బాధగా అనిపించింది.మీకు ఇంట్లోనే ఇలా జరిగింది కనుక మీకు ఆ బాధ ఇంకా ఎక్కువగా అనిపించివుంటుంది.

    ReplyDelete
  3. మా బంధువుల్లో కూడా ఒకతను ఇలాగే ఇల్లు విడిచిపెట్టి వెళ్లి పోయాడండి.. మిగిలిన పిల్లలు అందరూ చుట్టూ ఉన్నా అతని తల్లి తండ్రి చివరి రోజుల్లో అతన్నే తలచుకుంటూ కన్ను మూశారు.. ఇప్పటికీ అతని జాడ తెలియదు.. ప్చ్.. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల పరిణామం ఇలాగే ఉంటుంది..

    ReplyDelete
  4. స్వాభిమానం ఎక్కువైనా కష్టమే...ఆవే్శపు నిర్ణయాలు ఎంతటి అనర్ధాలకి దారితీస్తాయో....చాలా బాధపడి ఉంటారు ఆ తల్లిదండ్రులు...ప్చ్...

    ReplyDelete
  5. మీ రచనా శైలి బాగుంది. చక్కగా రాస్తున్నారు. :)

    ReplyDelete
  6. కామెంటుపెట్టిన అందరికీ ధన్యవాదాలు.
    మురళి - ఆవేశంలో తీసుకునే నిర్ణయాల పరిణామం ఇలాగే ఉంటుంది..ఇంతవరకూ బాగనే ఉంది. మరీ ఇక నీకూ నాకూ చెల్లు అనేది జీవితాంతం అంటే ఎలా? కొరుకుడు పడట్లా.
    స్వాభిమానం ఎక్కువైనా కష్టమే!! నిజం. స్వాభిమానం ప్రాణలతో చెలగాటం కాకూడదు.

    ReplyDelete
  7. ప్చ్.. చదువుతుంటే బాధగా అనిపించింది.

    ReplyDelete
  8. పిల్లలు ఎంత మంది ఉన్నా దగ్గర లేనోళ్ళ గురించే తలితండ్రులకి చింత,అదే చివరి రోజులని ఇంకా దగ్గరకి చేర్చి మరీ బాధిస్తూ ఉంటుంది,అంతేలే మన చేతిలో ఏముంది కనక మానవ ప్రయత్నం తప్ప.

    ReplyDelete
  9. నాకు మాటలు రావడం లేదు బ్రదర్..

    ReplyDelete