Jul 15, 2009

ఏతన్మాత్రుఁడు

నాకు బాగా గుర్తు, నా ఎనిమిదో తరగతిలో తెలుగు పద్యభాగంలో ఓ పద్యం. మా తెలుగు మాష్టారు బుఱ్ఱలో చాలా లోతుగా నాటాడు ఈ పద్యాన్ని. ఎప్పుడూ నోట్లో ఆడుతూ ఉంటుంది గుర్తుండీ గుర్తులేనట్టుగా.

ఆరూపం బవికార, మాభుజబలం బత్యంత నిర్గర్వ, మా
శూరత్వంబు దయారసానుగత, మా శుంభత్ర్కియాజ్ణాన మా
ర్యారంభ ప్రతికూల వాద రహితం, బాయీగి సమ్మానవి
స్తారోదాత్తము మాద్రి పిన్నకొడుకేతన్మాత్రుడే చూడగన్


మొత్తానికి పట్టా ఈ పద్యాన్ని మళ్ళీ.
పై పద్యం విరాట పర్వం లోనిది (విరాట - 2-209)
ఏతన్మాత్రుఁడే అనగా సహదేవుడు. ఇది సహదేవుణ్ణి గురించి ద్రౌపది అభిప్రాయం.
ఇది భర్త గురించి భార్య భావన. ఏ భార్యయైనా తన భర్తని అమాయకుడని, వెర్రిబాగుల వాడని అంటే ఒప్పుకోదు. అలా ఉండాలని కోరుకోదు. భార్యకు కావలసింది ముంది భర్త రూపం. అందుకే ఆరూపంబవికారము అని సహదేవుని రూపం బాగుంటుందని చెప్పింది. తల్లికి రూపంతో నిమిత్తం లేదు. అందుకే అక్కడ కడు పసిబిడ్డ భార్య భర్తలో గొప్ప నాయకత్వ లక్షణాలన్నీ ఉండాలని కోరుకుంటుంది. అందుకే అతని భుజబలం గురించి ప్రశంసించింది. బలం ఉంటే మంచిదే కానీ గర్వం ఉండకూడదని భార్య కోరుకుంటుంది. ఉంటే తనకీ ప్రమాదమే. అందుకే సహదేవుని నిర్గర్వాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పింది. భర్త శూరుడు కావాలని కోరుకొనే భార్య కూడా మరి రౌడీలా ఉంటే సహించలేదు. అందుకే అతడు శూరుడే కాని, దయారసానుగతుడని చెప్పింది. తన భర్త పదిమందీ మెచ్చుకొనేలా అన్ని పనులు నిర్వహించగలగాలని (Managing Ability) భార్య కోకుకొంటుంది. అంతే కానీ మా ఆయనకి ఔను, కాదు అనడం కూడా తెలియదు. బొత్తిగా నోట్లో వేలు పెడితే కొరకలేడు. అని ఏ భార్యా చెప్పదు. అలా చెబితే వెర్రాడి పెళ్ళాం వాడకెల్లా వదిన అన్నట్లుగా చుట్టు ప్రక్కల వాళ్ళకి ఆమె లోకువై పోతుంది. అందుకే సహదేవుని క్రియా జ్ఞానం (Working Knowledge) గొప్పదని చెప్పింది. మొత్తం మీద సహదేవుడు అసాధారణ ప్రజ్ణాశాలి అని తేల్చింది. తల్లి మాటలకి భార్య మాటలకి ఎంత తేడా ఉందో చూడండి. ఆ తేడా ఆ స్థానాల్లో ఉన్న స్త్రీల మనోభావాలను బట్టే ఏర్పడుతుంది. ఈ భేదాన్ని భావంలోనే కాదు భాషలో కూడా చూపించడం తిక్కన గొప్పదనం. పద్యం మొత్తం సంస్కృత సమాన భూయిష్టంగా నడిచింది. ఈగి, పిన్నకొడుకు, చూడగన్, వంటి మాటలు తప్ప మిగిలిన పద్యమంతా సంస్కృత సమాస బంధురమై గంభీరమైన శైలిలో నడిచింది. ఈ శైలి భార్య భర్తను గురించి వ్యక్తం చేసే ఉదాత్త గంభీర భావాలకు సరిగ్గా తగినది. సందర్భాన్ని బట్టి భాషలో ఈ భేదాన్ని అడుగడుగునా చూపించి సంస్కృత ప్రేమికులైన కవి పండితులను, ఆంధ్రాభిమానులయిన రసజ్ణులను ఇద్దరినీ మెప్పించబట్టే తిక్కనను ఉభయ కవి మిత్రుడన్నారని పెద్దలు పేర్కొన్నారు.

దీనికోసం గెలుకుతుంటే ఈ క్రింది లింకు తగిలింది.
http://siliconandhra.org/nextgen/sujanaranjani/april2009/virataparvam.html
పై పేరా ఇందునుండి సంగ్రహింప బడింది.

5 comments:

 1. పద్యంతో పాటి వ్యాఖ్యానం బాగుంది భాస్కరా!

  ReplyDelete
 2. "కేతన్మాత్రుడు" ఎవడు నాన్నా? ఆ పద్యంలోని పదవిభాగం "మాద్రి పిన్నకొడుకు+ఏతన్మాత్రుఁడే (ఏతత్+మాత్రుఁడే)" అని కదా!

  ReplyDelete
 3. శంకరయ్య గారూ - అవునుసుమా...నిజమే. తెలుగు పదవిభాగాలు గట్రా మర్చిపొయ్యి సాన్నాళ్ళే అయ్యింది..

  ధన్యవాదాలు.

  ReplyDelete