కొన్ని వేల సంవత్సరాలుగా ప్రభువులు బ్రాహ్మణికల్ యాటిట్యూడ్‌లో తడిసి ముద్దై గుళ్ళు, గుడి వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి కోసం మాన్యం, గుడికొక అర్చకుడు అనే వ్యవస్థని ఏర్పాటు చేశారు.
కొన్ని శతాబ్దాలో దశాబ్దాలో నడిచాక పరాయి పాలకులు దేశాన్ని గుళ్ళను గుడి సంపదను దోచుకోగా మిగిలిన టాంజిబుల్ ప్రాపర్టీలని తమతో తీసుకెళ్ళలేక పాపం డీలాపడి, సదరు భూముల్ని ఎలా దోచుకోవాలా అని బాధపడ్డారు.
శతాబ్దాలు దశాబ్దాలు గడచాక నల్లదొరల పాలనలో దోచేవాడే పాలకుడు అయ్యాడు రాజకీయ వేత్త అయ్యాడు కాబట్టి దోపిడికి అడ్డు అదుపూ లేకుండా పోయింది.
దోచుకున్నోడికి దోచుకున్నంత అయ్యింది.
ఈ రాపిడిలో దోపిడిలో ఒరిపిడిలో ఎండ్లకాలం అమెరికన్ అమ్మాయి డ్రస్సు లాగా వేల ఎకరాలున్న దేవుడి మాన్యం కాస్త కురచై కురచై జానెడుకొచ్చింది.
ఇందులో తిలా పాపం తలా పిరికెడు.
చివరికి 2020వ సంవత్సరం ఓ పెద్దాయన -
ఆ ఫైలు ఇలా తే! స్వామి వారికి ఎక్కడెక్కడ ఎంతెంత భూమి ఎవరెవరు ధారాదత్తం చేశారో చూద్దాం అన్నాడు.
ముందరి ప్రభుత్వ హయాంలో ఏసీ గదుల్లో కూర్చునే కొందరు బడాబాబులు "అబ్బే! వేస్ట్ భూమి. ఎందుకూ పనికిరాదు. అక్కడెక్కడో, మనకి దూరం గురూ కనీసం వెళ్ళి చూడను కూడా లేము, ఏ పాతిక సెంట్లో ఉంటే ఎవడు కాపాడతాట్టా" అన్నారు.
వాళ్ళని తప్పు పట్టలేం.
ఒకరకంగా చెబితే - భక్తులు ఇచ్చే భూమిని ట్రాక్ చేయటమూ కష్టమే, దాంట్లో అసాంఘీక కార్యకలాపాలు జరక్కుండా కాపు కాయటమూ కష్టమే.
ఇంతలో కొందరు మేధావులు - ఈ చిన్న చిన్న ముక్కలని అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి, ఎక్స్ఛేంఝ్ ఆఫర్ కింద కన్సాలిడేటెడ్ గా ఓ పెద్ద ముక్క పొందవచ్చు కదా?
ఎగ్రీడ్. మంచి ఆలోచనే. అయినా కష్టమే.
సరే! ఏతావాతా - దేవుడికి భక్తులిచ్చిన భూమిని వదిలించుకోవటం అనకుండా - దాన్ని ఏదోరకంగా ప్రజలకే ఇస్తే అటు ప్రజలకూ ఉపయోగం. ఇటు కనిపించని ఆ దేవుడికి ఆనందం.
అయితే సమస్య - దీన్ని గురించిన రాజకీయం.
అమ్ముదాం అన్నది ఎవరూ?
ఇంతక ముంది ఎన్ని సార్లు అమ్మారు?
ఇప్పుడు అమ్మటానికి ప్రాతిపదిక ఎప్పటిదీ?
ఈ ప్రశ్నలు అడిగితే - మీరు సమస్యని డైల్యూట్ చేస్తున్నారు, జనాల వేడి మీద నీళ్ళు పోస్తున్నారు అంటున్నారు.
అడక్క పోతే - తిరుపతి కొండనే అమ్మేస్తారు దగుల్బాజీలు అంటున్నారు
దీనికి పరాకాష్ఠ - గుంటూరు రైల్వేస్టేషన్ని, గాంధీ పార్కునీ, దానిముందున్న కూరగాయల మార్కెట్టుని అమ్మేస్తున్నారట అని ప్రచారం.
ఎంతకి దిగజారిపోతున్నారో రాజకీయ నికృష్ఠులు అనిపించింది.