Jun 14, 2011

తెలుగులో ప్రభుత్వ వెబ్‌సైట్లు

ఇకపై 'అంతర్జాలం'
తెలుగులో ప్రభుత్వ వెబ్‌సైట్లు
ఏక సంకేత లిపిలో సభ్యత్వం!
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్‌సైట్లను తెలుగులోకి అనువదించనున్నారు. ఇక నుంచి ప్రతి వెబ్‌సైట్‌ ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగు అంతర్జాలం (ఇంటర్నెట్‌) అమలు కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. ఈ మేరకు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏక సంకేత లిపి (యూనీకోడ్‌)లో ఇప్పటికే ఎన్నో భాషలు సభ్యత్వం తీసుకున్నాయి. దేశంలో తమిళానికి సభ్యత్వం ఉంది. తాజాగా తెలుగు భాషకు ఏక సంకేత లిపి సమాఖ్య (యూనీకోడ్‌ అథారిటీ)లో సభ్యత్వం తీసుకునేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. దీంతో తెలుగు అక్షర, పదాలు, సంఖ్యలు, అర్థాలకు సంబంధించిన సంకేతాలు(కోడ్‌), అనువర్తనాలు (అప్లికేషన్లు) అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. ఏక సంకేత లిపి సమాఖ్య సమావేశాలకు రాష్ట్రం తరఫున హాజరయ్యే అవకాశం ఏర్పడుతుంది. దీనికి తోడుగా రాష్ట్రంలో వెబ్‌సైట్లకు ఒకే రకమైన ప్రమాణాలు రూపొందించనున్నారు. సెర్చింజన్‌లో తెలుగు భాషలోనూ వెబ్‌సైట్లు సెర్చ్‌ చేయడానికి వీలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బాగుంది. అత్భుతమ్. ఆహ్వానించతగ్గది. ఐతే, ఈ తెలుగీకరణ ప్రహసనంలో ఆంగ్లంనుండి తెలుగుని పుట్టించే ప్రమాదం లేకపోలేదు. అలా ఐతే, ఒక్క పదం కూడా అర్థం కాక జనాలు బుర్రలు నేలకేసి కొట్టుకునే ప్రమాదం ఉంది.
తెలుగు పదాలను ఉన్నవి ఉన్నట్టు వాడటం ఒకెత్తు, ఆంగ్లపదాలను తెలుగులోకి మార్చటం మరో ఎత్తు.
అనువర్తనాలు = అప్లికేషనులు.
బ్రౌన్ నిఘంటువులో అనువర్తనము అంటే -
అనువర్తించు (p. 0057) [ anuvartiñcu ] anu-vartinṭsu. [Skt.] v. a. To attend on, serve, follow, court one's favour. అనుసరించి నడచు. అనువర్తనము n. Serving or following another.
గ్విన్ నిఘంటువు ప్రకారం
anuwartanam

anuwartanam n. application

బూదరాజు గారి నిఘంటువులో
అనువర్తనము అంటే అప్లికేషన్ అని ఉన్నది.

సాధారణ వాడుకదారు నిఘంటువులను అనుక్షణమూ అందుబాటులో ఉంచుకోలేడు.
వెబ్సైట్లలోని పదాలను ఎవరు ఎలా స్టాండర్డైజ్ చేస్తారు? అనేది పెద్ద ప్రశ్నే అని నా అభిప్రాయం.

తెలుగు అంతర్జాల అమలు కోసం నియమింపబడ్డ కమిటీలో వీవెన్ గారికి చోటు దక్కటం గొప్ప విషయం వీవెన్ గారికి అభినందనలు. వారు శక్తికొద్దీ పనిచేసి చక్కటి ప్రమాణాలతో తెలుగు అంతర్జాలాన్ని అభివృద్ధి చేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వారికి నాతరఫునుండి పూర్తి మద్దతుని బ్లాగ్ ముఖంగా ప్రకటిస్తున్నాను. వీవెన్ గారూ ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నన్ను సంప్రదింప వలసిందిగా కోఱుతున్నాను.

No comments:

Post a Comment