Sep 16, 2020

జయ ప్రకాశ్ రెడ్డి

జయ ప్రకాశ్ రెడ్డి


మనాన్న గారు హిందూ కళాశాలలో పట్టభద్రుడైయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఒక ఏడాది చదివి మధ్యలో జై ఆంధ్రా ఉద్యమం అంటూ సమ్మెలు హర్తాళ్ళు అయ్యాక మధ్యలోనే ఆపివేసి బందరులో బిఈడి చేరినప్పుడు ఆయనకి సహాధ్యాయీ జయప్రకాశ్ రెడ్డి గారు. మా నాన్న గారికి కూడా నాటకాల పిచ్చి ఉండటం. డిగ్రీ రోజుల్లో ఒకె నాటకాన్ని అయిదు రోజులు ప్రదర్శించటం. ఆ నాటకం పేరు ఒథెల్లో అవటం. అదీ ఇంగ్లీషులో అవ్వతం. ఆయన డిగ్రీ సర్టిఫికెట్ లో "Talented Actor" అని ఉండటం - గొప్పగా చెప్పుకునే వాడు నాన్న.


జయప్రకాశ్ రెడ్డి గారు మా నాన్న గారు ఒరేయ్ ఒరేయ్ అనుకునే స్నేహితం.


ఓ రోజున నాన్న సమరసింహారెడ్డి సినిమాకి వెళ్దాం పదా అని లాక్కెళ్ళారు. బాలకృష్ణ సినిమాలు థియేటరుకి వెళ్ళి చూసినవి 4 మాత్రమే. ఏంటినాన్నా బాలయ్య సినిమకి లాక్కుపోతున్నావ్ అని ఏడుస్తూ మూలిగితే నా మిత్రుడు జయప్రకాశ్ రెడ్డి అందులో గొప్పగా నటించాడు. వాడికోసం అని చెప్పుకొచ్చాడు నాన్న.


సమరసింహారెడ్డి సినిమా చూట్టం జయప్రకాశ్ రెడ్డి గారి నటన చూసి ఆయనే నటించినంతగా పొంగిపోవటం ఇంటికొచ్చాక ఒరేయ్ అంటూ ఆయనతో మాట్లాడటం. నాన్న గొప్పగా పొంగిపోయాడు - అదిగో వాడే నా మిత్రుడు అంటూ.


టీచర్ల బృందంలో బాగా నలిగిన నాటకాలు కొన్ని. ఈ ఇద్దరు మిత్రులూ కొన్ని నాటకాల గురించి మాట్లాడుకునే వాళ్ళు. మరో మొహంజో దారో గురించి మధ్యలో వచ్చేది. జయప్రకాశ్ రెడ్డి గారి అలెక్జాండర్ గురించి మాట్లాడుకునే వారు.


జయప్రకాశ్ రెడ్డి గారు స్క్రీన్ మీద ఎంత గంభీర్యంగా ఉన్నా నిజ జీవితంలో చాలా సౌమ్యంగా మాట్లాడేవారు. ఎంతో సాఫ్ట్ గా మాట్లాడేవారు. చిన్నా పెద్ద అని లేకుండా అందరితో బహు సరళంగా మాట్లాడేవారు. మా నాన్న లాగానే.


ఆయన కాలం చేశారనే వార్త నన్ను కలచి వేసింది.


నటుడికి చావుండదు అని నా అభిప్రాయం.


2 comments:

  1. నటీనటులు వారు రక్తి కట్టించిన పాత్రలతో జనాల మదిలో ఎప్పటికి నిలిచే ఉంటారు. జయప్రకాశ్ రెడ్డి గారి అకాల మరణం అందరిని కలచి వేసింది, భాస్కర్ గారు..!

    ReplyDelete