Jan 8, 2010

జ్ఞాపకాల దొంతర - జనవరి

ఆరోజుల్లో -
మండుటెండలకి సుప్రసిద్ధమైన పల్నాడ్లో కూడా డిశెంబరు జనవరుల్లో సలిపుట్టేది. సలిమంటేసుకునేవాళ్ళం. పొద్దున్నే మంచుదొంతరలు కప్పేసేవి ఊరుఊరుని, పంటపొలాల్ని. గడ్డిమీన, చెట్లమీన పూరిగుడిశెలమీనా మంచుబిందువులు కప్పుకునుండేవి.
అట్టాంటిరోజుల్లో, జనవరి నెల మొదట్లో -
రెండోమూడో మానికల బియ్యం నానబెట్టి,
నీడపడని కొంచెం సురుక్కుమనే ఎండలో నులకమంచం వాల్చి
పైన దుప్పటిపరిసి
బియ్యం ఆ దుప్పటిమీన పల్సటిపొరలా పోసి,
బాగా ఆరేంతలో
గోడకానోనున్న రోలు సుబ్బనంగా కడిగి,
రోకలి సుబ్బనంగా కడిగి
తడిలేకుండా తుడిసి
మెద్దానం రెంటికో మూడుకో ఇక రంగంలో దిగితే
ఒకపోటు, జూడుపోటు
ఆ బియ్యం రోట్లో ఏసుడు పోటు ఏసుడు
దంచిన్దాన్ని జల్లెళ్ళో పోసి జల్లెడపట్టి కిన్దకి దిగని నూకని మళ్ళీ రోట్లో ఏసి
అట్టా మొత్తం అయినాక, బియ్యప్పిండిని మళ్ళోరోజు ఎండబోసి
పిండిబాగ ఏడెక్కినాక
పొయ్యెట్టి, మంచిబెల్లంతో పాకంపట్టి యాలుకలేసి కమ్మగా చలిమిడి ముద్ద చేస్తే,
ఇక పెద్ద ఇనప భాండిపెట్టి, నూనెపోసి అమ్మ కూర్చుంటే,
నేనూ అన్నయ్య ఇద్దరం బాదం ఆకులమీద చలిమిడి ముద్దపెట్టి గుండ్రంగా అప్పచ్చిలా నొక్కి ఇస్తే బాగా కాల్చి పీటలాంటె ఓ జల్లెడమీద పెడితే దాన్ని నూనెకక్కేలా నొక్కితే -
ఆవచ్చిన అరిశెలు* కరకరలాడుతూ, ఎన్నితిన్నా ఇంకా తినాలనిపించే అరిశెలు.
.....................
జనవరి నాకు అత్యంత ఇష్టమైన నెల. కారణం *రేగ్గాయలు*. :):)
దోర రెగ్గాయలు తినీ తినీ పసరుపడేది.
ఇక పండువి తినీతినీ పళ్ళు పులిసిపొయ్యేవి.
అదొకెత్తైతే రేగి అప్పచ్చులు. రేగిపొట్టుపచ్చడి.

నోరూరుతోంది...ఏంచేయ్యటం??

యావత్ జనులకూ సంక్రాంతి శుభాకాంక్షలు

6 comments:

  1. భలే కమ్మగా ఉంది మీ జ్ఞాపకాల దొంతర. "అరిశెలు" నాక్కాదు గాని మావారికి చాలా ఇష్టం.
    నాకు రేగుపళ్ళతో చేసే "రేగొడియాలు" ఇష్టం. మా నానమ్మ ఎంత బాగా పెట్టేదో...సేలవులకు వెళ్తే డబ్బా నేనే ఖాళీ చేసేదాన్ని.....కానీ ఇప్పుడిక తినటానికి లేదు..."రేగుపళ్ళని" మేమిద్దరం కాశీలో వదిలేసాం...:)
    అప్పుడే సంకురాతిరి శుభాకాంక్షల్లోకి వచ్చేసారా..! అయితే మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. అరిసెలు రేపు మేం చేసుకుంటున్నామోచ్......
    రేగొడియాలు తెలుసు, రేగు పొట్టు పచ్చడి ఏంతో కొంచెం చెపుతారా?

    ReplyDelete
  3. ఇప్పుడే అరిశెలు తింటూ మీ పోస్ట్ చదివాను. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. రేగుపళ్ళ మీద ఇష్టం మెల్లగా తగ్గి పోయింది కానీ అరిశెలు మాత్రం ఇంకా నోరూరిస్తూనే ఉంటాయ్ సోదరా... మరి ఇంత ట్రెడిషనల్ గా కాకపోయినా అరిశెలు చేయడానికి ప్రయత్నిస్తున్నారా లేదా.

    ReplyDelete
  5. reggayalaa mee kavitha pulla pullagaa bhale bavundi. meeku jakara-subhakara samkranti subhakanshalu.

    ReplyDelete
  6. ఇప్పుడే చూసాను మీ పోస్ట్
    అసలే సంక్రాంతి జరుపుకోలేదని నా గోలలో నేనుంటే (http://vivaha-bhojanambu.blogspot.com/2010/01/blog-post_15.html) మీ అరిసెల ఊరింపొకటి...బాగానే ఉంది సంబడం

    ఇప్పుడు ఆఫీసులో కరకరలాడే అరిసేలు గుర్తొచ్చేస్తున్నాయి,లాలాజలం ఉబికొస్తోంది, నానేటి సెయ్యనురో బగమంతుడో :(

    ReplyDelete