Dec 27, 2009

జ్ఞాపకాల దొంతర - వైకుంఠ ఏకాదశి

మనం పరమబేవార్సుగా తిరిగే రోజుల్లో, ఇంట్లో అప్పటికి మా నాయన నాస్తికత్వ చొక్కాని ఇంకా ఏసుకుతిరిగే రోజుల్లో, మాయమ్మ హిందూ సనాతన ధర్మాన్ని తూచా తప్పక పాటిస్తూ మహానైవేద్యాలు పెట్టేరోజుల్లో, ఒకానొక రోజున మా సందు సివరాకరున్న శ్రీ బడబానల వీరప్రతాప ఆంజనేయస్వామి వారి భక్తులు కొందరు, మా పక్కింట్లోని వెంకటేశ్వర రావు మాష్టరు *శ్రీ విష్ణుసహస్రనామ అహోరాత్రపారాయణ* ఏర్పాటుచేసారు. ఓ పెద్ద ఏర్పాటు, జనాలు, అట్టఇట్టా అని అందరూ అంటుండగా విన్నా. ఇక రేపు పొద్దున మొదలెడతారనంగా మాష్టారుగారు నన్నోకేకేసి పిలిచి అబ్బాయి, నువ్వు నీమిత్రబృందం అందరూ పాల్గోవాలి అని చెప్పారు. వాకే దాందేముంది అన్నాం అందరం. అప్పటిదాకా విష్ణుసహస్రనామం అనే పేరు ఇనటమేగానీ అదేంది, ఆ కధేంది మనకసలేం తెల్వది.
సరే, వెంకటేశ్వర రావు గారు, అబ్బాయిలూ రేపు అహోరాత్రపారాయణ, అచ్చేయండా అంటే - వాకే అన్నాం. ఆయన అలాక్కాదు బాబూ, ఇదీ ఇదిఇదానం అని ఇవరణ చెప్పారు.
అహోరాత్ర పారాయణ - పొద్దున ఆరుకి మొదలు, ఆపకుండా మర్రోజు పొద్దున ఆరుదాకా సదవాల. బువ్వ తినకూడదీ, సుట్ట బీడీ తాక్కూడదీ, బయటకి పోకూడదీ, నో ఔట్ గోయింగ్, నో ఇన్కమింగ్, నో పార్కింఎటాల్ అనిజెప్పారు.
వోరినాయనో పొద్దుగాలపొద్దుగాల ఆర్కి మొదలెట్టి మర్రోజు పొద్దున ఆరుదాకా సవినమంటే గొంతుకాస్తా బొంతవదా సోవీ అని సందేహం ఎలిబుచ్చాం. ఓరిపిచ్చిసన్నాసి అదా నీ సందేహం అని - నువ్వు మొదలెడతావు, ఇంతలో ఇంకోడందుకుంటాడు, అలా తర్వాత ఇంకోడు..అలా ఆపకన్డా మర్రోజు పొద్దుటిదాకా అనిజెప్పి కళ్ళు తెరిపించాడా మగానుభావుడు.
ఇంకేముంది, మర్రోజు పొద్దుగాల్నే లెగిచేసి బావికాడ ఓ నాలుగు బుంగలు నెత్తినపోస్కుని, ఓ తెల్లపంచ గోచిపెట్టుకుని సలికి గజగజ లాడుకుంటా ఎళ్ళి కూకున్నాం.
హా వచ్చావా ఇంద ఈ బొక్కు తీస్క్కూర్చో, మొదలెట్టు అన్నారాయన. అప్పటికే ఓ పాతికమంది చేరుకున్నారు. హడావిడిగా ఉంది.
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం...
ఇంతవరకూ సురిగాడిక్కూడా వచ్చు.
పూర్వపీఠిక మొదలయ్యింది. ఎబ్బే నోరు తిరగట్లా. అందరు పండితుల్లా సదివేస్తున్నారు. మనకేమో నొక్కులు. మన పక్కనకూకున్నాయన ఓ పెద్దమగానుభావుళ్ళా ఉన్నాడు, ఇసుగ్గా సూట్టం మొదలెట్టాడు. అలా అచ్చరం అచ్చరం కూడబలుక్కుని మొత్తానికి ఒకరౌండు లాగించి వెంకటేశ్వర రావుగారి వైపు జూసా అయ్యా ఓపాల్జదివా ఇక ఎళ్ళొచ్చా వల్లోతల్లేమరి, ఏంజెయ్యాలే అని. ఆయన, మొదటి రౌండు మూడుగంటలు తమ్మీ. కూకో, మూడు గంటల్లో ఎన్నిసార్లో సదువతరో అన్నిసార్లు సదువహే అనిసెలవిచ్చారు. మూడుసార్లవరకూ కుంటుతూ నడిచబండి నాలుగోసారికి పర్లేదు, ఐదోసారికి ఇంకాస్తమెరుగైయ్యింది. మొత్తానికి మన మూడుగంటల ప్రహసనం అయ్యింది. ఆరోజు సాయంత్రం మళ్ళీ ఓ మూడుగంటలు కూకున్నాం. మర్రోజు పొద్దున, ఆరుకల్లా వచ్చేమన్నారు. ఎళ్ళాం. ఈసారి నిన్నపొదుణ్ణుండి సదివన అందరూ వచ్చారు. చివర్స్సారి చదివింది అత్భుతంగా అనిపించింది. అయ్యాక అందరికీ ఉల్ల్స్, మిరగాయలు గట్రా ఎయ్యకుడా చేసిన గోధుమఉప్మా భిక్ష పెట్టారు.
అయ్యాక ఒక పెద్దాయన పిలిచాడు, ఆయన సేతిలో ఓ పెద్దనోటుబుక్కు. అబ్బాయి నీపేరు గోత్రం గట్రా చెప్పుకో అన్నాడు. ఎందుకో అనుకుని చూస్తే అప్పుడు కనిపించింది అక్కడో బ్యానరు *శ్రీ విష్ణు సహరనామ పారాయణా సంఘం, బ్రాడీపేట* అని. ఈపెద్దయన దానికి ప్రెసినెంటు. సదవటానికిచ్చిన బొక్కు ఈళ్ళు అచ్చేయ్యించిందే. అబ్బాయి ఈసారి ఏకాదశికి మళ్ళీ అహోరాత్రపారాయణ ఇంకోరింటో. నీకు ఓకార్డుముక్క ఏస్తాం, తప్పకుండా రావాలి అని సెలవిచ్చారా పెద్దాయన.
అలా మొట్టమొదటిసారి శ్రీ విష్ణుసహస్రనామ పరిచయం అయ్యింది.
ఇక తర్వాత యం.యస్ సుబ్బులక్ష్మిగారు *శ్రీ విష్ణుసహస్రనమం* అనేదొకటుంటుందని తెల్సుకుని, క్యాసెట్టు చేయింద్చుకుని అప్పుడప్పుడు సదవటం మొదలెట్టా.
అది అప్పుడప్పుడు నుండి ప్రతీరోజు కి మారింది ఒకానొక సీజనులో.
ఇప్పుడు తప్పులు లేకుండా చదవగలిగేంత రేంజికి వచ్చింది కధ.

అస్సలేందయ్యా అంటే - ఇంతదూరాభారంలో, అహోరాత్రపారాయణలు జరగటం కాదు, కనీసం చదివే భాగ్యం దొరకటమే కష్టం.
ఈ రోజు మా ఊళ్ళో వైకుంఠఏకాదశి చేస్తున్నారు. సాయంత్రం గుళ్ళో శ్రీ విష్ణుసహస్రనామ పారాయణ. గమ్మత్తేంటంటే ఈ పారయణ సామూహికంగా చేస్తే భలే ఉంటుంది.

మీ అందరికీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు. ఆ భగవానుడు అందరినీ సదా కాపాడుగాక.

7 comments:

 1. రోజూ అమ్మచదివుతుంటే ఇదిసానా వీజీ అని అనుకునేవాణ్ణి. స్కూల్లో చదువుకునే రోజుల్లో సాయంత్రాలు ట్యూషనులో కూర్చుంటే అళఘనాథస్వామిగుడిలోంచి వినిపిచ్చేది ఎమ్మెస్సమ్మ గొంతు. ఇంజనీరింగ్ మూడోసం. సెలవుల్లో ఓసారి చదవాలి అనుకుని అమ్మదగ్గర కూర్చున్నా. ఇంతకీ ఓసంగతి చెప్పటం మర్చిపోయా- అమ్మ విస్ణుసహస్రానికి వీరఫాన్సుండేవాళ్ళు సాయిబాబాగుడిలో. చాలాకాలం సాయాత్రం తప్పకుండావెళ్ళి పారాయణ చేసొచ్చేది. సరే అమ్మదగ్గర కూర్చున్నాం. ఇంట్లో అట్టపైన సాయిబాబాబొమ్మ ఉండే పచ్చరంగుపుస్తకం చేతికిచ్చింది. మొదలెట్టా. నీలానే సేంటుసేం 'శుక్లాంబరథరం' ఆతర్వాత? ఎలాగో ఓవారం గడిచింది. కొన్నిచోట్ల రిథం బాగా కుదిరేవి గబగబా వచ్చేసేయి. అయితే ధ్యానం ఉందే "క్షీరోధన్వత్ప్రదేశే.." అబ్బే పంటికింద నాలుక పడీపోయేది. ఓపదిరోజుల తర్వాత వీజీఅయిపోయి తర్వాత మరోనెలకి నోటికి కంఠతావచ్చేస్తే "అబ్బో. మనమే." అనుకున్నాగానీ ఆగొప్పతనమంతా అనుష్టుప్‌దే. ఆతర్వాత గీతాప్రెస్సోళ్ల పసుప్పచ్చ పుస్తకం జేబులో సరిపోయేది వచ్చింది.

  ReplyDelete
 2. మీ క్కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. శ్రీనివాసుని కటాక్ష సిద్దిరస్తు .

  ReplyDelete
 4. అన్నాయ్, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. పది సెలవుల్లో, ఓ పది రోజులు దీక్షగా ముత్యాలంపాడు సాయి బాబా గుళ్ళో చేసాను కాని, తరువాత కుదరలేదు. ఇప్పటికి ఆ గుళ్ళో అహోరాత్ర పారాయణ జరుగుతుంది. అసందర్భమైనా, ఒక మాట, సాయి లీలామృతం లో విష్ణు సహస్రనామం గురించి ప్రస్తావన ఉంటుంది. భావ యుక్తంగా రోజుకి ఒక నామమైనా చదవమని, సాయిబాబా శ్యామా కు చెబుతారు. నీ పుణ్యమా అని ఈ రోజు ఒక సారి ఎమ్మెస్ గారి తో కలిసి చదివేసా.

  ReplyDelete
 5. "ఆ గొప్పతనమంతా అనుష్టుప్ దే" - లెస్స బలికితిరి. నిజంగా ఎమ్మెస్ గొంతులో అవి విన్నాక మళ్ళీ ఎక్కడా వినాలనిపించదు. నేను ఎనభై శ్లోకాలదాక కంఠస్థం చేసి మానేశా. ధ్యానం శ్లోకాలు బెస్టు శ్లోకాలు. ఇప్పటికీ ఇంట్లో పిల్లలకి అపుడపుడు తెలుగు డిక్టేషన్ పోటీ పెట్టి ఇవి పలికిస్తుంటా. (ఇది సంస్కృతమనుకోండి..కానీ వాళ్ళకది తెలీదు)

  ReplyDelete
 6. మీక్కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.

  ReplyDelete