Nov 4, 2009

మఱ్ఱిచెట్టు మహాలక్ష్మమ్మగారి ముద్దుల మూడో మనుమరాలు

సు.వీ: మింగినట్లున్నావ్ కొత్తావకాయతో కొండంత బాయ?
రోగి:చిత్తం. ఆహా!! చేయిచూడకుండానే ఎలా చెప్పగలిగారో మహానుభావులు?
సు.వీ:ఆవకాయలో వేడిఉంటుంది. ఆవేడి నాలాంటి వాడికల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా కోడి. ఇదిగో ఈ మాత్రలు తీస్కెళ్ళి రాత్రికి రెండు పొద్దున్నే పది మింగు.
[ఇంతలో సుత్తివేలు వస్తాడు, వచ్చి కుర్చీలో కూలబడతాడు]
సు.వీ:జంటగా వెళ్ళి ఒంటిగా తగలడ్డావేం?
రోగి:నేనాండి?
సు.వీ:నిన్ను కాదు. నువ్వెళ్ళు
రోగి:వత్తాను బాబయ్యా
సు.వీ:కోడలేదిరా?
కోడలేదిరా అంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా ఊడల జుట్టు వెధవ. ఏం అమ్మేసావా?
సుత్తివేలు:నా ఖర్మ. సినిమాకెళ్ళామా!! అందులో ఓ మాంచి ఫైటింగు సీను వచ్చింది. హీరో రౌడీల్ని బాత్తున్నాడు. అదిచూసి నీ కోడలు అమెరికాకి వినిపించేట్టుగా కై మని ఓ ఈలకొట్టింది. దాంతో ముందు సీట్లోని ఒకామెకి గుండేజబ్బు వచ్చి పడిపోయింది.
సు.వీ:హమ్మా హహహ [గుండెమీద చెయ్యి పెట్టుకుని]
సుత్తివేలు:నాన్నా నాన్నా నీక్కూడానా? నాకంత అదృష్టంకూడానా? ఆ ఆపరేటరు ఈలవిని భయపడి సినిమా ఆపేసి లైట్లేసాడు. జనాలంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నే పారిపోయివచ్చా. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా చూపించాల్సిందే అంటూ ఈలేసి గోలచేస్తోందక్కడ.
సు.వీ:ఈ ఈలల గోల మనకేల. ఈ ఈలన్నది ఇలలో కలలో మన ఇంటావంటా లేనిదే
సుత్తివేలు:అబ్బా తన ఈలతో నే చస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోల ఏంటినాన్నాతలవాచిపోతోంది.
ఇంతలో శ్రీలక్ష్మి వస్తుంది.
సుత్తివేలు:ఆగు! ఏవిటే, హుం? ఏవిటి ఇందాక నువ్వక్కడ చేసిన పని?
శ్రీలక్ష్మి:కోప్పడకండి. అంత శబ్దం వస్తుందని అనుకోలేదు.
సుత్తివేలు:ని ని నిన్ను, ఈ జన్మలో బయటకి తీస్కెళ్తే చెవిలో ఈలేసి చంపేయవే
శ్రీలక్ష్మి:అంతమాట అనకండి. ఈలవేయటం నాకిమాత్రం ఇష్టమానా? ఏం చేయను చెప్పండి, ఎక్కువ సంతోషం కానీ బాధగానీ కలిగినప్పుడు, వేళ్ళు వాటంతట అవే దగ్గరౌతాయ్, నోటిదగ్గరకి వెళ్ళిపోతాయ్, నోట్లోంచి గాలొస్తుంది, బయటకి శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకుతెలియకుండానే జరిగిపోతాయండి.
సుత్తివేలు:నావల్లకాదే. ఈలేసే పెళ్ళాణ్ణి ఏలుకోలేను. ఇవ్వాళ్ళో రేపో వకిలు గారిని కలిసి నీకు విడాకులిచ్చేస్తా.
శ్రీలక్ష్మి:అంటే ఏంటండీ
సుత్తివేలు:కోర్టువారు నీకూ నాకూ ఏ సంబంధం లేదని కాయితం ఇస్తారు. అది
శ్రీలక్ష్మి:కైఈఈఈఈఈఈఈ!! క్షమించండి ఇది బాధ ఈల
సుత్తివేలు:ఓసి నీ బాధ తగలెయ్యా
సు.వీ:గుండిగకిందపడ్డ అప్పడంలా చితికిపోయింది కదమ్మా గుండె. ఒరేయ్ కుంకాక్షి. ఇహనుంచి క్షమించమని నీ ఆవిణ్ణి ఏదీ అడక్కు. ఆసంబరంలో ఈలకొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలౌతుంది. స్వస్తి.
సుత్తివేలు:ప ప లోపలికి ప.



సుత్తివేలు:ఇదిగో ఇదిగో ఇప్పుడేమయ్యిందనే ఈలకొడుతున్నావ్
శ్రీలక్ష్మి:తాతగారు గుర్తుకొచ్చి.
సుత్తివేలు:చూడు, చచ్చిపోయినవారి పట్ల మౌనంపాటించాలే కానీ ఇలా ఈల వేసి చప్పట్లుకొట్టి గోలచేయకూడదు.
శ్రీలక్ష్మి:నాకుతెలియదండి
సుత్తివేలు:నాఖర్మే నా ఖర్మ. మన పెళ్ళి చూపులప్పుడు, సరిగ్గా నిన్ను ఇంట్లోంచి తీసుకునొచ్చేముందు లోపలనుంచి కైఈఈ మని ఈల వినిపించి అదిరిపడ్డాను. అదేదో దొడ్లో పాలేరు వెధవ ఈలేసాడని సర్దిచెప్పాడు మీనాన్న. నిజమే అనుకుని మోసపొయ్యాను.
శ్రీలక్ష్మి:రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూసాను, అంతే!!!!!

సు.వీ అలా కుర్చీలో కూర్చుని ఉంటాడు. సుత్తివేలు టకామనొచ్చి ఇటుపక్క కుర్చీలో కూలబడతాడు. అలవాటుప్రకారం సు.వీ సుత్తివేలు వైపు చూడకుండ ఇంకోవైపు చూస్తూ, పక్కనే ఉన్న మందుల డబ్భలో చేయిపెట్టి
హా ఏవిటయ్యా జబ్బూ, నువ్వా!! ఏరా గస్తీ గుమస్తాలా చంకన సర్టిఫికేట్ల బస్తాతో బస్తీ అంతా గస్తీ తిరిగొస్తున్నట్టున్నావ్. ఏవైంది? ఉద్యోగం వచ్చిందా?
సుత్తివేలు:హహ రాలేదు నాన్నా, హహహ ఇంకోళ్ళకి ఇచ్చెసారు.
సు.వీ:హా?? ఎవైరానా ఉద్యోగం రాకపోతే బాధపడతారు! నువ్వు సంతోషపడతావేరా అక్కుపక్షి??
సుత్తివేలు:ఏం చేయనూ ఛావనా? నా ఖర్మకలి ఉద్యోగం వచ్చి పట్నంకెళ్ళి కాపరంపెట్టా అనుకో, నీకోడలు నిమిషానికోసారి కైకై అని ఈలకొట్టిందంటే ఇదేదో దొంగలముఠా నాయకురాలనుకుని పోలీసులు పట్టుకుని జైల్లో తోస్తారు. మొన్నేంజరిగిందో తెలుసా?
సు.వీ:తెలియదే??
సుత్తివేలు:విను. పట్నం తీస్కెళ్ళానా. అక్కడ రైలెక్కబోతూ స్టేషన్లో మావిడి తాండ్ర అమ్మేవాణ్ణి చూసి కూకూ అని ఓ విసురు విసిరింది. అది గార్డు విజిల్ అనుకుని రైలెళ్ళిపోయింది. ఛస్తున్నానుకో దీంతో..
సు.వీ:విధివైపరీత్యం. మంచి మర్యాదలుకల మహామగువ మానవసేవే మాధసేవని మనసారా నమ్మిన మహా ఇల్లాలు మఱ్ఱిచెట్టు మహాలక్ష్మమ్మగారి ముద్దుల మూడో మనుమరాలుకదా అని మనువు చేస్కుంటే
సుత్తివేలు:నాన్నా! నీప్రాస ఆపు ఛస్తున్నాను. ఈ జన్మలో నువ్వు కధరాయలేవు, రచయితవీ కాలేవు. ఇంకా ఎందుకీ ప్రాసా ప్రయాసానూ
సు.వీ:నోర్మూయ్. మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా, బక్కచిక్కిన కుక్కగొడుగు మొక్కలా, చదలు కొట్టేసిన చక్కముక్కలా, కుక్కపీకేసిన పిచ్చి మొక్కలా, బిక్కమొహంవేస్కుని, వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ, చుక్కలు లెక్కబెడుతూ, ఇక్కడే ఈ వుక్కలో గుక్కపట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేస్కుని, డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుంటూ, నక్కపీనుగలా చెక్కిలాలు తింటూ, అరటితొక్కలా, ముంగిట్లో తుక్కులా, చిక్కుజుట్టేస్కుని, ముక్కుపొడిపీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్ళాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులుచేస్తూ, రెక్కలుతెగిన అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్కబల్లమీద పక్కచుట్టలా పడుకోకపోతే, ఏపక్కకో ఓ పక్కకెళ్ళి, పిక్కబలంకొద్దీ తిరిగి, నీ డొక్కసుద్ధితో వాళ్ళని ఢక్కాముక్కీలు తినిపించి, నీ లక్కు పరీక్షించుకుని, ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకుని, ఒక చిక్కటి ఎడ్వాన్సు చెక్కు చెక్కుచెదరకుండా పుచ్చుకుని, తీసుకురావొచ్చుకదరా తిక్క సన్నాసి.
హహ ఇందులో యాభైయారు కాలున్నాయి తెలుసా?



నిన్న తెలుగువన్ లో ఏదో హాస్యపు ఛురకుల్ చూస్తుంటే పట్టేసాను పై హాస్యాన్ని.
సు.వి = సుత్తి వీరభద్రరావు తండ్రిగా , సుత్తివేలు కొడుగ్గా, శ్రీలక్ష్మి సుత్తివేలుకి భార్యగా వేసారు. ఆనందభైరవి అనుకుంటా సినిమా.
ఇక్కడ వినండి ఈ ఆడియో http://nalabhima.posterous.com/6968665.

5 comments:

  1. పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలోఒకటేరాగం
    అది ఆనందభైరవరాగం.
    అన్నట్టు "నీనూనె నీనూనె నానూనె నానూనె. నీనునెని నానూనెని నానూనెని నీనూనెని నేనన్నానా నాన్నా." ఇది మిస్స్ కొట్టినట్టుంది అన్నాయ్.

    ReplyDelete
  2. భలే ఉంది.నేను ఎపుడో చిన్నపుడు చూసా ఈ సినిమా.మళ్ళీ గుర్తు చేసారు.థాంక్స్.

    ReplyDelete
  3. చదివాం , విన్నాం, నవ్వుకున్నాం :)

    ReplyDelete
  4. హహహ!ఎప్పటి ఙ్ఞాపకమో గుర్తు చేసారు. బాగుంది.

    ReplyDelete
  5. పేరు చాలా బాగుంది. టపా ఇంకా బాగుంది. బాగా నవ్వుకున్నా. నెనర్లు.

    ReplyDelete