Nov 3, 2009

మాతృభాష

మాతృభాషని పిల్లలకి నేర్పడం ఓ సామాజిక బాధ్యత అని నా నమ్మకం. భాషని కేవలం తల్లితండ్రులే బతికించగలుగుతారు. బడిని, పిల్లలు తిరిగే ప్రదేశాలని అన్నిటినీ తల్లితండ్రులు మాత్రమే కంట్రోలు చేయగలుగుతారు. ఎలా అంటే మా అబ్బాయి మీ బడికి ఎందుకురావాలి, ఏమి నేర్పుతున్నారూ? ఇవి నేర్పండి. ఇలా ఐతేనే మావాడు మీ బడికి వస్తాడు అని మా అబ్బాయి ఇక్కడ ఆడుకోవాలంటే ఈఈ పరీస్థితులు ఉండాలి అనీ.

ఈ మధ్య మా ఊళ్ళోని కొందరిని గమనిస్తే నాకు పిచ్చి కోపంవస్తోంది. తెలుగు తల్లి తండ్రులే, పిల్లల్తో ఆంగ్లంలో మాట్టాడుతున్నారు. సరే, ఆ తల్లితండ్రుల తల్లితండ్రులు చూట్టానికి వచ్చి, వాళ్ళుకూడా పిల్లల్తో ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. వచ్చీరాని భాషని. ఈ మధ్య మా ఇంటికి ఇలాంటి ఒక తల్లి, ఒక కూతురు, ఒక మనుమరాలు వచ్చారు. మావాడు ఆంగ్లంలో మాట్లాడుతుంటే మావిడ అరేయ్, తెలుగులో ఏడువు అని చెప్పిందట, ఆ ముసలామే, పర్వాలేదు, నేను అర్ధం చేస్కోగలను అలవాటయిపోయింది అని సూరిగాడితో ఆంగ్లంలో మాట్లాడిందట. ఆళ్ళు వెళ్ళిపొయ్యాక మావాడికి ఘట్టి క్లాసు పీకాం. ఇంట్లో ఆంగ్లం వద్దు అని. చక్కగామాట్లాడతాడు మావాడు తెలుగు. మేమేనాడు వాడితో ఆంగ్లం మాట్లాడలేదు.

అంతదాకా ఎందుకు, నేను ఒకటినుండి పదివరకు తెలుగు మీడియంలో, ప్రభుత్వ అభ్యుదయ పాఠశాలలో, ఆం.ప్ర.రా.జి.ప్ర.ప.ఉ.పాఠశాలలోనే చదువుకున్నా. ఆగ్లం భాషలో చదవకపోవటం ఆటంకంగా నాకు ఎక్కడా ఆనిపించలా.

నేను దేశదేశాలు తిరిగాను. హెలనిక్ రిపబ్లిక్ లో పని చెసాను. రోమన్ రాజ్యంలో పని చేసా. నాకు ఇటాలియన్ వచ్చు, గ్రీక్ వచ్చు, కొంచెం రష్యన్ వచ్చు, కొంచెం జెర్మన్ వచ్చు, కొంచెం స్పానిష్ కూడా వచ్చు. భాష తెలుసుకోవటం భావాన్ని వ్యక్తపరచే ప్రక్రియలో ముఖ్యమైనది.

ఆశ్చర్యకరమైన విషయాలేంటంటే - ఐరోపా దేశాల్లో తొంభైశాతం బళ్ళు వాళ్ళ వాళ్ళ మాత్రుభాషల్లోనే భోదిస్తాయి. ఐతే వాడుక భాషలో ఆంగ్లం నేర్చుకోటానికి బడే అవసరంలేదు. *లెరనింగ్ బై ఇమిటేషన్* అని ఒకటుంటుంది. చూసి నేర్చుకో. మాట్లాడి నేర్చుకో. సింపుల్.

అలానే ఎక్కడో దేనికో వెతుకుతుంటే పిల్లలమఱ్ఱి అరవింద మరియూ కూచిమంచి రవి అనే భార్యాభర్తల దగ్గర ఆగింది నా గూగుల్ వెతుకులాట. పిల్లలమఱ్ఱి అరవింద ఈమాట లో ఓ చక్కని వ్యాసాన్ని రాసారు.
తెలుగదేల యన్న … http://www.eemaata.com/em/issues/200509/64.html
ఇలా అంటుంది ఈమె -
"కాని ఈ రోజుల్లో కూడ రెండు మూడేండ్ల వయసున్న పిల్లలు తెలుగు మాట్లాడుతుంటే, “ఇంకెంత కాలం మాట్లాడుతారట్లా?” అని అందరు అనుకుంటారే తప్ప, ఆ వయస్సులో ఉన్న కేపబిలిటీని ఎట్లా నర్చర్ చేయ్యాలి అని ఎక్కువ మంది ఆలోచించరు."
ఇది అక్షరాలా నిజం. మావాడు టీవీలో కైలాన్ అని ఓ జాపనీస్ కార్టూన్ చూస్తాడు. నిహావ్ అంటే అర్ధం తెలుసు వాడికి. అలానే డోరా డియాగో చూస్తాడు ఆయూడమే అంటే తెలుసు వాడికి. కారణం వీళ్ళు ఆంగ్లంతోపాటు ఇతర భాషల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనం మన మాతృభాషని చంపేస్తున్నాం. ఎంతతేడా? ఎంత దారుణం? ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే లేత వయసులో పిల్లలు కనీసం ఆరు భాషల్ని నేర్చేస్కోగలరట. అందుకే అరవింద *ఎట్లా నర్చర్ చేయాలి అని ఎందుకాలోచించరూ* అని అంది.

ఏమౌతుంది నేర్పకపోతే? *ఫన్* అనేది పోతుంది. మాడలీకం పోతుంది. దాంట్లోని *మన తనం* పోతుంది. ఈరోజు రేపట్లో నేరాసే పోస్టులు కొన్ని కొంతమందికి భలే నచ్చుతున్నాయి. కారణం? ఆ *మన తనమే*. తెలుగులో ఆలోచించలేని వాళ్ళు పధ్యంది అనే అనుకుంటారు, భాషలోని ఆనందాన్ని పట్టెసినవాళ్ళు పజ్జెంది అంటే కమ్మగా నవ్వుకుంటారు.

*తెలుగు గురించి ఇప్పుడు రాయటానికి బలమైన రెండవ కారణం: రెండు సంవత్సరాల వయస్సు ఉన్న మా అమ్మాయి. తనకి తెలుగు పద్యాలన్నా, పాటలన్నా, కథలన్నా చాలా చాలా ఇష్టం. తను ఇప్పటికే తెలుగు అక్షరాలు గుర్తు పట్టగలుగుతోంది కాని
తను చదవడానికి ఉన్న తెలుగు పుస్తకాలు చాలా తక్కువ. మేము గ్రామాలలో మొదలుపెట్టిన కార్యక్రమాలలో కూడా ఇదే సమస్యని ఎదురుకుంటున్నాం. చిన్న చిన్న గ్రంథాలయాలు స్థాపించి గ్రామాల్లో ఉన్న పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచాలనుకుంటే మాకు తగినన్ని పుస్తకాలు దొరకటం లేదు. చిన్న వయస్సులో తెలుగు నేర్పడానికి కావలసిన పుస్తకాలు, వనరుల కొరత మాకు స్పష్టంగా
తెలుస్తోంది. పిల్లల స్థాయిలో చదువగలిగే తెలుగు పుస్తకాల ముద్రణ ఖచ్చితంగా చాలా అవసరం.*

పిల్లలమఱ్ఱి అరవింద రాసిన పోస్టులో నాకు పై పేరా ఆసక్తి కరంగా అనిపించి ఇక్కడ ఉంచుతున్నా.
చాలా ముఖ్యమైన పాయింటు ఇది. నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటా దీని గురించి. పెద్ద బాలశిక్ష ఉందికదా అనుకోవచ్చు, ఐతే దాన్ని ఆరగించుకోగల ప్రజ్ఞాపాటవాలు ఎందరికి ఉంటాయి? పెద్ద బాలశిక్ష అంమృతాన్ని సక్రమమైన రీతిలో అందించగల ఉపాధ్యాయ దేవుళ్ళు ఎందరు ఉన్నారూ? ఈ రెండు పెద్ద ప్రశ్నలే అని నా అభిప్రాయం.

19 comments:

  1. అన్నా నీబ్లాగుముఖంగా ఒక ప్ర్శ్న వెయ్యాలి అనుకుంటున్నా.
    ఎవరైనా కాన్వెంటులో చదివినవాడు నూటికి ఎనభైమార్కుల పైన తెచ్చుకున్నోడు తెలుగేకాదు మరే ప్రాంతీయమాధ్యమంలో చదివిన (అంటే తమిళంలో చాదివిన తమిళుడుకానీ, కన్నడంలో చదివిన కన్నడిగుడితోగానీ ఇలా అన్నమాట) అరవైమార్కుల వాడితో పోటీ అంటే రీజనింఘ్, అర్థమెటిక్స్, వంటివాటిలో పోటీ పడగలడా?
    బ్లాగీమే సవాల్

    ReplyDelete
  2. మాతృభాష ఆవశ్యకతని ఇలా నొక్కి వక్కాణించారన్న మాట బాగుంది , కాని అన్ని భాషలు ఎలా నేర్చుకున్నారు కొద్దిగా మాక్కూడా చెప్పచ్చు కదా ఆ రహస్యమేమిటో?

    ReplyDelete
  3. చాలా బాగా రాసారు. మాతృభాష లో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తే ఇలాంటివి జరగవు. దీనిల్ వల్ల కలిగే మానసిక వికాసం దేనికీ సాటి రాదు.

    ReplyDelete
  4. నాకు తెలిసి ఈ విషబీజాలు ఎప్పుడో నాటుకుపోయాయి. నా చిన్నప్పుడు కాన్వెంటు బళ్ళో ఇంగ్లీష్ మాధ్యమంలో చదివేవాళ్ళు, మాకు తెలుగు రాదు అనడం ఒక ఫ్యాషన్. ఇప్పటికి మా బంధువులు, వాళ్ళ పిల్లలు తెలుగులో మాట్లాడితే తిడతారు. మా చిన్నప్పుడు కిరస్తానీ మిషనరీ బళ్ళలో ఒక తెలుగు పదానికి 5 పైసలు జరిమానా వేసేవారు.
    ఒక బ్లాగులో చెప్పినట్టు, ఒక తెలుగు వాడు, సాటి తెలుగు వాడితో, తెలుగులో మాట్లాడడం అవమానంగా భావిస్తాడు.
    తల్లితండ్రుల ఆలోచన ధోరణిలో మార్పు రానంతవరకు, పరిస్థితి ఇంకా దిగజారుతుంది.

    ReplyDelete
  5. సుబ్బు - నీ ఛాలెంజికాడికి మళ్ళీ వస్తా..
    శ్రావ్యా - భాష నేర్చుకోడం అనేది ఓ ప్యాషన్. నేను గెలీలియో ఏర్పోర్టులో దిగంగనే నాకోసం వెదురు చూస్తున్నా మా మానేజరుని *చావ్!! కొమెస్తాయ్* అని పలకరించంగనే బెమ్మానందంలా కిందపడి కొద్దిగసెపు పాపం గిలగిలా కొట్టుకున్నాడు. అప్పటి పరిచయం ఇప్పటికీ అతను నేను *టచ్* లో ఉన్నాం. కారణం అతని భాషలో ఆత్మీయంగా పలకరించటమే అంటే కాదంటావా?
    సుజాత గారు - *మానసిక వికాశం* - నిజమే.
    దీనిగురించి కొంచెం తీవ్రంగా ఆలోచించాల్సిందే.

    ReplyDelete
  6. >>"లేత వయసులో పిల్లలు కనీసం ఆరు భాషల్ని నేర్చేస్కోగలరట".

    ఆరు భాషలు కాదు, పజ్జెంది భాషలు నేర్చుకోగలరని, నేను సిద్ధ సమాధి యోగ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చెప్పారు. వాళ్ళు Infant education అనే కార్యక్రమంలో పిల్లలు భూమ్మీద పడకముందు, అంటే ఇంకా పొట్టలో ఉన్నప్పటి నుంచే నేర్పిస్తారట. ప్రహ్లాదుడు, అభిమన్యుని చదువులాగా అన్నమాట.


    >>"చిన్న చిన్న గ్రంథాలయాలు స్థాపించి గ్రామాల్లో ఉన్న పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచాలనుకుంటే మాకు తగినన్ని పుస్తకాలు దొరకటం లేదు".

    పుస్తకాలు కావాలంటే, ముందుగా తగినంతమంది రచయితలు ఉండాలి. ఈ విషయంలో మా వంతుగా మా పని మొదలెట్టాం. ప్రసుతానికి తెలుగులో ఆంగ్లభాషలో ఉన్నట్టుగా "కామిక్" పుస్తకాలు లేవు. వాళ్ళకి, మనకీ అదే తేడా. ఆఖరికి మన రామాయణం, మహాభారతం కామిక్ పుస్తకాలు కూడా ఇంగ్లీషులో ఉన్నట్టుగా తెలుగులో లేవు నాకు తెలిసి. ఇప్పుడు పిల్లల కోసం ఈ కామిక్ పుస్తకాలు తయారు చేసే వాళ్ళు కావాలి. కాదు కాదు మనమే ఈ పని మెదలెట్టాలి. ఎవరో వచ్చి చేస్తారంటే, ఎవ్వరూ చెయ్యరు. మరి మీరు సిద్ధమేనా.

    ReplyDelete
  7. నా అద్రుష్టమో దురద్రుష్టమో, ఆ దేశంలో ఓ కాలూ, ఈ దేశంలో ఓ కాలూ వల్ల మా పిల్లలూ చక్కటి తెలుగు మాట్లాడతారు, రాత కూడా ఫర్వాలేదు. పెద్దది స్పానిష్ కంఫర్టబుల్ గానే మాట్లాడతది, కొంచం కొంచం సంస్క్రుతం కూడా వచ్చు, హిందీ కూడా ఫరవాలేదు( వట్రుసుడి ఎలా రాయాలో లేఖిని లో తెలియడం లేదు).నా మటుకు నేను మొసలి అని తెలుసు కాబట్టి, ఆలిగేటర్, క్రోకడైలు అని నేర్చుకోవడం తేలిగ్గా వచ్చింది. అదే నా పిల్లలకు మొసలి అని నేర్పడం కష్టమైంది.మీలాగే మేము కూడా (నా తోబుట్టువులు కూడా) ఎవరం ఇంట్లో పిలుపులు తో సహా ఆంగ్లం వాడనివ్వం ఐనా వాళ్ళు అదే సౌలభ్యంగా అనుకుంటారు. ఎలా ఐనా వీళ్ళతో రోజూ ఈనాడు చదివించాలని నా ఆశ.

    ReplyDelete
  8. పైన కామెంట్ ఆన్నిటితొ ఏకీభవిస్తాను.. ముఖ్యం గా " మాతృభాష లో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తే ఇలాంటివి జరగవు. దీనిల్ వల్ల కలిగే మానసిక వికాసం దేనికీ సాటి రాదు ".

    సుబ్బు చాలెంజ్.. ఇప్పుడు తెలీదు కానీ నేను చదువుకునే రొజుల్లొ అది కరక్టే.. కాన్వెంట్ లొ చదివే వాళ్ళు ఎంత % వచ్చినా ప్రాంతీయ బాష లొ చదివే వారి తొ కొన్ని విషయాల్లొ (రీజనింగ్, అనలైటికల్ లాంటివి) పొటిపడలేరు అనిపిస్తుంది.. కారణం బహుశా సుజాత గారు చెప్పినదే అయివుంటుంది..

    భా. రా. రా. ....పి వి గారి టైపు అనుకుంటా :-)

    ReplyDelete
  9. ఈ భాషాసమస్య ప్రజల నుంచి వచ్చినది కాదని అందఱూ గ్రహించే రోజు రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుభాష పట్ల తన విధ్యుక్త కర్తవ్యాల్ని పూర్తిగా విస్మరించడం మూలాన ఏర్పడిన భాషాసంక్షోభం ఇది. ప్రపంచంలో ఏ భాషైనా ప్రభుత్వ ఆదరణతోనే బతికి బట్టకడుతుంది. అమెరికాలో ఇంగ్లీషైనా, అరేబియాలో అరబ్బీ అయినా !! కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం పీకల్లోతు మైనారిటీ వోట్ బ్యాంక్ రాజకీయాల్లో మునిగి ఆ బాధ్యతని పూర్తిగా గాలికొదిలేసింది. పరాయి రాష్టాలనుంచి దిగుమతి అవుతున్న అయ్యేయెస్ లూ, ఐపీయెస్ లూ తెలుగువాళ్ళ ప్రభుత్వంలో తెలుగు అధికారభాషగా అమలు కాకుండా అడ్డుపడుతున్నారు. అంతా కలిసి కావాలని పైనుంచి తెలుగుని తొక్కేస్తూ ప్రజల్లో మార్పొచ్చిందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు తెలుగుని జన్మలో చదవకుండానే డిగ్రీలు సంపాదించడానికి వీలు కల్పించే ఒక అపూర్వ వ్యవస్థని, ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్ర విద్యావ్యవస్థని ఆంధ్రప్రదేశ్ లో సృష్టించారు. కొద్దిమంది నాన్-తెలుగువాళ్ళని చూపించి అందఱికీ తెలుగు నుంచి మినహాయింపు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలలవాళ్ళకి ! అలా తోక (భాషా మైనారిటీలు) కుక్కని (రాష్ట్రంలోని మెజారిటీ తెలుగుజాతిని) ఆడించే విడ్డూరపు వాతావరణం కల్పించారు.

    -- తాడేపల్లి

    ReplyDelete
  10. కామిక్స్ అంటే గుర్తొచ్చింది ఒకసంగతి
    కొంతకాలం క్రితం తెనాలిరామకృష్ణుని కథలు కామిక్సుగా మార్చాలి అనుకున్నారు. దాని మార్కెట్ విశ్లేషిస్తే లాభాలకేమీ లోటుండదు అని తేళింది. మనతెనాలి మన రామకృష్ణుడు అని మీడియా అంతా గోలచేసింది. ఒక్కొక్కరూ ఆహా ఓహో అంటూ 'మీది తెనాలి..'అంటూ దరువేశారు. సీను కట్ చేస్తే
    ఆసీడీ అట్టపైన 'తెనాలిరామన్‌' అనొచ్చింది. కృష్ణాతీరంలో పుట్టి ఆవకాయ, తుంగభద్ర ఒడ్డూన బతికి బిసీబేలాబాత్ తిన్నాయన సాంబారు ఎప్పుడు తాగాడా అని. కనీసం ఆయనపేరు పుట్టుపూర్వోత్తరాలు కూడా తెలుసుకోకుండా మనసంస్కృతిని ఉద్ధరించారు ఆసంస్థవాళ్లు.

    ReplyDelete
  11. ఇంగ్లిష్ మీడియం చదివిన నేను ఇంగ్లిష్ రాని పల్లెటూరి వాళ్ళతో కూడా ఎలా మాట్లాడగలుగుతున్నాను? ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే తెలుగు మరచిపోతారనేది ఒక భ్రమ మాత్రమే.

    ReplyDelete
  12. అయ్యా ప్రవీణ్ శర్మ గారూ
    >>ఇంగ్లిష్ మీడియం చదివిన నేను ఇంగ్లిష్ రాని పల్లెటూరి వాళ్ళతో కూడా ఎలా మాట్లాడగలుగుతున్నాను?
    ఇలా ప్రశ్నలేసి సమాధానాలు చెప్పకపోతే, తెలుగుమీడియంలో చదువుకున్న నాకు ఎలా అర్ధం అవుతుందనుకుంటున్నారూ?

    ReplyDelete
  13. మీది కూడా దుంపల బడేనా? మా పట్టణంలో మొట్టమొదటి ఆంగ్ల మాధ్యమ పాఠశాల 1965లో పెట్టారు. అప్పట్లో పట్టణంలోని డబ్బున్న వాళ్ళ పిల్లలు మాత్రమే ఆంగ్ల మాధ్యమ పాఠశాలకి వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు పట్టంలోని మురికివాడ వాసులు కూడా తమ పిల్లలని మిషనరీ పాఠశాలలకి పంపుతున్నారు. ఒక సెయింట్ డగ్లాస్ దుంపల బడి తప్ప మిగిలిన మిషనరీ పాఠశాలలన్నీ ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నవే. నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, తెలుగు మాధ్యమ విద్యా బోధన గురించి మాట్లాడేవాళ్ళని అంత మందిని చూశాను. కానీ పట్టణాలలో (మురికివాడలతో సహా) తమ పిల్లలని తెలుగు మాధ్యమ దుంపల బడులకి పంపే వాళ్ళ సంఖ్య ఎంతో ఒక సారి నాలుగు గోడల మధ్య నుంచి బయటకి వచ్చి చూస్తే కనిపిస్తుంది.

    ReplyDelete
  14. సుబ్రహ్మణ్య ఛైతన్య, మంచు పల్లకి,
    ఏదో కొంచెం ఉండచ్చు కాని, మరి అంత ఉండకూడదు ... గోరోజనం :)
    ఇంతకీ ఏ ప్రాతిపదిక మీద మీరు ఈ విషయం చెప్పగలుగుతున్నారు ?
    సవాల్ కి నేను సిద్ధం. మరి మీరు (నేను ఆంగ్ల మాధ్యమంలో చదివానని వేరే చెప్పాలా) ?

    ReplyDelete
  15. మాతృబాష గురించి గొప్పగా మాట్లాడేవాళ్ళు కూడా తమ పిల్లలని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకి పంపిస్తున్నారని వీళ్ళకి తెలియదు అనుకోను. తెలిసినా తెలియనట్టు నటిస్తారు. ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళ వల్ల తెలుగు చావదు. నేను ఇంగ్లిష్ మీడియంలో చదివినా నేను నిత్య జీవితంలో ఎక్కువగా మాట్లాడేది తెలుగులోనే. నా బిజినెస్ కస్టమర్స్ తో కూడా ఎక్కువగా తెలుగులో మాట్లాడుతాను. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళతో మాత్రం ఇంగ్లిష్ లో మాట్లాడుతాను. వాళ్ళకి ఇంగ్లిష్ రాకపోతే హిందీలో మాట్లాడుతాను. ములాయం సింగ్ యాదవ్ "अंग्रेजी हठाओ" అన్నట్టు ఇక్కడ కూడా కొంత మంది "ఆంగ్లాన్ని తుడిచిపెట్టండి" అంటూ కేకలు వేస్తున్నారు. కానీ అలా కేకలు వేసే వాళ్ళే ఉద్యోగావకాశాల కోసం తమ పిల్లలని ఆంగ్ల మాధ్యమ పాఠ్శలాలలకి పంపిస్తున్నారు.

    ReplyDelete
  16. అతని భాషలో ఆత్మీయంగా పలకరించటమే అంటే కాదంటావా?>> అస్సలు అనను , కాని ఎలా నేర్చుకుంటున్నారా అన్ని భాషలు అని నా సందేహం .

    ReplyDelete
  17. బాషలు నేర్చుకోవడం కష్టమని ఎందుకు అనుకోవాలి? సంస్కృతం నేర్చుకోకుండానే అలెక్సాండర్ ఇండియా పై దండయాత్ర చేశాడా? హిందీ నేర్చుకోకుండా బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఆక్రమించుకున్నారా? నాలుగైదు బాషలు నేర్చుకోవడం సులభం అనుకుంటాను. ఇంగ్లిష్ అంతర్జాతీయ బాషగా లేని రోజుల్లో విదేశాలకి వెళ్ళేవాళ్ళు నాలుగైదు బాషలు నేర్చుకునే కదా వెళ్ళేవాళ్ళు.

    ReplyDelete
  18. అయ్యా శర్మగారూ
    ఇక మా బడికి సెలవులిచ్చేసాం. మీరు ఆంగ్లభాషలో చదువుకుని తెలుగులో అనర్గళంగా ఇలా పుంఖానుపుంఖాలు రాసేసి పడేస్తే మాబళ్ళు చాలవు. అయ్యలూ అమ్మలూ అయ్యగారికో జైకొట్టండి.
    అయ్యా అందుకోండి మా జోహార్లు. మా బడిని మూసేస్తున్నాం. ఇక నిష్క్రమించండి.

    ReplyDelete
  19. @ శివ్ .. నీలా కొంతమంది ఎక్స్చెప్షనల్ ఉంటారమ్మా.. కాస్త సులువు గా తీసుకో.. :-)

    ReplyDelete