Feb 14, 2009

మన పెన్నులు

మాది టీచర్ల కుటుంబం. మా నాన్న జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో లెక్కల, మరియూ ఆంగ్ల స్కూల్ అస్సిస్టెంటుగా చేసారు. నాకు ఊహ వచ్చేప్పటికీ పిడుగురాళ్లలో ఉండే వాళ్లం, నేను పుట్టింది దాచేపల్లిలో మా తాతగారి ఇంట్లో పడమటిగదిలో అయినప్పటికీ.
పిడుగురాళ్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, అ.క.అ ఎత్తుబడి పల్నాడులోని అతిపెద్ద పాఠశాలల్లో ఒకటి. ఇది ఇప్పటి మాట కాదు, పంతొందొందలదెభైలల్లో. అప్పటిరోజుల్లోనే ఆ ఎత్తుబళ్లో తొమ్మిదొందలమంది పిల్లలు చదువుకునేవారు ప్రతీ సంవత్సరం సరాసరి. మరి ప్రభుత్వ పాఠశాల కావటంవల్లనేమో ఎప్పుడూ ఉపాధ్యాయుల కొరత ఉంటూఉండేది. కాబట్టి ఉన్నవాళ్ల మీద అధిక వత్తిడి మామూలే. నాకు గుర్తిండి, ప్రతీ మూడు నెలలకూ ఓ పెద్ద కట్ట యూనిట్ పరీక్షల పేపర్లతో మా నాన్న సైకిలు బుట్ట నిండిపొయ్యి వచ్చేది. మాకేమైన తినుబండారాలు తెచ్చారేమో అనుకుని చెయ్యిపెడితే ఈ కాయితాలు తగులుతుండేవి పరీక్షల సీజనులో. ఇక క్వార్టర్లీ, హాప్యర్లీ, సంవత్సర పరీక్షలు మామూలే. మా నాన్న పాలసీ, వెంటనే దిద్దేసి ఇవ్వటం. ఈపూట పరీక్ష అయిపోతే మర్రోజుకల్లా ఇచ్చేయాలి మార్కులు.
మా ఇంట్లో "నర్సరావుపేట కుర్చి" ఒకటిండేది. ఆ కుర్చీకి, కుర్చీలో పడుకుని కాళ్లు పైకి పెట్టుకోటానికి రెండువైపులా, పొడుగ్గా చెక్కలు ఉంటాయి. వాటిని కుర్చీ చేతులు అనుకోవచ్చు. ఆ రోజుల్లో దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటూ ఉండేది ఆ కుర్చి. నిద్ర రాకపోతే దాంట్లో కూర్చుంటే చాలు. కమ్మగా నిద్రవస్తుంది.
మా నాన్న దగ్గర ఓ పెద్ద చాలా బరువైన ప్లాంక్ ఉండేది. దాన్ని ఈ కుర్చీ చేతుల మీద పెట్టి చకా చకా దిద్దేవాళ్లు ఆ పేపర్లని మా నాన్న. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే దేంతో దిద్దే వాళ్లు అని? మళ్లీ కొంత ఉపోద్ఘాతం. మా చిన్నప్పుడు, నాల్గోతరగతి దాకా పలకే. అయిదునుండి ఇంగ్లీషు రాయటం మొదలు. నాలుగు రూళ్ల నోటు బుక్కు ఉండేది. మరి రాయటానికి ఏంటి?
ఇప్పట్లోలా అప్పట్లో బాల్పాయింటు పెన్నులు ఉండేవి కాదు. మరి? ఇంకుపెన్నులు. మా నాన్న దగ్గర "ప్రసాద్ కంపెని" వాళ్ల చెక్క పెన్నులు ఉండేవి. ఆమాటకొస్తే, బళ్లో రైటరు దగ్గరనుండి, పచారీకొట్టులో గుమాస్తా దాకా అందరూ ఈ చెక్కపెన్నుల్నే వాడే వాళ్లు. ఇవి ఒకరకమైన వాసనతో, రకరకాల సైజులతో ఉండేవి. మానాన్న దగ్గర ఇంతలావుది ఉండేది, మరి పరీక్షపేపర్లు దిద్దడానికి, ఒక్కసారి సిరా పోస్తే ఐదారొందల పేపర్లు మెత్తగా దిద్దుకుంటూ వెళ్లటమే. ఇక మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడివద్ద మూడు పెన్నులు జేబులో, నీలం సిరా, ఎర్ర సిరా, ఆకుపచ్చ సిరా. ఆకుపచ్చసిరా కేవలం గెజిటేడ్ ఆఫీసరు హోదా ఉన్నవాళ్లు మాత్రమే వాడుతుంటారు. మా నాన్న ప్రధానోపాధ్యాయుడు అయ్యాక నేనూ మా నాన్న బజారుకెళ్లి కొన్నాం. అయితే మానాన్న ఎప్పుడూ జేబులో పెట్టుకునే వాడు కాదు. దేనికంటే సిరా లీకు అవుతుందేమో అని. మానాన్న జేబులో ఎప్పుడూ జాటర్ రీఫిల్ పెన్ను ఉండేది మొట్టమొదటినుండి, అదేదో కంపెనీ పెన్ను. గుర్తు రావటంలేదు. ఇక బడిలో అప్పుడప్పుడూ సిరా పెన్నులోచి ముందున్నోడి చొక్కా మీదకెక్కుతుండేది. ఇక సంవత్సరాంత చివరి పరీక్షరోజున చొక్కా ఆంతా సిరానే. అప్పుడప్పుడూ పాళ్లీలు చిట్లిపోతుండేవి. బెంచీకేసి నిక్కటం, పాళీనీ తిప్పిరాయటం ఇలాంటివన్నీ మామూలే. ఆ రోజుల్లో పాళీ పావలా ఉండేది. ఇంకుపెన్నుతో రాస్తే చక్కటి చేతిరాత వస్తుంది. అలానే ఒకరు వాడిన ఇంకుపెన్ను ఇంకొకరి చేతిలో సరిగ్గా రాయకపోవచ్చు. కారణం, పాళీ ఒకలా అరిగిపోవడమే.

ఇంతకీ ఈ రాస్కొచ్చేది దేనిగురించంటే - "ప్రసాద్ కంపెని" చెక్కపెన్నుల గురించి.
నిన్ననో మొన్ననో గూగుల్లో వెతుకుతుంటే ఈ లింకు కనిపించింది. ఆ మొత్తాన్నీ తెలుగులోకి అనువదించేకన్నా, అక్కడకి వెళ్లి చదవటమే బాగుంటుంది.
టూకీగా:
ఈ ప్రసాద్ పెన్నులు తెనాలి లో తయ్యారవుతాయి. ప్రస్తుతానికి ఒక జైనుడు నడుపుతున్నాడు.
ఇక్కడ కొన్ని ఫోటోలు పెడుతున్నా పై లింకు నుండే, వీటిల్లో కొన్ని నాదగ్గర ఉన్నవే, గుంటూర్లో.....



పైమూడూ ఉన్నాయి నాదగ్గర



సాధారణంగా టీచర్లు, గుమాస్తాలు, రైటర్లూ వాడే పెన్నిలు ఈ పైవి. ఇవి కొంచెంపెద్ద పెన్నులు


మనం కోల్పోతున్న కనుమరుగౌతున్న ఇంకో మన లెగసి - సిరా పెన్నులు.
ఇప్పటికీ ఈ పెన్నులు గుంటూరులో కొన్ని దుకాణాల్లో మాత్రమే దొరుకుతున్నాయ్.

7 comments:

  1. ఆహా..భాస్కర్,ఇలాంటి విలక్షణమైన అంశాలను ఎన్నుకోవటం,వాటికి నూరుపాళ్ళు న్యాయం చెయ్యటం నీకు మాత్రం పరిమితమైన గొప్పకళ.
    ఇంకుపెన్నులుగా ప్రఖ్యాతమైన ఫౌంటెన్ పెన్నులతోటి కొన్ని దశాబ్దాలపాటు,కొన్ని లక్షల,కోట్లమంది జీవితాలు ఆధారపడ్డాయి.
    ప్రసాద్,అశోకా రెండు పెన్నులకంపేనీలు తెనాలివే,అలాగే నాకు తెలిసినంతవరకూ బ్రిల్ ఇంకు కూడా తెనాలిలోనే తయారయ్యేది అనుకుంటా.నాదగ్గర మొన్నటిదాకా ఈ కలాలు ఉండేవి.అభినందనలు :)

    ReplyDelete
  2. నన్ను ఆరో తరగతిలో చేర్చి ఇంకు పెన్ను కొనిచ్చారు నాన్న. ఐతే అది ప్రసాద్ పెన్ను కాదు. కంపనీ పేరు గుర్తు లేదు. ఓ కామేల్ ఇంకు బాటిల్ కూడా కొన్నారు. నేను కామేల్ ఇంకుతో రాయడం మా క్లాసులో పెద్ద వార్త. మాష్టార్లు మాత్రమె ఆ ఇంకు వాడేవారు. ఇంక ఆ పెన్నుతో, పాళీలతో నా అనుభవాలు..ఓ టపా రాయాల్సిందే..చాలా సంగతులే గుర్తు చేశారు.

    ReplyDelete
  3. :)

    నేను మొన్నే ఇంక్ పెన్స్ కొన్నాను.కాని వాటిలో రీఫిల్స్ ఉన్నాయి.ఇలాంటి ఇంక్ పెన్స్ అంటే నాకు ఇష్టం ఎక్కడ దొరుకుతాయో మీకు ఏమైనా తెలుసా?

    ReplyDelete
  4. అన్నగారు అదరగొట్టేశారు .
    రాజేంద్రగారు అన్నట్లు మీకె మీరె సాటి.
    మొత్తానికి మమ్మల్ని బడి రొజులకు తీసుకెల్లారు మీ బ్లాగుతో.

    ReplyDelete
  5. కామెంటేసిన అందరికీ ధన్యవాదాలు

    ReplyDelete
  6. pennula sekarana na abhiruchi. Prasad pen mart gurinci vini tenali varaku vellaanu. kani akkada shop vaaru verega chepaaru. Ee madhya kaalam lo prasad pennulu original dorakadam ledu ani. Inka Rajahmundry lo Ratnam pennilu maatram naku bagane dorikaayi. Bhimavaram nunchi tayary ayina Brahmam pennulu kuda ipudu dorakadam ledu. Hyderabad Deccan pen mart vaari daggara Brahmam pennulu vunnai kaani avi yenta varaku nammagalamo teliyadu.

    ReplyDelete
  7. గుంటూరు లో ఎక్కడ అమ్ముతరు

    ReplyDelete