Feb 11, 2009

2035

అది 2035 సమచ్చరం. మన దేశానికి ఎన్నికలు జరగనున్నాయి. దేశం అంటే దేశం కాదుగానీ రాష్ట్రం. రాష్ట్రం అంటే రాష్ట్రం కాదుగాని అదో ఇదో తెలియని ఓ ప్రదేశం. అప్పటికి 25 జిల్లాల రాష్ట్రం 50 ముక్కలాయ, ఎవ్వనికి ఏది జిల్లానో, ఏది రాష్ట్రమో ఏది దేశమో, ఏది పెపంచమో గుర్తుండే తెలివి పోనేపోయ్యింది.

అప్పటికి ప్రతీ సమచ్చరం ఎలచ్చన్లు జనాలకి అలవాటాయిపొయినియ్. జనాలు ఇలా అనుకుంటూన్నరు "ఆ కాలంలో (1900, 2000లల్లో) ఐదు సమచ్చరాలకి ఓ పాలి ఎలచ్చన్లు జరిగినయ్యంటా" అని. సమచ్చరం సమచ్చరానికి కూటములు మారిపోతున్నయ్. 2034 గెల్చిన కూటామిలో ఉన్న పార్టీలు పభుత్వాన్ని ఇరగనూకి మళ్లీ ఎలచ్చన్ల కోశం ఎగబడుతున్నయ్. ఈసారి మాలమహానాడు ఏ, బీ, సీ, డీ, మాదిగదండోరా 1,2,3,8, కాపు 5,2,9,11, రెడ్డి 1,6,9, కుమ్మరి 23,45, వడ్డెర 5,12, రజక 1ఎ, 56డీ, గొల్లలు 23,45 బేపనోళ్లు 2,3,7 ఈళ్లందరూ ఓ కూటమి అయితే, మాలమహానాడు 4,5,6,7, కమ్మ 3,4,7ఇ,8క, రెడ్డి 89,78, ఇంకో కూటమి అయితే, మిగతావోళ్లు ఆళ్లకి చేతనైన కూటముల్లోజేరి ఎలచ్చన్లలో పోటీకి దిగుతున్నరు.
ఎలచ్చను కమీషనుకి సానా కష్టంగుండింది ఈతూలి. పార్టీలు పెరిగిపోయ, చాంతాడంతైనై వోటు పత్రాలు. ఎల్ట్రానిక్కు వోటు మిషన్లు పనిజెయ్యటంలా మరి బయిట 61 ఉండిందిగా వేడి. వోటు మిషన్లు ఈ సారికి ఒక్కోటి 50కేజీల బరువు ఉండిందాయా, మరి ఇన్ని పార్టీల గుర్తుల్ని సూపించాలిగా. 2037 సార్వర్త్రిక ఎలచ్చన్లకి స్పీచ్ రికొగ్నీషన్ తెస్తాం అని సెప్తుండే ఎలచ్చను కమీషను. అంటే, వోటేసే బోనులోకి పొయ్యి, నా వోటు పలానోడికి అని సెప్పలి. ఏదో కార్డుముక్క ఇస్తరంట, దానిపైన బారుకోడు ఉటదంట, ఆ వోటేసేబోనులోకెళ్లి యాడనో ఆ కార్డుముక్కనిబెట్టి గీకితే నువ్వు పలానా అనిచెపుద్దంట, నీవోటెవ్వాడికీ అని అడుగుతే పలానోడికి అనాలంట. మూణ్నిమిషాలు టైము, నువ్వు సెప్పకపోతే, అదే రూలింగు పార్టీవోడికే పోద్ది వోటు అనికూడా సెప్పుకుంటున్నరు జనాలు. బీరుబారులు ఇన్నంగానీ బారుకోడేందో!! పుచు!! కలికాలం ఇసాపట్ణం!! నల్గురితోపాటూ నాగలచ్చిమి. సేసేదేముంది. ఈ మరని ఎట్టా ట్యాంపర్ జెయ్యొచ్చు అని పార్టీలు ఆలోచన కూడా మొదలుబెట్టినయి అప్పుడె.
టీవీషోలు, పాడ్టీవీ షోలు వీడియోకాస్టుల్లో ఓ అని ఊదరకొడుతున్నరు ఎలచ్చన్లలో నిలబడేటోళ్లు. పతీ కూటమి పలాని కూటమి ఇంకో కూటమికి వోటేయొద్దు ఏసిన్రో ఇంకమీరు జచ్చిన్రే అని చెప్తుండింది. 2034 సమచ్చరం ఎలచ్చన్ల వోటూ శాతం 41. గెల్చినోడికి 11.5 శాతం పడినయ్ వోట్లు. మిగతావి మిగిల్నోళ్లు పంచుకున్నరు. అది ఈ పేరు ఊరు తెలియని దేశ/రాష్ట్ర/ప్రాంత 5సమచ్చరాల వోటు సరిత్రలో రికార్డంట.
మరి ఈతూలి ఎట్టుంటదో? ఎందుకింత వోటు శాతం పడిపోతున్నదీ అని ఓ కమీషన్నేసిన్రంట ఎలచ్చను కమీషనోళ్లు. సదువుకున్న కుఱ్ఱకారంతా ఆఫ్రికాకి, అరబ్బు రష్యా దేశాలకి వలసపోతున్నరని తేలిందంని వార్త. అదేందది, అక్కడకూడా జనాలున్నారుగా అని ఓ తెలివితక్కూవోడు అడుగుతుంటె ఓ తెలివైనోడు మూడో పెపంచ యుద్ధంలో అమెరికా సంకీర్ణసేన ఆదేశాలన్నిట్నీ కొల్లగొట్టిందిగా, ఇంకెవ్వరు మిగిలిన్రక్కడా? అందుకే మనోళ్లు అక్కడకి జారుకుంటుంన్నరు అని చెప్తుంటే నే ఇన్నా. మరి ఆ పొయ్యేదేదో అమెరికానే పోవచ్చుగా అన్నడింకో తెలివితక్కువోడు. అక్కడేం మిగిలింది న్యూక్లియర్ రేడియేషను తప్ప అంటున్నడూ ఆ తెలివైనోడు. ఏందో అంతా గోలగోలగుండింది బతుకు.

(...................అసంపూర్ణం)

13 comments:

  1. "ఈసారి మాలమహానాడు ఏ, బీ, సీ, డీ, మాదిగదండోరా 1,2,3,8, కాపు 5,2,9,11, రెడ్డి 1,6,9, కుమ్మరి 23,45, వడ్డెర 5,12, రజక 1ఎ, 56డీ, గొల్లలు 23,45 బేపనోళ్లు 2,3,7 ఈళ్లందరూ ఓ కూటమి అయితే, మాలమహానాడు 4,5,6,7, కమ్మ 3,4,7ఇ,8క, రెడ్డి 89,78, ఇంకో కూటమి " ---- super!!!!

    కామెడి అని నవ్వి వదిలెయ్యకుండా చదివిన వారు దీని గురించి ఆలోచిస్తే మీరు రాసినందుకు సగం లక్ష్యం (మీ లక్ష్యం ఇది కాకపోయినా సరే) నెరవేరినట్టే

    ReplyDelete
  2. అసంపూర్ణం..అంటే తరువాతి భాగం ఉందనేనా?

    ReplyDelete
  3. ఔరా!ఇప్పుడు ఐదేళ్లకొకసారే ఎలక్షన్ డ్యూటీలు చెయ్యలేక చస్తున్నాం.

    సంవత్స్రానికొక సారంటే అబ్బో! నే చెయ్యలేను రిజైన్ చేస్తా.

    ReplyDelete
  4. ఏంటో.. అంతా గోలగోలగుండింది బతుకు..
    ఇప్పుడే ఇలా ఉంటే.. మునుముందు ఇంకా ఎట్లా ఉండబోతోందో.. అని భయం వేస్తోంది.

    ReplyDelete
  5. ఈసారి మాలమహానాడు ఏ, బీ, సీ, డీ, మాదిగదండోరా 1,2,3,8, కాపు 5,2,9,11, రెడ్డి 1,6,9, కుమ్మరి 23,45, వడ్డెర 5,12, రజక 1ఎ, 56డీ, గొల్లలు 23,45 బేపనోళ్లు 2,3,7 ఈళ్లందరూ ఓ కూటమి అయితే, మాలమహానాడు 4,5,6,7, కమ్మ 3,4,7ఇ,8క, రెడ్డి 89,78, ఇంకో కూటమి అయితే, మిగతావోళ్లు ఆళ్లకి చేతనైన కూటముల్లోజేరి ఎలచ్చన్లలో పోటీకి దిగుతున్నరు.

    he hee.. [:D]

    ReplyDelete
  6. కామెంటేసిన అందరికీ ధన్యవాదాలు

    ReplyDelete
  7. 2035 లో బయట 61 వేడి వుంటే ఇంటర్నెట్ లో ఓటు వెసుకుంటే పోలా? ఖర్చు తగ్గి పోతది.

    ReplyDelete
  8. # దేశం అంటే దేశం కాదుగానీ రాష్ట్రం. రాష్ట్రం అంటే రాష్ట్రం కాదుగాని అదో ఇదో తెలియని ఓ ప్రదేశం. అప్పటికి 25 జిల్లాల రాష్ట్రం 50 ముక్కలాయ, ఎవ్వనికి ఏది జిల్లానో, ఏది రాష్ట్రమో ఏది దేశమో
    :))

    #సదువుకున్న కుఱ్ఱకారంతా ఆఫ్రికాకి, అరబ్బు రష్యా దేశాలకి వలసపోతున్నరని తేలిందంని వార్త.
    Yeppo yeppaa!!!

    ReplyDelete