Aug 29, 2008

మాఊళ్ళో నాటకాలు

మా ఊళ్ళో నర్సింసోవి (నరసింహ స్వామి) తిర్నాల గురించి కొంచెం రాద్దాం అనిపించింది ఈపూట...
పల్నాడులో ప్రతీ ఊళ్ళో ఏదోక తిర్నాల ఉంటుంది. ప్రతీదానికి ఎవళ్ళోకళ్ళ ఇంటికి సుట్టాలు వస్తనే ఉంటారు...కాబట్టి తిర్నాల్లు సానా నిండుగా, హడావిడిగా ఉంటాయి..అలాంటి జాతికి చెందిందే మా ఈ నర్సింసోవి తిర్నాల.

ఐతే ఇక్కడ రాయాల్సిన ఇషయం తిరునాల ఎల జేస్తారు, పిల్లల గోల, చెరుకుగడలు, అవి ఇవి కాదు.. ఒక ప్రత్యేకమైన విషయం... అదే ... నాటకాలు..

తిర్నాలకి ముందు తర్వాత ఆ సీజనులో మాఊరోళ్ళు 90 శాతం సాంఘీక నాటకాలు ఏస్తరు.
దీనికి రెండు శిబిరాలు ఉంటాయి..ఒకటి కమ్మోళ్ళది, ఇంకోటి రెడ్లది..
తతంగం ఏంటంటే, గుంటూరు నుంచి హీరోవిన్లు దిగుతారు వారంరోజుల ముందు. గుంటూరు పద్మ అండు కంపెని, జూనియర్ ఇజకశాంతి అండు కంపెని, గుంటూరు రాధా అండు కంపెని, ఇలా వాళ్ళకి ఫేమస్సు పేర్లు. ఇంక ఆ పటాలం ఊర్లోకి దిగినాక మన కుఱ్ఱకారుకి సందడే సందడి. అప్పుడు స్క్రీన్ ప్లే, కధ అన్ని రాసుకుంటారు లేక రెడీమేడ్ నాటకాలు కోకొల్లలు దొరుకుతాయి, వాట్లోంచి ఒకటి లాక్కుంటారు. ఈ నాటకాల్లో కధకి, నాటకీయతకి పెద్ద విలువ ఉండదు. మరింక దేనికి అంటారా..డాన్సు, పాటలు, మ్యూజిక్కు, హీరోవిన్ను, హీరో..అంతే..
ఒక హీరోకి రెండు పాటలు, కొన్ని సార్లు మూడు కూడా ఉండొచ్చు..ఎవడికి ఎంత జిల ఉంటే అంత.. అంటే 1 పాటకి 1000, రెండు పాటలకి 2000 అలా పాడుకోవచ్చు.. పాడుకున్నోడికి పాడుకున్నంత అన్నమాట (కబడ్డి కబడ్డి సిలుమాలోలా -ద్రౌపదీ వస్త్రాపహరనం ఐతే సీరనేనే లాగుత ఇదిగో వెయ్య, ఇదిగో రెండేలు నేను లాగుతా .. అలా)
ఇంక ఒక నాటకానికి పాడుకున్నంత మంది హీరోలు. ఒక శిబిరమ్లో ఒక పాటకి రామిరెడ్డి ఐతే, ఇంకోపాటకి ఎంకట్రెడ్డి..ఇంకో శిబిరమ్లో సాదినేని రమణ ఒక పాటకి హీరో ఐతే సూదినేని శీను ఇంకో హీరొ...అలా
ఇంక డాన్సు రిహార్సిల్సు మొదలు పెడతారు.. మనోళ్ళందరూ తొంగిసూట్టం, అలా. అక్కడ హీరోవిన్ని టచింగులు గట్రా మాములే అనుకోండి. లేటు నైటు హీరోవిన్ బస దెగ్గర ఇసుకేస్తే రాలనంతమంది జనం.
ఈ హీరోఇన్లు యమ ఫాష్టు..ఒకపాటలో 5 కోకలు మర్చే వాళ్ళుగూడా ఉంటారు..
కమ్మ శిబిరం వాళ్ళు యన్.టీ.ఆర్, బాలయ్య పాటలు ఏసుకుంటే, రెడ్డి శిబిరం వాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ పాటలు. ఈ పాటలు పాడతానికి, మ్యూసిక్కు కొట్టటానికి ఇంకో టౄపు. దానికి రిహార్సిల్లు.
ఒక నాటకమ్లో 10 పాటలు అలా..అప్పాట్లో ఫేమస్సు పాటలు...అనసూయమ్మగారి అల్లుడు, మంగమ్మగారి మనవడు, ఇలా..ఇటువైపు..సింహాసనం, అగ్నిపర్వతం, ఇలా..కొన్ని సిరంజీవి పాటాలు ఉండేవి అప్పుడప్పుడు..కమ్మ శిబిరమ్లో మాత్రం పొరబాటున కూడా మిగిల్నోళ్ళ పాటలు ఉండేవి కావి...
దీంట్లో హైలైటు డవిలాగు

ఫోను మోగుతుంది
"ట్రింగ్ ట్రింగ్"
హీరో అలా నడ్సుకుంటు వచ్చి ఫోను ఎత్తుతాడు
సెప్పాల్సిన డవిలాగు
"హల్లో!! ఇక్కడ విజయ్ స్పీకింగు!! అటు ఎవరు" అని
మనోడు
"ఈడ విజయ్ పీకింగు అవతలెవడహే"

1 comment: