Aug 27, 2008

రేగ్గాయలు, గంగిరేగ్గాయలు, సీమరేగ్గాయలు

నల్లమల అడవులు పల్నాడునుంచే మొదలౌతాయి. కనీసం మేము అట్టా అనుకుంటాం. కృష్ణానది ఒడ్డెమ్మట్ట ఉంటుంది నల్లమల. పులిచింతల డాము కాడ్నుచి, నెమ్మదిగా ఒడ్డేమ్మటి చూస్కుంటా నాగార్జున సాగర్ దాక ఎళితే అడవి దుప్పులు దుప్పులకాడ్నించి దట్టమైన సెట్లదాకా ఉంటుంది. దాస్పల్లి (దాచేపల్లి), పొందుగల, సత్రశాల , అలా పైకి ఎళ్ళేకొద్ది చెట్ల సైజుకూడా పెరుగుతుంటది. నాగార్జునసాగర్ కాడ్నుంచి ఇంక థిక్ ఫారెస్టు. రాజీవ్ టైగర్ సాంక్చురి నాగార్జునసాగర్ కాడ్నుచే మదలౌతుంది.
ఇంతకీసెప్పోచేదేంటంటే....పల్నాటి వైపు రేగ్గాయలు..వాహ్...తల్స్కుంటేనే నోరూరుతుంది. ఈ అడవి దుప్పలు దుప్పలుగా ఎక్కడ సూసినా రేగిసెట్లు లేకపోతే కళే సెట్లు, బీడీ ఆకు సెట్లు, జాన సెట్లు. ఎక్కడసూసినా రేగి కంపే పల్నాడులో. ఊర్లో మూలల్లో, సందు సివరా, ఇంట్లో, బైట, అక్కడా ఇక్కడా, ఎక్కడసూసినా రేగి కంప. రేగిముల్లు దిగనోడు పల్నాడులో ఉండడేమో. సేతిలోనో కాల్లోనో యాడోసోట. పల్లేరుగాయల తర్వాత కాల్లో ఎక్కువదిగేది రేగిముల్లే, ఆతర్వాతనే తుమ్మముళ్ళు. ఇంక డిశెంబరు కాడ్నించి రేగిపళు పండటానికొస్తై. అమ్ముతుంటరు కూడా. అయితే పల్నాడులో ఒకప్పుడు రేగిపళ్ళు అమ్మేటోళ్ళుకాదు..దేనికంటే ఎక్కడసూసినా అవేగా.
మేము పిడుగురాళ్ళలో ఉండే వాళ్ళం. మా తాతయ్య నాయనమ్మవాళ్ళు దాస్పల్లి (దాచేపల్లి) లో ఉండే వాళ్ళు, ప్రతీ రెండో వారం లేక మూడో వారం మేము దాసేపల్లి ఎళ్ళేవాళ్ళం. మానాన్నా ఎఱ్ఱబస్సులో కూర్సోబెట్టి డ్రైవెర్కి సెప్తే ఠంచనుగా దాసేపల్లిలో మాతాతయ్య కి అప్పగించేవాడు. అంటే, దాసెపల్లి సెంటరులో, నాగులేరు బ్రిడ్గి దెగ్గర బస్ స్టాపు. అక్కడ మాతాతయ్య రెడీగా ఉండే వాడన్నమాట.
మా తాతయ్య వాళ్ళ ఇంటిముందు మాదే కాలేజి ఉండేది. దాని పక్కన కేశవరెడ్డి మాస్టారుగారి ఇల్లు, దానెనకమాల ఆంజనేయులు మాష్టారు గారి ఇల్లు ఉండేవి.
ఆంజనేయులు మాష్టారు గారి ఇంట్లో పెద్ద గన్నేరు చెట్టంత రేగి చెట్టు ఉండేది. ఆంజనేయులు మాస్టారు గారికి వాళ్ళింట్లో అందరికి మేమంటే చాలా ఇష్టం. మాకోసం అని ఆ చెట్టుని కదపకుండా అలానే ఉంచే వాళ్ళు.
ఇంక మేము తాతయ్య వాళ్ళింటికి ఎళ్ళంగనే ముందు ఆంజనేయులు మాష్టారుగారింటికి ఎళ్ళటం, చెట్టుని ఊపటం, రేగిపళ్ళు జేబుల్నిండా కుక్కుకోవటం. దోరపళ్ళు, కొంచెం పండినవి, బాగా పండినవి అలా.. తినీ తినీ పళ్ళు పులిసి, నాలికి బీటలు కొట్టుకుపోయ్యేది.
ఇందాక సెప్పినట్టు రేగ్గాయలకి సీజను ఉంటుంది. సలికాలం. ఫెబ్రవరి వచ్చేసరికి పంట తగ్గిపోతుంది.
మా అమ్మ, మా నాయనమ్మ, మాకోసం అని, రేగిపండ్లు ఉప్పు ఏసి తొక్కి కొంచెం ఎండబెట్టి ఆ చెక్కల్ని పెట్టే వాళ్ళు. ఆ రుచి జన్మ జన్మ లకీ మర్చిపోలేం. అలానే మా ఇంట్లో రేగిపొట్టు పచ్చడి పెట్టేది మా అమ్మ. పచ్చడికోసం రేగిపళ్ళని అడవుల్నించి తెప్పించే వాడు మా నాన్న. దానికొక ప్రత్యేకమైన బాచ్చి ఉండేది. మా ఇంట్లో ఎప్పుడుజూసినకనీసం 5-10 మంది సుగాలిలు ఉండేవారు చడువుకోటానికి. లంబాడీలు తండాల్లో ఉంటారు. అవి అడవుల్లో ఉంటయి. వాళ్ళకిజెప్తే ఏమికావలంటే అవి దెచ్చిపెడ్తారు. అలా తెచ్చిన పండిపోయిన రేగిపళ్ళని ఎండబెట్టి, తొక్కి, పొట్టుతీస్తారు. ఆపొట్టుతో పచ్చడి. ఆవకాయి దానిముందు బుస్సు..
నానోరూరుతుంది మంచీళ్ళు తాగొస్తా.
గంగిరేగ్గాయలు అంటే, ఈరోజున బజార్లో దొరికే పెద్ద రేగిపండ్లన్నమాట. ఇవి అంతపెద్ద ఖాస్ గా ఉండావు నాటు రేగ్గాయల్తో పోలిస్తే.
ఇంక సీమరేగ్గాయ అంటే పియర్ అన్న మాట.

11 comments:

  1. బావుంది రామరాజు గారూ - గంగ రేగుపళ్ళు మా అమ్మమ్మగారి ఊరు (కృష్ణాజిల్లా)చల్లపల్లిలో కూడా కుప్పలు తెప్పలుగా తెచ్చి అమ్మేవాళ్ళు. కిలో అర్ధరూపాయి, మా చిన్నప్పుడు..నేనయితే ఒక్కోరోజు భోజనం కూడా చెయ్యకుండా అవే తిని కూర్చునేవాడిని. యమాగా ఉండేది రుచి...

    ReplyDelete
  2. రాజు గారు నేను కూడా పల్నాటి బిడ్డనే .మాది మాచవరం ,బ్రహ్హ్మనపల్లి దగ్గర నుంచి రేగులగడ్డ వీల్ల్లె దారిలో వస్తుంది .మేరు చెప్పిన రేగి కాయలు వల్లే దానికి రేగులగడ్డ అని పేరు కూడా వచ్చిందేమో.నేను చిన్నప్పుడు పొలాల్లో రేగిపండ్లు ,కలే కాయలు,జానపండ్లు తినేవాడిని.సెలవుల్లో గేదలను మేపటానికి వేల్లెవాన్ని.పిడుగురాళ్ళ బస్ స్టాప్ లో చాల సార్లు దిగాను .ఈ మద్య కూడా కారంపూడి వెళ్ళాను .గుంటూరు నుంచి వెళ్ళేటప్పుడు బస్ ను కొండమోడు లో ఆపుతారు టీ కోసం .పిడుగురాళ్ళ వాళ్ళు చాలా తిట్టుకుంటారు కాదు .నేను ఎనిమిదవ తరగతి పిడుగురాళ్ళ లో చదువుదామని అనుకున్నా ను ....ఏ డ వ తరగతి పరిక్షలు మాచవరం నుండి మొర్జం పాడు నడిచి వెళ్లి రాసాము. వేరి గుడ్ ఎక్ష్ పే రి యన్స్ .ఇప్పటికీ నాకు బాగా గుర్తు ఆరోజులు .

    ఎనిమిదవ తరగతో రెంటచింతల లో చేరాను .ఫామిలి కూడా అక్కడే సెటిల్ అయ్యాము.చాలా సంతోషం .

    ReplyDelete
  3. hai ramaraju gaaru chaala baagundi mee post manadaina guntur naatu styl lo , nenoo chinnappudu regu pandla kosam, jaana kaayala kosam polaala venta , chittadavullo ,saradaaga thirige vaadini,oka brundaanni ventesukuni cycles meeda duobles thokkukuntoo haa aa rojule veru, annattu maadi atchempeta, near sattenapalli.

    ReplyDelete
  4. మీరిలా ఊరిస్తే ఇప్పటికిప్పుడు ఎక్కడికెళ్ళి సంపాదించాలి రేగ్గాయలు? రేగిపళ్లతో వడియాలు పెట్టే కోమట్ల ఫామిలీ ఒకటి మా ఇంటి పక్కనే ఉండేది. అవి కూడా చాలా రుచిగా ఉంటాయి. అవి ఎండేలోపుగానే లేపేసేవాళ్లం మేము!

    ఆవకాయ దాని ముందు బుస్సు..భలే చెప్పారు!

    ఈ గంగ రేగిపళ్ళు నాకూ అంతగా నచ్చవు! అవి హైదరాబాదులో వలల వంటి సంచుల్లో పోసి అమ్ముతారు. బొప్పాయి పళ్ళు, రేగుపళ్ళు బజార్లో అమ్మడం ఏమిటో చాలా రోజులు అర్థ మయ్యేది కాదు. అవి మనకు ఊరికే వస్తే అలాగే అనిపిస్తుంది మరి.

    పియర్ మొదటి సారి తిన్నప్పుడు తెల్సింది అది సీమరేగుపండని. చెప్తే ఎవరూ నమ్మలా!

    మీ భాష బాగుంది. ఇలాగే రాయండి. మన nativity ని కనీసం బ్లాగుల్లో అయినా కొనసాగిద్దాము!

    గుంటూరు జిల్లా వాళ్ళే అనుకుంటే రాను రాను పల్నాడు వాళ్ళు కూడా బ్లాగుల్లో మిత్రులుగా కలవడం సంతోషంగా ఉంది. పండు మిరపకాయల పచ్చడితో వేడన్నం తిన్నట్టు ఉంది

    ReplyDelete
  5. @సుజాత గారు: "గుంటూరు జిల్లా వాళ్ళే అనుకుంటే రాను రాను పల్నాడు వాళ్ళు కూడా బ్లాగుల్లో మిత్రులుగా కలవడం సంతోషంగా ఉంది." -పల్నాడు గుంటూరు జిల్లాలోదే..
    @అరుణాంక్: మీ వ్యాఖ్య మీద ఇంకోటపా రాద్దామనుకుంటున్న.
    @వంశీజి: నా బ్లాగు చదివినందుకు థాంక్సులు.
    @అయ్యా నేనుసైతం గారు: మీరు దేనికి "నేను సైతమో"..థాంక్సులు.

    ReplyDelete
  6. భాస్కర్ గారు,
    పల్నాడు గుంటూరు జిల్లా లోనిదే లెండి! పుట్టి పెరిగి చదివినదంతా NRPTలోనే!ఇదివరలో పల్నాడు నుంచి ఇంతమంది ఉండేవారు కాదు కదా! ఇప్పుడిప్పుడే నేను, వేణూశ్రీకాంత్,(మీరు పాత కాపే అనుకొండి), గీతాచార్య ఇలా అందరం మా వూరికి ఇటువైపు నుంచి కలుస్తుంటే ఆ మాట రాశాను.

    ReplyDelete
  7. @సుజాత గారు!! పల్నాటి ప్రభంజనం మొదలైతే ఆగదు!!

    ReplyDelete
  8. హై రామరాజు గారు
    నా పేరు జ్యోతి బోయిన మాది కారంచేడు. కాని నేను పెరిగింది అనంతపూర్, రాయలసీమ.
    మీ పోస్ట్ రేగ్గాయలు చదివాను చాలా బాగుంది. మీరు రేగ్గాయలు గురించి చెప్పగానే నాకు కుడా నోరు ఊరింది. మాకు మీకు లాగ కోసుకోలెదు కానీ కొనుకున్నాము. మరి ఇప్పుడు మీ మాటల్లలో ఆ రుచి గుర్తికి వచ్చింది. చిన్నప్పుడు నేను కూడా మీరు చెప్పిన రుచులన్ని చూసాను . చాలా బాగుంటాయి.మీ భాష లో nativity బాగుంది దీనినీ కొనసాగించండి.మిమ్మల్ని ఇలా కలసినందుకు చాలా సంతోషంగా ఉంది.

    ReplyDelete
  9. ఎలాగో మిస్సయ్యానీ జాబును. మీ భాష బావుంది. "రేగిముల్లు దిగనోడు పల్నాడులో ఉండడేమో." - భలే!.
    నాకు నచ్చేసిందీ జాబు.

    ReplyDelete
  10. >>>"@సుజాత గారు!! పల్నాటి ప్రభంజనం మొదలైతే ఆగదు!! "

    నిజవేఁ

    ReplyDelete
  11. @రేగ్గాయలు
    హ్మ్... నాకు చాలా ఇష్టం.. సిన్నప్పుడు మా వూర్లో కొండకి వెళ్లి కోసుకోచ్చుకొనే వాళ్ళం. కొని తినడం కన్నా అలా కష్టపడి కోసుకోచ్చుకు తినడం ఆ రుచిని మరింత పెంచేది:). అందులోనూ దోరదోరగా ఉన్దేవి.. పుల్ల పుల్లగా.. తియ్య తియ్యగా ఆహ్ ఎంత రుచో. మావైపెతే విత్తనముతో సహా తినేవాల్ల్లం. ఇంక ఆకాలంలో ఐతే అంతకు ముందే ఉప్పులో ఊరేసి ఎండబెట్టిన రేగాయలు అమ్మేవాళ్ళు..రుచి ఇంకా పెరిగేది..

    హిప్పుడు మీరు రేగ్గాయలు గుర్తు చేసి నా మనసుకి ఆ తీపి/పులుపు గాయం చేసారు :)

    ReplyDelete