Sep 29, 2020

భాజపా తన బొందని తానే పెట్టుకుంటున్నదని నా భావన

నిన్ననో మొన్ననో ఈ వార్త చూశాను

"భారతీయ జనతా పార్టీ (భాజపా) తన జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన డీకే అరుణ, పురందేశ్వరిలకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీకి చెందిన సత్యకుమార్‌ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు."


భాజపా తన బొంద తానే పెట్టుకుంటున్నదని అనిపించింది. పైన ప్రకటించిన ఇద్దరు వ్యక్తులూ భాజపా భావజాలంతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన వాళ్ళు కారు. ఒకరు మరీ దారుణంగా కాంగ్రేస్ భావజాలంలోంచి వస్తే మరొకరు అవకాశావాద రాజకీయాలతో నెట్టుకుంటూ కేవలం పదవులే ముఖ్యంగా కేవలం లైంలైట్లో ఉంటానికే వచ్చిన వ్యక్తి. 


ఇలాంటివారికి పార్టీలో ప్రధాన్యత ఇస్తే ఎప్పటినించో పార్టీనే అంటిపెట్టుకుని భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న వ్యక్తులు ఏమి చేయాలీ? వారికి గుర్తింపెదీ?


భాజపా తన బొందని ఈరకంగా తానే పెట్టుకుంటున్నదని నా భావన


Sep 27, 2020

కీ|శే|| బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖి ఆకాశవాణిలో (రిప్లే)

 కీ|శే|| బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖి ఆకాశవాణిలో


నిన్న మధ్యాహ్నం అనుకుంటా ఆకాశవాణిలో బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖీ (రిప్లే) వచ్చింది. నిజం చెప్పాలంటే ఎటువంటి నాన్-సెన్స్ లేకుండా సుత్తిలేకుండా ఎంతో హుందాగా చక్కటి భాషతో స్లోగా ఉంటుంది ఆకాశవాణి. 

అదేకోవకు చెందింది ఈ ముఖాముఖీ కార్యక్రమం. శ్రీ మోహన కృష్ణ గారు బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖీ కార్యక్రమాన్ని ఎంతో హుందాగా నిర్వహించారు. బాలసుబ్రహ్మణ్యంగారితో ముఖాముఖీ ఒక గంటలో తేలేది కాదు. ఆయన పాడిన పాటలు ఎన్నో పాటతో ఆయన ప్రయాణానికి ఎన్ని ఏళ్ళో - ఆసారాన్నంతా ఒక గంటలోకి కుదించటం ఆ దేవుడి వల్ల కూడా కాదు. 


బాలసుబ్రహ్మణ్యం గారికి లలిత గీతాల పోటీలో బహుమతి రావతం, ఆ నాటి జ్ఞాపకాలు అయన పంచుకోవటం బాగుంది. అయితే మోహన కృష్ణగారు చక్కటి ప్రశ్న వేయటం కొస పెరుపు - మీరు పాడిన పాట ఎదీ? అని. బాలసుబ్రహ్మణ్యం గారు వారి తండ్రిగారు రాసిన పాట అని ఆ పాటన తడమటం -"పాడవే వల్లకీ పాట". తండ్రిగారు రాసిన పాటను ఆయన పాడటం ఎంత గొప్ప అనుభూతి? బాలసుబ్రహ్మణ్యంగారు కాలంలో కలసి పోయినా వారి పుత్రుడు తాత గారి రచనలని, తంద్రి గారి రచనలని సెకరించి అచ్చు వేయిస్తే అంత గొప్పగా ఉంటుందో అని నా మనసులో ఓ ఆలోచన స్పురించింది, అది ఇప్పటికే జరిగుండకపోతే.


ముఖాముఖీ అనేక పాటలని స్పృశించకపోయినా మోహనకృష్ణ గారు చక్కగా తన స్టైల్లో ప్రశ్నలు అడగతం, బాలసుబ్రహ్మణ్యం గారు న్వ్వుతూ జవాబులు చెప్పటం - వీనుల విందుగా అనిపించింది.



కొన్ని మెరుపులు -

"అబ్బాయ్ మురళీకృష్ణ సరస్వతీ  పుత్రులైన శ్రీ బాలమురళీకృష్ణ గారి దగ్గర నువ్వు అంతేవాసివి - నేను అంతే" ఎంత నిజాయితీగా చెప్పుకున్నారో?


Sep 26, 2020

దొరకునా ఇటువంటి సేవా

మధ్యానం బాధ లోంచి  బయట పడటానికి ఛానెల్స్ బ్రౌజ్ చేస్తుంటే జెమినీలో శంకరాభరణం తగిలింది.

సామజ వర గమన పాట వస్తున్నది అప్పటికే


బహుశా నా ఒకటో లేక రెండో తరగతిలో వచ్చిందనుకుంటా శంకరాభరణం.

చూసిన ప్రతిసారీ ఓకొత్త అనుభూతి అనుభవం

నా దృష్టిలో గొప్పనటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారుశంకరాభరణం నిలువెత్తు ఉదాహరణ.

నా దృష్టిలో గొప్ప నటుడు శ్రీ జొన్నలగడ్డ సోమయాజులు గారు.

నా దృష్టిలో గొప్ప నటి నిర్మలమ్మ.

నా దృష్టిలో గొప్ప నటుడు చంద్రమోహన్.

నా దృష్టిలో గొప్ప నటుడు సాక్షి రంగారావు.


సరే సినిమాలోకొస్తే సామజ వర గమన పాటప్రాణం వేటూరిఊపిరి బాలు జానకి.

ప్యూర్ వేటూరి మాయాజాలం బాలు దాన్ని తారాస్తాయికి తీసుకెళ్ళటం -



"ఆమని కోయిల

ఇలా 

నా 

జీవన వేణువులూదగ

ఆమని 

కోయిల 

ఇలా 

నా జీవన వేణువులూదగ

మధురలాలసల 

మధుపలాలనల 

మధురలాలసల 

మధుపలాలనల 

పెదవిలోని మధువులాను రసముపూని జతకు చేరగా 


వేసవి రేయిలా 

ఇలా 

నా 

ఎదలో మల్లెలు చల్లగ 


మదిని కోరికలు 

మదన గీతికలు 

మదిని కోరికలు 

మదన గీతికలు 

పరువమంత విరుల పానుపు పరచి నిన్ను పలకరించగా"


పాటని అనుభవిస్తూ పాడితే ఎలా ఉంటుందో  పాట ఒక మైలురాయి.


ఇంతలో సినిమా చివరకు వచ్చేసింది.


"దొరకునా ఇటువంటి సేవ"

సన్నివేశం విశ్వనాథ్ గారు ఎలా చిత్రీకరించారు నాటకీయత  ఇవన్నీ పక్కన పెడితే!


వేటూరి ఆలోచనా తీరుజంధ్యాల మాటబాలసుబ్రహ్మణ్యం పాటవిశ్వనాథ్ దర్శకత్వం -


ఎన్నో ఏళ్ళ తర్వాత కచేరీకి అంగీకరించిన  సంగీత శాస్త్రవేత్త.

కచేరికి వేంచేసి అతని పేరు మీద వెలసిన క్షేత్రంలోకి ఆశ్చర్యపోయి వచ్చి - 

పాశ్చాత్య సంగీతపు పెనుతుపానుకి రెపరెపలాడుతున్న సత్-సాంప్రదాయ సంగీతపు జ్యోతిని ఒక కాపుకాయటానికి తనచేతులు అడ్డుపెట్టిన దాత ఎవరో వారికి శత సహస్ర వందనాలు అర్పిస్తున్నానుసుష్కించిపోతున్న భారతీయ సంస్కృతీసాంప్రదాయాలని పునరుద్ధరించటానికి నడుంకట్టిన  మహా మనీషీకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానుకళ జీవకళఅజరామమైనదిదీనికి అంతం లేదునిరాదరణ పొందుతున్న  కళని పోషించటానికి కోటికి ఒక్క వ్యక్తిముందుకొచ్చినా సరే -  అమృతవాహిని అనంతగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుందిమనిషి నిలువెత్తు ధనంసంపాదించినా -

దొరకునా ఇటువంటి సేవ

నీ పద రాజీవముల చేరు 

నిర్వాణ సోపాన మధిరోహణము 

సేయు త్రోవ


రాగాలనంతాలు నీ వేయి రూపాలు

భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు

రాగాలనంతాలు నీ వేయి రూపాలు

భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు


నీ పాదాలు చేరటానికి నిచ్చెన సేవ

తిమిరాలను పోకార్చు దీపాలు - 

తిమిరం - చీకటి

పోకార్చుట - 'పొకారు or పోకారు [Tel.] v. n. To be ruined, నాశమగుపొకార్చుపొకారుచుపోకారుచు or పోకార్చుpokārṭsu. To kill or ruin, to render powerless, to strike with stupor, ".. కానకకన్నమాసుతుబొకారిచియిన్నియుమిధ్యచేసితే."'


జీవితాన్ని మింగేసిన చీకట్లను నాశనం చేసే దీపం సేవ.. 



బాలసుబ్రహ్మణ్యం  పాటకి నిజంగా ఊపిరి!

నా కళ్ళు చెమర్చాయి.


సినిమా ఇండస్ట్రీ అంతా హీరో చుట్టూతా పరిభ్రమిస్తూ ఉంటుంది ముఖ్యంగా తెలుగులో.


రచయితకి గుర్తింపు ఉండదు.

పాటకర్త  ఎవరో తెలియదు.

వీటి ప్రస్తావన ఎక్కడా ఉండదు.

దౌర్భాగ్యం

పై మాటలు ఎంత లోతుగా ఉన్నాయీదర్శకుడి తపనని గుర్తెరిగిన రాసిన రాత - శంకరాభరణం మాట కర్త జంధ్యాల.

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మాటలు పాటలు నటన దర్శకత్వం.

Sep 25, 2020

గాయకుడు పాటకు ఊపిరి, కవి పాటకు ఆత్మ

 


ఊహ తెలిసినప్పటి నుంచి రేడియోలో ఆయన పాటలు వింటూ పెరిగినవాళ్ళకు ఆయన పాట జీవితంలో ఓ భాగం అయిపోతుంది. మనసులో ఆయన ఒక చోటు చేసుకుని కూర్చున్నట్టే ఉంటుంది. అమ్మా నాన్నా అన్నా చెల్లీ లతో పాటు ఆయన ఒక కుటుంబ సహ్యుడే. బాధల్లో *దుఖఃభరిత పాటల* ఓదార్పు. ఆనందంలో *ఉత్సాహాన్ని రేకెత్తించే పాటలు* వాటంతట అవే పెల్లుబుకుతాయి. ఈ పాటలన్నీ మనసొత్తు అయినట్టు. ఆ పాడినవాడు మనోడన్నట్టు మనకోసమే అన్నట్టు.


గాయకుడు పాటకు ఊపిరి

కవి పాటకు ఆత్మ


పాట నిలిచినంత కాలం గాయకుడికి మరణం లేదు

రచయితకీ మరణం లేదు


కానీ ఒక వ్యక్తిగా కరోనాతో ఆయన కాలం చేయటం బాధగా ఉంది.


ఆయన గళంలోంచి వచ్చిన ఈ పాట మనసులో తిరిగుతోంది -


ఎక్కడో దూరాన కూర్చున్నావు

ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు 

చిత్రమైన గారడి చేస్తున్నావు

తమాష చూస్తున్నావు సామీ



లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు

మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు 

లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు

మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు 

అంతా మా సొంతమని అనిపిస్తావు

అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా సామీ 


ఎక్కడో దూరాన కూర్చున్నావు

ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు 

చిత్రమైన గారడి చేస్తున్నావు

తమాష చూస్తున్నావు సామీ

 

ఎక్కడో దూరాన కూర్చున్నావు 


పెరుగుతుంది వయసనీ అనుకుంటాము

కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము 

పెరుగుతుంది వయసనీ అనుకుంటాము

కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము 

కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా 

మా కళ్ళముందు మాయతెరలు కప్పేస్తావు సామీ 


ఎక్కడో దూరాన కూర్చున్నావు

ఎక్కడో దూరాన కూర్చున్నావు 

ఎక్కడో దూరాన కూర్చున్నావు సామీ

ఎక్కడో దూరాన కూర్చున్నావు


Sep 20, 2020

ఆదివారం పాటలతో ప్రయాణం

ఆదివారం పని చేయటం అంత ఈజీకాదు.

కాస్త ఊరట కోసం ఆకాశవాణి పెట్టాను.

ఒక్కో పాట నన్ను పరుగెత్తేలా చేస్తున్నాయి

"అలుపన్నది ఉందా

ఎగిరే అలకు

ఎదలోని లయకు

అదుపన్నది ఉందా

కలిగే కలకు

కరిగే వరకు

మెలికలు తిరిగే నది నడకలకు

మరి మరి ఉరికే మది తలపులకు


నా కోసమే చినుకై కరిగి

ఆకాశమే దిగదా ఇలకు

నా సేవకే సిరులే చిలికి

దాసోహమే అనదా వెలుగు

ఆరారు కాలాల అందాలు బహుమతి కావా

నా ఊహలకు

కలలను తేవా నా కన్నులకు


నీ చూపులే తడిపే వరకు

ఏమైనదో నాలో వయసు

నీ ఊపిరే తగిలే వరకు

ఎటు ఉన్నదో మెరిసే సొగసు

ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే

తరుణం కొరకు

ఎదురుగా నడిచే తొలి ఆశలకు"


- సిరివెన్నెల

గాయం చిత్రం నుంచి 


తేలిక పదాలతో అల్లిన ఈ పాట మొదలు సిరివెన్నెల మార్క్ ని ఆవిష్కరిస్తుంది. 

ఈ పాటని అనుభవించెలోపు ఇంకోపాట మొదలైంది


ఓ కన్నె పువ్వా కాటేసి పోనా - మొదలులోనే వేటురి బాణి అర్థమైపోయింది.


"ఓ కన్నె పువ్వా కాటేసి పోనా

నా తేనే బువ్వా భోంచేసి పోరా


శివ శివా ఏంటమ్మా నాలో ఇంత కువ కువా

హర హరా అందాలకెందుకింత పెర పెరా

కనుల నిదుర కరువై అది పగటి కలల పరమై

పరువమేమో బరువై అది మరువలేని దరువై

ఎల్లకిల్లా పడ్డదమ్మా ఎన్నెల బిళ్లా

తెల్ల చీర నల్లబోయే పొద్దుటికల్లా

తొలి చూపులో...

తొలి చూపులో చలి కాచుకో పులకింతల పున్నమి వేళా"

ఇంక చెప్పేదేవుందీ


తేనె బువ్వలు

మల్లె బువ్వలు 

వేటూరి శృంగారంలోచి ఉద్భవించిన ఊహలే కదా?


తర్వాతి పాట గులాబి చిత్రం నుంచి

ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో 

సునీతకి సినిమా ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని ఇచ్చిన పాట.


"ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో

అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

నా గుండె ఏనాడో చేజారి పోయింది

నీ నీడగా మారి నావైపు రానంది

దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో"


సిరివెన్నెల గారి ఈ ఊహ అద్భుతమైన ఊహ. నా గుండె నీ నీడగా మారిపోయింది. మనిషి నుంచి నిడని వేరు చేయలేం అతను ఆమె దగ్గరకి చేరితే తప్ప.

అబ్బా ఇకచాల్లే ఈపాటల పదనిస అనుకుంటుండగానే తర్వాత మొదలైంది.

పాపం రాజేంద్రప్రసాద్ ని మింగేసిన సినిమా రాంబంటు.

ఇందులోని ఈ పాట - 


"సందమామ కంచమెట్టి, సన్నజాజి బువ్వపెట్టి

సందెమసక చీరగట్టి, సందుచూసి కన్నుగొట్టి"

చెప్పకనే చెబుతుంది ఇది వేటూరి బాణి అని

చందమా కంచంలో సన్నజాజి బువ్వ. మళ్ళీ అదే గోల.

సందె మసక చీకటి అంటే కనిపించీ కనిపించని చీకటిని చీరగా చుట్టిందట శృంగార తార. అతన్ని కవ్వించటానికి అందాలని ఆరబోస్తూ కన్ను కూడా కొట్టిందట పాపం.

కానీ అతనేమో - 

"భద్రాద్రిరామయ్య పెళ్ళికొడుకవ్వాల, సీతలాంటినిన్ను మనువాడుకోవాల

బెజవాడ కనకదుర్గమ్మ బాసికాల్దేవాల, బాసరలో సరస్వతి పసుపుకుంకుమలివ్వాల

ఏడుకొండలసామి ఏదాలుజదవాల, సెవిటిమల్లన్నేమో సన్నాయి ఊదాల

అన్నవరం సత్తన్న అన్నవరాలివ్వాల, సింహాద్రప్పన్న సిరి(జాస?)లివ్వాల"

అంటూ లెక్కలు కడుతున్నాడు ముడుపుల మూటలు చుడుతున్నాడు ఆమెని ఏ మాత్రమూ పట్టించుకోకుండా

ఆమేమో పెదవితేనెలందిస్తే పెడమోములు, తెల్లారిపోతున్న చెలినోములు

పిల్లసిగ్గు చచ్చినా, మల్లెమొగ్గ విచ్చినా

అంటూ వేడి నిష్టూరాలు పోతున్నది.


అనురాగ్ కశ్యప్ - గొప్ప స్త్రీవాది

ఆదివారం హాస్యోక్తి:


"నాకు తెలిసినంతవరకూ నువ్వు గొప్ప స్త్రీవాదివి"

- తాప్సీ అనురాగ్ కశ్యప్ ని ఉద్దేశించి.


Sep 19, 2020

బుచ్చిబాబు చివరకు మిగిలేది నాటకం

 ఎందరో రచనలు చేస్తారు.

కొన్ని రచనలే లోతుగా స్పృశిస్తాయి.


"ఇతరులతో సంపర్కం వదులుకుని, ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యధార్థం అని నమ్మి సమాధాన పరుచుకోవడం, సంఘంతో నిమిత్తం వున్న మనిషికి చేతకాదు కాబోలు. చరిత్ర కట్టుకున్న ప్రాచీన పునాదులు, సంఘం పాతుకున్న మట్టి విత్తనాలు, వాటిని మినహాయిస్తే మానవుడిలో చివరకు మిగిలేది ఏమిటి?"

ఈ ప్రశ్న అంత సులభంకాదు జవాబు చెప్పటానికి.


ఒక వ్యక్తి భావుకతని అతని స్థాయికి వెళ్ళి అతనితో ప్రయాణించి అతన్ని గమనిస్తూ వెళ్తే కానీ అర్థం కాదు. ఆవిష్కారం కాదు.


దయానిధి అనే భావకుడితో ప్రయాణం చేసేలా చేశాడు ఆ పాత్ర సృష్టికర్త *బుచ్చిబాబు* *చివరకు మిగిలేది* అనే తన నవలలో


చివరకు మిగిలేది నవలని ఎప్పుడో చదివిన జ్ఞాపకం. వయసులో ఉన్నప్పుడు ఉన్న వేడి ఆలోచనా ధోరణీ చపున ఎగసి పడే ఆవేశం నలభైల్లో పడ్డాక పడి విరిగిన అలలా అయిపోయింది.


నాలో నా ఆలోచనలలో కలిగే మార్పులు నాకు సుస్పష్టంగా తెలుస్తున్నాయి.



పోయినవారమో అంతకముందో ఏదో పనిలో ఉండి ఆకాశవాణి పెట్టుకుని వినటం మొదలుపెట్టాను. చివరకు మిగిలేది నాటకం నన్ను కట్టేసింది. దానిలోని పాత్రలు అద్భుతంగా మలచారు నండూరి రామకృష్ణ గారు మరియూ పాలగుమ్మి పద్మరాజు గారు.


ఈ నాటకం నన్ను మరోమారు చివరకు మిగిలేది నవల చదివేలా ప్రోత్సహించింది.


చూద్దాం ఆలోచనలు భావాలు ఎలా తిరుగుతాయో.


Sep 16, 2020

జయ ప్రకాశ్ రెడ్డి

జయ ప్రకాశ్ రెడ్డి


మనాన్న గారు హిందూ కళాశాలలో పట్టభద్రుడైయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఒక ఏడాది చదివి మధ్యలో జై ఆంధ్రా ఉద్యమం అంటూ సమ్మెలు హర్తాళ్ళు అయ్యాక మధ్యలోనే ఆపివేసి బందరులో బిఈడి చేరినప్పుడు ఆయనకి సహాధ్యాయీ జయప్రకాశ్ రెడ్డి గారు. మా నాన్న గారికి కూడా నాటకాల పిచ్చి ఉండటం. డిగ్రీ రోజుల్లో ఒకె నాటకాన్ని అయిదు రోజులు ప్రదర్శించటం. ఆ నాటకం పేరు ఒథెల్లో అవటం. అదీ ఇంగ్లీషులో అవ్వతం. ఆయన డిగ్రీ సర్టిఫికెట్ లో "Talented Actor" అని ఉండటం - గొప్పగా చెప్పుకునే వాడు నాన్న.


జయప్రకాశ్ రెడ్డి గారు మా నాన్న గారు ఒరేయ్ ఒరేయ్ అనుకునే స్నేహితం.


ఓ రోజున నాన్న సమరసింహారెడ్డి సినిమాకి వెళ్దాం పదా అని లాక్కెళ్ళారు. బాలకృష్ణ సినిమాలు థియేటరుకి వెళ్ళి చూసినవి 4 మాత్రమే. ఏంటినాన్నా బాలయ్య సినిమకి లాక్కుపోతున్నావ్ అని ఏడుస్తూ మూలిగితే నా మిత్రుడు జయప్రకాశ్ రెడ్డి అందులో గొప్పగా నటించాడు. వాడికోసం అని చెప్పుకొచ్చాడు నాన్న.


సమరసింహారెడ్డి సినిమా చూట్టం జయప్రకాశ్ రెడ్డి గారి నటన చూసి ఆయనే నటించినంతగా పొంగిపోవటం ఇంటికొచ్చాక ఒరేయ్ అంటూ ఆయనతో మాట్లాడటం. నాన్న గొప్పగా పొంగిపోయాడు - అదిగో వాడే నా మిత్రుడు అంటూ.


టీచర్ల బృందంలో బాగా నలిగిన నాటకాలు కొన్ని. ఈ ఇద్దరు మిత్రులూ కొన్ని నాటకాల గురించి మాట్లాడుకునే వాళ్ళు. మరో మొహంజో దారో గురించి మధ్యలో వచ్చేది. జయప్రకాశ్ రెడ్డి గారి అలెక్జాండర్ గురించి మాట్లాడుకునే వారు.


జయప్రకాశ్ రెడ్డి గారు స్క్రీన్ మీద ఎంత గంభీర్యంగా ఉన్నా నిజ జీవితంలో చాలా సౌమ్యంగా మాట్లాడేవారు. ఎంతో సాఫ్ట్ గా మాట్లాడేవారు. చిన్నా పెద్ద అని లేకుండా అందరితో బహు సరళంగా మాట్లాడేవారు. మా నాన్న లాగానే.


ఆయన కాలం చేశారనే వార్త నన్ను కలచి వేసింది.


నటుడికి చావుండదు అని నా అభిప్రాయం.


Sep 14, 2020

మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి

 వాట్సప్ లో వచ్చిన ఈ పజిల్ కూడా ఆసక్తికరంగా ఉంది 👇.

————————————-
WhatsApp msg :-👇
————————————-
Forwarded
“మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి
> ఉదాహరణకు: - - లీ, సిసిలీ

> 1. ➖➖యి
> 2. ➖➖లు
> 3. ➖➖న
> 4. ➖➖త
> 5. ➖➖జు
> 6.➖➖ రం
> 7. ➖➖న
> 8. ➖➖ధ
> 9. ➖➖గం
> 10. ➖➖యి
> 11. ➖➖లు
> 12.➖➖ కారం
> 13. ➖➖త్సుడు
> 14. ➖➖ఆట
> 15. ➖➖ని
> 16. ➖➖ద్రి
> 17. ➖➖ట
> 18.➖➖పు
> 19. ➖➖లు
> 20. ➖➖మంత్రం
> 21. ➖➖బసవన్న
> 22. ➖➖పట్టు
> 23.➖➖త
> 24.➖➖నం
> 25. ➖➖లు. “
————————————

అందించిన విన్నకోట వారికి కృతజ్ఞతలు