May 26, 2011

ఈ వార్త చూసారా?

వార్త అటుంచితే, ఆ బొమ్మమాత్రం నన్ను కదిపేసింది. భారతదేశం కర్మభూమి, అదీ ఇదీ అని చెప్పుకోటానికే అని మరోమారు రుజువైంది.

ఆడపిల్లా.. అంతుచూస్తారు!
ఏ మాత్రం తగ్గని భ్రూణ హత్యలు
గర్భస్రావాలతో కడతేరుస్తున్న వైనం..
సంపన్నులు, విద్యావంతుల్లోనే ఎక్కువ
2011 లెక్కల్లో తగ్గిన బాలికలు
న్యూఢిల్లీ
డుపులో పడిన నలుసు ఆడపిల్లని తేలితే చాలు.. మొగ్గలోనే చిదిమేస్తున్నారు. ఈ దురాచారం మరింతగా పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించే ఈ సమస్య క్రమంగా దక్షిణ భారత్‌లోనూ అదేస్థాయిలో విస్తరిస్తున్నట్లు వెల్లడైంది. ఆడపిల్ల అనే కారణంతో దేశంలో గత మూడు దశాబ్దాల కాలంలో 42 లక్షల నుంచి 1.21 కోట్ల గర్భస్రావాలు జరిగినట్లు తేలింది. తొలి సంతానంగా ఆడపిల్లను కలిగిన సంపన్నులు, విద్యావంతులు సైతం.. రెండోసారి గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లు గుర్తిస్తే గర్భస్రావం చేయించుకున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ తరహా గర్భస్రావాలు 1980 నుంచి 2010 వరకూ 42 లక్షల నుంచి 1.21 కోట్ల దాకా జరిగి ఉంటాయని 'లాన్సెట్‌'లో ప్రచురించిన అధ్యయనంలో వివరించారు. బాలురు, బాలికల నిష్పత్తిలో సైతం గణనీయ మార్పులు వచ్చినట్లు నిర్ధరించారు. ఇలాంటి గర్భస్రావాలు సర్వసాధారణంగా జరిగే రాష్ట్రాల్లోనే దేశ జనాభా ఎక్కువగా కేంద్రీకృతమై ఉందని టొరంటో విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రభాత్‌ఝా తెలిపారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు జనగణన, జాతీయ సర్వేలను పరిశీలించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఆరేళ్లలోపు చిన్నారుల్లో బాలురతో పోలిస్తే 71 లక్షల బాలికలు తక్కువగా ఉన్నారు. 2001 జనాభా లెక్కల్లో 60 లక్షల మందే తక్కువగా ఉండగా తేడా గణనీయంగా పెరిగింది. కుమారుడే ఉండాలనే నిర్ణయం వల్లే ఇలా స్త్రీ పురుష నిష్పత్తిలో భారీ తేడాకు కారణమవుతోందని వివరించారు. అల్ట్రాసౌండ్‌ సౌకర్యాలు అందుబాటులోకి రావడం, ఖర్చుపెట్టే సామర్థ్యం పెరగడం వంటివి ఇలాంటి గర్భస్రావాలకు కారణమవుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

అమెరికాలోనూ మారని మనవాళ్లు..
బోస్టన్‌: అమెరికాలో ప్రవాస భారతీయ మహిళలు సైతం.. కడుపులో ఆడపిల్ల ఉన్నట్లు తేలితే గర్భస్రావాలు చేయించుకుంటున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించారు. కుటుంబ ఒత్తిడుల కారణంగానే ఈ పనికి ఒడిగడుతున్నట్లు తేలింది. భారత్‌లో మాదిరిగా కాకుండా లింగనిర్ధరణ పరీక్షలు అమెరికాలో చట్టబద్ధం కావడంతో ఈ పని మరింత తేలికవుతోంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు 2004 నుంచి 2009 వరకు ఈ పరిశీలన చేపట్టారు. గర్భంలో ఆడబిడ్డ ఉన్నట్లు నిర్ధరణ జరిగినప్పుడు 40 శాతం మంది మహిళలు గర్భస్రావం చేయించుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ మహిళల్లో సగం మందికి ఉద్యోగాలు ఉండగా, చాలామంది ఉన్నత విద్యావంతులేనని తేలింది. గర్భంలో ఆడపిల్లను మోసే మహిళలు ఇళ్లలో తిట్లు, దెబ్బలకు గురవుతున్నట్లు గుర్తించారు. అత్త, భర్తల నుంచే ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటున్నట్లు వెల్లడైంది. ఈ అధ్యయనంలో పరిశీలించిన మహిళల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చినవారూ ఉన్నారు.



9 comments:

  1. ఆడపిల్ల పుడితే కట్నం ఇచ్చుకోవలసి వస్తుందనే అలా చేస్తున్నారు. పల్లెటూర్లలో కట్నం ఇచ్చేంత డబ్బున్నవాళ్ళు తక్కువ కాబట్టి ఇటువంటి అబార్షన్లు పల్లెటూర్లలో అంతగా కనిపించవు. పట్టణాలలో, అదీ బాగా చదువుకున్న కుటుంబాలలో ఎక్కువగా కనిపిస్తాయి.

    ReplyDelete
  2. దీన్ని ఆడపిల్ల, మగపిల్లవాడు అనే దృష్టితో చూడడం సరికాదు. ఆడ భ్రూణాలకు ఎదురవుతున్న ఈ సమస్య ఒక చాలా పెద్ద సమస్యలో చిన్న ఏకదేశం. మనుషుల్లో డబ్బాశ చాలా అమానుషంగా పెఱిగిపోయింది. మనుషులు సంపూర్ణ ఆర్థిక జీవులుగా పరిణామం చెందారు. ఆ మనస్తత్త్వంలో వారు దేన్నీ సహజంగా జఱగనివ్వడం లేదు. ఎవఱినీ సహజంగా బతకనివ్వడం లేదు. అసలు మూలం అక్కడుంది. కానీ ఆడవాళ్ళకి సమస్య వస్తే తప్ప ఏ సమస్య గుఱించీ సీరియస్‌గా పట్టించుకోని అసున్నితత్వం (insensitivity) సమాజంలో ప్రవేశించింది. మన సున్నితత్వాలన్నీ ఆడవాళ్ళకే రిజర్వుడు.

    ReplyDelete
  3. బాధేసింది...ఆడపిల్లలే ఆప్యాయతలకు పెట్టింది పేరు అని ఎప్పుడూ గ్రహిస్తారు???

    ReplyDelete
  4. పిండ దశలో ఆడపిల్ల అని గుర్తించినప్పుడే భ్రూణ హత్యలు జరుగుతున్నపుడు దాన్ని ఆడపిల్ల, మగపిల్లవాడు అనే దృష్టితో కాకుండా మరో దృష్టితో చూడ్డం ఎలా సాధ్యమో తాడేపల్లిగారు వీవరించి ఉండాల్సింది.

    భారత సమాజంలో వరకట్న దురాచారం ఉందని తాడేపల్లివారు అంగీకరిస్తారనే అనుకుంటున్నా. ఆడపిల్లకి పళ్ళి చేసేటప్పుడు కట్న రూపంలో తమ ఆస్తిలో కొంత భాగాన్ని ఆడపిల్ల తల్లి దండ్రులు వదులుకోవాల్సి ఉంటుంది. అంటే తమ ఆస్తిలో ఒక భాగం మీద యాజమాన్యం తమకు కాకుండా ఆడపిల్ల భర్త కుటుంబానికి దక్కుతుంది. అదే మగపిల్లాడైతే తమ ఆస్తి తమ దగ్గరే ఉండడమే కాక వరకట్నంగా వేరే కుటుంబానికి చెందిన ఆస్తిలో ఒక భాగాన్ని కూడా పెళ్ళి సమయంలో తెస్తాడన్న ఆశ ఉంటోంది. ప్రస్తుత సమాజంలో ఉన్న స్వంతాస్తి దృక్పధం ఇది. దీనికీ తాడేపల్లివారికి అభ్యంతరం ఉండదనుకుంటా.

    దీని వలన తమ ఆస్తి తమకే దక్కాలన్న భావం, పెళ్ళి సందర్భంగా ఉన్నపళాన పెద్ద మొత్తంలో ఆస్తి తెస్తాడన్న ఆశా తల్లి దండ్రులకు కలుగుతోంది. ఈ ఆశ వెర్రి తలలు వేయడంతో ఆడపిల్లల కంటే మగ పిల్లలపైనే ఇష్టాన్ని పెంచుకునే బుద్ధులు తలెత్తాయి. మనుషుల మధ్య ఉండే సహజ సామాజిక సంబంధాలను ఆస్తుల కోణంనుండి చూడ్డమే దీనికి కారణమని స్పష్టంగా అర్ధం అవుతోంది. తాడెపల్లి వారి మాటల్లో చెప్పాలంటే సంపూర్ణ ఆర్ధికజీవిగా మనిషి మారాడు.

    ఆస్తి దృక్పధంతో ఆడ కాదు మగ పిల్లాడే కావాలని కోరుకుంటూ, ఆడపిల్ల గర్భంలో ఉన్నందుకు తల్లిని హింసిస్తూ, పుట్టక ముందే అభార్షన్‌లతో బలవంతంగా చంపేయడం ఆడపిల్లల సమస్య కాకుండా ఎలా ఉంటుంది? ఆడ/మగ పుట్టడంలో తల్లిదండ్రుల ఇద్దరి పాత్ర ఉన్నా ఒక్క తల్లినే తప్పుపట్టి హింస పెట్టడం ఆడ సమస్య కాకుండా ఎలా ఉంటుంది? ఇంకా చెప్పాలంటే ఆడపిండ హత్యలు ఒక్క ఆడపిల్ల సమస్యలే కాకుండా మొత్తం సమాజ సమస్యగా కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే మగ పిల్లాడ్ని కనడానికైనా ఆడపిల్లే కావాలి గదా?

    సమాజంలో సగభాగం స్త్రీలే. అంటే ఆరువందల కోట్ల ప్రపంచ జనాభాలో మూడువందల కోట్ల మంది స్త్రీలు. మూడువందల కోట్లమంది భరిస్తున్న సమస్య అనేక సమస్యల్లో చిన్న సమస్యగా పరిగణించడం సబబేనా?

    ఆడవాళ్ళ సమస్య పట్టించుకునేవారెవరైనా, మిగతా సమస్యలగురించి కూడా తమ తెలివిడి మేరకు, అనివార్యంగా పట్టించుకుంటారు. ఎందుకంటే ఆడవాళ్ళు 'ఆడ'వాళ్ళే అని సమాజంలో గట్టి నమ్మకం ఉన్నపుడు స్త్రీల సమస్యలను గుర్తించి పట్టించుకోవడం అనేది ఒక రకంగా అరుదుగా సంభవించే విషయం. అలాంటి అరుదైన గుణం ఉన్నవారు అనివార్యంగా ఇతర సామాజిక సమస్యలన్నింటినీ పట్టించుకునే లక్షణాలను కలిగి ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ విధంగా చూసినప్పుడు ఆడవారి సమస్యలను పట్టించుకునేవారిని 'అసున్నితులు' అని అర్ధం వచ్చేలా చెప్పడం సరికాదు కదా తాడేపల్లిగారూ!

    డబ్బాశ అంతవరకే పరిమితమైతే అది ఆశగానే ఉంటుంది. అలా కాకుండా ఆ డబ్బాశ ఆడపిండాల హత్య వరకు వెళ్తే సంఘంలో సగం మంది ఉనికికి ప్రమాదం వచ్చినట్లే కదా? డబ్బాశే అమానుషం అయితే ఆ అమానుషానికి మరో అమానుషం -ఆడపిండ హత్య- తోడైతే అది డబుల్ అమానుషం కాదా?

    "బానిసకొక బానిసవోయ్ బానిసా!" అంటాడు శ్రీ.శ్రీ., స్త్రీని ఉద్దేశించి. భూస్వామి దగ్గరో, పెట్టుబడిదారుడి వద్దనో బానిస లెక్కన శ్రమ చేసే పురుషుడు ఓ బానిసైతే, ఆ బానిసకింద ఇంట్లో అన్ని పనులూ కిక్కురుమనకుండా చేసి పెట్టే స్త్రీ బానిస కింద బానిసగా మిగిలిపోయిందని ఆయన భావం.

    కనుక ఆడపిండ హత్యలు 1.ఆడవారి సమస్య 2.సామాజిక సమస్య 3.జనాభా సమస్య (ఆడపిల్లలు లేకపోతే ఆడ, మగ ఎవరూ పుట్టే అవకాశం లేదు కనక) 4.వివాహ సమస్య (పెళ్ళికి ఆడవారు కావాలి కనక - పర్వర్షన్స్ గురించి వదిలేద్దాం)5. సాంస్కృతిక సమస్య (ఆడపిల్లను హీనంగా చూడ్డం హీన సంస్కృతి గనక)6.ఆర్ధిక సమస్య (పెళ్ళాల చాకిరీ లేకపోతే మగవారికి ఆర్ధిక భారం మరింత పెరుగుతుంది మరి. అదీ కాక డబ్బు మూలానే కదా భ్రూణ హత్యలు!)

    అర డజను ముఖ్య సమస్యలతో ముడిపడి ఉన్న ఆడపిండ హత్యల సమస్య నిస్సందేహంగా పెద్ద సమస్యల్లో ఒకటే. కదా తాడేపల్లిగారూ?

    ReplyDelete
  5. ఆడ పిల్లకి ఆస్తిలో వాటా ఇస్తే మగపిల్లవాడితో సమానంగా ఇవ్వాల్సి వస్తుంది. అదే కట్నమైతే లక్షో, రెండు లక్షలో ఖర్చవుతుంది. అందుకే మనవాళ్ళు కట్నం ఇవ్వడానికి ఒప్పుకుంటారు కానీ ఆస్తిలో వాటా ఇవ్వడానికి ఒప్పుకోరు.

    ReplyDelete
  6. వి.ఫ్రా గారు సమయమనంతో ఇచ్చిన సమాధానానికి చప్పట్లు. నాలాంటి వారు బ్లాగులు చదువుకుంటూ వాదించడం వల్ల ఒరిగేది ఎంత అన్న దానికి ఎవరి సమాధానాలు వారికి ఉన్నా, ఈ సమాధానంలో ఉన్న స్పష్టతని అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

    ReplyDelete
  7. 3 years back chennai royapettah roadlo evaro pindanni coverlo petti paresaru. coverni kukkalu chimpaga pindam nadi road meedha vundipoyindhi. Still its a nightmare to me.

    ReplyDelete