Aug 29, 2008

మాఊళ్ళో నాటకాలు

మా ఊళ్ళో నర్సింసోవి (నరసింహ స్వామి) తిర్నాల గురించి కొంచెం రాద్దాం అనిపించింది ఈపూట...
పల్నాడులో ప్రతీ ఊళ్ళో ఏదోక తిర్నాల ఉంటుంది. ప్రతీదానికి ఎవళ్ళోకళ్ళ ఇంటికి సుట్టాలు వస్తనే ఉంటారు...కాబట్టి తిర్నాల్లు సానా నిండుగా, హడావిడిగా ఉంటాయి..అలాంటి జాతికి చెందిందే మా ఈ నర్సింసోవి తిర్నాల.

ఐతే ఇక్కడ రాయాల్సిన ఇషయం తిరునాల ఎల జేస్తారు, పిల్లల గోల, చెరుకుగడలు, అవి ఇవి కాదు.. ఒక ప్రత్యేకమైన విషయం... అదే ... నాటకాలు..

తిర్నాలకి ముందు తర్వాత ఆ సీజనులో మాఊరోళ్ళు 90 శాతం సాంఘీక నాటకాలు ఏస్తరు.
దీనికి రెండు శిబిరాలు ఉంటాయి..ఒకటి కమ్మోళ్ళది, ఇంకోటి రెడ్లది..
తతంగం ఏంటంటే, గుంటూరు నుంచి హీరోవిన్లు దిగుతారు వారంరోజుల ముందు. గుంటూరు పద్మ అండు కంపెని, జూనియర్ ఇజకశాంతి అండు కంపెని, గుంటూరు రాధా అండు కంపెని, ఇలా వాళ్ళకి ఫేమస్సు పేర్లు. ఇంక ఆ పటాలం ఊర్లోకి దిగినాక మన కుఱ్ఱకారుకి సందడే సందడి. అప్పుడు స్క్రీన్ ప్లే, కధ అన్ని రాసుకుంటారు లేక రెడీమేడ్ నాటకాలు కోకొల్లలు దొరుకుతాయి, వాట్లోంచి ఒకటి లాక్కుంటారు. ఈ నాటకాల్లో కధకి, నాటకీయతకి పెద్ద విలువ ఉండదు. మరింక దేనికి అంటారా..డాన్సు, పాటలు, మ్యూజిక్కు, హీరోవిన్ను, హీరో..అంతే..
ఒక హీరోకి రెండు పాటలు, కొన్ని సార్లు మూడు కూడా ఉండొచ్చు..ఎవడికి ఎంత జిల ఉంటే అంత.. అంటే 1 పాటకి 1000, రెండు పాటలకి 2000 అలా పాడుకోవచ్చు.. పాడుకున్నోడికి పాడుకున్నంత అన్నమాట (కబడ్డి కబడ్డి సిలుమాలోలా -ద్రౌపదీ వస్త్రాపహరనం ఐతే సీరనేనే లాగుత ఇదిగో వెయ్య, ఇదిగో రెండేలు నేను లాగుతా .. అలా)
ఇంక ఒక నాటకానికి పాడుకున్నంత మంది హీరోలు. ఒక శిబిరమ్లో ఒక పాటకి రామిరెడ్డి ఐతే, ఇంకోపాటకి ఎంకట్రెడ్డి..ఇంకో శిబిరమ్లో సాదినేని రమణ ఒక పాటకి హీరో ఐతే సూదినేని శీను ఇంకో హీరొ...అలా
ఇంక డాన్సు రిహార్సిల్సు మొదలు పెడతారు.. మనోళ్ళందరూ తొంగిసూట్టం, అలా. అక్కడ హీరోవిన్ని టచింగులు గట్రా మాములే అనుకోండి. లేటు నైటు హీరోవిన్ బస దెగ్గర ఇసుకేస్తే రాలనంతమంది జనం.
ఈ హీరోఇన్లు యమ ఫాష్టు..ఒకపాటలో 5 కోకలు మర్చే వాళ్ళుగూడా ఉంటారు..
కమ్మ శిబిరం వాళ్ళు యన్.టీ.ఆర్, బాలయ్య పాటలు ఏసుకుంటే, రెడ్డి శిబిరం వాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ పాటలు. ఈ పాటలు పాడతానికి, మ్యూసిక్కు కొట్టటానికి ఇంకో టౄపు. దానికి రిహార్సిల్లు.
ఒక నాటకమ్లో 10 పాటలు అలా..అప్పాట్లో ఫేమస్సు పాటలు...అనసూయమ్మగారి అల్లుడు, మంగమ్మగారి మనవడు, ఇలా..ఇటువైపు..సింహాసనం, అగ్నిపర్వతం, ఇలా..కొన్ని సిరంజీవి పాటాలు ఉండేవి అప్పుడప్పుడు..కమ్మ శిబిరమ్లో మాత్రం పొరబాటున కూడా మిగిల్నోళ్ళ పాటలు ఉండేవి కావి...
దీంట్లో హైలైటు డవిలాగు

ఫోను మోగుతుంది
"ట్రింగ్ ట్రింగ్"
హీరో అలా నడ్సుకుంటు వచ్చి ఫోను ఎత్తుతాడు
సెప్పాల్సిన డవిలాగు
"హల్లో!! ఇక్కడ విజయ్ స్పీకింగు!! అటు ఎవరు" అని
మనోడు
"ఈడ విజయ్ పీకింగు అవతలెవడహే"

Aug 27, 2008

రేగ్గాయలు, గంగిరేగ్గాయలు, సీమరేగ్గాయలు

నల్లమల అడవులు పల్నాడునుంచే మొదలౌతాయి. కనీసం మేము అట్టా అనుకుంటాం. కృష్ణానది ఒడ్డెమ్మట్ట ఉంటుంది నల్లమల. పులిచింతల డాము కాడ్నుచి, నెమ్మదిగా ఒడ్డేమ్మటి చూస్కుంటా నాగార్జున సాగర్ దాక ఎళితే అడవి దుప్పులు దుప్పులకాడ్నించి దట్టమైన సెట్లదాకా ఉంటుంది. దాస్పల్లి (దాచేపల్లి), పొందుగల, సత్రశాల , అలా పైకి ఎళ్ళేకొద్ది చెట్ల సైజుకూడా పెరుగుతుంటది. నాగార్జునసాగర్ కాడ్నుంచి ఇంక థిక్ ఫారెస్టు. రాజీవ్ టైగర్ సాంక్చురి నాగార్జునసాగర్ కాడ్నుచే మదలౌతుంది.
ఇంతకీసెప్పోచేదేంటంటే....పల్నాటి వైపు రేగ్గాయలు..వాహ్...తల్స్కుంటేనే నోరూరుతుంది. ఈ అడవి దుప్పలు దుప్పలుగా ఎక్కడ సూసినా రేగిసెట్లు లేకపోతే కళే సెట్లు, బీడీ ఆకు సెట్లు, జాన సెట్లు. ఎక్కడసూసినా రేగి కంపే పల్నాడులో. ఊర్లో మూలల్లో, సందు సివరా, ఇంట్లో, బైట, అక్కడా ఇక్కడా, ఎక్కడసూసినా రేగి కంప. రేగిముల్లు దిగనోడు పల్నాడులో ఉండడేమో. సేతిలోనో కాల్లోనో యాడోసోట. పల్లేరుగాయల తర్వాత కాల్లో ఎక్కువదిగేది రేగిముల్లే, ఆతర్వాతనే తుమ్మముళ్ళు. ఇంక డిశెంబరు కాడ్నించి రేగిపళు పండటానికొస్తై. అమ్ముతుంటరు కూడా. అయితే పల్నాడులో ఒకప్పుడు రేగిపళ్ళు అమ్మేటోళ్ళుకాదు..దేనికంటే ఎక్కడసూసినా అవేగా.
మేము పిడుగురాళ్ళలో ఉండే వాళ్ళం. మా తాతయ్య నాయనమ్మవాళ్ళు దాస్పల్లి (దాచేపల్లి) లో ఉండే వాళ్ళు, ప్రతీ రెండో వారం లేక మూడో వారం మేము దాసేపల్లి ఎళ్ళేవాళ్ళం. మానాన్నా ఎఱ్ఱబస్సులో కూర్సోబెట్టి డ్రైవెర్కి సెప్తే ఠంచనుగా దాసేపల్లిలో మాతాతయ్య కి అప్పగించేవాడు. అంటే, దాసెపల్లి సెంటరులో, నాగులేరు బ్రిడ్గి దెగ్గర బస్ స్టాపు. అక్కడ మాతాతయ్య రెడీగా ఉండే వాడన్నమాట.
మా తాతయ్య వాళ్ళ ఇంటిముందు మాదే కాలేజి ఉండేది. దాని పక్కన కేశవరెడ్డి మాస్టారుగారి ఇల్లు, దానెనకమాల ఆంజనేయులు మాష్టారు గారి ఇల్లు ఉండేవి.
ఆంజనేయులు మాష్టారు గారి ఇంట్లో పెద్ద గన్నేరు చెట్టంత రేగి చెట్టు ఉండేది. ఆంజనేయులు మాస్టారు గారికి వాళ్ళింట్లో అందరికి మేమంటే చాలా ఇష్టం. మాకోసం అని ఆ చెట్టుని కదపకుండా అలానే ఉంచే వాళ్ళు.
ఇంక మేము తాతయ్య వాళ్ళింటికి ఎళ్ళంగనే ముందు ఆంజనేయులు మాష్టారుగారింటికి ఎళ్ళటం, చెట్టుని ఊపటం, రేగిపళ్ళు జేబుల్నిండా కుక్కుకోవటం. దోరపళ్ళు, కొంచెం పండినవి, బాగా పండినవి అలా.. తినీ తినీ పళ్ళు పులిసి, నాలికి బీటలు కొట్టుకుపోయ్యేది.
ఇందాక సెప్పినట్టు రేగ్గాయలకి సీజను ఉంటుంది. సలికాలం. ఫెబ్రవరి వచ్చేసరికి పంట తగ్గిపోతుంది.
మా అమ్మ, మా నాయనమ్మ, మాకోసం అని, రేగిపండ్లు ఉప్పు ఏసి తొక్కి కొంచెం ఎండబెట్టి ఆ చెక్కల్ని పెట్టే వాళ్ళు. ఆ రుచి జన్మ జన్మ లకీ మర్చిపోలేం. అలానే మా ఇంట్లో రేగిపొట్టు పచ్చడి పెట్టేది మా అమ్మ. పచ్చడికోసం రేగిపళ్ళని అడవుల్నించి తెప్పించే వాడు మా నాన్న. దానికొక ప్రత్యేకమైన బాచ్చి ఉండేది. మా ఇంట్లో ఎప్పుడుజూసినకనీసం 5-10 మంది సుగాలిలు ఉండేవారు చడువుకోటానికి. లంబాడీలు తండాల్లో ఉంటారు. అవి అడవుల్లో ఉంటయి. వాళ్ళకిజెప్తే ఏమికావలంటే అవి దెచ్చిపెడ్తారు. అలా తెచ్చిన పండిపోయిన రేగిపళ్ళని ఎండబెట్టి, తొక్కి, పొట్టుతీస్తారు. ఆపొట్టుతో పచ్చడి. ఆవకాయి దానిముందు బుస్సు..
నానోరూరుతుంది మంచీళ్ళు తాగొస్తా.
గంగిరేగ్గాయలు అంటే, ఈరోజున బజార్లో దొరికే పెద్ద రేగిపండ్లన్నమాట. ఇవి అంతపెద్ద ఖాస్ గా ఉండావు నాటు రేగ్గాయల్తో పోలిస్తే.
ఇంక సీమరేగ్గాయ అంటే పియర్ అన్న మాట.

Aug 26, 2008

ఇస్పాట్

నేను ఎవరికీ ఇస్పాట్ పెట్టటమ్లేదు...
ఐతే, నేను నాకళ్ళారా చూసిన నిజమైన ఇస్పాట్ ఇక్కడ రాస్తున్న. జాగర్తగా చదవండి...
మేము అప్పట్లో మోర్జంపాడు అనే ఒక ఊళ్ళో ఉండే వాళ్ళం. మా ఇల్లు ఎత్తు బడికి వెనక ఉండేది. ఎత్తు బడి అంటే ఎంటో అనుకునేరు, ఉన్నత పాఠశాల అని అర్ధవ్. మొదటే బడి ఊరికి ఒక చివరగా ఉండేది. దాని ఎనక అంటే దాదాపు ఊరి పొలాలు కనపడుతుంటయన్నమాట. మా ఇల్లు దాటుకుని ఇంకో రెండు చిన్న చిన్న వీధులు దాటితే ఇంక దొడ్లు ఉంటాయి. అవికూడా దాటితే పొలాలే. మిగతా పల్నాటి ఊర్ల మాదిరే ఈఊళ్ళో కూడా కంది, మిరప, పత్తి గట్రా వేసేవాళ్ళు. పత్తి కట్టెని పొయ్యిలో వాడుకోటనికి వాడతారు. మరి ఒక చేను పత్తి కట్టె ఎక్కడ పెట్టుకోవాలి? దొడ్లలో పెట్టుకుంటరు. వాటితో పాటు గడ్డి వాములు అవి ఇవి కూడా ఉంటాయి ఆ దొడ్లల్లో. ఇవి పావులకి ఇళ్ళు అన్నమాట. కొంచెం పెద్ద దొడ్డి ఐతే ఎండ్లకాలం సినెమాలేస్తరు.
కధకి సంబంధం లేకపోయినా ఒక చిన్నగమ్మత్తైన ఇషయం..
ఒకానొక రోజున మా అన్నయ్య ఎండ్లకాలం సెలవల్కి ఇంటికి వచ్చాడు. సినిమాకి వెల్దాం అని నిర్ణైంచాం. సరె, ఫలాని వెంకట్రెడ్డిగారి దొడ్లో ఫాలాని సినిమా. రూపాయి టిక్కెట్టు. కొన్నాం. వెళ్ళం చూసాం, వచ్చాం, మర్రోజు ఆ టిక్కెట్టు జేబులో ఉంటే చుద్దుముకదా, రూళ్ళ కాయితకం ముక్క, దానిమీద జిల్లా శాఖా గ్రంధాలయం ముద్ర, ముద్ర మద్దెన 1/- అని రాసుంది సేత్తో.
సరే ఇస్పాట్ లోకి వస్థే!!!
పల్లె చాలా తొందరగా మేల్కొంటుంది. అరకలు కట్టుకుని దూరాలు వెళ్ళెవాళ్ళు, బరెగొడ్లని మేతకి వదిలేవాళ్ళు, ఆ వెళ్ళే బరెగొడ్ల పేడ గంపలోఓకి ఎత్తుకునెవాళ్ళు, నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఇలా. పొద్దున్నే 3 నుంచి మొదలవుతుంది పల్లె జీవితం. ఒకానొక రోజున పొద్దున్నే బైలుకెళ్ళె ఒకామె, మా వీధి చివర్లో ఉన్న దొడ్డి దగ్గర కొన్ని చారలు గమ్నించింది. అవి మారుతి కారు టైరంత లావున ఒక పాటెర్న్ లో ఉన్నయి. తర్వాతనుంచి జనం కొంచెం జాగర్తగా ఉండటం మొదలు పెట్టారు. మళ్ళి ఒక వారం దాకా ఆ చారలు కంబళ్ళా. మళ్ళీ ఒకానొక రోజున ఆ చారలు, రొప్పుతున్నట్టు, రోజుతున్నట్టు, ఒక లోతైన బుస వినిపించింది ఒకతనికి. ఈసారి వీధిలో ఉన్న పెద్దోళ్ళు అందరూ వాటిమీద పరిశోధన చేసి అవి పాము పాకుడు చారలుగా గుర్తించారు. కొంచెం అల్జడి మొదలైంది జనాల్లో. పల్లెల్లో పాములు కొత్తకాదు. ఇంట్లో కూడా తిరిగుతుంటై. ఉట్టిమీదకి ఎక్కిన సందర్భాలు, పొయ్యిపక్కన కుండకింద చుట్టేస్కున్న సందర్భాలు, సప్టాబండల్లో ఇరుక్కున్న సందర్భాలు, నీళ్ళ తొట్టి కింద దాక్కున్న సందర్భాలు, ఇంటి చూర్లో చుట్టుకునున్న సందర్భాలు..ఇలాంటివి కోకొల్లల్లు. కాని ఇప్పటి చారలు, కొంచెం భయంకొల్పేవిగా అనిపించినై. ఎందుకంటే అవి మారుతి కారు టైరు సైజులో ఉన్నాయి. అంటే కొంచెం పెద్దపామే. ఇంక జనాలు కఱ్ఱల్తో తిరగటం, దొడ్లకి ఎళ్ళేప్పుడు, బైలుకి పోయేప్పుడు శబ్దం చేసుకుంటా ఎళ్ళటం ఇలా నడిచింది కొన్ని రోజులు. ఇంక మనోళ్ళు మాములుగానే దానిగురించి చెప్పుకోవటం, నేను జూసా అని ఒకడు, నన్ను పాము ఏవిసెయ్యదు నా సేతిలో గద్ద గీత ఉంది అని ఒకడు ఇల కధలు కధలుగా, గుసగుసలాడుకుంటుంటే, మరోవైపు పాము పాకుడు చారలు నెమ్మదిగా ఇండ్లవైపు కుడా కనపడ్డం మొదలుపెట్టినై.
సాధారణంగా పల్నాడ్లో ఇళ్ళకి ప్రహరీ గోడ రాళ్ళాతో పెడతరు. అంటే ఆ గోడలు ఒకరకమైన పోరస్ మెంబ్రేన్లా ఉంటై. చిన్న చిన్న జంతువులు, పాములు, మండ్రగబ్బలు, తేళ్ళు ఆ గోడాలోంచి ఇంట్లోకి క్షేమంగా ఆట్టె కష్టపడకుండా దూరిపోగలవ్ అన్నమాట.
మరి పాము ఇళ్ళ దెగ్గరకి వచ్చిందంటే ఏ ఇంటోకైనా జొరబడగలదు. కొంచెం భయం మొదలైంది ఆ వీధిలో, దానికానుకున్న వీద్ధుల్లో. వీధులు అంటే మన యం.జి రోడ్డు అంత ఉండవ్. ఒక పదో ఇరవయ్యో ఉంటయి ఒకోవీధిలో ఇళ్ళు.
ఈ పాము జాడలు ఉన్న వీధిలో, ఊరివైపుకి ముందు వచ్చేది, ఒకవైపు ఎత్తుబడి బండలగోడ, దాని పక్కన జీడీమళ్ళ కాశెయ్య వాళ్ళ ఇల్లు, దాని కానుకుని వాల్ల బాబాయిల ఇళ్ళు, తర్వాత నరసింహయ్య గారి ఇల్లు. ఇంకోవైపు వెంకయ్య వాళ్ళ ఇల్లు, ఈ వీధిని కలుపుతూ ఇంకో చిన్న వీధి (పాముని గమనించిన వీధికి పర్పెండిక్యులర్గా), తర్వాత వర్సగా ముగ్గురన్నదమ్ముల ఇళ్ళూ, తర్వాత బసివిరెడ్డి వాళ్ళ ఇల్లు, ఇంకో చిన్న సందు (పాముని గమనించిన వీధికి పర్పెండిక్యులర్గా), అది దాటంగనే నిర్మాణమ్లో ఉన్న ఒక చిన్న గుడి, దానినానుకుని మాఇల్లు. అంటే మాది నర్సింహయ్య గారి ఇంటికి కరెక్టుగా ఆపోజిట్టు అన్నమాట. కాబట్టి ఆ పాము మా వీధి అంటే ప్రేమ పెంచుకుని మా ఇళ్ళళ్ళొ ఏ ఇంట్లోకైనా ఎంట్రీ ఇచ్చేయొచ్చు ఏ అర్ధరాత్రో అపరాత్రో. కాశెయ్యా వాళ్ళ బాబాయిల ఇంటికి గోడకి ఆనించి కొన్ని రాళ్ళ దూలాలు (స్టోన్ కార్వ్డ్ పిల్లర్స్) ఉన్నై. అలానే కొన్ని పెద్ద బండలు అవి ఇవి. ఇవి ఆ నిర్మాణమ్లో ఉన్న గుడికోసమని అక్కడ పెట్టారు.
ఒకానొక రోజున ఎవరు చూసారోకాని ఆ పాము ఆ బండల్లో ఒక పెద్ద బండ చాటున ఉన్నట్టు కనిపెట్టారు. ఇంకేముంది ఇస్పాట్ మొదలైంది. కాశెయ్య, బసివిరెడ్డి, బసివిరెడ్డి చిన్న కొడుకు ఎచ్చులు రామి రెడ్డి, కాశెయ్య వాళ్ళ బాబాయి కొడుకులు, బసివిరెడ్డి వాళ్ళ ఇంటి పక్కనున్న వెంకట్రెడ్డి, ఇటు మా ఇంటి పక్కనున్న గొల్లోళ్ళ నూకల శివరావయ్య దుడ్డుకఱ్ఱలు, ముల్లుగఱ్ఱలు సేతబట్టుకుని ఈయ్యాల ఎట్టైనా పావుని సంపాల్సిందే అని బండలదెగ్గరకి జొరబడ్డారు. సంపటాకి, అటైపునుంచి కాశెయ్య అండ్ కో, ఒకైపు గోడ, ఇంకో వైపు శివరావయ్య, ముందైపు బసివిరెడ్డి అండ్ కో, కఱ్ఱలు సేతబ్బట్టుకుని సిద్దంగున్నారు. మఱి పావుని ఎవురు నిద్రలేపాలా? ఒకేళ తప్పించుకుంటే? కాటేస్థే? ఎంతపొడుగుంది? నల్లతాచా? జెఱ్ఱిగొడ్డా? కట్లపావా? ఇన్ని ప్రశ్నలు లేచినై. ఇంతలో చిక్కటి రోజుకున్న శబ్దం.. ఊజ్ ఊజ్ అని. అంటే పాములేచింది. దానికి తరంగాల్లల్లో మార్పు అర్ధం ఐంది. అటు పక్కనున్న కాశెయ్య తమ్ముళ్ళకి కాళ్ళళ్ళో వణుకు మొదలైంది. ఊజ్ ఊజ్ ఊజ్ శబ్దం ఎక్కువైంది. తల బైటికి పెట్టి బుస్ మని బైటకొచ్చింది ఆ పావు. అదిపావా? దానెక్క 15 అడుగులు ఉంది. నేను మాఇంటి పైకి ఎక్కిజూస్తున్న సేఫ్టీగా..కాశెయ్య తమ్ముళ్ళళ్ళో ఒకళ్ళు తప్పుకున్నరు భయంతోటి. పావు కాశెయ్య వైపుజూసి, ఇటు తిరిగింది బసివిరెడ్డి వైపు. ఎయ్యి ఎయ్యి అని అరుస్తున్నడు రామిరెడ్డి, దొరకట్ల పావు. నడుముమీద లేచి నుంచోని ఇంత పడగతో ఊజ్ ఊజ్ మని అటు ఇటు మెలికలు తిరుగుతున్నది. సంప్టానికొచ్చినోళ్ళ ధైర్నం సాలట్లా. ఇషం చిమ్ముతున్నది. సివరావుడు కఱ్ఱ ఇసిరాడు, తప్పింది. శివరావుడు పావుకి రెండు కఱ్ఱల దూరమ్లో ఉన్నాదు. అది శివరావుడిమీదకి దూకేలోపు కాశెయ్య తమ్ముడు ముల్లుగఱ్ఱతో పడగమూద ఒక్కటే దెబ్బేసిండు. అంతే...సచ్చింది...అవునండీ, పావే, సచ్చింది..సచ్చి అట్టా బండమీదపడి సిన్నగా నేలమీనకి జారిపోతాఉంది..పావే!!మరి ఏంపావో? ఎక్కడ్నుంచి వచ్చిందో, దాని పడగ సాటాంత ఉంది. 15 అడుగులపొడుగుంది, అవును పావే!! నిజంగా అది ఇషప్పావే!! మరింక గుడిముంగట పావుని జంపటం ఘోరం, కాని, సంపేయాల్సొచ్చిందంతే!! మరేంజేస్తాం అన్నుకున్నారు ఆ సంపినోళ్ళందరు. దాని ఆత్మకి శంతి జేద్దం అని అన్నారు. నోట్టో రూపాయి బిళ్ళపెట్టి దాన్ని తగలబెట్టారు. తర్వాత ఎవరో ఆ రూపయి బిళ్ళకి బొక్కబెట్టి తాడుకట్టి మెళ్ళొయేసుకున్నారు...

Aug 25, 2008

పల్నాడు పాములకి ప్రసిద్ధి

పల్నాడు పాములకి ప్రసిద్ధి.
ఎన్ని రకాల పాములంటే కట్ల పాములు, పసిరికపాములు, జెర్రి గొడ్డ్లు, నల్ల తాచులు, తెల్ల తాచులు, నాగుబాములు (అంటారు కాని, నేనుప్పుడు చూడలేదు), శిఖండి పాములు, ఒక రకమైన మంచి వాసన వచ్చే పాములు, నీళ్ళపాములు బ్లా బ్లా ఇలా..
మాఊళ్ళల్లో పాముల గురించి జనాలు కధలు కధలుగా చెప్పుకుంటుంటారు..
మేము అప్పుడు కొండమోడు అనే ఒక చిన్న జంక్షన్ లో ఉండేవాళ్ళం. అది పిడుగురాళ్ళ కి 1-2 కి.మి దూరమ్లో ఉండేది. మాఇంటి ముందు పెద్ద మఱ్ఱిచెట్టు దాని పరివృత్తంకి ఆనుకుని ఒక పెద్ద పుట్ట ఉండేది. పుట్ట అంటే అలాంటిలాంటి పుట్టకాదు, ఆరడుగుల ఎత్తు, చిన్న కొండలా ఉండేది. ఎన్ని చీమలు ఎన్నిరోజులు కష్టపడికట్టుకుని ఉంటాయో అనిపిస్తుండేది. దాన్ని కబ్జా చేసింది అలాంటిలాంటోళ్ళు కాదు. మన నల్ల తాచు గారు అండ్ ఫామిలి. మేము ఆ మఱ్ఱిచెట్టు మీద కోతికొమ్మచ్చి గట్రా అడుకునేప్పుడు అడపదడపా ఆ సర్పరాజుని చూసేవాళ్ళం. వెన్నులో వణుకు వచ్చేదనుకోండి.
ఒకానొక రోజున, మా మిత్ర బృదం అందరు, కొంచెం దూరమ్లో ఉన్న లాకుల దెగ్గర బిళ్ళంగోడు, ఈత కొడుతున్నారని తెలిసి నేనూ లగెత్తుకుంటూ వెళ్తున్న..లగెత్తటం ఒక రిధమిక్కగ్గా ఉంటుందికదూ!! కుడిచేయి ముందికిపెట్టి బాడీని లాగి, కాలితో నేలని తన్ని ఊతం తెచ్చుకుని మళ్ళీ ఎడమచేతిని ముందుకి పెట్టి శరీరాన్ని ముందుకిలాగి కాలితో నేలన్ని తన్ని ఊతంతెచ్చుకుని ..అలా..ఆ రిధమ్లో, నా ఎడంకాల్తో నేలని తన్ని ముందుకు వెళ్ళే నేపధ్యమ్లో, ఎడమకాలు ఇంకో అర అడుగులో నేలని తాకుతుంది అనేలోపు ఒక్క సారి కిందకి చూసి స్థాణువైపొయ్ అలానే ఉండిపోయా. రెప్పపాటు కాలం, ఒక్క ఝలక్, ఒక్క సెకండులో వెయ్యోవంతు ఆలస్యం ఐనా నేను ఈ రోజు ఇలా తెలుగులో బ్లాగు రాస్తుండేవాడిని కాదు. మళ్ళీ జన్మ ఎత్తి ఉండుండేవాడ్ని. ఏమైంది ఆక్షణం? నాకాలు కిందకి తాకే చోట, మన నల్లతాచుగారి నడుము. కాలు అలా లాండ్ ఐఉంటే నల్లతాచుగాడు వెనక్కితిరిగి, నడుముమీదలేచి నన్ను ఒక్కటే కొడితే థట్స్ ఇట్!! మనోడు నల్లగా నిగనిగలాడూతూ, కాడిమాను అంతలావుతో, ఒక 10అడుగులు పొడుగుతో, భయానకంగా,చూసేవాడికి వెన్నులోచి చావుభయాన్ని ఉసిగొల్పుతున్నట్టుగా, నిద్రలోచి ఉలిక్కిపడిలేచేంత భయంకరంగా,చిద్విలాసంగా నవ్వుతూ, ఉల్లాసంగా అలా పాక్కుంటూ పాక్కుంటూ, "నన్నుజూసి దడ్సుకుని సావండెహే" అన్నట్టు వెల్తున్నాడు. నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లా ఉండిపోయా. ఉలుకులేదు, పలుకులేదు, నా చుట్టు ఎమైందో తెలియదు, నేను ఏ అవస్థలో ఉన్నానో తెలియదు, ఒలంపిక్స్ లో స్ప్రింటర్ల బొమ్మలా ఎంతసేపు ఉన్నానో నాకెతెలియదు..ఇంతలో నాజబ్బని ఎవరో కుదిపినట్టు, భుజం మీద మన నల్ల తాచుగాడు తోక వేసినట్టు అనిపించి మామూలు లోకమ్లోకొచ్చి భయం భయంగా వెన్నక్కి తిరిగిచూస్తే మా మితృడు.ఏరా ఇంకా ఎళ్ళలేదా ఆడ మనోళ్ళు ఈతకొడున్రు..పదా అని లాకెళ్ళాటంతో...ఆ సంఘటన అలా నా స్మృతిపధమ్లో వెనక్కి వెళ్ళిపోయింది...తర్వాత కొంతకాలానికి, జనావాసమ్లో పుట్ట డేంజరపాయం అని పెద్దలు ఆలోసించి, దాన్ని తవ్వేయ్యాలని నిర్ణయం తీసుకుని, దాన్ని ఒకానొకరోజున తవ్వించెయ్యటం మొదలెట్టారు. నేను మాఇంటి గట్టుమీదనుంచి అలా చూస్తున్న. దాంట్లోంచి 15 నల్ల తాసులు, సిన్న సితక నుంచి, రాజ్జెం ఏలేంతవాటివరకూ ఉన్నయి..కొన్ని నిద్రపోతూ, కొన్ని ముచ్చట్లు సెప్పుకుంటూ, వాటిల్లో పెద్దోళ్ళు "ఎవుడహే పుట్టమీన సేయ్యేశింది" అన్నట్టు..మన జనజెంతువులు వాటినన్నిటినీ సంపేశరనుకోండి...

Aug 14, 2008

జెండా పండగ

"గేందివయా!! ని నడకేం మంచిగలే!! గటుజూసినా గిటుజూసినా అందరూ జెండా ఎగరేస్తఉంటే, నువ్వేంది ముక్కు మూసుకుంటున్నవ్!! గేంది కత"
"కొన్ని జెండాలు కులం కంపు కొడుతున్నై, కొన్ని రాజకీయ కంపు కొడుతున్నై...అందుకే"

స్వాతంత్రదినోత్సవ!@#$%^&*()

"ఎరా!! ఈయాల పంద్రాగష్టు!! ఏంది అట్టాఉన్నా"
"పంద్రాగష్టు!! ఐతే"
"సొతొంత్రదినం!! జెండా పండగ!! సూడు టీవీల మన రాజకీయ నాయకులు జెండా ఎట్టా ఎగరేత్తన్నారో..సూడు..సూడహే"
"సొతంత్రం ఆ తెల్లళ్ళోళ్ళ కాడ్నించి ఈ రాజ్జం ఏలే నళ్ళోళ్ళ కాడికి వచ్చింది..కాని..మనకి కాదురా...రాజ్జం సేతులు మారిందంతే..మన బతుకులు కాదు....మూడురంగుల జెండా గుండెల్లో ఎగరేసుకోండ్రా...ఫోటోలకోసం కాదు....."

Aug 5, 2008

ఎనుబోతు, కవి, అచేతనుడు, మనిషి, మట్టి మషాణం

సెల్ లో శ్రీవారి ఆలయ చిత్రాలు: ఈనాడు
ముంబైకి చెందిన భక్తుడి చిత్రీకరణ..యం.యం.యస్.ల ద్వారా ప్రసారం...
తిరుమలలో భద్రత మరోసారి ఉత్తుత్తిదే అని మరోసారి తేలిపోఇంది...

ప్రభుత్వం గద్దెదిగాలి...అసలు ప్రభుత్వం ఏమిచేస్తోంది? ఒక భక్తుడు మొబైల్ ఫోను ఎలా తీసుకెళ్ళగలిగాడు? ఇదంతా రాజశేఖర్ కుట్ర, వెంటనే ఆంధ్ర రాష్ట్రానికి క్షమాపణలు చెప్పుకుని రాజీనామా చెయ్....

అహమ్మదా బాదులో బాంబులు..బంగళూరులో బాంబులు..
అశాంతి, విజయశాంతి..కేసీఆర్..చెంబా, వియసార్, భూమి కబ్జా..దేశమ్లో దొంగలు పడ్డారు..
సమాచార విప్లవం, సమాచార చోరి, ఎలక్ట్రానిక్ మీడియ విప్లవం, అతి సమాచారం, మట్టి మశాణం..

ఇంతకీ నేనేం చెప్దామనుకున్నానంటే....నా బ్లాగు నాఇష్టం, నా సెల్లు నాఇష్టం..నా బతుకూ నాఇష్టం, దేశం ఎటుపోతే నాకేం, నువ్వు ఏమైతే నాకేం..భద్రత ఎటుపోతే నాకేం....అందుకే నన్ను ఎనుబోతు అని కూడా అంటారు, కొంతమంది నన్ను కవి అనికూడా అంటారు (ముద్దుగా కావొచ్చు, కోపంగా కావొచ్చు, అసహ్యంగా కావొచ్చు, మరోలా కావొచ్చు - అర్ధంకాలేదా...నీఖర్మ) , కవి అంటే నీకుతెలియదా? ఏటి, దేశానికి కొత్తా నువ్వు? కవి = క వి = కనపడదు వినపడదు.....ఇంతకీ నేనెవరు?? సామాన్య మానవుడ్ని....నా బతుకింతే...