Jun 28, 2010

జ్ఞాపకాల దొంతర - ఏరువాక

మది పల్లెప్రాంతమైనా మాకు పొలాలు లేవు. ఎకరం భూమికూడా లేదు. ఐతే, చుట్టుపక్కలున్నవారికి ఉన్నాయి పొలాలు. గొడ్డుగోదా. ఆవూ గేదే అన్ని.
ఏరువాక పండగ అనేది కేవలం ఓ పండుగలాగనే నాకు తెలుసుగానీ మేమెప్పుడూ అందులో పాల్గోలేదు.
అలాంటిది ఓ ఏడాది నా మితృడు ఆహ్వానించాడు. నా జ్ఞాపకాలదొంతరలో అలా భద్రంగా ఉండిపోయిందా పండుగ.
ఆరోజు పొద్దున పొద్దునే వెళ్ళాను వాళ్ళింటికి. కోలాహలంగా ఉంది. రెండెడ్లనీ శుభ్రంగా కడిగాం. ఒకటి మహా కోపంగా ఉంటుంది. అది కేవలం మా మితృడి నాన్న మాటను మాత్రమే వింటుంది. ఆయన వచ్చారు, శుద్ధి కార్యక్రమం ముగిసింది. ఇంతలో మా మితృడి వాళ్ళ అమ్మగారు వంటలు ముగించారు. ఎడ్లను బండికి కట్టాము. పసుపుకుంకుమలు పెట్టారు బండికీ ఎద్దులకీ. బొట్లుపెట్టారు, హారతులిచ్చారు. గొఱ్ఱు కూడ ఎక్కించారు బండిలోకి.
ఇక మూటలు ముల్లెలు అన్నీ వేస్కుని పొలానికి బయల్దేరాం.
అక్కడకెళ్ళినాక, పొలం మధ్యలో బండిని నిలిపి, ఎడ్లను తీసేసి గొఱ్ఱుకి కట్టి, గొఱ్ఱుకి పసుపుకుంకుమ పెట్టి, హారతిచ్చి చదునుచేసారు. నా మితృడి నాన్న నన్ను కేకేసేడు. భాస్కరా రా నువ్వు చేయి అని. మొట్టమొదటిసారి, గొఱ్ఱు మీద కూర్చుని, పగ్గాలు పట్టుకుని, వంకరటింకరగా చాలు చేసాను. అలా కాదు ఇలా అని చూపించారు ఆయన. రెండూ లైని వంకలు లేకుండా మొత్తానికి లాగించా.
అప్పుడు మొదలైంది ప్రసాదాల కార్యక్రమం. పెద్ద డబ్బాలోంచి పరమాన్నం వేడివేడిగా, ఇంకో డబ్బలోంచి ఉత్తిపప్పు, చిన్న ముంతలోంచి నెయ్యి. పళ్ళెంలో పరమాన్నం పెట్టి, పైన పప్పేసి గుంట చెసి నిండుగా నెయ్యి పోసి ఇచ్చింది ఆ మహా తల్లి. ఇదేందిదీ అన్నా. పరమాన్నంలో పప్పా అన్నా అర్ధంకాక. నే ఎప్పుడూ అలా తినలా మరి. తినిచూడు అన్నారందరూ. పరమాన్నంలో పప్పు కలుపుకుని నెయ్యి కుమ్మి తినటం ఎప్పటికీ మర్చిపోలేను.
పొట్టనిండా తిన్నాక పక్కనే కాలవలో చల్లగా నీళ్ళు తాగి బండి కట్టుకుని బయల్దేరాం. నన్ను తోలమన్నారు బండిని. టయరు బండి తోలటం శులభమే కాని పెద్ద చెక్రాల బండి చాలా కష్టం అనిపించింది. ఆయన సహాయంతో మొత్తానికి లాగించా.

తరగని ఆ జ్ఞాపకాలు అతి మధురాలు.

4 comments:

 1. ఏమైపోయారు ఇన్ని రోజులు జ్ఞాపకాలలో మునిగి తేలుతున్నారా, ఇటు పక్కకే రావటం లేదు :)
  పరమాన్నం లో పప్పు కామన్ అనుకుంటాను , మా ఇంట్లో ప్రతి పండగకి తప్పనిసరి గా చేస్తుంది మా అమ్మ,అది తినటానికి తప్పించుకునేందుకు నానా తిప్పలు పడేదాన్ని :)

  ReplyDelete
 2. బాగుంది!అదే ఆడపిల్లలైతే తలో చెయ్యీ వేసి పరమాన్నం చేసే వారు.పిల్లలు వచ్చేసారా?

  ReplyDelete
 3. రెండో లైన్లోనే వంకర లేకుండా తోలావంటే బెదరూ నువ్వు సామాన్యుడివి కాదన్నమాట.తరగని ఆ జ్ఞాపకాలు అతి మధురాలు నిజమే ఎప్పటికీ మన మదినుంచి చెరిగిపోనివి.

  ReplyDelete