Showing posts with label సూరీడు. Show all posts
Showing posts with label సూరీడు. Show all posts

Apr 17, 2023

మంచి కాలేజీయేనా?

ఆంధ్రా నుంచి వచ్చిన నేను ఒక సగటు ఆంధ్రావాడిలాగనే ఉంటాగానీ ఇంకోలా ఎలా ఉంటా? పుట్టుకతో వచ్చిన, పెరగటంలో కలిగిన జ్ఞానం విజ్ఞానం పరిజ్ఞానం నాది.

సరే! విషయంలోకొస్తే, సూరిగాడు కాలేజీకి వచ్చాడు.

నమ్మలేకపోతున్నారు కదూ? నా బ్లాగులో ఎన్నో పోస్టులు పిల్లల మీద వేశాను. ముఖ్యంగా సూరిగాడి మీద. ఎందరో బ్లాగు మిత్రులు సూరిగాడికి ఫ్యాన్స్ అయ్యారు. వాడి పుట్టినరోజుకి శుభాకాంక్షలు అందించారు ప్రతీ ఏడాది, పెద్దలు అనేకులు దీవించారు.

మహాభారత్ టీవీ serial మొట్టమొదట వచ్చే మాటలు గుర్తుకొస్తున్నాయి

మై సమయ్ హూఁ మై కభీ రుక్తా నహీఁ, హమేషా ఆగె బడ్తా రహ్తా హూఁ, ఔర్ ఠీక్ ఉసీ తరాహ్  కాం హై, హమేషా బడ్థా హీ రహ్తా హై, పర్ సమయ్ కభీ కాం కేలియే నహీఁ రుక్త

కాలం నాకోసమో నీకోసమో ఆగదు...ఎప్పుడూ తన మానాన తాను ప్రవహిస్తూనే ఉంటుంది. నా బ్లాగ్ లో మొదటి పోస్ట్ వేసే నాటికి సూరిగాడు ఏడాది వయసు. ఈ రోజున 18 ఏళ్ళ వయసు.

కాలేజీకి సిద్ధం అవుతున్నాడూ అంటే ... పుత్రోత్సాహము, చెయ్యొదులన్నా, పొంగిపోనీ అన్నా...

సరే విషయంలోకొస్తే, మనోడు ఓ పెద్ద పగలనూకుతాడు భూమి మొత్తాన్ని తలకిందులుగా తిప్పే పైతాన్ కోడ్ రాసి, ఎక్జిక్యూట్ చేస్తే సిస్టంస్ అన్నీ వేడెక్కి పగిలిపోతాయి అని నేను ఏమాత్రమూ ఊహించలా.

అసలు వాడు ఏమి చదువుతున్నాడు అని కూడా నేను పెద్ద పట్టించుకోలా. బడి నుంచి ఇంటికొచ్చేవాడు, బ్యాగ్ ఇస్సిరికొట్టి baskaetball ఆడుతుండేవాడు. నేను దాన్ని ప్రోత్సహించాను. వాడి కన్నా ఏడాదో రెండేళ్ళో ముందున్నవాళ్ళు రాత్రిళ్ళు 1 దాకా హోంవర్కులు చేస్తూ హడావిడీ పడేవాళ్ళు. వీడు మాత్రం పది కల్లా దుప్పటి ముసుగులోకి జారుకునే వాడు. ఏరాబాబూ హోంవర్క్ లేదా అంటే, స్కూల్లోనే చేశా అని చెప్పేవాడు. ఆశ్చర్యం వేసేది. ఇదేంటిది, ఇలాఎలాగా? ఇల్లాక్కూడా అవ్విద్దా అని నోరెల్లబెట్టి ధనా ధనా అని మోగే బాస్కెట్ బాల్ హూప్ వైపు చూస్తూ ఉండేవాణ్ణి. వాడొచ్చి, మూసేయ్ నోట్లోకి దోమలు ఈగలూ కార్లు బస్సులూ ఎల్తన్నయ్యై అని చెప్పేవాడు వెటకారంగా.

మోడీ గారు చెప్పిన మాట, మన అందరికీ తెలిసిన మాట ఒకటి ఉంది - జో ఖేలేఁ వో ఖిలే, ఆడేవాడు వికసిస్తాడు అని. నా అభిప్రాయం - అది అక్షర సత్యం అని.

నేను వాడి చదువులో వేలు పెట్టకుండా ఉంటానికి కారణాలు అనేకం.

ఒక ముఖ్య కారణం - మీవాడు చదువులో వెనకబడి ఉన్నాడు అని బడి నుంచి నాకు నోటిఫికేషన్ రానంత వరకూ నేను వేలు పెట్టాల్సిన అవసరం లేదు అనిపించింది.

ఇంకొక విషయం - ప్రతీవాడు IIT కి వెళ్ళలేడు. వెళ్ళినా మొదటిరోజు నుంచే 20 అడుగులు దూకు కమాన్ పెర్ఫార్మ్ అనే డిమ్యాండ్ ఉంటుంది. ఎందుకు అంత ఒత్తిడి? అనిపించింది

మూడూ విషయం - సూరిగాడి మిత్రబృందంలో ఒకడి నాన్న 1960 లల్లో వచ్చి స్థిరపడ్డ సంతతి. అతను ఒకమాట చెప్పాడు. గురూ పిల్లవాడు MS చేద్దాం అనే అలోచన ఉన్నటైతే BS ఏకాలేజీలో చేసినా దాదాపు ఒక్కటే. అంతేగాక, అమెరికా సిస్టంలో, ప్రతీ వాడికి ఏదోక కాలేజీలో సీటు తప్పక రాసిపెట్టి ఉంటుంది. కొందరు Texas A&M కి వెళ్తారు, కొందరు UT Austin కి వెళ్తారు మిగతావాళ్ళు మిగతా కాలేజుల్లోకి వెళ్తారు. అంతే అన్నాడు.

ఓరిదీనెమ్మ దీనికోసం చిన్నప్పటి నుంచి ఎన్ని వెషాలు తలితండ్రులు వేస్తారూ, ఎన్ని వేషాలు పిల్లలచేత వేయిస్తారూ? హవర్స్ అని వాలెంటరీంగ్ అని మ్యూజిక్ అని స్పోర్ట్స్ అనీ సాకర్ mom సాకర్ డాడ్ .. అదీ ఇదీ ... 

ఇవన్నీ అవసరమే కాదన్ను కానీ అవసరానికి మించి యాస్పైర్ అవటం మనిషి నైజం అనిపిస్తుంటుంది..

ఏవైనా ఉరుకులు పరుగులు taekwondo లు basketball లు music లు dance లు అవి ఇవి - వీటన్నిట మధ్యలోంచి లేచి నాన్నా కాలేజీకి అప్లై చేస్కుంటున్నా, UT Arlginton UNT UT Dallas UofH Texas Tech లాంటి కాలేజీలల్లో వచ్చింది. కానీ UT Arlginton UNT Texas Tech లో నేను కోరుకున్న మేజర్లో వచ్చింది అన్నాడు.

సరేరా నాయనా, మంచి నిర్ణయం తీస్కో, ఏది బాగుంటుందో తెలుసుకో, ఇండస్ట్రీకి ఏది దగ్గరగా ఉంటుందో ఇండస్ట్రీకి ఏది సుస్పష్టంగా కనిపిస్తుందో కనుక్కుని చేరు అన్నాను.

మా ఇంటి వెనుక ఓ పెద్దాయన MIT లో PhD చేసి ఇక్కడకొచ్చి సెటిల్ అయ్యాడు పెద్ద వయసులో. మా స్కూల్ డిస్ట్రిక్టులో ఆయన అనేక స్కూల్స్ లో సబ్స్టిట్యూట్ టీచర్ గా చేస్తుంటాడు కాలక్షేపానికి. అప్పుడెప్పుడో మాటల మధ్యలో మీ వాడికి కాని అమ్మాయికి కానీ చదువు విషయంలో లెక్కలు కెమిస్ట్రీ ఫిజిక్సుల్లో ఏవైనా సహాయం కావాలంటే ఏమాత్రమూ సందేహించకుండా నా డోఋ కొట్టు, మీ పిల్లలకి ఉచితంగానే చెప్తాలే అని మాటిచ్చాడు.

సూరిగాడు ఒకటి రెండు సందర్భాలల్లో ఆయనదగ్గరకు వెళ్ళొచ్చాడు కూడా.

వీడికి పైన చెప్పిన కాలేజీలల్లో వచ్చింది అని తెలిసిన తర్వాత ఓ రోజు సాయంత్రం ఆయన వాక్ చేసుకుంటూ మా ఇంటి ముందునుంచి వెళ్తూ అగాడు హై అంటూ.

పెద్దాయనా, PhD చేసిన వ్యక్తి, MIT నుంచి వచ్చిన వ్యక్తి, పైగా సూరిగాడికి రెండు ముక్కలు ప్రపంచాగ్నికి సమిధలు ఆహుతొక్కటి ఇచ్చిన వ్యక్తి. బాగున్నారా సార్ అని పలకరించాను.

"యా యా ఏం జరుగుతోంది. మీవాడు కాలేజీలల్లో అప్లికేషన్ పడేస్తున్నాడా? అబ్బే కంగారు పడకు, ఏదోకదాంట్లో వస్తుంది అడ్మిషన్. భలే వాడివే ఊర్క టెన్షన్ పడతావెందుకూ" అన్నాడు

"అంటే ఉంటుంది కదా మాష్టారూ పిల్లాడన్నాక. అందునా చింపి చేట చేసే వాడైతే పేద్ద ఆలోచించం కానీ వాడు నాకొడుకు కదండి, అందుకే భయం" అంటూ ఒక సామాన్య తెలుగు వాడు వదిలే ఓ క్లిష్టమైన సంక్లిష్టమైన అదైన ఇదైన ప్రశ్నని వదిలాను. ఆంధ్రా నుంచి వచ్చిన నేను ఒక సగటు ఆంధ్రావాడిలాగనే ఉంటాగానీ ఇంకోలా ఎలా ఉంటా? పుట్టుకతో వచ్చిన, పెరగటంలో కలిగిన జ్ఞానం విజ్ఞానం పరిజ్ఞానం నాది.

"పై కాలేజీలల్లో ఏకాలేజీ బాగుంటుందీ, ఈ కాలేజీలు మంచివేనా" అని.

ఆయన నావైపు ఓ చూపు విసిరి చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వి అర్జునా వినూ అంటూ మొదలుపెట్టాడు

"పై కాలేజీలన్నీ మంచివే. అమెరికాలో మంచి కాలేజీ కాదు అనబడే కాలేజీనే లేదు. నీకో ముఖ్యమైన విషయం చెప్తా సావధానంగా విను, ఏకాలేజీకి వెళ్ళినా, మంచి చెడు చదివే వాడిని బట్టి. విద్యార్థిని బట్టి. కొన్ని కాలేజీలల్లో అవకాశాలు తక్కువ ఉంటాయి. కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి. తేడా అంతే. కొన్ని కాలేజీలు ఇండస్ట్రీకి దగ్గరగా ఉండి సంబంధాలు కలిగి ఉంటాయి. కొన్ని ఉండవు. ఏది ఏవైనా కష్టపడి అవకాశాలని అందిపుచ్చుకుంటూ వెళ్ళేవాడే రాణిస్తాడు." అని ముగించాడు.

నాకు కళ్ళు తెరుచుకున్నాయి.

నిజమే అనిపించింది చివరాకరికి.

మా culdesac లో సాయంత్రం అయ్యే సరికి ఓ డజను మంది పిల్లలు రెండేళ్ళ నుంచి పన్నెండేళ్ళవరకూ ఆడటానికి వస్తారు, culdesac safe కాబట్టి. పిల్లలతో పాటు ఒక కేర్ టేకర్ తండ్రో తల్లో నానమ్మో ఎవరోకరు. వాళ్ళలో ఒకతను తెల్లవాడు మనకి బాగా పరిచయం. 
"ఏంటి గురూ" అన్నాడోరోజున. 
"మామూలే" అన్నా ప్రసన్నంగా. 
"మీవాడి కాలేజీ తేలిందా" అన్నాడు కుతూహలంగా. 
పై కాలేజీ పేర్లు చెప్పి, మళ్ళీ వదిలాను - "ఇవి మంచి కాలేజీలేనా" అని.
బట్టనెత్తి అయి, అది కవర్ చేస్కోటానికి నున్నగా గీసేస్కున్న బోడిగుండు మీద ఓ సారి గీక్కుని "అంటే?" అన్నాడు. 
"అదే అదే ఈ కాలేజీలు ఎలా ఉంటాయి" అన్నాను తప్పడిగానా ఏంటి పొరపాటునా అనుకుంటూ.
"మా brother పై చెప్పిన కాలేజీలో పలానీ దాంట్లో చదివాడు, నేను పలానీ దాంట్లో చదివాను. "నీకో విషయం చెప్తా విను, కాలేజీలు అన్నీ బాగనే ఉంటాయి, విషయం అంతా విద్యార్థిలోనే ఉంటుంది అంతా." అంటూ చెప్పుకొచ్చాడు ఆయన కాలేజీలో ఎలాంటి కష్టాలు పడ్డాడో అవన్నీ...

Jun 23, 2020

Oxycontin

అంకం 1 
"ఏంటీ?" 
"పళ్ళు మీద పళ్ళు" 
"రాఘవేంద్ర రావు పూనాడా?" 
"లేదు" 
"మరీ?" 
"పళ్ళు తిక్కిరిబిక్కిరిగా ఉన్నాయి. ఫ్లూటు ఊత్తుంటే నొప్పి"
"అలా చెప్పండి. ఓహ్! గుడ్ న్యూస్. మీవాడు కారణ జన్ముడు. సాధారణంగా పన్ను మీద పన్ను రావటం మీరు చూసుంటారు. మీవాడికి పళ్ళు మీద పళ్ళు. " 
"బాబోయ్! ఏంచేమంటారూ?" 
"పెద్దగా ఏంలేదు. 4 మోలార్స్ పీకించుకురండి. క్లిప్స్ పెడదాం." 

అంకం 2 
 "అయ్యా! తమరు సర్జన్. మావాడికి పళ్ళ మీద పళ్ళు. అవి మీకు తెచ్చి పెట్టును ఇళ్ళ మీద ఇళ్ళు. దయుంచి ఆ నాలుగు మోలార్స్ పీకితే" 
"ఆగండాగండి. ఏదీ నన్ను చూడనీ. ఓయా. బాగుంది బాగుంది. పీకేద్దాం. కానీ గమనించారా? మీవాడికి జ్ఞాన దంతములు కూడా వంకరగా వచ్చుచున్నవి. అవి భీ పీకేస్తాం. మొత్తం ఎంది. ఇప్పుడు పీకితే చిన్నరాయితో పోవును. పెద్దైయ్యాక పీకితే పెద్దరాయి." 
"అయ్యా. మా కుటుంబం కూర్చుని నిర్ణయించి అప్పాయింటుమెంటు తీసుకోగలవారము"  

అంకం 3 
"ఇదిగిదిగో ఇదీ విషయం" 
"ఏరా?" 
"ఏంటీ? 8?" 
"గలవా?" 
"మరొక్కసారి ఆలోచించుకో?" 
"సరే" 

అంకం 4 
"అయ్యా డాక్టరు వర్యా! మావాడు తాయారు. మీరు తాయారా?" 

మొన్న మొత్తానికి 8 పళ్ళు పీకి చేతిలో పెట్టారు. వాడి బాధ వర్ణనాతీతం. బుగ్గలు రెండూ బాగా వాచిపొయ్యాయి. 
గంట ఆపరేషన్. Antibiotics ఇచ్చారు. నొప్పితగ్గటానికి ibuprofen తో పాటు Oxycontin ఇచ్చారు. పెద్ద సందిగ్ధం. 
వెయ్యాలా వద్దా? వేస్తే ఏంటీ? వెయ్యకపోతే ఎలా? 
మొత్తానికి ఈరోజుకి కాస్త వాపు తీసింది. మందులు వేసుకుంటూనే ఉన్నాడు. 
Oxycontin తో సహా...

Jun 8, 2020

సూరిగాడు ఇన్ సమ్మర్

సూరిగాడి కోతిమూక టు ది రూఫ్ ఎంజాయ్ చేస్తున్నారు

Apr 5, 2020

ఇయర్ బడ్స్

సూరిగాడు వాడి పడేసిన ఇయర్ బుడ్స్ వాట్టం మొదలెట్టాను నావి పక్కన పడేసి. హంగులు ఆర్భాటాలు పక్కన పెడితే ఇవి పెట్టుకుంటే చెవిటోడితో సమానం. పక్కన *బం* పడ్నా తెలియదు.

ఇంతలో కొత్త సమస్య -
ఎడమ చెవిది వినబడును
కుడిచెవిది వినబడదు

ఎన్నోరకాలుగా *ఎక్కడా ఇక్కడా నొక్కినా* పనిజేయటంలేదు
వాడినే అడిగా ఏరా అని
హా అవి ఔట్ ఆఫ్ సింక్ అన్నాడు
భలే భలే మరి సింక్ చేయటం ఎలా అడిగాను
నాకు హోంవర్క్ ఉందని వెలుగులోకి జారుకున్నాడు నన్ను చీకట్లోకి నెట్టి

అలా కుస్తీ సిగపట్లు పడుతుండగా ఏకళనుందో కుడిది పనిచేయటం మొదలెట్టింది

అనూహ్యంగా ఎడమది పనిచేయటంలేదు

ఈ సమస్యని పూరించిన వారికి నా రెండు ఇయర్ బడ్స్ నుంచి ఒకదాన్ని నిట్ట నిలువునా చీల్చేసి బహుమతిగా ఇస్తానని వాక్దానం చేస్తూ నా రాజ్యంలో చాటింపు వేయిస్తున్నా

Jul 5, 2018

గట్టర్



గత ఏడాదిగానో రెండేళ్ళగానో ముందరి గట్టర్లోంచి నీళ్ళు కిందకి రావటంలేదు. సదరు విషయాన్ని మొన్న గమనించాం ఇద్దరం. ఏవైయుండచ్చూ అని ఈనాడు ఆరా విశ్వవిద్యాలయానికి కాల్ చేస్తే, సూరిగాడు అప్పుడెప్పుడో ఓ టెన్నీస్ బంతిని పైకి వెయ్యటం, అదికాస్తా దొర్లుకుంటూ దొర్లుకుంటూ గట్టర్లోకి జారటం ఆగిపోవటం కళ్ళ ముందు మెదిలింది. తీద్దాం తీద్దం అనుకున్నాం.
ఈరోజు సొతంత్ర దినం సందర్భంగా పిచ్చి వాన కుమ్మరిస్తున్నాడు ట్రంపు. గట్టరు బంతి జ్ఞాపకమొచ్చి లేచాను.
మరి మన దగ్గర పెద్ద నిచ్చెన లేదుగా. ఓ 2x4x8 స్టడ్లు రెండు తీసుకుని, మూడోదాన్ని అడుగు ముక్కలకింద కట్ చేసి నిచ్చెన చేసి, తనని ఎక్కించి గట్టర్ని ఓ చూపు చూడమన్నాను. ఓ వైపు వాన. తను నిచ్చెనెక్కి గట్టర్లో చేయిపెట్టి చూస్తే ఒకటి కాదు రెండు కాదు 8 టెన్నీస్ బంతులు ఇరుక్కుని ఉన్నాయి.
ఏరా అని గుడ్లురుమితే నాకు తెలియదు అని భుజాలెగరేసి వెళ్ళిపోయాడు స్టైలుగా!


Mar 30, 2018

సూరిగాడి పుట్టిన్రోజు



నా బ్లాగు టపాలు కొన్నిటికి సూరిగాడే స్పూర్తి. వాడు చేసే అల్లరి పనులు, వాడు పెరగటం, వాడి గోల, వాడి హేల, వాడి బాధ, వాడి ఆనందం, వాడి ఆలోచనలు, వాడి మాటలు, వాడి పాటలు...... ఎన్నో!

అమెరికాలో భారతీయ సంతతి అనే విషయాన్ని ఊహిస్తే - పిల్లల పెంపకం అంత సుళువు కాదు. మనతనం చొప్పించాలి, చప్పించగలగాలి, పిల్లలు ఆ అవకాశాన్ని ఇవ్వాలి. వాళ్ళు దాన్ని తీస్కోగలగాలి

ఏవైనా!

సూరిగాడి పుట్టిన్రోజు ఇవ్వాళ్ళ. వాడికి ఆశీస్సులు

Jun 25, 2013

సూరిగాడి పిచ్చి

సూరిగాడికి అనేక పిచ్చులు ఉన్నాయి. వాటిల్లో అత్యంత గొప్ప పిచ్చి పజిల్స్! చిన్నప్పుడు మూడేళ్ళ వయసప్పుడనుకుంటా, మికీ మౌస్ పజిల్ తెచ్చిచ్చాను. ఇరువదినాలుగు పీసులు ఉండే పజిల్ అన్నమాట. మొదలెట్టాడు ఏకాగ్రతతో! మొత్తానికి సాధించినాడు. వాడి ఇంటరెస్ట్ చూసి, వాడి ఇంటరెస్టుని ఉత్సాహపరుద్దాం అనిపించింది. ఓరోజు టాయిస్-స-రస్ కి వెళ్తే మెలీసా అండ్ డగ్ వాళ్ళ పజిల్స్ సేల్లో ఉంటే కొన్నా ఈ బొమ్మలో పజిల్. రెండడుగుల వెడల్పు, మూడడుగుల పొడవు ఉండే అండర్ వాటర్ పజిల్, వంద పీసులు ఉండేది. ఆరు డాలర్లకో ఏమో సేల్లో ఉంటే కొన్నాను.
ఈపజిల్ని ఏ వెయ్యిసార్లు పెట్టుంటాడో! భారత్ వెళ్ళేప్పుడు తీసుకెళ్ళి అక్కడా పెట్టినాడు. ఎంత పిచ్చి అంటే, అదే పని. ఇటు పెట్టను, పీకి మళ్ళీ మరోవైపు పెట్టను.
అప్పుడు పట్టిన పజిల్ పీసెస్ పిచ్చి ఇప్పటికీ వదల్లేదు. మొన్న ఇండియా వెళ్ళేప్పుడు అయిదువందల పీసెస్ ఉన్న పజిల్స్ తీసుకెళ్ళాడు, కాలక్షేపానికి.

Jan 23, 2013

సూరిగాడి జర్నల్ నుండి: స్కేరీ స్టోరీ

Once a dark night was shining with stars when a rugged looking thing showed up.It looked very dreadfuland rotten.Its skin was peeled except its head.It was ferocious.The fearless animal letout a growl and walked away.Roarrrrr!!!!!!!But when he was walking he saw an animal sitting and looking at the sky.He spied and pounced on it.The monster had a pet male werewolf.It was an adult.His house was filled with ghost and goblins and monsters and zombies and bats.Gulp!

Dec 17, 2012

గ్రీటింగ్ కార్డ్స్

ఇషయం ఏటంటే
ఇయ్యాల అనఘ  సూరిగాళ్ళ పాద్రీ పుట్టిన్రోజు
ఇట్టా గీసినారు గ్రీటింగు కార్డు ముక్కలు.
సూరిగాడు బుగాతి వైరన్ గీసిచ్చినాడడు. ఏదోనాడు కొనిస్చాళ్ళే అని కలలు కంటా ఉంటి.



అనఘ ఇలా గీసిచ్చింది.


హార్టు ఓపెన్ సేస్తే



Oct 9, 2012

అనఘ పుట్టినరోజు


అనఘ పుట్టినప్పటి టపా. http://ramakantharao.blogspot.com/2008/10/blog-post_10.html
హ్మ్! నాలుగేళ్ళు నిండాయి తారీఖుల ప్రకారం ఈనాటికి. ఎన్ని మాటలు నేర్చిందో.
"ఈ రోజు నా బర్త్‌డె కదా! నాన్నా! నా బర్త్‌డే కదా. అందుకే దోసె మొత్తం, అమ్మ తినూ తినూ అని చెప్పకుండానే తినేశా".
ఇక సూరిగాడు వాళ్ళ చెల్లికి గీసిచ్చిన గ్రీటింగు కార్డు.


అనఘకి పుట్టినరోజు శుభాకాంక్షలు దీవెనలూ అందించగోరతాను

Aug 23, 2012

బుల్లీయింగు చేసేవాళ్ళతో జాగ్రత్త

సూరిగాడి టెక్‌వాన్-డొ గురువు చక్కని మార్గనిర్దేశకం చేస్తున్నాడు అతని శిష్యులకు.
 సూరిగాడు గురువు నిన్న ఇలా నేర్పించాండు -
బడిలో బుల్లీయింగ్ చేసే వాళ్ళు ఎక్కడ చూసినా ఉంటారు. వాళ్ళతో ఎలా నెట్టుకురావాలి అని చెప్పుకొచ్చాడు. ఎలా నెట్టుకురావాలో చూపించాడు.
బుల్లీయింగు సమయంలో పాటించవలసిన ముఖ్యమైన సూత్రాలు ఎ బి సి డి
ఎవాయిడ్ కాన్ఫ్లిక్ట్.
బి అంటే బి కామ్. ఎవడన్నా వచ్చి కంటి దగ్గర ఏలు పెట్టి ఏడిపిస్తున్నాడుకుందాం. వెను వెంటనే ఢమాల్ ఢిమీల్ అనకుండా కామ్ గా ఉండాలట
సి అంటే కమ్యూనికేట్ విత్ కాన్ఫిడెన్స్ అట. కామ్ గా ఉండి, కాన్ఫిడెన్స్ తో వాడికి చెప్పాలట, స్టే అవే ఫ్రం మి అని.
డి అంటే డోంట్ వొర్సెన్ అట, అంటె తెగిందాకా లాగకూడదట. అంటే? స్టే అవే అని వెళ్ళిపోవాలట. అంతేకానీ వాడి ముక్కు పచ్చడి పచ్చడి చేయటం తెగిందాకా లాగటం అవుతుందట.
బుల్లీయింగ్ చెసేవాడు ఐనా వెంటపడితే టీచర్ దృష్టికి తీసుకువెళ్ళాలట. కొన్ని కొన్ని అక్కడే వదిలేస్తే మంచిదట. కొన్ని తప్పక టీచర్ దృష్టికి తీసుకువెళ్ళాలట.
ఐ కంప్లీట్లీ ఎగ్రీ విత్ హిం.

ఏటా బుల్లీయింగ్ రాక్షసికి బలౌతున్న పిల్లలు ఎందరో. ఇలాంటి డిఫెన్సివ్ స్కిల్స్ పిల్లలకి నేర్పటం ప్రతీ తల్లితండ్రుల బాధ్యత అని నా అభిప్రాయం.

Aug 20, 2012

కెన్ ఎ సెవెన్ ఇయర్ ఓల్డ్ ప్లే విత్ మి.

[సూరిగాడు ఆడుకుంటుంటాడు వాడి బ్లోక్స్ తోటి, సరిగ్గా అప్పుడు]
అనఘ: కెన్ ఎనీవన్ ప్లే విత్ మీ
నేను: అరెయ్! చెల్లితో ఆడుకోరా
సూర్య: ఏం! నాకు స్పేస్ వద్దా. పొద్దుగూకులు చెల్లితోనే ఆడుకోవాలా? నేను బ్లోక్స్ ఆడుకుంటా. హా!
నేను: నాన్నా! చెల్లిని ఆడించాలి. నీ రెస్పాన్సిబిలిటి.
సూర్య: ఎప్పుడూ కాదు. పొద్దున ఆడించా. ఐ వాంట్ మై టైమ్.
నేను: అమ్మలూ! నే ఆడతా రా
అనఘ: నో! దట్స్ నాట్ ఫెయిర్
అనఘ కి మా: నేనాడతా రావే!
అనఘ: నో!
అనఘ: కెన్ ఎ సెవెన్ ఇయర్ ఓల్డ్ ప్లే విత్ మి.
సూర్య:..
అనఘ:ఐ యాం బోర్డ్...
సూర్య:..
అనఘ: కెన్ ఎ సెవెన్ ఇయర్ ఓల్డ్ బోయ్ ప్లే విత్ మి.
....
...
..
.

Aug 16, 2012

అమ్మ మనసు

పుట్టిన్నాటినుండి ఆలనాపాలనా చూస్తూ పిల్లలే లోకంగా ఉంటూ
వారికి అడుగులు నేర్పుతూ మాటలు నేర్పుతూ పాటలు నేర్పుతూ
జీవిత పాటాలు నేర్పుతూ వారి అడుగులో అడుగులు వేస్తూ
అన్నీ వారై అన్నిటా తానైన అమ్మ మనసు
నాలుగో ఏడున బడికి పంపిన పూట
ఒక్కసారిగా ఏర్పడే ఆ నిశ్శబబ్దాన్ని ఎలా తట్టుకుంటుందీ?
ఎలా తీస్కుంటుందీ?
వళ్ళంతా కళ్ళై తన పిల్లలు ఇంటికి ఎప్పటికొస్తారా అని
నిమిష నిమిషానికీ గోడ గడియారం వైపు చూస్తుంటుందా?
అప్పటిదాకా పరుగెత్తిన నిమిషాల ముల్లులు
ఒక్కసారిగా ఆగిపోయాయేంటా అని అవాక్కవుతుందా?
ప్రతీక్షణం తన వెనుక తిరిగే పిల్లల అడుగులకోసం
వెనక్కి వెనక్కి తిరిగి చూస్కుంటుందా?


ఈ పిల్లలే రేపు పెద్దై ఇంటినుండి గూటినుండి
ఎగిరిపోతే, ఏ ఏడాదికో చూట్టానికొచ్చే పక్షుల కోసం
ఆ గూటిపక్షి ఎలా ఎదురుచూస్తుంటుండో?
పుట్టిననాటి నుండి పిల్లల స్మృతులను
తలచుకుని తలచుకుని ఆనందంతో ఏడుస్తుందా?
స్మృతులు కరిగిపోతాయేమో అని భారంగా దాచుకుంటుందా?
[కండ్లలో నీళ్ళు ఇక రాయనివ్వటంలేదు]

Jul 26, 2012

లెగొ క్రియేటర్

సూరిగాడికి పజిల్స్ పిచ్చి. ఒక వంద పీసెస్ ఉన్న పజిల్ ఇస్తే చాలు. అది అయ్యిందాకా లేవడు. మొన్నీమధ్య సమ్మక్క కాడ లెగొ స్టార్ వార్స్ కొన్నాడు. ఇక కుమ్ముకున్నాడు దాన్ని ఓ యాభైసార్లు తీసిపెట్టి తీసీ పెట్టి. ఇక లెగొ మీదపడ్డాడు. కొత్తవి కొను కొత్తవి కొను అని గోల. సరే ఆడుతున్నాడుగా అని ఇప్పటికి ఓ నాలుగో ఐదో కొని పెట్టినాను అప్పుడొకటి అప్పుడొకటి. ఒక్కోటి ఇరవై డాలర్లు మరి.
ఎండ్లకాలం సెలవుల్లో చెప్పినట్టు విని బుద్ధిమంతుళ్ళా తయ్యారయ్యాడు. పెట్టింది తినటం చెప్పింది వినటం ఇలాంటివి చేస్తున్నాడు. టెయ్క్‌వాండోలో ఫోకస్ పెరిగింది. ఇంట్లోకూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాళ్ళ గురువు "మీవాడికి ఫోకస్ బాగా పెరిగిన్! మీవాడికి బెస్ట్ ఫామ్స్ ఇన్ ది క్లాస్! హి విల్ బి మై డైమండ్" లాంటి పలుకులు పలికితే బ్రహ్మానందంలాగా కిందపడి దొర్లా.
అసలు వీరపల్నాటివాడిలాగా స్వీట్ ముట్టనివాడు ఈ మధ్య సున్నుండలు రుచి చూస్తున్నాడంటే మరి మనకి ఆశ్వర్యంతో ఉబ్బై తబ్బిబ్బై మబ్బై చినుకై వానై వరాలు కురవవా.
అరేయ్! నువ్విలానే చెప్పినమాటా వింటుంటే నీకో గిఫ్ట్ అని ఓ రోజు మబ్బులు పట్టినరోజు చెప్తే మొన్న పదా పదా అని గోలపెడితే వెళ్ళాం ఓ దుకాణానికి.
వాడికి త్రీ ఇన్ వన్ లెగొ క్రియేటర్ కొనిపెట్టాను
[రేసుకార్ల పిచ్చిగా మరి]


ఇప్పటికి ఓ పది సార్లు మార్చి మార్చిపెట్టాడు.
ఐతే ఓ సమస్య.
ఇవి పెట్టేప్పుడు వాడికి హెల్పింగ్ హ్యాండ్ కావాలి. ఇవి చాలా టైని టీనీ బ్లాక్స్ అవటంవల్ల
"అమ్మాఆఆఆఆఆ! ఇది కనిపించటంలేదు వెతికివ్వు".
"అరేయ్ వంట చేయాలా వద్దా?"
"వంట తర్వాత! ప్లీజ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్ అమ్మాఆఆఆఆఆఆఆఆఆఅ"
తీరా చూస్తే అక్కడే ఉంటుందా పీసు.
అంతలో పిల్ల
"సూర్యా నాతో ఆట్టంలేదూఊఊఊఊఊఊఊఊఊఉ"
"పోవే నేను బిజీ"
"సూర్యాఆఆఆఆఆఆఆఆఆఆఅ యూఆర్ సో మీన్"
"‌%&%#‌$%‌$%౬౪౩౩#@$%#@%$"
"$#%$‌‌%&‌&*&(*&)*()"

అలా ఉంది కథ

Mar 23, 2012

ఉగాది ముగ్గులు

ఏ పండక్కైనా హైందవ స్త్రీలు ముందు చేసేది, ఇల్లు అలికి ముగ్గులు వేయటం.
మరి మా హోము గారు కూడా అదేబాటలో ముగ్గులు వేద్దామని పూనుకున్నారు. పిల్లలిద్దరికీ ఈ ముగ్గు, చుక్కలు, మెలికలు భలే నచ్చాయి. కేరింతలు పెట్టారు. వావ్!! అమ్మా!! నువ్వు డిజైనర్వి, ఆర్టిస్టువి అని పొగిడి, మేవూ వేస్తాం మెవూ వేస్తాం అని చెరొక నోటుపుస్తకం లాక్కొచ్చుక్కుని కూర్చున్నారు. పాపం అనఘకి ఇంకా అంత రాలేదు కావున ఇలా వేసింది


సూరిగాడు తల్లి గీసిన ముగ్గుని ఇలా వేసి *నఖలు పిల్లి* అనిపించుకున్నాడు


వాళ్ళ అమ్మ వేసింది ఇది


ఏదేవైనా
యావత్ తెలుఁగు దేశానికి
నందన ఉగాది మేల్తలపులు

Jan 18, 2012

మార్టిన్ లూథర్ కింగ్ బర్త్‌డే!! - సూరిగాడి లెక్చర్

పోయిన శుక్రవారం బడినుండి ఇంటికి రాంగానే, నాన్నా! నీకు మార్టిన్ లూథర్ కింగ్ గురించి తెలుసా అని అడిగినాడు సూర్యా. తెల్సులేరా అన్నను. ఆయన గురించి తనకు తెల్సినవి చెప్పకొచ్చాడు. ఆశ్చర్యం వేసింది. జనవరి పదహారు సాయంత్రం వాడిచేత మళ్ళి చెప్పించి ఈసారి రికార్డు చేసాను.
ఇక్కడ వినచ్చు
http://bhaskar.posterous.com/94844773

Dec 1, 2011

సూరిగాడి ఉత్తరం

మొన్నీమధ్య కార్లో కాన్సాసు పట్నాకి వెళ్తున్నప్పుడు సూరిగాడు ఎదో బెరికాడు ఓ చిన్న కాయితకం ముక్క మీద. ఎదో రంగులద్దుతున్నాళ్ళే అనుకున్నాం. పెద్దగా పట్టించుకోలేదు. ఇదొక తతంగం ప్రయాణాల్లో. ఎనకమాల ఇద్దర్నీ కట్టిపడేయాలంటే ఓ పది కాయితకం ముక్కలిచ్చి రంగులేస్కోండహే అంటే సప్పుడు సేకుండా రంగులేస్తారు ఇద్దరూ. ఇంతలో మనం చెరాల్సిన సోటికి సేరిపోతావన్నమాట.
ఆతర్వాత రోజో ఎప్పుడో ఈ కాయితకం బయటపడ్డది.
సారాంశం ఏవిటయ్యా అంటే
వీడి తరగతిలోనే ఇశాన్ అనే పిల్లాడు, వీడి సహవాసగాడు. తెలుగు పిల్లాడే. మధ్యానం బువ్వ తినేప్పుడూ ఆడేప్పుడూ వీళ్ళిద్దరూ మరొక తెల్లోడు ఏడ్రియన్ కల్సుంటారు. ఇశాన్ కి వీడేదో అబద్ధం చెప్పాట్ట.
ఒరె ఇశాన్
స్వారీ రా
నన్ను సెమించేయ్
నీకు అబద్ధం చెప్పా
ధన్యవాదాలు
సూర్యా
అని రాసుకున్నాడు ఆ కాయితకం ముక్కమీద, కార్లో ఎల్లెప్పుడు.
ఏట్రా అది అంటే ఏదో రగస్యం అన్నాడు. నేనూ వదిలేసా.
సూరిగాడు ఇలా కాయితకం మీద రా(వ్రా)యటం నాకు బాగా నచ్చింది. వాడికో తెల్లకాయితకాల పుస్తకం ఇచ్చాను. దినచర్య సంచిక అనుకోచ్చు, ఆంగ్లంలో చెప్పాలంటే జర్నల్. రోజూ ఏవేం చేస్సావో రాస్కోరా అని. ఇలా ఇప్పటినుండే రోజుకో వాక్యం కనక రా(వ్రా)య గల్గితే పెద్దైయ్యాక వాడూ ఓ రచయిత కాగల్డని నా ఆశ.

Oct 24, 2011

రెడ్ రిబ్బన్ వీక్

మొన్నెప్పుడో ఆఫీసునుండి ఇంటికి చేరంగనే సూరిగాడికీ నాకూ మధ్యన సంభాషణ
సూరి: నాన్నా! డూ యూ డూ దోజ్ థింగ్స్?
నేను: ఏవిట్రా అదీ?
సూరి: అదే నాన్నా! తెల్లగా ఉంటాయి, నోట్లో పెట్టుకుంటారు, పొగ బ్లో చేస్తారూ
సూరి: ఏవంటారు నాన్నా దాన్నీ?
నేను: సిగరెట్టు
సూరి: అదే అదే!! డు యూ డూ దోజ్ థింగ్స్?
నేను: లేదురా.

హ్మ్! ఇలాంటి రోజు వస్తుందని నాకు నిజంగా తెలియదు. మానేసాను కాబట్టి, వాడి కళ్ళలోకి సూటిగా చూసి చెప్పగలిగాను. అసలు వీడికి ఇవెలా తెలిసాయీ? అనుకునేంతలో సూరీ కీ మా చెప్పుకొచ్చింది, వాళ్ళ బళ్ళో బాడ్ థింగ్స్ గురించి చెప్తున్నారట. రెడ్ రిబ్బన్ వీక్ అట.
నాన్న ఆల్కాహాల్ తాగుతాడా అని అడిగాట్ట వాళ్ళ అమ్మని.

రెడ్ రిబ్బన్ వీక్ - అక్టోబర్ చివరి వారాన్ని డ్రగ్ ఫ్రీ వీక్ గా జరుపుకుంటారట. దాన్నే రెడ్ రిబ్బన్ వీక్ అంటారట.
పిల్లల్లో ఎవేర్నెస్ తేవటం బాగుంది.

ఐతే ఎందరు వీటిని పట్టించుకుంటారూ?
అనేకసార్లు ఇలా గమనించాను -
ఓ తల్లి, వెనక సీట్లో చంటి పిల్లల్ని పెట్టుకుని, చలిలో, విండో కొంచెం కిందకు తీసి, పొగ ఊదటం. ఆ పిల్లల ఊపిరితిత్తులు ఏమౌతాయో అనే ఆలోచన లేక పోవటాన్ని చదువులేని తనం అందామా? కేర్లెస్నెస్ అందామా?

ఆలోచించాలి....................

Oct 16, 2011

ఫాల్ పండగ

సూరిగాడి బళ్ళో ఆకురాలు కాలం సందర్భంగా *రాలే పండగ* అనగా ఫాల్ ఫెస్టివల్ జరిగింది.
హూలా హూప్, గోతాల్లో నడుముదాకా మునుగి గెంతటం అనగా సాక్ రేస్, బక్కెట్లో బంతులు వేయటం, గురిచూసి కొట్టటం, కాలి బంతి, వాలీబాలు ఇత్యాదివి ఎన్నో ఆటలపోటీలు పెట్టారు.
ముఖంపై బొమ్మలు వేయించుకునే వారికి ఒక షామియానా పెట్టారు.
గుమ్మడికాయలకు రంగులద్దే బల్ల ఒకటి వేసారు.
అనఘ సూర్యా తమ తమ గుమ్మళ్ళకు రంగులు పులిమారు
From 2011-10-15

పైది సూరిగాడు రంగు పులిమిన గుమ్మడి
ఈ కిందది అనఘ రంగులద్దిన గుమ్మడి
From 2011-10-15

అలా రంగులద్దినాక గోడామీద పెట్టారు.
కొన్ని ఫోటోలు -
From 2011-10-15


From 2011-10-15


From 2011-10-15


From 2011-10-15